International funds
-
ఉన్నత విద్య కోసం.. ఇంటర్నేషనల్ ఫండ్స్ గురించి తెలుసా?
మూడు నుంచి ఆరు నెలల కాలానికి రూ.50 వేలు ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. మెరుగైన రాబడుల కోసం ఈ మొత్తాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి? –సంతోష్ కుమార్ పెట్టుబడులకు చాలా స్వల్పకాలం ఉంది. కనుక మెరుగైన రాబడుల కోసం పెట్టుబడిపై రిస్క్ తీసుకోవడం సరికాదు. పెట్టుబడికి భద్రత ఎక్కువ ఉండాలి. రాబడుల కంటే పెట్టుబడిని కాపాడుకునే విధంగా వ్యూహం ఉండాలి. కనుక ఈ మొత్తాన్ని మీరు బ్యాంకు ఖాతాలోనే ఉంచుకోవచ్చు. లేదంటే ఆరు నెలల కోసం ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వీటిల్లో రాబడులు తక్కువే అయినా గ్యారంటీతో కూడినవి. పైగా పెట్టుబడికి భద్రత ఎక్కువ. బ్యాంకులో చేసే డిపాజిట్ రూ.5 లక్షల వరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ నుంచి బీమా ఉంటుంది. అలాగే, లిక్విడ్ ఫండ్స్‌లోనూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇవి ట్రెజరీ బిల్లులు, ప్రభుత్వ సెక్యూరిటీలు, రెపో సర్టిఫికెట్లలో ఇన్వెస్ట్ చేస్తాయి. గరిష్టంగా 91 రోజుల కాల వ్యవధి కలిగిన సెక్యూరిటీల్లోనే లిక్విడ్ పథకాలు ఇన్వెస్ట్ చేస్తాయి. బ్యాంకు డిపాజిట్ల కంటే లిక్విడ్ ఫండ్స్‌లో కొంచెం అదనపు రాబడి వస్తుంది. కాకపోతే పెట్టుబడి భద్రతకు అవి హామీ ఇవ్వవు. నేను యూఎస్ లేదా గ్లోబల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నాను. ఇందుకోసం ఫండ్స్‌ను ఎలా ఎంపిక చేసుకోవాలి? వీటికి ఎంత మేర కేటాయింపులు చేసుకోవాలి? – వరుణ్ దేశం వెలుపలి ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టే పథకాలను ఇంటర్నేషనల్ ఫండ్స్ అని పిలుస్తారు. తమ పిల్లలను ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపించాలని కోరుకునే వారు ఇంటర్నేషనల్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. విదేశీ కరెన్సీలో అయ్యే వ్యయాలకు ముందు నుంచే ఈ రూపంలో ప్రణాళిక మేరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్లో చేరినప్పటి నుంచి వారి భవిష్యత్ విదేశీ విద్య కోసం ఇంటర్నేషనల్ ఫండ్స్‌లో సిప్ ద్వారా క్రమానుగతంగా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలి. దేశీయంగా మెరుగైన రాబడులను ఇచ్చే పథకాలు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ కరెన్సీ విలువల పరంగా ఉండే రిస్క్‌ను దృష్టిలో పెట్టుకుని కొంత మొత్తాన్ని మంచి రాబడినిచ్చే అంతర్జాతీయ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవడం మేలైన నిర్ణయం అవుతుంది. వివిధ రంగాల కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే వైవిధ్యంతో కూడిన ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవాలి. మనం భారత్‌లో నివసిస్తున్నప్పుడు, మన ఆదాయం, వ్యయాలు, ఆస్తులన్నీ ఇక్కడే ఉంటాయి. అంతర్జాతీయ పెట్టుబడులు అన్నవి మన మార్కెట్‌తో సంబంధం కలిగి ఉండవు. కాకపోతే ఈ మార్గం ద్వారా తగినంత వైవిధ్యాన్ని పాటించొచ్చు. అలాగే, కేవలం ఒకే రంగంలో పెట్టుబడులు పెట్టే ఇంటర్నేషనల్ ఫండ్స్‌కు దూరంగా ఉండాలి. ఇంటర్నేషనల్ ఫండ్స్ థీమ్యాటిక్ ఫండ్ లేదా కమోడిటీ ఫండ్ లేదా ఒకే దేశానికే సంబంధించి పెట్టుబడులతో కూడిన పథకాల్లో రిస్క్ ఉంటుంది. అప్పటి వరకు సానుకూలంగా ఉన్న రాబడులు ప్రతికూలంగా మారిపోవచ్చు. అందుకని వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియోతో ఉన్న పథకాలను ఎంపిక చేసుకోవాలి. అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్లో డాలర్ విలువ ఏటేటా బలపడుతోంది. 2017లో యూఎస్ డాలర్ రూపాయితో 65 దగ్గర ఉంటే, ఇప్పుడు 83కు చేరింది. ఐదేళ్లలో ఏటా 4 శాతానికి పైనే డాలర్ బలపడింది. డాలర్ మారకంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఈ విధమైన కరెన్సీ ప్రయోజనాన్ని పొందొచ్చు. డాలర్ మారకంతో కూడిన ఇంటర్నేషనల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా క్షీణించే రూపాయి విలువ పరంగా రక్షణ ఉంటుంది. ఫలితంగా మెరుగైన రాబడి అందుకోవచ్చు. అలాగే, ఈక్విటీ పథకాల మాదిరే ఇంటర్నేషనల్ ఫండ్స్‌లోనూ దీర్ఘకాలం దృష్టితోనే పెట్టుబడులు పెట్టాలి. ఏడాది, మూడేళ్ల కాల పనితీరు చూసి పెట్టుబడులు పెట్టకూడదు. ఇంటర్నేషనల్ ఫండ్స్‌ను ఆదాయపన్ను చట్టం నాన్ ఈక్విటీ పథకాలుగా పరిగణిస్తుంది. కనుక డెట్ ఫండ్స్ మాదిరే పన్ను విధానం అమలవుతుంది. - ధీరేంద్ర కుమార్, సీఈవో వాల్యూ రీసెర్చ్ -
అంతర్జాతీయ పెట్టుబడులకు ద్వారాలు
న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ ఫండ్స్‌కు సంబంధించి తాజా పెట్టుబడులను పలు మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు అనుమతిస్తున్నాయి. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్, మిరే అస్సెట్ మ్యూచువల్ ఫండ్, ఎడెల్వీజ్ మ్యూచువల్ ఫండ్ ఇలా అనుమతించిన వాటిల్లో ఉన్నాయి. ఎడెల్వీజ్ మ్యూచువల్ ఫండ్ ఏడు అంతర్జాతీయ పథకాలను నిర్వహిస్తుండగా, అన్నింటిలోకి చందాలను సోమవారం నుంచి స్వీకరిస్తోంది. స్విచ్ ఇన్ లేదా లంప్సమ్ లావాదేవీలను అనుమతిస్తోంది. డెట్ మ్యూచువల్ ఫండ్‌పై పన్ను ప్రయోజనాలు ఏప్రిల్ 1 నుంచి మారిపోతున్నాయి. దీంతో మార్చి 31లోపు ప్రస్తుత పన్ను ప్రయోజనం నుంచి లబ్ధి పొందాలనుకునే వారికి అవకాశం కల్పించాలని నిర్ణయించినట్టు ఎడెల్వీజ్ ఏఎంసీ ప్రొడక్ట్ హెడ్ నిరంజన్ అవస్థి తెలిపారు. ఇక మిరే అస్సెట్ మ్యూచువల్ ఫండ్ మూడు ఇంటర్నేషనల్ ఈటీఎఫ్‌లు, వీటికి సంబంధించిన ఫండ్ ఆఫ్ ఫండ్‌ల్లోకి లంప్సమ్ పెట్టబడులను మార్చి 27 నుంచి అనుమతిస్తున్నట్టు తెలిపింది. ప్రస్తుత సిప్‌లు, సిస్టమ్యాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ (ఎస్టీపీ)లను సైతం మార్చి 29 నుంచి తెరుస్తున్నట్టు.. తాజా సిప్‌లు, ఎస్టీపీలను మాత్రం అనుమతించడం లేదని స్పష్టం చేసింది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మూడు విదేశీ మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి లంప్సమ్ పెట్టుబడులను అనుమతిస్తోంది. పరిమితులు.. ‘‘తాజా పెట్టుబడుల స్వీకరణకు సంబంధించి పరిమితులు ఉన్నాయి. సెబీ విదేశీ పెట్టుబడుల పరిమితులకు అనుగుణంగా ఈ పథకాల్లో తిరిగి భవిష్యత్తులోనూ పెట్టుబడులను నిలిపివేయవచ్చు’’ అని మిరే అస్సెట్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ ఈటీఎఫ్ హెడ్ సిద్ధార్థ శ్రీవాస్తవ తెలిపారు. విదేశీ స్టాక్స్‌లో దేశీ మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ 7 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు సెబీ పరిమితి విధించింది. గతేడాది జనవరి నాటికి ఫండ్స్ మొత్తం పెట్టుబడులు ఈ పరిమితికి చేరడంతో తాజా పెట్టుబడులు స్వీకరించొద్దని ఆదేశించింది. 2022 జూన్‌లో తాజా పెట్టుబడులకు మళ్లీ అనుమతించింది. -
అంతర్జాతీయ ఫండ్స్.. పన్ను భారం ఎంత?
నేను హెచ్డీఎఫ్సీ ఎస్ఎల్ యంగ్ స్టార్ సూపర్ టూ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను తీసుకున్నాను. ఏడాదికి రూ.40,000 ప్రీమియమ్ చొప్పున ఐదేళ్లు చెల్లించాను. ఈ పాలసీలో కొనసాగమంటారా? లేక వైదొలగమంటారా? - స్పందన, విజయవాడ హెచ్డీఎఫ్సీ ఎస్ఎల్ యంగ్ స్టార్ సూపర్ టూ అనేది యూనిట్ లింక్డ్ ప్లాన్. ఈ తరహా ప్లాన్‌ల్లో మీరు చెల్లించే ప్రీమియం నుంచి సదరు మ్యూచువల్ ఫండ్ సంస్థ వివిధ చార్జీలను(మోర్టాలిటీ చార్జీలు, నిర్వహణ వ్యయాలు, ఫండ్ మేనేజ్మెంట్ చార్జీలు... తదితర చార్జీలు) మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తుంది. ఇలాంటి వ్యయాల కారణంగా మీరు ఎక్కువ ప్రీమియం చెల్లించినప్పటికీ, నికరంగా ఇన్వెస్ట్ చేసే మొత్తం తక్కువగా ఉంటుంది. ఫలితంగా మీరు పెద్ద మొత్తంలో ప్రీమియం చెల్లించినప్పటికీ, మీకు వచ్చే రాబడులు తక్కువగా ఉంటాయి. మార్కెట్ మంచి ఊపుమీద ఉన్నప్పటికీ, ఈ వ్యయాల కారణంగా మీరు స్వల్ప రాబడులతోనే సరిపెట్టుకోవలసి వస్తుంది. అయితే ఈ పాలసీలను విక్రయిస్తే ఏజెంట్లకు భారీగా కమీషన్లు వస్తాయి. ఈ కమీషన్ల కోసం ఏజెంట్లు ఈ పాలసీల గురించి అతిగా చెప్పి ఇన్వెస్టర్లకు అంటగడతారు. ఇక మీ విషయానికొస్తే, ఈ పాలసీ పరంగా మీకు ఎదురయ్యే భవిష్యత్ నష్టాలను తగ్గించుకోవడానికి ఈ ప్లాన్‌ను సరెండర్ చేయడమే సరైన పని. ఈ ప్లాన్‌కు లాక్-ఇన్-పీరియడ్ ఐదేళ్లుగా ఉంది. మీ ప్లాన్ తీసుకొని ఐదేళ్లు పూర్తయింది. కాబట్టి, ఈ ప్లాన్‌ను సరెండర్ చేసినా, మీరు ఎలాంటి సరెండర్ చార్జీలు చెల్లించాల్సిన పనిలేదు. మీరు సరెండర్ చేసే సమయానికి ఈ ఫండ్ విలువ ఎంత ఉంటుందో, అదే సరెండర్ విలువగా మీరు పొందవచ్చు. ఇక భవిష్యత్ ఇన్వెస్ట్మెంట్స్ విషయానికొస్తే, బీమా, ఇన్వెస్ట్మెంట్ కలగలసిన ఈ తరహా ప్లాన్‌ల్లో ఎప్పుడూ ఇన్వెస్ట్ చేయకండి. ఇవి తగిన బీమాను, ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులను కూడా ఇవ్వలేవు. జీవిత బీమా కోసం పూర్తిగా టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను తీసుకోండి. వీటికి బీమా కవర్ అధికంగానూ, చెల్లించాల్సిన ప్రీమియమ్‌లు తక్కువగానూ ఉంటాయి. పిల్లల ఉన్నత విద్యాభ్యాసం, స్వగృహం ఏర్పాటు చేసుకోవడం.. తదితర దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం మంచి బ్యాలెన్స్డ్ లేదా ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఏ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసినా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానాన్ని అనుసరించడం మరచిపోకండి. సాధారణంగా పలు బీమా సంస్థలు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకునే కవరేజ్ ఉన్న ఆరోగ్య బీమా పాలసీలను ఆఫర్ చేస్తాయి. అయితే డొమిసిలియరీ వ్యయాల(ఇంటి వద్ద ట్రీట్మెంట్ తీసుకుంటే అయ్యే ఖర్చులు) కవరేజ్ ఉన్న ఆరోగ్య బీమా పాలసీలను ఏయే సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి? వీటి వివరాలను వెల్లడించండి. - మహేందర్, హైదరాబాద్ డొమిసిలియరీ వ్యయాలను కూడా కవర్ చేసే ఆరోగ్య బీమా పాలసీలను పలు సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. మీ అవసరాలను బట్టి అపోలో మ్యూనిక్ ఆప్టిమ రిస్టోర్, రెలిగేర్ హెల్త్ ఇన్సూరెన్స్ కేర్లను పరిశీలించవచ్చు. ఈ ప్లాన్లకు మంచి క్లెయిమ్ రికార్డ్ ఉంది. మీ లైఫ్ స్టైల్, ప్రస్తుత ఆరోగ్య స్థితిగతులు, జబ్బులకు సంబంధించి మీ కుటుంబ చరిత్ర తదితర అంశాలను ఆధారంగా ఎంత మొత్తానికి బీమా తీసుకోవాలో నిర్ణయించుకోండి. మీ వయస్సును బట్టి వివిధ సంస్థలు ఎంత ప్రీమియమ్‌లు వసూలు చేస్తున్నాయో పరిశీలించి, మీకు అనువైన ప్లాన్‌ను ఎంచుకోండి. మీరు పాలసీ తీసుకున్న 30 రోజుల తర్వాతనే పాలసీ అమల్లోకి వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. పాలసీ తీసుకున్న 30 రోజుల లోపు మీరు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నా, వాటికి అయిన ఖర్చులు రీయింబర్స్మెంట్ కావు. నేను 2010, జనవరి నుంచి ఫ్రాంక్లిన్ ఏషియన్ ఈక్విటీ ఫండ్‌లో నెలకు రూ.1,000 చొప్పన ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాను. 2014,జూన్ వరకూ ఇలా ఇన్వెస్ట్ చేశాను. 