అంతర్జాతీయ ఫండ్స్‌లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి?
మా నాన్నగారి వయస్సు 57 సంవత్సరాలు. ఆయన 2017 నవంబర్‌లో రిటైరవుతున్నారు. ఆయన కొంత మొత్తాన్ని న్యూ ఫండ్ ఆఫర్స్(ఎన్‌ఎఫ్‌ఓ)లో ముఖ్యంగా క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. వీటికి లాకిన్ పీరియడ్ మూడేళ్లుగా ఉంది. రిటైర్మెంట్ దగ్గరగా ఉన్న నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరైనదేనా?
- వేద ప్రకాష్, హైదరాబాద్
రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్న ఈ సమయంలో ఈ నిర్ణయం సరైనది కాదు. అంతేకాకుండా ఈక్విటీల్లో ఏమైనా ఇన్వెస్ట్‌మెంట్స్ ఉంటే వాటిని డెట్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ల్లోకి మార్చుకోవాలి. భారత్‌లో మార్కెట్ సైకిల్స్ 3-5 సంవత్సరాలుగా ఉంటా యి. ఒకవేళ స్టాక్ మార్కెట్ డౌన్‌ట్రెండ్‌లో ఉందనుకోండి. క్లోజ్ ఎండ్ ఫండ్‌లు మెచ్యూర్ అయితే, మీ నాన్నగారికి తక్కువ రాబడులు రావచ్చు. నష్టాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రిటైరవుతున్నారు కాబట్టి మార్కెట్ కోలుకొని మంచి రిటర్న్‌లు వచ్చేదాకా వేచి చూసే పరిస్థితి ఉండదు. మరొక విషయమేమిటంటే, న్యూ ఫండ్ ఆఫర్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ఎవరికైనా సరే ఎప్పుడూ మంచి నిర్ణయం కాదు. ఒక వేళ మీ నాన్నగారికి ఈక్విటీలపై ఆసక్తి ఉన్న పక్షంలో దీర్ఘకాలాన్ని దృష్టిలో పెట్టుకొని మంచి రేటింగ్ ఉన్న ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమనండి.
నేను ఇంటర్నేషనల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం సరైనదేనా?
- అవినాశ్ జైన్, సికింద్రాబాద్
డైవర్సిఫికేషన్ నిమిత్తం ఇంటర్నేషనల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదే. భారత కంపెనీల పనితీరు పేలవంగా ఉన్నా, మార్కెట్లు పతన బాటలో ఉన్నా, రూపాయి క్షీణిస్తూ ఉన్నా, ఈ ప్రతికూలతలను ఇంటర్నేషనల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా అధిగమించవచ్చు. భారత మార్కెట్లు అన్ని వేళలా మంచి రాబడులను ఇవ్వలేవు. ఒక్కొక్కసారి కొన్ని ఇతర దేశాల మార్కెట్లు భారత మార్కెట్ల కంటే మంచి పనితీరునే కనబరిచే అవకాశాలూ ఉండొచ్చు. మీ పోర్ట్‌ఫోలియోలో ఇంటర్నేషనల్ ఫండ్ ఉండడం వల్ల మీరు డైవర్సిఫికేషన్ ప్రయోజనాలు పొందవచ్చు. మూడు మార్గాల్లో మీరు అంతర్జాతీయ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. మొదటిది. .. భారత కంపెనీల్లో 65 శాతం ఇన్వెస్ట్ చేసి, మిగిలిన మొత్తాన్ని విదేశీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను కొనుగోలు చేయవచ్చు. ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఈక్విటీ ఫండ్స్‌కు లభించే పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఈ కేటగిరి కింద వచ్చే ఫండ్స్... టెంపుల్టన్ ఇండియా ఈక్విటీ ఇన్‌కమ్ ఫండ్, బిర్లా సన్‌లైఫ్ ఇంటర్నేషనల్ ఈక్విటీ ఫండ్. రెండవది... ఏదైనా ఒక ప్రాంతాన్ని గానీ, ఏదైనా ఒక కరెన్సీని గానీ ప్రధానంగా తీసుకుని కార్యకలాపాలు నిర్వహించే ఫీడర్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడం. దీని కోసం మీరు ప్రస్తుతం యూఎస్ ఈక్విటీ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు. ఎందుకంటే, ఇప్పుడు అమెరికా మార్కెట్లు మంచి స్థితిలో ఉన్నాయి. అంతే కాకుండా డాలర్ కూడా బలపడుతోంది. ఈ కేటగిరిలో పరిశీలించదగ్గ ఫండ్స్... ఫ్రాంక్లిన్ యూఎస్ ఈక్విటీస్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ యూఎస్ బ్లూచిప్ ఈక్విటీ ఫండ్. అయితే వీటికి పన్ను ప్రయోజనాలు ఉండవు. ఇక మూడవది. ఎనర్జీ, అగ్రికల్చర్, కమోడిటీస్ వంటి థీమ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం, ఈ కేటగిరిలో పరిశీలించదగ్గ ఫండ్స్... డీఎస్‌పీ బ్లాక్‌రాక్ వరల్డ్ ఎనర్జీ, అగ్రికల్చర్ ఫండ్, ఎల్ అండ్ టీ గ్లోబల్ రియల్ అసెట్స్ ఫండ్, అయితే సంబంధిత థీమ్ పట్ల మీకు ప్రత్యేకమైన అవగాహన ఉన్నప్పుడే ఇలాంటి థీమ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి.
బ్యాలెన్స్‌డ్ ఫండ్‌లో రిటైర్మెంట్ ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం ఏ ప్లాన్‌ను ఎంచుకోవాలి? డివిడెండ్ ప్లాన్‌నా లేకుంటే గ్రోత్ ప్లాన్‌నా?
- బిందు మాధవి, విజయవాడ
మీ ప్రశ్నలో స్పష్టత లేదు. మీరు ఇప్పటికే రిటైరయ్యారా ? లేకుంటే రిటైర్మెంట్ అవసరాల కోసం ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అన్న విషయాల్లో స్పష్టత లేదు. సరే. ఒకవేళ మీరు రిటైర్మెంట్ అవసరాల కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, గ్రోత్ ఆప్షన్‌ను ఎంచుకోండి. మీకు మంచి రాబడులు వస్తాయి. చక్రగతి వృద్ధి ప్రయోజనాలు పొందగలరు. ఒక వేళ డివిడెండ్ ప్లాన్‌ను ఎంచుకుంటే లభించే డివిడెండ్‌లు ఏదో విధంగా ఖర్చయిపోతాయి. ఇక మీరు ఇప్పటికే రిటైరైపోతే, మీ ఆర్థిక అవసరాలకనుగుణంగా నిర్ణయం తీసుకోండి. మీకు క్రమబద్ధంగా సొమ్ములు అవసరమైన పక్షంలో డివిడెండ్ ఆప్షన్‌ను ఎంచుకోండి. అలాంటి అవసరం లేకపోతే గ్రోత్ ఆప్షన్‌ను ఎంచుకోవడం మంచిది.