అంతర్జాతీయ ఫండ్స్.. పన్ను భారం ఎంత?
నేను హెచ్‌డీఎఫ్‌సీ ఎస్‌ఎల్ యంగ్ స్టార్ సూపర్ టూ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను తీసుకున్నాను. ఏడాదికి రూ.40,000 ప్రీమియమ్ చొప్పున ఐదేళ్లు చెల్లించాను. ఈ పాలసీలో కొనసాగమంటారా? లేక వైదొలగమంటారా?
- స్పందన, విజయవాడ
హెచ్‌డీఎఫ్‌సీ ఎస్‌ఎల్ యంగ్ స్టార్ సూపర్ టూ అనేది యూనిట్ లింక్డ్ ప్లాన్. ఈ తరహా ప్లాన్‌ల్లో మీరు చెల్లించే ప్రీమియం నుంచి సదరు మ్యూచువల్ ఫండ్ సంస్థ వివిధ చార్జీలను(మోర్టాలిటీ చార్జీలు, నిర్వహణ వ్యయాలు, ఫండ్ మేనేజ్‌మెంట్ చార్జీలు... తదితర చార్జీలు) మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తుంది. ఇలాంటి వ్యయాల కారణంగా మీరు ఎక్కువ ప్రీమియం చెల్లించినప్పటికీ, నికరంగా ఇన్వెస్ట్ చేసే మొత్తం తక్కువగా ఉంటుంది. ఫలితంగా మీరు పెద్ద మొత్తంలో ప్రీమియం చెల్లించినప్పటికీ, మీకు వచ్చే రాబడులు తక్కువగా ఉంటాయి.
మార్కెట్ మంచి ఊపుమీద ఉన్నప్పటికీ, ఈ వ్యయాల కారణంగా మీరు స్వల్ప రాబడులతోనే సరిపెట్టుకోవలసి వస్తుంది. అయితే ఈ పాలసీలను విక్రయిస్తే ఏజెంట్లకు భారీగా కమీషన్లు వస్తాయి. ఈ కమీషన్ల కోసం ఏజెంట్లు ఈ పాలసీల గురించి అతిగా చెప్పి ఇన్వెస్టర్లకు అంటగడతారు. ఇక మీ విషయానికొస్తే, ఈ పాలసీ పరంగా మీకు ఎదురయ్యే భవిష్యత్ నష్టాలను తగ్గించుకోవడానికి ఈ ప్లాన్‌ను సరెండర్ చేయడమే సరైన పని. ఈ ప్లాన్‌కు లాక్-ఇన్-పీరియడ్ ఐదేళ్లుగా ఉంది. మీ ప్లాన్ తీసుకొని ఐదేళ్లు పూర్తయింది. కాబట్టి, ఈ ప్లాన్‌ను సరెండర్ చేసినా, మీరు ఎలాంటి సరెండర్ చార్జీలు చెల్లించాల్సిన పనిలేదు.
మీరు సరెండర్ చేసే సమయానికి ఈ ఫండ్ విలువ ఎంత ఉంటుందో, అదే సరెండర్ విలువగా మీరు పొందవచ్చు. ఇక భవిష్యత్ ఇన్వెస్ట్‌మెంట్స్ విషయానికొస్తే, బీమా, ఇన్వెస్ట్‌మెంట్ కలగలసిన ఈ తరహా ప్లాన్‌ల్లో ఎప్పుడూ ఇన్వెస్ట్ చేయకండి. ఇవి తగిన బీమాను, ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులను కూడా ఇవ్వలేవు.
జీవిత బీమా కోసం పూర్తిగా టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను తీసుకోండి. వీటికి బీమా కవర్ అధికంగానూ, చెల్లించాల్సిన ప్రీమియమ్‌లు తక్కువగానూ ఉంటాయి. పిల్లల ఉన్నత విద్యాభ్యాసం, స్వగృహం ఏర్పాటు చేసుకోవడం.. తదితర దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం మంచి బ్యాలెన్స్‌డ్ లేదా ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఏ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసినా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానాన్ని అనుసరించడం మరచిపోకండి.
సాధారణంగా పలు బీమా సంస్థలు హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకునే కవరేజ్ ఉన్న ఆరోగ్య బీమా పాలసీలను ఆఫర్ చేస్తాయి. అయితే డొమిసిలియరీ వ్యయాల(ఇంటి వద్ద ట్రీట్‌మెంట్ తీసుకుంటే అయ్యే ఖర్చులు) కవరేజ్ ఉన్న ఆరోగ్య బీమా పాలసీలను ఏయే సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి? వీటి వివరాలను వెల్లడించండి.
- మహేందర్, హైదరాబాద్
డొమిసిలియరీ వ్యయాలను కూడా కవర్ చేసే ఆరోగ్య బీమా పాలసీలను పలు సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. మీ అవసరాలను బట్టి అపోలో మ్యూనిక్ ఆప్టిమ రిస్టోర్, రెలిగేర్ హెల్త్ ఇన్సూరెన్స్ కేర్‌లను పరిశీలించవచ్చు. ఈ ప్లాన్‌లకు మంచి క్లెయిమ్ రికార్డ్ ఉంది. మీ లైఫ్ స్టైల్, ప్రస్తుత ఆరోగ్య స్థితిగతులు, జబ్బులకు సంబంధించి మీ కుటుంబ చరిత్ర తదితర అంశాలను ఆధారంగా ఎంత మొత్తానికి బీమా తీసుకోవాలో నిర్ణయించుకోండి.
మీ వయస్సును బట్టి వివిధ సంస్థలు ఎంత ప్రీమియమ్‌లు వసూలు చేస్తున్నాయో పరిశీలించి, మీకు అనువైన ప్లాన్‌ను ఎంచుకోండి. మీరు పాలసీ తీసుకున్న 30 రోజుల తర్వాతనే పాలసీ అమల్లోకి వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. పాలసీ తీసుకున్న 30 రోజుల లోపు మీరు ఎలాంటి ట్రీట్‌మెంట్ తీసుకున్నా, వాటికి అయిన ఖర్చులు రీయింబర్స్‌మెంట్ కావు.
నేను 2010, జనవరి నుంచి ఫ్రాంక్లిన్ ఏషియన్ ఈక్విటీ ఫండ్‌లో నెలకు రూ.1,000 చొప్పన ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాను. 2014,జూన్ వరకూ ఇలా ఇన్వెస్ట్ చేశాను. 2014 సెప్టెంబర్ నుంచి ఈ ఫండ్ నుంచి సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్(ఎస్‌డబ్ల్యూపీ) ద్వారా నెలకు రూ.4,500 విత్‌డ్రా చేసుకుంటున్నాను. ఇది కొనసాగుతోంది. ఈ ఇన్వెస్ట్‌మెంట్స్, విత్‌డ్రాయల్స్‌పై మూలధన లాభాల పన్నును ఎలా లెక్కించాలి? దీనికి రెండు పద్దతులున్నాయని మిత్రులు చెబుతున్నారు.
ఒకటి ఫస్ట్‌ఇన్‌ఫస్ట్ అవుట్(ఫిఫో-మొదటగా ఇన్వెస్ట్ చేసింది మొదటిగా ఉపసంహరించుకోవడం), రెండవది లాస్ట్‌ఇన్ ఫస్ట్‌అవుట్(లిఫో-చివర్లో ఇన్వెస్ట్ చేసింది మొదటగా ఉపసంహరించుకోవడం). ఫిఫో పద్ధతిని అనుసరిస్తే నేను ఇన్వెస్ట్ చేసిన సిప్‌లకు ఏడాది దాటింది కాబట్టి నేను ఎలాంటి మూలధన లాభాల పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని భావిస్తున్నాను. ఇక రెండో పద్ధతి(లిఫో)ను అనుసరిస్తే, కొన్ని సిప్‌లకు ఏడాది దాటలేదు కాబట్టి, కొన్నింటికే నేను మూలధన లాభాల పన్నుల చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయమై తగిన సూచనలివ్వండి.
- కార్తికేయ, ఈ మెయిల్ ద్వారా
మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి ఫిఫో పద్ధతినే అనుసరిస్తారు. అంటే తొలిసారిగా కొనుగోలు చేసిన యూనిట్లను తొలిసారిగా విక్రయించడం. ఇక మీ ఇన్వెస్ట్‌మెంట్స్, విత్‌డ్రాయల్స్‌ను పరిశీలిస్తే మీరు కొన్ని విత్‌డ్రాయల్స్‌కు మూలధన లాభాల పన్నును, చాలావాటికి స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లంచాల్సి ఉంటుంది. ఫ్రాంక్లిన్ ఏషియన్ ఈక్విటీ ఫండ్ అనేది అంతర్జాతీయ ఫండ్. డెట్ ఫండ్స్‌కు ఎలాంటి పన్ను నియమాలు వర్తిస్తాయో, అవే నియమాలు అంతర్జాతీయ ఫండ్స్‌కు వర్తిస్తాయి. అంటే ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే, ఇలా ఇన్వెస్ట్ చేసిన యూనిట్లను మూడేళ్ల తర్వాత విక్రయిస్తే, దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను, మూడేళ్లలోపు విక్రయిస్తే స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
అంతర్జాతీయ ఫండ్స్‌కు దీర్ఘకాల మూలధన లాభాల పన్ను-20 శాతంగా (ఇండేక్సేషన్‌తో కలిపి) ఉంటుంది. స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను-ఆ వ్యక్తి ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి ఉంటుంది. మీ విషయానికొస్తే మీరు ఎక్కువ భాగం స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఈ ఫండ్ విక్రయాలపై మీకు వచ్చిన రాబడులను, మీ మొత్తం ఆదాయానికి కలిపి మీ ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం పన్ను విధిస్తారు. కొన్నింటికి మాత్రమే మీరు దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
- ధీరేంద్ర కుమార్
సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్