2014 సెప్టెంబర్ నుంచి ఈ ఫండ్ నుంచి సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్(ఎస్‌డబ్ల్యూపీ) ద్వారా నెలకు రూ.4,500 విత్‌డ్రా చేసుకుంటున్నాను. ఇది కొనసాగుతోంది. ఈ ఇన్వెస్ట్మెంట్స్, విత్డ్రాయల్స్పై మూలధన లాభాల పన్నును ఎలా లెక్కించాలి? దీనికి రెండు పద్దతులున్నాయని మిత్రులు చెబుతున్నారు. ఒకటి ఫస్ట్ఇన్ఫస్ట్ అవుట్(ఫిఫో-మొదటగా ఇన్వెస్ట్ చేసింది మొదటిగా ఉపసంహరించుకోవడం), రెండవది లాస్ట్ఇన్ ఫస్ట్అవుట్(లిఫో-చివర్లో ఇన్వెస్ట్ చేసింది మొదటగా ఉపసంహరించుకోవడం). ఫిఫో పద్ధతిని అనుసరిస్తే నేను ఇన్వెస్ట్ చేసిన సిప్‌లకు ఏడాది దాటింది కాబట్టి నేను ఎలాంటి మూలధన లాభాల పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని భావిస్తున్నాను. ఇక రెండో పద్ధతి(లిఫో)ను అనుసరిస్తే, కొన్ని సిప్‌లకు ఏడాది దాటలేదు కాబట్టి, కొన్నింటికే నేను మూలధన లాభాల పన్నుల చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయమై తగిన సూచనలివ్వండి. - కార్తికేయ, ఈ మెయిల్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి ఫిఫో పద్ధతినే అనుసరిస్తారు. అంటే తొలిసారిగా కొనుగోలు చేసిన యూనిట్లను తొలిసారిగా విక్రయించడం. ఇక మీ ఇన్వెస్ట్మెంట్స్, విత్‌డ్రాయల్స్‌ను పరిశీలిస్తే మీరు కొన్ని విత్‌డ్రాయల్స్‌కు మూలధన లాభాల పన్నును, చాలావాటికి స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లంచాల్సి ఉంటుంది. ఫ్రాంక్లిన్ ఏషియన్ ఈక్విటీ ఫండ్ అనేది అంతర్జాతీయ ఫండ్. డెట్ ఫండ్స్‌కు ఎలాంటి పన్ను నియమాలు వర్తిస్తాయో, అవే నియమాలు అంతర్జాతీయ ఫండ్స్‌కు వర్తిస్తాయి. అంటే ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే, ఇలా ఇన్వెస్ట్ చేసిన యూనిట్లను మూడేళ్ల తర్వాత విక్రయిస్తే, దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను, మూడేళ్లలోపు విక్రయిస్తే స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ ఫండ్స్‌కు దీర్ఘకాల మూలధన లాభాల పన్ను-20 శాతంగా (ఇండేక్సేషన్‌తో కలిపి) ఉంటుంది. స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను-ఆ వ్యక్తి ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి ఉంటుంది. మీ విషయానికొస్తే మీరు ఎక్కువ భాగం స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఈ ఫండ్ విక్రయాలపై మీకు వచ్చిన రాబడులను, మీ మొత్తం ఆదాయానికి కలిపి మీ ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం పన్ను విధిస్తారు. కొన్నింటికి మాత్రమే మీరు దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. - ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
అంతర్జాతీయ ఫండ్స్‌లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి?
మా నాన్నగారి వయస్సు 57 సంవత్సరాలు. ఆయన 2017 నవంబర్‌లో రిటైరవుతున్నారు. ఆయన కొంత మొత్తాన్ని న్యూ ఫండ్ ఆఫర్స్(ఎన్ఎఫ్ఓ)లో ముఖ్యంగా క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. వీటికి లాకిన్ పీరియడ్ మూడేళ్లుగా ఉంది. రిటైర్మెంట్ దగ్గరగా ఉన్న నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరైనదేనా? - వేద ప్రకాష్, హైదరాబాద్ రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్న ఈ సమయంలో ఈ నిర్ణయం సరైనది కాదు. అంతేకాకుండా ఈక్విటీల్లో ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే వాటిని డెట్ ఇన్వెస్ట్మెంట్స్ల్లోకి మార్చుకోవాలి. భారత్‌లో మార్కెట్ సైకిల్స్ 3-5 సంవత్సరాలుగా ఉంటా యి. ఒకవేళ స్టాక్ మార్కెట్ డౌన్‌ట్రెండ్‌లో ఉందనుకోండి. క్లోజ్ ఎండ్ ఫండ్లు మెచ్యూర్ అయితే, మీ నాన్నగారికి తక్కువ రాబడులు రావచ్చు. నష్టాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రిటైరవుతున్నారు కాబట్టి మార్కెట్ కోలుకొని మంచి రిటర్న్‌లు వచ్చేదాకా వేచి చూసే పరిస్థితి ఉండదు. మరొక విషయమేమిటంటే, న్యూ ఫండ్ ఆఫర్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ఎవరికైనా సరే ఎప్పుడూ మంచి నిర్ణయం కాదు. ఒక వేళ మీ నాన్నగారికి ఈక్విటీలపై ఆసక్తి ఉన్న పక్షంలో దీర్ఘకాలాన్ని దృష్టిలో పెట్టుకొని మంచి రేటింగ్ ఉన్న ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమనండి. నేను ఇంటర్నేషనల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం సరైనదేనా? - అవినాశ్ జైన్, సికింద్రాబాద్ డైవర్సిఫికేషన్ నిమిత్తం ఇంటర్నేషనల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదే. భారత కంపెనీల పనితీరు పేలవంగా ఉన్నా, మార్కెట్లు పతన బాటలో ఉన్నా, రూపాయి క్షీణిస్తూ ఉన్నా, ఈ ప్రతికూలతలను ఇంటర్నేషనల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా అధిగమించవచ్చు. భారత మార్కెట్లు అన్ని వేళలా మంచి రాబడులను ఇవ్వలేవు. ఒక్కొక్కసారి కొన్ని ఇతర దేశాల మార్కెట్లు భారత మార్కెట్ల కంటే మంచి పనితీరునే కనబరిచే అవకాశాలూ ఉండొచ్చు. మీ పోర్ట్‌ఫోలియోలో ఇంటర్నేషనల్ ఫండ్ ఉండడం వల్ల మీరు డైవర్సిఫికేషన్ ప్రయోజనాలు పొందవచ్చు. మూడు మార్గాల్లో మీరు అంతర్జాతీయ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. మొదటిది. .. భారత కంపెనీల్లో 65 శాతం ఇన్వెస్ట్ చేసి, మిగిలిన మొత్తాన్ని విదేశీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను కొనుగోలు చేయవచ్చు. ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఈక్విటీ ఫండ్స్‌కు లభించే పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఈ కేటగిరి కింద వచ్చే ఫండ్స్... టెంపుల్టన్ ఇండియా ఈక్విటీ ఇన్కమ్ ఫండ్, బిర్లా సన్‌లైఫ్ ఇంటర్నేషనల్ ఈక్విటీ ఫండ్. రెండవది... ఏదైనా ఒక ప్రాంతాన్ని గానీ, ఏదైనా ఒక కరెన్సీని గానీ ప్రధానంగా తీసుకుని కార్యకలాపాలు నిర్వహించే ఫీడర్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడం. దీని కోసం మీరు ప్రస్తుతం యూఎస్ ఈక్విటీ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు. ఎందుకంటే, ఇప్పుడు అమెరికా మార్కెట్లు మంచి స్థితిలో ఉన్నాయి. అంతే కాకుండా డాలర్ కూడా బలపడుతోంది. ఈ కేటగిరిలో పరిశీలించదగ్గ ఫండ్స్... ఫ్రాంక్లిన్ యూఎస్ ఈక్విటీస్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ యూఎస్ బ్లూచిప్ ఈక్విటీ ఫండ్. అయితే వీటికి పన్ను ప్రయోజనాలు ఉండవు. ఇక మూడవది. ఎనర్జీ, అగ్రికల్చర్, కమోడిటీస్ వంటి థీమ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం, ఈ కేటగిరిలో పరిశీలించదగ్గ ఫండ్స్... డీఎస్పీ బ్లాక్‌రాక్ వరల్డ్ ఎనర్జీ, అగ్రికల్చర్ ఫండ్, ఎల్ అండ్ టీ గ్లోబల్ రియల్ అసెట్స్ ఫండ్, అయితే సంబంధిత థీమ్ పట్ల మీకు ప్రత్యేకమైన అవగాహన ఉన్నప్పుడే ఇలాంటి థీమ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. బ్యాలెన్స్డ్ ఫండ్‌లో రిటైర్మెంట్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఏ ప్లాన్‌ను ఎంచుకోవాలి? డివిడెండ్ ప్లాన్‌నా లేకుంటే గ్రోత్ ప్లాన్‌నా? - బిందు మాధవి, విజయవాడ మీ ప్రశ్నలో స్పష్టత లేదు. మీరు ఇప్పటికే రిటైరయ్యారా ? లేకుంటే రిటైర్మెంట్ అవసరాల కోసం ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అన్న విషయాల్లో స్పష్టత లేదు. సరే. ఒకవేళ మీరు రిటైర్మెంట్ అవసరాల కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, గ్రోత్ ఆప్షన్‌ను ఎంచుకోండి. మీకు మంచి రాబడులు వస్తాయి. చక్రగతి వృద్ధి ప్రయోజనాలు పొందగలరు. ఒక వేళ డివిడెండ్ ప్లాన్‌ను ఎంచుకుంటే లభించే డివిడెండ్లు ఏదో విధంగా ఖర్చయిపోతాయి. ఇక మీరు ఇప్పటికే రిటైరైపోతే, మీ ఆర్థిక అవసరాలకనుగుణంగా నిర్ణయం తీసుకోండి. మీకు క్రమబద్ధంగా సొమ్ములు అవసరమైన పక్షంలో డివిడెండ్ ఆప్షన్‌ను ఎంచుకోండి. అలాంటి అవసరం లేకపోతే గ్రోత్ ఆప్షన్‌ను ఎంచుకోవడం మంచిది. -
అంతర్జాతీయ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చా?
ఓపెన్-ఎండ్, క్లోజ్డ్-ఎండ్ మ్యూచువల్ ఫండ్స్‌కు మధ్యనున్న తేడాలేంటి ? ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో ఎలా ఇన్వెస్ట్ చేస్తే మంచిది. ఒకేసారి పెద్ద మొత్తంలోనా? లేకుంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) విధానంలోనా? - నాగవల్లి, రాజమండ్రి ఓపెన్-ఎండ్ మ్యూచువల్ ఫండ్‌లో మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. కానీ క్లోజ్డ్-ఎండ్ మ్యూచువల్ ఫండ్‌లో మాత్రం ఆ ఫండ్ ఆఫర్ కాలంలోనే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఓపెన్-ఎండ్ ఫండ్‌లో యూనిట్లను ఎప్పుడైనా అమ్మేసి మీ ఇన్వెస్ట్మెంట్స్ పొందవచ్చు. కానీ క్లోజ్డ్-ఎండ్ ఫండ్‌లో మాత్రం మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు లాకిన్ పీరియడ్ ఉంటుంది. అది పూర్తయిన తర్వాత మాత్రమే మీరు మీ యూనిట్లను అమ్మేసి, మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను పొందవచ్చు. ఓపెన్-ఎండ్ ఫండ్ విషయంలో మీ యూనిట్లను మొత్తంగా కానీ, కొన్ని గానీ అమ్మేసుకోవచ్చు. కానీ క్లోజ్డ్-ఎండ్ ఫండ్ విషయంలో మాత్రం అలా కాదు. ఓపెన్ ఎండ్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయవచ్చు. క్లోజ్డ్-ఎండ్ ఫండ్ విషయంలో అలా చేయలేం. ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఒకసారి పెద్దమొత్తంలో ఇన్వెస్ట్ చేయడం సరైనది కాదు. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని, క్లోజ్డ్-ఎండ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం కాదని మేం ఎప్పుడూ సూచిస్తూ ఉంటాం. ఇక ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్మెంట్ విషయానికొస్తే, ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం కన్నా సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఫలితంగా మార్కెట్ల హెచ్చుతగ్గుల, ఒడిదుడుకుల ప్రభావాల నుంచి తట్టుకొని ప్రయోజనం పొందవచ్చు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ పినాకిల్ స్కీమ్‌లో మొదటి ఏడాది రూ.50,000 ఇన్వెస్ట్ చేశాను. ఈ స్కీమ్ పనితీరు ఎలా ఉంది? రెండో ఇన్స్టాల్మెంట్ చెల్లించి, ఈ స్కీమ్‌లో కొనసాగవచ్చా? - భక్తవత్సలం, కర్నూలు మీ ఆర్థిక అవసరాలు ఎలా ఉన్నాయనే దానిని బట్టి ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాలి. ఒక విధంగా చెప్పాలంటే, బీమాను, ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కలగలపకూడదు. మీ బీమా అవసరాలు ఒక యూలిప్ ద్వారా తీర్చుకోలేరు. యూలిప్ ద్వారా బీమా, ఇన్వెస్ట్ మెంట్ అవసరాలను పొందాలనుకుంటే, అది రెంటికీ చెడ్డ రేవడి చందంగా అవుతుంది. ఇది కొత్త యూలిప్ కాబట్టి మూడేళ్లకు ముందే ప్రీమియం చెల్లించడాన్ని ఆపేసినా మీకు ఇన్వెస్ట్‌మెంట్‌కు ఎలాంటి ఇబ్బంది లేదు. మీ ఆర్థిక అవసరాలు, లక్ష్యాలను బట్టి ఈ విషయంలో నిర్ణయం తీసుకోండి. భారత జాతీయుడు ఎవరైనా సరే అంతర్జాతీయ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చా? ఇలా ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి రాబడులు పొందవచ్చా? ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై పొందిన రాబడులపై పన్నులు ఎలా ఉంటాయి? - సాగరిక, హైదరాబాద్ ఒక వ్యక్తిగా మీరు ఎలాంటి అంతర్జాతీయ ఫండ్స్‌లోనైనా నిరభ్యంతరంగా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఆర్బీఐ నిర్దేశిత నియమాల ప్రకారం మీరు ఒక బ్యాంక్ అకౌంట్ ద్వారానే ఈ ఫండ్స్‌ను నిర్వహించాలి. ప్రతీ ఏడాది ఏ వ్యక్తై 75 వేల డాలర్ల వరకూ ఇలాంటి అంతర్జాతీయ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇక పన్ను విషయానికొస్తే, డెట్ ఫండ్స్‌కు వర్తించే నియమాలే ఈ అంతర్జాతీయ ఫండ్స్‌కూ వర్తిస్తాయి. పన్ను నియమాల ప్రకారం మ్యూచువల్ ఫండ్స్ రెండు రకాలు, ఈక్విటీ, ఈక్విటీయేతర మ్యూచువల్ ఫండ్స్. మొత్తం ఇన్వెస్ట్‌మెంట్స్‌లో కనీసం 65 శాతం దేశీయ ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్‌ను ఈక్విటీ ఫండ్స్‌గా పరిగణిస్తారు. ఇక అంతర్జాతీయ ఫండ్స్ విషయానికొస్తే, ఇవి దేశీయ ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయవు. కనుక వీటిని ఈక్విటీయేతర మ్యూచువల్ ఫండ్స్‌గా భావిస్తారు. ఈ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మీరు మూడేళ్లలోపే ఉపసంహరించుకుంటే, ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై పొందిన లాభాలపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వివిధీకరణ నిమిత్తం చాలా మంది ఇన్వెస్టర్లు ఇలాంటి ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు.