tax burden
-
ఇల్లు అమ్మితే పన్ను భారం!
సొంతిల్లు.. చాలా మందికి జీవితకాల కష్టార్జితం. అలాంటి సొంతింటిని అవసరార్థమై విక్రయించినప్పుడు వచి్చన లాభంపై పన్ను చెల్లించాలన్న విషయం ఎంత మందికి తెలుసు? మరీ ముఖ్యంగా ఇటీవలి బడ్జెట్లో చేసిన తాజా ప్రతిపాదన ప్రకారమైతే.. ఈ పన్ను మరింత చెల్లించాల్సి రావచ్చు. దీర్ఘకాల మూలధన లాభాల పన్నును 20 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించడం సానుకూల నిర్ణయమేగా అని అనుకోవచ్చు. కానీ, ఇండెక్సేషన్ ప్రయోజనాన్ని తొలగించారు. దీని కారణంగా నికరంగా చెల్లించాల్సిన పన్ను గణనీయంగా పెరగనుంది. అసలు ఇండెక్సేషన్ ప్రయోజనం తొలగింపు ఎవరికి అనుకూలం? తాజా పన్ను ప్రతిపాదన ఎవరికి లాభం..? తమపై పడే భారం ఎంత..? నిపుణుల విశ్లేషణ ఆధారంగా ఈ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. ఇప్పటి వరకు.. ప్రాపర్టీ (ఇల్లు లేదా ఇంటి స్థలం/గ్రామీణ వ్యవసాయ భూమి కాకుండా)ని క్యాపిటల్ అస్సెట్‌గా ఆదాయపన్ను చట్టం చెబుతోంది. కనుక ప్రాపర్టీ విక్రయం మూలధన లాభాల పన్ను పరిధిలోకి వస్తుంది. కొనుగోలు చేసిన రెండేళ్ల తర్వాత విక్రయించిన సందర్భాల్లో అది దీర్ఘకాల మూలధన లాభాల పన్ను పరిధిలోకి వస్తుంది. వచ్చిన లాభంపై లోగడ (జూలై 23కు ముందు) 20% పన్ను అమ లు చేసేవారు. కరెన్సీ విలువను ఏటా కొంత శాతం చొప్పున ద్రవ్యోల్బణం హరిస్తుందని తెలుసు. ఈ ద్రవ్యోల్బణాన్ని ప్రాపర్టీ కొనుగోలు ధరతో సర్దుబాటు చేసే వారు. దీన్నే ఇండెక్సేషన్ బెనిఫిట్‌గా చెబుతారు. ఉదాహరణకు 6% ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు రూ.100 విలువ ఏడాది తర్వాత రూ.94గా మారుతుంది. పేరుకు మన దగ్గర రూ.100 ఉంటుంది. కానీ, దాని అసలు విలువ రూ.94. ఇదే మాదిరి రూ.100 పెట్టి కొనుగోలు చేసిన ప్రాపరీ్ట.. అసలు కొనుగోలు ధర ఏడాది తర్వాత ఇండెక్సేషన్‌తో కలిపితే రూ.106గా మారుతుంది. పాత విధానంలో ప్రాపర్టీ అసలు కొనుగోలు ధర ఇండెక్సేషన్ ప్రయోజనంతో గణనీయంగా పెరిగేది. దీంతో నికరంగా చెల్లించే పన్ను తక్కువగా ఉండేది. ఆదాయపన్ను శాఖ ఏటా ద్రవ్యోల్బణం సర్దుబాటు ఆధారంగా కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ (సీఐఐ/ద్రవ్యోల్బణ వ్యయ సూచీ)ను ఖరారు చేస్తుంది. దీన్ని కేంద్ర ప్రభుత్వం గెజిట్ ద్వారా విడుదల చేస్తుంది. దీన్ని ప్రామాణికంగా తీసుకునేవారు. ఇప్పుడు ప్రాపరీ్టకి ఈ ప్రయోజనాన్ని తొలగించారు. ఇది మెజారిటీ ఇంటి యజమానులకు నిజంగా మేలు చేస్తుందని కేంద్రం చెబుతోంది. కానీ, నిపుణులు మాత్రం తాజా సవరణలతో పన్ను భారం పెరుగుతుందని గణాంకాల సహితంగా వివరిస్తున్నారు. ప్రాపర్టీ కొనుగోలు చేసిన రెండేళ్లలోపు విక్రయిస్తే అది స్వల్పకాల మూలధన లాభాల పన్ను కిందకు వస్తుంది. ఈ మొత్తం తమ ఆదాయానికి కలిపి పన్ను రిటర్నుల్లో చూపించాలి. ఏ శ్లాబు పరిధిలోకి వస్తే ఆ రేటు ప్రకారం పన్ను చెల్లించాలి. వ్యవసాయ భూమి క్యాపిటల్ అస్సెట్ కాదు కనుక దీని విక్రయంపై మూలధన లాభాల పన్ను వర్తించదు. ఎవరికి ప్రయోజనం? జూలై 23 ముందు వరకు ఉన్న ఇండెక్సేషన్ ఆధారిత దీర్ఘకాల మూలధన లాభాల పన్ను విధానంతో అందరికీ ప్రయోజనం ఉండేది. కరెన్సీ విలువ క్షీణత ప్రభావం తీసివేసిన తర్వాత మిగిలిందే అసలైన లాభం కనుక, దానిపై పన్ను చెల్లిస్తే సరిపోయేది. ఇప్పుడు నూతన విధానంతో మెజారిటీ యజమానులు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ద్రవ్యోల్బణం రేటుకు మించి ప్రాపర్టీ ధరలు గణనీయంగా పెరిగినప్పుడే నష్టం లేకుండా ఉంటుంది. కొనుగోలు నుంచి విక్రయించే మధ్యకాలంలో ధరల్లో పెద్దగా వృద్ధి పెద్దగా లేకపోతే నష్టమే. ఏటా ప్రాపర్టీ ధరలు 9 శాతంలోపే వృద్ధి చెందితే నష్టపోవాల్సి వస్తుంది. కనీసం 10 శాతం, అంతకంటే ఎక్కువ పెరిగితేనే కొత్త విధానంతో లాభపడొచ్చు. 2013 మార్చి నుంచి 2024 మార్చి మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 36 పట్టణాల్లో ప్రాపర్టీ ధరలు సగటున 5.11 శాతం చొప్పునే పెరిగినట్టు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ‘రెసిడెక్స్’ స్పష్టం చేస్తోంది. ఈ కాలంలో ఒక్క హైదరాబాద్‌లోనే ఇది 8.56 శాతం సీఏజీఆర్‌గా ఉంది. దీర్ఘకాలంలో రియల్ ఎస్టేట్ రాబడులు 12–16 శాతం (వార్షిక) మధ్య ఉంటున్నాయని, కనుక నూతన విధానం లాభదాయకమని ప్రభుత్వం అంటుంటే.. అన్ని ప్రాంతాల్లోనూ ఆ విధమైన ధరల వృద్ధి లేదంటూ నిపుణులు తోసిపుచ్చుతున్నారు. ఆర్బీఐ హౌసింగ్ ప్రైజింగ్ ఇండెక్స్‌ను చూసినా ప్రముఖ పట్టణాల్లో గడిచిన దశాబ్ద కాలంలో ధరల వృద్ధి 1–9 శాతం మధ్యే ఉన్నట్టు తెలుస్తోంది.పన్ను తగ్గించుకునే మార్గం..? ఇంటి విక్రయంపై దీర్ఘకాల మూలధన లాభం వస్తే.. అంతేసి పన్ను చెల్లించడం వల్ల మిగిలేదేమీ లేదని భాపడక్కర్లేదు. పన్ను భారం తగ్గించుకునేందుకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఇందుకోసం మెరుగైన ఆప్షన్ తిరిగి ఇంటిని కొనుగోలు చేయడమే. ప్రాపర్టీ విక్రయం ద్వారా వచి్చన మూలధన లాభంతో రెండేళ్లలో తిరిగి ఇల్లు కొనుగోలు చేయాలి. ప్రాపర్టీ విక్రయించడానికి ముందు ఏడాది కాలంలో మరో ఇంటిని కొనుగోలు చేసినా కానీ, సెక్షన్ 54 కింద పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. కొత్త ఇంటిని నిర్మించుకునేట్టు అయితే అందుకు మూడేళ్ల వ్యవధి ఉంటుంది. ఇలా మరో ఇంటిని కొనుగోలు చేసి పన్ను మినహాయింపు పొందిన వారు.. ఆ ప్రాపరీ్టని మూడేళ్లు నిండిన తర్వాతే విక్రయించాలి. లేదంటే గతంలో పొందిన పన్ను మినహాయింపును కోల్పోవాల్సి వస్తుంది. మూలధన లాభం రూ.2 కోట్లకు మించి ఉంటే, పన్ను మినహాయింపునకు కొత్త ఇల్లు ఒక్కటే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మూలధన లాభం రూ.2 కోట్లలోపు ఉంటే రెండు ఇళ్లపై వెచి్చంచినా పన్ను మినహాయింపు లభిస్తుంది. ఒక్కసారి ఈ ప్రయోజనం క్లెయిమ్ చేసుకుంటే, ఇక తర్వాత మరోసారి అవకాశం ఉండదు. సెక్షన్ 54 కింద గరిష్ట పన్ను మినహాయింపు ప్రయోజనం రూ.10 కోట్లు. ఇంతకుమించి మూలధన లాభం ఉంటే దానిపై పన్ను చెల్లించాల్సిందే. ఉదాహరణకు ఒక వ్యక్తి ఇంటిని విక్రయించడం ద్వారా రూ.15 కోట్ల మూలధన లాభం ఆర్జిస్తే.. తిరిగి మరో ఇల్లు కొనుగోలు లేదా నిర్మాణంపై రూ.10 కోట్లపైనే పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోగలరు. విక్రయించిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటర్నుల దాఖలులోపు ఇంటిని కొనుగోలు చేయలేకపోతే.. అప్పుడు ఆర్జించిన మూలధన లాభాల మొత్తాన్ని ఎంపిక చేసిన బ్యాంకు శాఖల్లో క్యాపిటల్ గెయిన్స్ స్కీమ్ అకౌంట్ (సీజీఏఎస్)లో డిపాజిట్ చేయాలి. లేదంటే లాభం మొత్తాన్ని క్యాపిటల్ గెయిన్ బాండ్లలో ఇన్వెస్ట్ చేసినా పన్ను లేకుండా చూసుకోవచ్చు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ), ఆర్ఈసీ, పీఎఫ్సీ, ఐఆర్ఎఫ్సీ ఈ తరహా బాండ్లను జారీ చేస్తుంటాయి. వీటిపై కూపన్ రేటు 6 శాతంలోపే ఉంటుంది. వీటి కాల వ్యవధి ఐదేళ్లు. ఇంటిని విక్రయించిన తేదీ నుంచి ఆరు నెల్లలోపు ఈ బాండ్లలో ఇన్వెస్ట్ చేయాలన్నది నిబంధన. నష్టం వస్తే..? ప్రాపర్టీ విక్రయంపై నష్టం వస్తే ఏంటి పరిస్థితి..? ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. సంబంధిత ఆర్థిక సంవత్సరంలో ఇతర మూలధన లాభాలతో సర్దుబాటు చేసుకోవచ్చు. ఒకవేళ ప్రాపర్టీ విక్రయించిన సంవత్సరంలో ఇతర పెట్టుబడి సాధనాలపై ఎలాంటి దీర్ఘకాల మూలధన లాభాలు నమోదు చేయని వారు.. తదుపరి ఆరి్థక సంవత్సరానికి క్యారీ ఫార్వార్డ్ చేసుకోవచ్చు.ప్రాపర్టీ కొనుగోలు ధర..? మెజారిటీ నిపుణుల విశ్లేషణ ప్రకారం ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 48 కింద అసలు కొనుగోలు ధర, చెల్లించిన స్టాంప్ డ్యూటీ చార్జీలు, రిజి్రస్టేషన్ చార్జీలు, ఇంటి కొనుగోలుకు రుణం తీసుకుంటే అందుకు చేసిన వడ్డీ చెల్లింపులు (దీనిపై ఆదాయపన్ను మినహాయింపులు క్లెయిమ్ చేయకపోతోనే) అన్నింటినీ మూలధన లాభం లెక్కింపులోకి పరిగణనలోకి తీసుకుంటారు. ‘‘ఉదాహరణకు ఎక్స్ అనే వ్యక్తి రూ.50 లక్షల ప్రపారీ్టని కొనుగోలు చేశారు. దీనిపై రూ.3.5 లక్షలు స్టాంప్ డ్యూటీ కింద చెల్లించారు. ఇందులో రూ.1.5 లక్షలను అదే ఆరి్థక సంవత్సరంలో సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందారు. కొనుగోలుకు రుణం తీసుకోగా, దీనిపై మొత్తం మీద రూ.10 లక్షలు వడ్డీ రూపంలో చెల్లించారు. ఇందులో రూ.4 లక్షల వడ్డీ చెల్లింపులపైనే సెక్షన్ 24(బీ) కింద పన్ను మినహాయింపు పొందారు. దీంతో అసలు రూ.50 లక్షలు, స్టాంప్ డ్యూటీలో పన్ను మినహాయింపు క్లెయిమ్ చేయని రూ.2 లక్షలు, గృహ రుణంపై వడ్డీ చెల్లింపుల్లో పన్ను మినహాయింపు క్లెయిమ్ చేయకుండా మిగిలిన రూ.6 లక్షలు కలిపితే మొత్తం రూ.58 లక్షలను ప్రాపర్టీ కొనుగోలు ధర కింద పరిగణనలోకి తీసుకుంటారు’’అని ఖైతాన్ లీగల్‌కు చెందిన జోరావాలా తెలిపారు. కొన్ని ఉదాహరణలు చూద్దాం... → 2009లో ప్రాపర్టీని రూ.15లక్షలు పెట్టి కొన్నారని అనుకుందాం. ఏటా ధర 4% చొప్పున పెరిగింది. దీంతో ప్రస్తుత విక్రయ ధర రూ.27 లక్షలు అవుతుంది. కానీ, ఇండెక్సేషన్ సర్దుబాటుతో కొనుగోలు ధర రూ.36.79 లక్షలుగా మారుతుంది. అంటే 2009లో కొనుగోలుకు వెచి్చంచిన రూ.15 లక్షలకు ఏటా ఇండెక్సేషన్ ప్రభావాన్ని కలిపితే ఈ ధర వస్తుంది. దీంతో పోల్చితే విక్రయించిన ధర తక్కువ కనుక పాత విధానంలో ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఏర్పడదు. కానీ నూతన విధానంలో 2009 నాటి కొనుగోలు ధరనే ప్రామాణికం. దీంతో రూ.12 లక్షలు లాభం వచి్చనట్టు తేలుతుంది. దీనిపై 12.5% పన్ను కింద రూ.1.5 లక్షలు చెల్లించాల్సి వస్తుంది. ప్రాపర్టీ ధర ద్రవ్యోల్బణం కంటే తక్కువగా పెరగడం వల్ల వాస్తవంగా ఈ కేసులో నష్టం వచి్చనట్టు అర్థం చేసుకోవాలి. అయినా కానీ, కొత్త విధానం పన్ను చెల్లించాల్సిందే.→ 2009లోనే రూ.15 లక్షలు పెట్టి కొనుగోలు చేసిన ప్రాపర్టీ ధర ఒకవేళ ఏటా 8% కాంపౌండెడ్ చొప్పున పెరిగితే ప్రస్తుత విక్రయ ధర రూ. 47.58 లక్షలు అవుతుంది. ఇండెక్సేషన్ తో సర్దుబాటు చేస్తే కొనుగోలు ధర రూ.36.79 లక్షలు అవుతుంది. దీంతో పాత విధానంలో నికర లాభం రూ.10.79 లక్షలు అవుతుంది. దీనిపై 20% మూలధన లాభం కింద రూ.2.16 లక్షలు చెల్లిస్తే సరిపోతుంది. కొత్త విధానంలో ఇండెక్సేషన్ లేదు కనుక నికర లాభం రూ.32. 58 లక్షలు అవుతుంది. దీనిపై 12.5% పన్ను కింద రూ. 4.07 లక్షలు చెల్లించాల్సి వస్తుంది. → 2009లోనే రూ.15లక్షలు పెట్టి కొనుగోలు చేసిన ఇదే ప్రాపర్టీ ధర ఒకవేళ ఏటా 12 శాతం కాంపౌండెడ్ చొప్పున పెరిగితే ప్రస్తుత విక్రయ ధర రూ.82.10 లక్షలు అవుతుంది. ఇండెక్సేషన్‌తో సర్దుబాటు చేసిన తర్వాత వాస్తవ కొనుగోలు ధర రూ.36.79 లక్షలుగా మారుతుంది. దీని ప్రకారం నికర లాభం రూ.45.31 లక్షలు అవుతుంది. దీనిపై 20 శాతం పన్ను కింద 9.06 లక్షలు చెల్లించాలి. అదే ఇండెక్సేషన్ లేకుండా చూస్తే నికర మూలధన లాభం రూ.67.10 లక్షలు అవుతుంది. దీనిపై 12.5 శాతం పన్ను కింద రూ.8.39 లక్షలు చెల్లించాలి. కొత్త విధానం కారణంగా ఈ కేసులో రూ.67 వేలు ఆదా అవుతోంది. వివిధ పట్టణాల్లో ధరల వృద్ధి నిజానికి గడిచిన ఐదేళ్లలో ప్రముఖ పట్టణాల్లో ఇళ్ల ధరల పెరుగుదల 10 శాతంలోపే ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. హైదరాబాద్ మినహా ఇతర ప్రముఖ పట్టణాల్లో ధరల వృద్ధి 9 శాతంలోపే ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఐదేళ్ల క్రితం ప్రాపరీ్టలు కొనుగోలు చేసిన వారిపై కొత్త పన్ను విధానం కారణంగా ఎక్కువ ప్రభావం పడనుంది.2001 ఏప్రిల్ 1కి ముందు కొనుగోలు చేస్తే..? ఇంటిని 2001 ఏప్రిల్ 1 లేదా ఆ తర్వాత కొనుగోలు చేసిన వారికి వాస్తవ కొనుగోలు వ్యయాన్ని మూ లధన లాభాలకు సంబంధించి పరిగణనలోకి తీసుకుంటారు. అంతకుముందు కొనుగోలు చేసిన వారికి ‘గ్రాండ్ ఫాదరింగ్’ ప్రొవిజన్ అమలవుతుంది. 2001 ఏప్రిల్ 1కి ముందు కొనుగోలు చేసిన కేసుల్లో సహేతుక మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకుంటారు. మరి ఈ సహేతుక మార్కెట్ విలువ అన్న దానికి ఇంకా స్పష్టమైన నిర్వచనం ఇవ్వలేదు. మార్కెట్ విలువలకు, రిజి్రస్టేషన్ విలువలకు మధ్య గతంలో ఎంతో అంతరం ఉండేది. రిజి్రస్టేషన్ వ్యాల్యూనే పరిగణనలోకి తీసుకుంటే మరింత పన్ను భారం ఎదుర్కోవాల్సి రావచ్చు. నికర పన్ను పన్ను 14.95 %దీర్ఘకాల మూలధన లాభంపై 12.5 శాతం పన్నుకు అదనంగా 15 శాతం సర్‌చార్జ్, 4 శాతం సెస్సు కూడా కలిపితే మొత్తం రూ.14.95 శాతం పన్ను కింద చెల్లించాలన్నది గుర్తుంచుకోవాలి. ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే..? ప్రభుత్వం పన్ను నిబంధనలు మార్చిన నేపథ్యంలో.. పెట్టుబడుల దృష్ట్యా ఇల్లు, స్థలాలను కొనుగోలు చేసే వారు ముందు జాగ్రత్తలు తీసుకోక తప్పదు. ముఖ్యంగా తాము ఇన్వెస్ట్ చేస్తున్న ప్రాంతంలో ధరలు ఏటా కనీసం 10 శాతం, అంతకంటే ఎక్కువ పెరిగినప్పుడే ప్రయోజనం దక్కుతుంది. లేదంటే ఒకవైపు పన్ను భారం, మరోవైపు ద్రవ్యోల్బణ ప్రభావం కలిపి నికరంగా మిగిలేదేమీ ఉండదని నిపుణులు సూచిస్తున్నారు. ఎప్పుడో కొని ఉంటే పన్ను భారం 10–20 ఏళ్లకు ముందు కొనుగోలు చేసిన వారు తాజా పన్ను ప్రతిపాదనతో ఎక్కువ పన్ను భారాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటికి ప్రాపర్టీ ధరల్లో గణనీయమైన పెరుగుదల చోటు చేసుకుంది. ఇండెక్సేషన్ ప్రయోజనం తొలగించడం వల్ల మూలధన లాభాలు ఎక్కువగా కనిపిస్తాయి. దీంతో ఎక్కువ పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఇక నాన్ మెట్రో పట్టణాల్లో, పల్లెల్లో ప్రాపర్టీ ధరల పెరుగుదల అంతగా లేదు. వీటిని విక్రయించినప్పుడు ద్రవ్యోల్బణ ప్రభావం పోను నికరంగా నష్టమే వస్తుంది. అయినా కానీ, నూతన విధానంలో వీరు పన్ను చెల్లించాల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు. పదేళ్లకు మించితే భారమే... ఇండెక్సేషన్ ప్రయోజనం తొలగించడం వల్ల పదేళ్లకు పైగా ప్రాపరీ్టలను హోల్డ్ చేసిన వారిపై గణనీయమైన ప్రభావం పడుతుంది. దీనివల్ల పదేళ్లకు మించిన ఆస్తులను విక్రయించే వారు అధిక పన్ను చెల్లించాల్సి వస్తుంది. – నిరంజన్ హిరనందాని, నరెడ్కో చైర్మన్ – సాక్షి, బిజినెస్ డెస్క్ -
సూచీలకు పన్ను పోటు
ముంబై: ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ కాంట్రాక్టులపై కేంద్రం సెక్యూరిటీ లావాదేవీల పన్ను 25 శాతం(0.05% నుంచి 0.0625 శాతానికి)పెంపుతో స్టాక్ సూచీలు మూడోరోజూ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అంతర్జాతీయ బ్యాంకింగ్ రంగంలో భయాలు దావానలంలా వ్యాప్తి చెందుతుండటం సెంటిమెంట్‌పై మరింత ఒత్తిడిని పెంచింది. అలాగే డాలర్ రికవరీతో రూపాయి క్షీణత, విదేశీ ఇన్వెస్టర్ల వరుస అమ్మకాలు ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 398 పాయింట్లు నష్టపోయి 57,527 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 132 పాయింట్లు క్షీణించి 17 వేల దిగువన 16,945 వద్ద నిలిచింది. ఉదయం సెషన్లో లాభాలతో కదలాడిన సూచీలు మిడ్ సెషన్ ముందు బలహీనపడ్డాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో 57,423 – 58,066 పరిధిలో కదలాడింది. నిఫ్టీ 16,917–17,109 రేంజ్లో ట్రేడైంది. ఆ తర్వాత కొద్దిసేపు లాభనష్టాల మధ్య ట్రేడైన సూచీలు ఆఖర్లో అమ్మకాలు పోటెత్తడంతో వారాంతాన్ని నష్టాలతో ముగించాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్‌క్యాప్ సూచీలు ఒకటిన్నర శాతం నష్టపోయాయి. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంక్స్, మెటల్, మీడియా, రియల్టీ రంగాలకు చెందిన చిన్న, మధ్య తరహా షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు ఒకటిన్నర శాతం నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1720 కోట్ల షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2556 కోట్ల షేర్లను కొన్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ 20 పైసలు క్షీణించి 82.40 వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్ రంగ సంక్షోభంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. ఏఎంసీ షేర్ల పతనం.. తాజా ఫైనాన్స్ బిల్లుతో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(ఏఎంసీ)ల ఈక్విటీ పెట్టుబడులపై స్వల్పకాలిక పెట్టుబడి లాభాల పన్ను వర్తించనుండటంతో ఇన్వెస్టర్లు ఆందోళనలకు లోనయ్యారు. ప్రధానంగా యూటీఐ 4.7 శాతం, ఆదిత్య బిర్లా 4.4 శాతం, హెచ్డీఎఫ్సీ ఏఎంసీ 4.2 శాతం చొప్పున పతనమయ్యాయి. ఈ బాటలో ఇతర ఏఎంసీలు శ్రీరామ్ 3.2 శాతం, నిప్పన్ లైఫ్ ఇండియా 1.3 శాతం చొప్పున క్షీణించాయి. -
ట్యాక్స్‌పేయర్లకు కొంత ఊరట..
న్యూఢిల్లీ: ఆదాయం రూ. 7 లక్షలకన్నా స్వల్పంగా ఎక్కువుండి, కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునేవారికి కొంత ఊరటనిచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ. 7 లక్షల పరిమితిని దాటిన మొత్తానికి మాత్రమే పన్ను విధించేలా ఆర్థిక బిల్లును సవరించింది. కేంద్ర ఆర్థిక శాఖ వివరణ ప్రకారం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త పన్ను విధానం ప్రకారం రూ. 7 లక్షల వరకు ఆదాయంపై పన్ను భారం ఉండదు. (ఇదీ చదవండి: బుజ్జి బంగారం: ఆనందంలో మునిగి తేలుతున్న మార్క్ జుకర్‌బర్గ్) కానీ రూ. 7,00,100 ఉంటే మాత్రం రూ. 25,010 మేర పన్ను కట్టాల్సిరానుంది. అంటే రూ. 100 ఆదాయానికి రూ. 25,010 పన్ను భారం పడనుంది. ఈ నేపథ్యంలో పరిమితికన్నా ఆదాయం కాస్త ఎక్కువ ఉంటే, దానికి మించి పన్ను భారం ఉండరాదంటూ స్వల్ప ఊరటను ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే, ఎంత మేర అధిక ఆదాయానికి ఇది వర్తిస్తుందనేది ప్రభుత్వం నిర్దిష్టంగా వివరించలేదు. సుమారు రూ. 7,27,700 వరకు ఆదాయం ఉన్న వారికి దీనితో ప్రయోజనం ఉండగలదని నాంగియా ఆండర్సన్ పార్ట్నర్ సందీప్ ఝున్‌ఝున్‌వాలా తెలిపారు. (శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ , అదిరిపోయే లాంచింగ్ ఆఫర్ కూడా!) విషాదం: ఇంటెల్ కో-ఫౌండర్, ప్రముఖ వ్యాపారవేత్త కన్నుమూత -
పన్ను భారం తగ్గించుకోవాలంటే..
వేతన జీవులకు ఆదాయపన్ను చట్టంలోని పలు సెక్షన్లు గణనీయంగా పన్ను మినహాయింపులు ఇస్తున్నాయి. పాత పన్ను విధానంలో రూ.5 లక్షల వరకు ఆదాయంపై పన్ను లేకపోగా, అందుబాటులోని అన్ని మినహాయింపులు, తగ్గింపు ప్రయోజనాలను వినియోగించుకుంటే మరో రూ.5 లక్షల ఆదాయంపైనా పన్ను భారం లేకుండా చూసుకోవచ్చు. ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే తమ ఆదాయం, పన్ను బాధ్యతలకు అనుగుణంగా ప్రణాళిక వేసుకుని, పెట్టుబడులు చేసుకోవడం మెరుగైన మార్గం. కానీ, చాలా మందికి ఇది ఆచరణలో అసాధ్యంగా ఉంటుంది. ఆర్థిక సంవత్సరం చివరిలోనే పన్ను ఆదా బాధ్యతలపై ఎక్కువ మంది దృష్టి సారిస్తుంటారు. ఈ సమయంలో పన్ను భారం తగ్గించుకునేందుకు అందుబాటులో ఉన్న సాధనాలపై కథనం ఇది. ఏడాది చివర్లో వ్యవధి తక్కువగా ఉన్నప్పుడు, హడావిడిగా చేసే పెట్టుబడుల్లో తప్పులకు చోటు ఇవ్వకూడదు. అదే సమయంలో పన్ను ఆదా ఒక్కటే ప్రామాణిక అంశం కూడా కాకూడదు. ఒకవైపు పన్ను ఆదా ప్రయోజనాన్ని ఇస్తూనే, మరోవైపు చేసిన పెట్టుబడి మంచి ప్రతిఫలాన్ని కూడా అందించేలా ఉండాలి. పైగా మనలో కొందరు చిన్న వయసులో ఉంటారు. మరికొందరు మధ్య వయసులో, కొందరు రిటైర్మెంట్కు దగ్గర్లో ఉండొచ్చు. కొందరి ఆర్జన మెరుగ్గా, కొందరి ఆర్జన మధ్యస్థంగా, తక్కువగాను ఉండొచ్చు. ఆదాయానికి అనుగుణంగా తీసుకునే రిస్క్ సామర్థ్యం మారిపోతుంటుంది. ఉదాహరణకు ఈఎల్ఎస్ఎస్ అన్నది సెక్షన్ 80సీ కింద అర్హత కలిగిన పన్ను సాధనాల్లో ఒకటి. అచ్చం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే ఈ సాధనంలో పెట్టుబడులపై రాబడి దీర్ఘకాలంలో ఏటా 12 శాతానికి పైనే లభిస్తుంది. ఇందులో వ్యయాలు చాలా తక్కువ. మూడేళ్ల లాకిన్ పీరియడ్ ముగిసిన తర్వాత లిక్విడిటీ సమస్యే ఉండదు. కానీ, కొందరికి ఈక్విటీలు నచ్చకపోవచ్చు. కొందరికి పెట్టుబడులు అన్నింటినీ ఈక్విటీలకు కేటాయించడం ఇష్టం లేకపోవచ్చు. అందుకనే అందుబాటులో సాధనా లు, వాటి మంచి చెడులను అర్థం చేసుకుంటే, ఇన్వెస్టర్లు తమకు నచ్చినవి ఎంపిక చేసుకోవచ్చు. ఎన్పీఎస్– మూడు ప్రయోజనాలు ఇందులో రాబడులు గడిచిన ఐదేళ్ల కాలంలో వార్షికంగా 8–11 శాతం మధ్య ఉన్నాయి. ఇందులో చేసే పెట్టుబడులు రిటైర్మెంట్ వరకు లాకిన్లోనే ఉంటాయి. డెట్ నుంచి ఈక్విటీ, ఈక్విటీ నుంచి డెట్‌కు అలోకేషన్‌ను మార్చుకునే సౌలభ్యం ఉంది. ఎన్పీఎస్కు సంబంధించి మూడు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షలను ఇందులో ఇన్వెస్ట్ చేసి, ఆ మొత్తంపై పన్ను లేకుండా చూసుకోవచ్చు. సెక్షన్ 80సీసీడీ (1బీ) కింద రూ.50,000 మొత్తంపై అదనపు పన్ను మినహాయింపు కూడా అందుబాటులో ఉంది. ఉద్యోగి మూలవేతనం, డీఏలో 10 శాతాన్ని ఎన్పీఎస్కు కంపెనీలు జమ చేస్తే, ఆ మొత్తంపైనా పన్ను ఉండదు. సెక్షన్ 80సీసీడీ (2) కింద ఈ ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. కనుక ఎన్పీఎస్ ఇచ్చే ప్రయోజనాలతను వేరొక సాధనంతో పోల్చడం సరికాదు. ఎన్‌పీఎస్‌లో ఈక్విటీ, కార్పొరేట్ బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్ (గిల్ట్ ఫండ్స్) అనే మూడు కేటగిరీలు ఉంటాయి. ఇన్వెస్టర్లు ఈక్విటీలకు గరిష్టంగా 75 శాతం మించకుండా కేటాయింపులు చేసుకోవచ్చు. మిగిలిన రెండింటిలో నూరు శాతం కేటాయింపులకు అనుమతి ఉంది. మూడింటి మధ్య తమ రిస్క్‌స్థాయిని బట్టి కేటాయింపుల్లో మార్పులు చేసుకోవచ్చు. ఏడాదిలో నాలుగు సార్లు ఇలా చేసుకునేందుకు అనుమతి ఉంది. పనితీరు నచ్చకపోతే ఫండ్ మేనేజర్లను కూడా మార్చుకోవచ్చు. మార్కెట్ల పట్ల అవగాహన ఉన్న వారికి ఇది అనుకూలమైన టూల్. వీటికి అదనంగా ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ విభాగం కూడా ఉంది. జీవిత బీమా పథకాలు జీవిత బీమా ఎండోమెంట్ ప్లాన్లలో రాబడి దీర్ఘకాలానికి 5 శాతంగా ఉంటుంది. పన్ను ఆదా కోసం ఇది మెరుగైన ఎంపిక కాదు. దీనికంటే కూడా యులిప్‌లు మెరుగైనవి. లేదంటే ఈఎల్ఎస్ఎస్, పీపీఎఫ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. బీమా ఎండోమెంట్ ప్లాన్లలో జీవిత బీమా కవరేజీ కూడా చెల్లించే ప్రీమియానికి నామమాత్రంగానే ఉంటుంది. రూ.50 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ రూ.12,0000 ప్రీమియానికి వస్తుంది. కానీ, ఎండోమెంట్ ప్లాన్‌లో రూ.50 లక్షల కవరేజీ కావాలంటే ఏటా రూ.4–5 లక్షలు చెల్లించాల్సి వస్తుంది. జీవితానికి రక్షణ కోణంలోనే బీమా ఉత్పత్తులు కొనుగోలు చేయాలి. ఎన్ఎస్సీ, పన్ను ఆదా ఎఫ్డీలు ఎన్ఎస్సీలను పోస్టాఫీసు నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. పన్ను ఆదా ఎఫ్డీని బ్యాంకుల్లో తీసుకోవచ్చు. రెండింటిలోనూ లాకిన్ పీరియడ్ ఐదేళ్లు. ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీపై డీసీబీ బ్యాంక్ అత్యధికంగా 8.10 శాతం రేటును ఆఫర్ చేస్తుంటే, యాక్సిస్ బ్యాంక్ రూ.7.75 శాతం ఇస్తోంది. మిగిలిన బ్యాంకుల్లో 6.70 శాతం నుంచి 7.50 శాతం మధ్య రేట్లు ఉన్నాయి. పన్ను ఆదా ఎఫ్డీ అంటే పెట్టుబడిపైనే. వడ్డీ రాబడి పన్ను పరిధిలోకి వస్తుంది. వ్యక్తిగత ఆదాయానికి కలుస్తుంది. ఎన్ఎస్సీ కేవలం పోస్టాఫీసులోనే కొనుగోలు చేసుకోగలరు. దీంతో పోలిస్తే ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీని బ్యాంకుల్లో ప్రారంభించడం, క్లోజ్ చేసుకోవడం సులభం. కొన్ని బ్యాంక్‌లు ఆన్‌లైన్‌లోనూ ఆఫర్ చేస్తున్నాయి. ఎన్ఎస్సీలో ప్రస్తుతం 7 శాతం రేటు అమల్లో ఉంది. ఎన్ఎస్సీలో పెట్టుబడిని సెక్షన్ 80సీ కింద మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. వడ్డీ రాబడి పన్ను పరిధిలోకి వస్తుంది. యులిప్‌లు యులిప్‌లలో గడిచిన ఐదేళ్ల కాలంలో వార్షిక రాబడి 8–9 శాతం మధ్య ఉంది. యులిప్ అన్నది ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే బీమా సాధనం. బీమా సంస్థలు ఒకవైపు పాలసీదారులకు బీమా రక్షణ ఇస్తూ.. మరోవైపు ఈక్విటీ, డెట్ సాధనాల్లో పెట్టుబడులు పెట్టి, వచ్చిన రాబడిని పంచుతాయి. యులిప్లోనూ ఎన్‌పీఎస్‌లో మాదిరే ఈక్విటీ, డెట్ మధ్య కేటాయింపులను మార్చుకునే సౌలభ్యం ఉంది. ఇలా మార్చుకుంటే పన్ను కట్టక్కర్లేదు. ఈక్విటీల విలువలు గరిష్టాలకు చేరినప్పుడు డెట్‌కు మారి, మార్కెట్లు దిద్దుబాటుకు గురైనప్పుడు తిరిగి ఈక్విటీల్లోకి పెట్టుబడులను మళ్లించుకోవచ్చు. రాబడులపై పన్ను లేకపోవడం మరో ఆకర్షణీయ అంశం. యులిప్‌లో పెట్టుబడులపై ఐదేళ్ల పాటు లాకిన్ ఉంటుంది. ఆ తర్వాత కోరుకున్నప్పుడు పాక్షిక ఉపసంహరణలు చేసుకోవచ్చు. ఎన్‌పీఎస్‌లో మాదిరి ఇందులో ఫండ్ మేనేజర్‌ను మార్చుకోవడానికి అవకాశం లేదు. యులిప్‌ను జీవితంలో ముఖ్యమైన లక్ష్యాల కోసం పెట్టుబడి సాధనంగా ఉపయోగించుకోవచ్చు. వార్షిక పెట్టుబడితో పోలిస్తే జీవిత బీమా కవరేజీ కనీసం 10 రెట్లు ఉంటే సెక్షన్ 10(10డీ) కింద మెచ్యూరిటీ సమయంలో తీసుకునే మొత్తంపైనా పన్ను ఉండదు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఇది ఐదేళ్ల పథకం. తర్వాత మరో మూడేళ్లు పొడిగించుకోవచ్చు. ఇందులో వడ్డీ రేటు ప్రస్తుతం 8 శాతంగా ఉంది. 60 ఏళ్లు దాటిన వారు క్రమం తప్పకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి (త్రైమాసికం ఆరంభంలో) ఆదాయం అందుకునేందుకు ఇది అనుకూలం. ఇందులో పెట్టుబడులను సెక్షన్ 80సీ కింద చూపించి మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. పెట్టుబడిపై వచ్చే వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. కాకపోతే 60 ఏళ్లు నిండిన వారికి ఏటా రూ.50 వేల వరకు వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు అమల్లో ఉంది. అంటే ఈ పథకంలో రూ.6.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఒక ఏడాదిలో రూ.50,000 పన్ను లేని ఆదాయం అందుకోవచ్చు. వార్షికాదాయం రూ.50వేలు మించితే టీడీఎస్ అమలు చేస్తారు. పీపీఎఫ్ ఇందులో ప్రస్తుత వడ్డీ రేటు 7.1 శాతం. పెట్టుబడులు 15 ఏళ్ల పాటు లాకిన్‌లో ఉంటాయి. పెట్టుబడిపై సెక్షన్ 80సీ కింద మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. పెట్టుబడి, రాబడి, ఉపసంహరణ ఇలా ఏ దశలోనూ పన్ను చెల్లించాల్సిన అవసరం లేని సాధనం ఇది. కనుక స్థిరాదాయ పథకాలతో పోలిస్తే మెరుగైనది. బ్యాంక్ ఎఫ్‌డీలపైనా ఇంతే వడ్డీ రేటు లభిస్తున్నప్పటికీ, అది పన్ను పరిధిలోకి వస్తుంది. పీపీఎఫ్‌ను అన్ని ప్రభుత్వరంగ, ప్రైవేటు వాణిజ్య బ్యాంకుల్లో ప్రారంభించొచ్చు. పోస్టాఫీసులోనూ దీన్ని తెరవొచ్చు. బ్యాంకుల్లో మరింత సౌకర్యంగా ఉంటుంది. సొంత ఖాతా నుంచే పీపీఎఫ్ కంట్రిబ్యూషన్ బదిలీ చేసుకోవచ్చు. కోరుకున్నప్పుడు ఈ–స్టేట్మెంట్ తీసుకోవచ్చు. ఆరో ఏట తర్వాత పాక్షిక ఉపంసహరణకు అనుమతి ఉంటుంది. నాలుగో ఏడాది చివరి నాటికి ఉన్న బ్యాలన్స్నుంచి సగం తీసుకోవచ్చు. 15 ఏళ్ల కాల వ్యవధి తర్వాత మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చు. మూడో ఏట నుంచి ఆరో ఏట వరకు బ్యాలన్స్‌పై రుణం తీసుకునే సదుపాయం కూడా ఉంది. సుకన్య సమృద్ధి యోజన ప్రస్తుత వడ్డీ 7.6%. కుమార్తెల పేరిట ప్రారంభించి, పెట్టుబడులు పెట్టుకునే పథకం ఇది. వారికి 18 ఏళ్లు వచ్చే వరకు దీన్ని కొనసాగించుకోవచ్చు. పదేళ్లలోపు ఆడపిల్లలను కలిగిన తల్లిదండ్రులు ఈ పథకాన్ని పరిశీలించొచ్చు. ఏటా రూ.1.50 లక్షల పెట్టుబడిపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. గడువు ముగిసిన తర్వాత తీసుకునే మొత్తంపైనా పన్ను ఉండదు. ఈ పథకంలో వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తుంటుంది. బ్యాంకు శాఖలు, తపాలా కార్యాలయాల్లో ప్రారంభించుకోవచ్చు. కనీస పెట్టుబడి రూ.1,000. గరిష్టంగా ఇద్దరు కుమార్తెల పేరిట దీన్ని తెరుచుకునేందుకు అనుమతి ఉంది. ఇద్దరి పేరిట ఖాతాలు తెరిచినా సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షలకే పన్ను మినహాయింపు కోరగలరు. రిటైర్మెంట్ మ్యూచువల్ ఫండ్స్ వీటిల్లో గత మూడేళ్ల కాలంలో చూస్తే వార్షిక రాబడులు 7–13 శాతం మధ్య ఉన్నాయి. రిటైర్మెంట్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులను సైతం సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ మ్యూచువల్ ఫండ్స్ పథకాలు పెట్టుబడుల్లో 40 శాతాన్ని ఈక్విటీలకు, 55–60 శాతాన్ని డెట్ సాధనాలకు కేటాయిస్తుంటాయి. ఫ్రాంక్లిన్ పెన్షన్ ఫండ్, యూటీఐ రిటర్మెంట్ బెనిఫిట్ పెన్షన్ ఫండ్ ఇందుకు ఉదాహరణలు. వీటిల్లో రిస్క్ తక్కువ. తక్కువ రిస్క్ ఉండాలని కోరుకునే ఇన్వెస్టర్లు రిటైర్మెంట్ కోసం వీటిల్లో ఇన్వెస్ట్ చేసి సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. వీటిల్లో పెట్టుబడులకు ఐదేళ్ల లాకిన్ ఉంటుంది. రాబడి మాత్రం పన్ను పరిధిలోకి వస్తుంది. డెట్‌కు ఎక్కువ కేటాయింపులు చేస్తే, డెట్ ఫండ్స్ మాదిరిగా లాభంపై 20 శాతం పన్ను చెల్లించాలి. లాభం నుంచి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించొచ్చు. -
టారిఫ్‌లు పెరిగితేనే టెల్కోలకు మనుగడ
న్యూఢిల్లీ: టెలికం రంగంపై పన్నుల భారం భారీగా ఉంటోందని, టెల్కోలకు వచ్చే ఆదాయంలో ఏకంగా 35 శాతం ట్యాక్సులు.. సుంకాలకే పోతోందని దిగ్గజ టెల్కో భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ వ్యాఖ్యానించారు. వీటికి తోడు ఏజీఆర్‌పరమైన (సవరించిన స్థూల ఆదాయం) బాకీలు, స్పెక్ట్రం చెల్లింపుల భారాలతో టెల్కోలు కుదేలవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో టెలికం సంస్థలు మనుగడ సాగించాలంటే టారిఫ్‌లు పెరగాల్సిన అవసరం ఉందన్నారు. పన్నుల మోతను తగ్గించి పరిశ్రమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైట్స్ ఇష్యూ ద్వారా రూ. 21,000 కోట్ల నిధుల సమీకరణకు సంబంధించి ఇన్వెస్టర్లతో నిర్వహించిన సమావేశంలో మిట్టల్ ఈ విషయాలు తెలిపారు. ‘నెలకు ఒక్కో యూజరు సగటున 16 జీబీ డేటా వినియోగిస్తున్నారు. పరిశ్రమ లాభసాటిగా మారాలంటే టారిఫ్‌లు పెరగాల్సిన పరిస్థితి ఉంది. కంపెనీలు కొత్త టెక్నాలజీలను అమలు చేయాలన్నా, నెట్‌వర్క్‌లు విస్తరించాలన్నా పెట్టుబడులపై సముచిత రాబడులు వస్తేనే సాధ్యం. టారిఫ్‌లు పెంచాల్సి వస్తే ఎయిర్టెల్ వెనక్కి తగ్గబోదు. (చౌక టారిఫ్‌ల విషయంలో) మా ఓపిక నశించిందనడానికి ఇటీవల మేము రేట్లు పెంచడమే నిదర్శనం‘ అని మిట్టల్ పేర్కొన్నారు. అయితే, మార్కెట్లో ఇతర సంస్థలు కూడా ఉన్నప్పుడు నిర్దిష్ట స్థాయి దాకా మాత్రమే పెంచగలమని, పరిమితి దాటితే నష్టపోయే ప్రమాదమూ ఉందని ఆయన తెలిపారు. ‘పరిశ్రమ మనుగడ సాగించాలంటే ఈ ఆర్థిక సంవత్సరంలో నెలవారీ ఏఆర్పీయూ (ప్రతి యూజరుపై వచ్చే సగటు ఆదాయం) రూ. 200 స్థాయికి చేరాలి. ఆ తర్వాత క్రమంగా రూ. 300కి చేరాలి. అప్పుడు కస్టమర్లకు టన్నుల కొద్దీ డేటా, సంగీతం, వినోదం.. అన్నీ ఇవ్వడానికి వీలవుతుంది‘ అని మిట్టల్ చెప్పారు. -
హోమ్‌వర్క్ చెయ్యండి .. మాస్టారు!
‘‘మేము ఉద్యోగం చేస్తున్నాం, సంపాదిస్తున్నాం, సక్రమంగా పన్నులు కట్టి రిటర్నులు వేస్తున్నాం, మాకు ఇంకా హోమ్‌వర్క్ ఏమిటండీ’’ అని తీసిపారేయకండి. నిజంగా నూటికి నూరు పాళ్లు స్వయంగా హోమ్‌వర్క్ చేసి మీ పన్నుభారాన్ని మీరే లెక్కించుకోండి. ఎవరితోనూ పోల్చుకోవద్దు. పోటీ పడొద్దు. మీ యజమాని లెక్కించిన పన్నుభారాన్ని కూడా నమ్మవద్దు. 2021 మార్చి 31తో పూర్తయ్యే సంవత్సరం ప్రతి అసెస్సీ రెండు విధానాలుగా, రకాలుగా పన్నుభారాన్ని లెక్కించుకోవచ్చు. పాత పద్ధతి ప్రకారం అ న్ని మినహాయింపులు పరిగణిస్తూ పాత శ్లాబుల ప్ర కారం, పాత రేట్ల ప్రకారం పన్నుభారం లెక్కించ డం ఒక విధానం. ఇక రెండోది, కొత్తది సెక్షన్ 115 BAC ప్రకారం ఎటువంటి మినహాయింపులు, తగ్గింపులు తీసుకోకుండా కొత్త శ్లాబుల ప్రకారం కొత్త రేట్ల ప్ర కారం పన్నుభారం లెక్కించాలి. 115 BAC ప్రకారం .. కొత్త పద్ధతిలో 60 సంవత్సరాలు లోపు ఉన్నా, 60–80 ఏళ్ల సీనియర్ అయినా, 80 దాటిన సూపర్ సీనియర్ అయినా ఇవే రేట్లు. ఈ నేపథ్యంలో ఒక కేసు చూద్దాం. 80 సంవత్సరాలు దాటి పెన్షన్ పొందుతున్న శర్మగారు యజమానికి ఏమీ చెప్పకపోవడం వల్ల పాత పద్ధతిలో పన్ను కోశారు. వారి పెన్షను రూ. 11,20,000 కాగా స్టాండర్డ్ డిడక్షన్ రూ. 50,000 తీసివేసి, పాత రేట్ల ప్రకారం పన్ను భారం రూ. 1,25,840గా ఉంటుంది. కానీ కొత్త రేట్ల ప్రకారం పన్ను భారం రూ. 1,02,960గా ఉంటుంది. శర్మగారికి వారి యజమాని రూ. 22,880 ఎక్కువగా కోశారు. ఫారం 16,ఫారం 26 అ లో ఉన్న సమాచారం కూ డా చెక్ చేసుకోండి. శర్మగారు కొత్త పద్ధతి ప్రకారం వేసుకుంటే రూ. 22,880 రిఫండు వస్తుంది. ఒక ప్రభుత్వ సంస్థ ఉద్యోగి ఫారం 26 అ లో రూ. 55 కోట్ల జీఎస్టీ టర్నోవరు పడింది. నిజానికి ఆ ఉద్యోగికి ఎటువంటి వ్యాపారం లేదు. కానీ ఆయన పాన్ నంబరును ఒక సంస్థ వారు తస్కరించి, వాడుకోవడం వల్ల ఇలా జరిగింది. మరో ఉద్యోగి రావుగారు రిటైర్ అయ్యారు. వయస్సు 70 ఏళ్లు. పెన్షన్ రూ. 3,00,000, ఇంటి మీద ఆదాయం (నికరంగా) రూ. 3,20,000, 80సి సేవింగ్స్ రూ. 1,50,000, 80డి కింద రూ. 30,000, వృత్తి పన్ను రూ. 2,400 కాగా వీరికి టీడీఎస్ రూ. 12,000 అనుకుందాం. పాత పద్ధతి ప్రకారం నికర ఆదాయం రూ. 5,00,000 లోపల ఉంది కావున పన్నుభారం లేదు. టీడీఎస్ మొత్తం రిఫండు వస్తుంది. కొత్త విధానాన్ని ఎంపిక చేసుకుంటే మొత్తం పన్నుభారం రూ. 25,480, టీడీఎస్ పోను అదనంగా కట్టాలి. అంటే వీరికి పాత పద్ధతే బెస్ట్. మీ కేసు, మీ కేసే! శర్మగారితో, రావుగారితో పక్కింటి పరంధామయ్యగారితో, వెనకింటి వెంకట్రావుగారితో పోలిక లేదు. నికర ఆదాయం రూ. 5,00,000 లోపల పాత పద్ధతి ప్రకారం పైసా కూడా పన్ను అవసరం లేదు. కొత్త పద్ధతి అనుసరిస్తే నికర ఆదాయం రూ. 2,50,000 వరకూ పన్ను లేదు. పాత పద్ధతిలో అన్ని మినహాయింపులు పొందవచ్చు. కొత్త పద్ధతిలో సర్వసంగపరిత్యాగిలాగా ఏ మినహాయింపు, తగ్గింపు, ప్రయోజనం పొందడానికి ఉండదు. అందుకే కాస్త ఓపికగా హోమ్‌వర్క్ చేసి పన్నుభారాన్ని లెక్కించండి. ఎంపిక చేసుకున్నప్పుడు ఏ తప్పులూ చేయకుండా అంకెలు వేసుకోండి. ఎంపిక చేసుకోండి. ఈ లోపలే స్టేట్మెంట్లు రెండు పద్ధతుల్లోనూ చేసుకుని రెడీగా ఉంచుకుని, కావాల్సినది ఎంచుకోండి. -
స్టాక్స్‌లో లాభాలపై పన్ను ఆదా..!
రూపాయిని ఆదా చేశామంటే.. రూపాయిని సంపాదించినట్టే. ఇది ఎప్పటి నుంచో మనం వినే సామెతే. అన్ని తరాలకూ ఇది వర్తిస్తుంది. కరోనా కల్లోలం వచ్చిన తర్వాత ఇంటికే పరిమితమైన వాతావరణంలో చాలా మంది కొత్త ఇన్వెస్టర్లు ఈక్విటీల్లోకి అడుగుపెట్టారు. ఇంటి నుంచే అదనపు ఆదాయం కోసం స్టాక్స్ పెట్టుబడులను ఎంపిక చేసుకున్నారు. దీనికి నిదర్శనం సీడీఎస్ఎల్ వద్ద ఆరు నెలల్లోనే కోటి డీమ్యాట్ ఖాతాలు కొత్తగా తెరుచుకున్నాయి. కాకపోతే ఇన్వెస్టర్లు పెట్టుబడులు, విక్రయాలపైనే దృష్టి పెడుతుంటారు కానీ, పన్ను అంశాన్ని అంతగా పట్టించుకోరు. స్టాక్ మార్కెట్లో ఆర్జించే లాభాలపై పన్ను చెల్లించాలన్న అంశాన్ని ఇన్వెస్టర్లు తప్పకుండా దృష్టిలో ఉంచుకోవాలి. ఎందుకంటే ‘స్మార్ట్’గా అడుగులు వేయడం ద్వారా ఈ పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు. తద్వారా కొంత ఆదా చేసుకోవచ్చు. ఆ వివరాలే ఈ వారం ప్రాఫిట్ ప్లస్ కథనంలో.. ఇవి గమనించండి... ► ఏడాది, అంతకుమించిన పెట్టుబడులపై ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.లక్ష వరకు లాభంపై పన్ను ఉండదు. ► రూ.2 లక్షల దీర్ఘకాల మూలధన లాభం కనిపిస్తుంటే.. రెండు ఆర్థిక సంవత్సరాల్లో రెండు భాగాలుగా తీసుకోవచ్చు. ► లాభాలు ఎక్కువగా కనిపిస్తుంటే.. నష్టాలతో సర్దుబాటు చేసుకోవడం ద్వారా పన్ను తగ్గించుకోవచ్చు. ► నివాస గృహంపై ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎల్టీసీజీ భారాన్ని దింపుకోవచ్చు. నష్టాలతో సర్దుబాటు.. 2018 ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఎల్టీసీజీ పన్నును ప్రతిపాదించారు కనుక ఆ ముందు రోజు వరకు చేసిన పెట్టుబడులకు దీర్ఘకాల మూలధన లాభాల పన్ను వర్తించదు. ‘‘నూతన నిబంధనను ప్రవేశపెట్టినప్పుడు అప్పటి వరకు ఉన్న పెట్టుబడులకు సాధారణంగా మినహాయింపునిస్తుంటారు. దీన్నే గ్రాండ్‌ఫాదరింగ్ అంటారు. కనుక 2018 జనవరి 31 నాటి వరకు చేసిన పెట్టుబడులు గ్రాండ్ ఫాదరింగ్‌కు అర్హత కలిగినవి’’ అని ఏఎంఆర్‌జీ అండ్ అసోసియేట్స్ సీఈవో గౌరవ్ మోహన్ తెలిపారు. అంటే 2018 జనవరి 31 వరకు చేసిన పెట్టుబడులకు.. కొనుగోలు తేదీగా 2018 జనవరి 31ని పరిగణిస్తుంది చట్టం. ఆ తర్వాత తేదీ నుంచి ఆర్జించిన దీర్ఘకాల మూలధన లాభాలపైనే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. స్వల్పకాల మూలధన నష్టాలను.. స్వల్పకాల మూలధన లాభాలు, దీర్ఘకాల మూలధన లాభాలు రెండింటితోనూ సర్దుబాటు చేసుకోవచ్చు. అదే ఎల్టీసీఎల్ అయితే ఎల్టీసీజీతోనే సర్దుబాటు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. వరుసగా ఎనిమిదేళ్లపాటు దీర్ఘకాల, స్వల్పకాల మూలధన నష్టాలను క్యారీ ఫార్వార్డ్ చేసుకోవాలంటే.. అందుకోసం గడువులోపు ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసుకోవడం తప్పనిసరి. లేదంటే వాటిని భవిష్యత్తు లాభాల్లో సర్దుబాటు చేసుకునే అవకాశాన్ని కోల్పోయినట్టే. పన్ను బాధ్యత ఈక్విటీల్లో (స్టాక్స్) నేరుగా చేసిన పెట్టుబడులు లేదా మ్యూచువల్ ఫండ్స్ రూపంలో స్టాక్స్‌లో పెట్టుబడులైనా సరే.. ఏడాది, అంతకు మించి కొనసాగించిన తర్వాత విక్రయించినట్టయితే వచ్చే లాభాన్ని దీర్ఘకాలిక మూలధన లాభంగా (ఎల్టీసీజీ) ఆదాయపన్ను చట్టం పరిగణిస్తోంది. ఒకవేళ నష్టం వస్తే దాన్ని దీర్ఘకాలిక మూలధన నష్టం(ఎల్టీసీఎల్)గా చూస్తారు. అదే ఏడాది లోపు విక్రయించగా వచ్చిన లాభం స్వల్పకాల మూలధన లాభం (ఎస్టీసీజీ)గాను.. నష్టం వస్తే స్వల్పకాల మూలధన నష్టం(ఎస్టీసీఎల్)గాను పరిగణిస్తారు. ఎల్టీసీజీపై 10 శాతం పన్ను చెల్లించాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో మొదటి రూ.లక్ష దీర్ఘకాల మూలధన లాభంపై పన్ను లేదు. రూ.లక్షకు మించి ఉన్న లాభంపైనే 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే ఎస్‌టీసీజీపై 15 శాతం పన్ను చెల్లించాలి. ఇందులో బేసిక్ పరిమితి అంటూ ఏదీ లేదు. అంటే ఏడాదిలోపు పెట్టుబడులపై లాభం రూ.1,000 వచ్చినా ఆ మొత్తంపై 15 శాతం పన్ను చెల్లించాల్సిందే. ఎల్టీసీజీ 2018 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. కొద్ది కొద్దిగా... పన్ను ఆదా చేసుకునేందుకు మరో మార్గం.. ఒకే విడత వెనక్కి తీసేసుకోకుండా పరిమితి పాటించడం. ‘‘ఆర్థిక సంవత్సరం ముగింపు సమీపంలో షేర్లపై ఎల్టీసీజీ రూ.2లక్షలు ఉందనుకుంటే ఒకే పర్యాయం మొత్తాన్ని విక్రయించకుండా రెండు భాగాలు చేసుకుని.. ఒక భాగాన్ని నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలోనూ, మరో భాగాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం ఆరంభంలో వెనక్కి తీసుకోవాలి’’ అని ట్యాక్మన్కు చెందిన వాధ్వాన్ సూచించారు. అప్పుడు పన్ను భారం సున్నా అవుతుంది. ఒకవేళ మూలధన లాభాల పన్ను గణనీయంగా ఉన్నట్టయితే.. అప్పుడు రెండు భాగాలు చేసినా కానీ చెల్లించాల్సిన పన్ను గణనీయంగా ఏమీ తగ్గదు. పన్ను ఆదా కోసం పెట్టుబడుల ఉపసంహరణను మరింత దీర్ఘకాలం పాటు వాయిదా వేయడం కూడా సరికాదు. దీనివల్ల మార్కెట్లో పరిస్థితులు మారిపోతే రిస్క్‌లో చిక్కుకున్నట్టు అవుతుంది. దీనికి మోహన్ మరో పరిష్కారాన్ని సూచించారు. ‘‘పెద్ద పోర్ట్‌ఫోలియో నిర్వహించే వారు.. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.లక్ష దీర్ఘకాల మూలధన లాభం మినహాయింపు తర్వాత కూడా పన్ను చెల్లించాల్సిన లాభం ఉన్నట్టయితే పోర్ట్‌ఫోలియోను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వెళ్లడమే’’ అని ఏఎంఆర్‌జీ అండ్ అసోసియేట్స్ సీఈవో గౌరవ్ మోహన్ పేర్కొన్నారు. అంటే మూలధన లాభాల పన్ను రూ.లక్షకు సమీపించగానే విక్రయించడం.. తిరిగి మరుసటి రోజు కొనుగోలు చేయడం. దీనివల్ల లావాదేవీల వ్యయాలే తప్పించి మూలధన లాభాల పన్ను భారం ఉండదు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌కూ ఇదే అమలవుతుంది. ఫండ్ యూనిట్లను కొనుగోలు చేసిన (సిప్ అయితే విడిగా ప్రతీ సిప్ కొనుగోలు చేసిన తేదీ నుంచి) నాటి నుంచి ఏడాది, ఆ తర్వాత విక్రయించగా వచ్చిన లాభంపై 10 శాతం దీర్ఘకాల మూలధన లాభాల పన్ను, ఏడాదిలోపు అయితే 15 శాతం పన్ను చెల్లించాలి. కనుక షేర్లు, ఈక్విటీ ఫండ్స్ విషయంలో పెట్టుబడి ఏడాది కాలాన్ని పూర్తి చేసుకున్న వెంటనే అందులోని మూలధన లాభాన్ని రూ.లక్ష వరకు తీసేసుకోవడం మంచి ఆలోచన అవుతుంది. కాకపోతే ఏడాది రాకుండా విక్రయిస్తే పన్ను భారం 15 శాతం అవుతుందని మర్చిపోవద్దు. అలాగే, మీ పోర్ట్ఫోలి యోలోని షేర్లు, మ్యూచువల్ ఫండ్స్‌కు అన్నింటికీ పన్ను లేని మూలధన లాభం గరిష్టంగా రూ.లక్షే అవుతుంది. ఒక్కో దానికి విడిగా రూ.లక్ష అనుకోవద్దు. ఇల్లు కొనుక్కోవడం ఈక్విటీ షేర్ల విక్రయాలపై ఎల్టీసీజీ పన్ను మినహాయింపు కోసం ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 54ఎఫ్ కింద.. నూతన ఇల్లు కొనుగోలు లేదా నిర్మాణానికి ఆ మొత్తాన్ని వినియోగించాలి. కేవలం లాభాలే కాకుండా విక్రయం ద్వారా సమకూరిన మొత్తాన్ని నూతన ఇంటిపై వినియోగించాలి. మొదటి ఇంటికే ఇది పరిమితం. నూతన ఇల్లు కొనుగోలు అయితే ఈక్విటీ షేర్లను విక్రయించిన నాటి నుంచి రెండేళ్లలోగా చేయాలి. నూతన ఇంటి నిర్మాణం కోసం వినియోగించేట్టు అయితే మూడేళ్లలోగా చేయాలి. అంతేకాదు ఇలా చేసిన తర్వాత ఏడాది లోపు రెండో ఇల్లు కొనుగోలు చేయకూడదు లేదా మూడేళ్లలోపు రెండో ఇంటిని నిర్మించకూడదు. అలాగే మూలధన లాభాల పన్ను మినహాయింపునకు కొనుగోలు చేసిన మొదటి ఇంటిని లేదా నిర్మించుకున్న ఇంటిని మూడేళ్ల వరకు విక్రయించకూడదు. ఈ నిబంధనలను పాటించకపోతే కల్పించిన మినహాయింపులను త్యజించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. షేర్లను విక్రయించిన సంవత్సరానికి సంబంధించి ఆదాయపన్ను రిటర్నుల దాఖలు సమయం సమీపిస్తున్నట్టయితే క్యాపిటల్ గెయిన్స్ డిపాజిట్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసుకుని రిటర్నుల్లో పేర్కొనాలి. ఆ తర్వాత చట్టం అనుమతించిన సమయంలోపు మొదటి ఇంటిని సమకూర్చుకోవడంపై వ్యయం చేయాల్సి ఉంటుంది. షేర్లను విక్రయించడానికి ముందు ఏడాదిలోపు నూతన ఇంటిని కొనుగోలు చేసినా పన్ను మినహాయింపు కోరవచ్చు. ఈక్విటీల్లో దీర్ఘకాల మూలధన లాభాలపై పన్ను భారం వద్దనుకుంటే అందుకోసం 54ఈసీ బాండ్లలో ఇన్వెస్ట్ చేసుకోవడం ఒక ఆప్షన్. ఎక్కువ ఆదా అయితేనే ప్రయోజనం చిన్న ఇన్వెస్టర్లకు ఇంతకు ముందు పేర్కొన్న విధాలనాలతో పన్ను ఆదా చేసుకోవడం సౌకర్యంగా ఉంటుంది. మరి రూ.కోట్లలో పెట్టుబడులను నిర్వహించే వారు ఏటా రూ.లక్ష వరకే మూలధ లాభాలను పరిమితం చేసుకోవడం ఆచరణలో అసాధ్యం. కనుక వారు మొత్తం పోర్ట్‌ఫోలియోని సమీక్షించుకుని.. స్వల్పకాల నష్టాల్లో ఉన్న స్టాక్స్‌ను విక్రయించడం ద్వారా.. అటు స్వల్పకాల మూలధన లాభాలు, దీర్ఘకాల మూలధన లాభాల పన్ను భారాన్ని కొంత వరకు అయినా తగ్గించుకోవచ్చు. ‘‘ఎల్‌టీసీజీని సరిగ్గా మదింపు వేసుకోవడమే కాకుండా లాభ, నష్టాల సర్దుబాటులో భాగంగా విక్రయించిన స్టాక్స్‌ను మరుసటి రోజు మళ్లీ కొనుగోలు చేసుకోవాలి. విక్రయించిన పెట్టుబడులను మళ్లీ ఇన్వెస్ట్ చేసేందుకు సమయం తీసుకుంటే ఈ లోపు ఆ నిధులు వేరే అవసరాలకు కరిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలా చేయడం వల్ల దీర్ఘకాల లక్ష్యాల విషయంలో రాజీపడాల్సి వస్తుంది. కాకపోతే ఇక్కడ కూడా ఒక రిస్క్ ఉంటుంది. విక్రయించిన ధరకే తిరిగి కొనుగోలు చేసకునే అవకాశం అన్ని సందర్భాల్లోనూ ఉంటుందని చెప్పడానికి లేదు. ధరల్లో గణనీయమైన వ్యత్యాసం కూడా రావచ్చు. విక్రయించిన తర్వాత స్టాక్ ధర పడిపోతే లాభమే కానీ, పెరిగిపోతేనే సమస్య. మ్యూచువల్ ఫండ్స్ అయితే విక్రయించిన మేర ఇన్వెస్టర్ బ్యాంకు ఖాతాకు చేరుకునేందుకు మూడు నుంచి ఐదు రోజుల వ్యవధి తీసుకోవచ్చు. కనుక తిరిగి ఇన్వెస్ట్ చేసే సమయానికి ధరల్లో వ్యత్యాసం వస్తే ఈ విధమైన నష్టాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. అందుకనే ఇలా చేయడం వల్ల ఎంత మేర మూలధన లాభాల పన్ను ఆదా అవుతుందన్న అంచనాకు ముందుగానే రావాలి. కనీసం 10–20 శాతం మేర ఆదా అవుతుందనుకుంటే ధరల పరంగా రిస్క్‌ను అధిగమించే వెసులుబాటు ఉంటుంది. అంతేకానీ, కొద్ది మేర పన్ను ఆదా కోసం హోల్డింగ్స్‌ను విక్రయించడం అంతగా కలసిరాకపోవచ్చు. ఎందుకంటే స్టాక్స్ అయితే స్టాంప్ డ్యూటీ, బ్రోకరేజీ, ఎక్సే్ఛంజ్ చార్జీలు చెల్లించుకోవాలి. దీనికి ధరల్లో వ్యత్యాసం అదనం. -
‘న్యాయ్’ భారం మీపై వేయం
పుణే: కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ అన్నారు. తాము ప్రకటించిన ‘న్యాయ్’ పథకం నిధుల కోసం మధ్యతరగతిపై పన్ను భారం వేస్తారంటూ వస్తున్న అనుమానాలను ఆయన కొట్టిపారేశారు. ఆర్జే మలిష్క, నటుడు సుబోధ్ సమన్వయకర్తలుగా పుణేలో విద్యార్థులతో జరిగిన ముఖాముఖిలో రాహుల్ మాట్లాడారు. దేశంలోని 25 కోట్ల మంది నిరుపేద ప్రజల ఖాతాల్లో ఏడాదికి రూ.72 వేలు చొప్పున జమ చేస్తామనీ, న్యాయ్‌కు కావాల్సిన నిధుల కోసం మధ్యతరగతి వారిపై భారం వేయం.. ఆదాయ పన్ను పెంచబోమన్నారు. ప్రధాని మోదీపై ప్రేముంది. కానీ.. ప్రధాని మోదీపై అభిమానం ఉంది. నిజంగా, ఆయనపై నాకు ఎలాంటి ద్వేషం, కోపం లేదు. కానీ, ఆయన నాపై కోపంగా ఉన్నారు. నోట్లరద్దు ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. ప్రణాళిక సంఘం వ్యూహరచన సంస్థగా పనిచేయగా ప్రస్తుతమున్న నీతి ఆయోగ్ అమలు, ఎత్తుగడలపైనే మాట్లాడుతోంది. అధికారంలోకి వస్తే విద్య, ఆరోగ్య వ్యవస్థల బలోపేతంపై దృష్టి పెడతాం. బాలాకోట్‌పై దాడి ఐఏఎఫ్ ఘనత మాత్రమే. ఈ విషయాన్ని ప్రధాని మోదీ రాజకీయం చేయడం నాకు నచ్చలేదు. నన్ను ఇబ్బందిపెట్టే ప్రశ్నలు కూడా అడగాలని మిమ్మల్ని కోరుతున్నా. ఆత్మ విమర్శ చేసుకుని, జవాబు వెతకడానికి ప్రయత్నిస్తా. ప్రియాంక మంచి స్నేహితురాలు ‘చెల్లి ప్రియాంక నాకు మంచి స్నేహితురాలు. ఇంతకుముందు కొట్లాడుకునేవాళ్లం. రాఖీ పండుగరోజు ప్రియాంక కట్టే రాఖీని దానంతట అది తెగిపోయే దాకా అలాగే చేతికి ఉంచుకుంటా. తీసేయను’ అని అన్నారు. చిన్నతనంలోనే ఉగ్రవాదుల చేతుల్లో దారుణ హత్యకు గురైన నానమ్మ(ఇందిరాగాంధీ), తండ్రి(రాజీవ్‌గాంధీ)ని రాహుల్ గుర్తుచేసుకున్నారు. ‘అప్పట్లో నానమ్మ ఆఫీసు రూంలో కర్టెన్ల వెనక దాక్కొని ఆమె లోపలికి రాగానే భయపెట్టే వాడిని’ అని ఇందిరతో అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. అల్లావుద్దీన్ కథల్లో ఉండే భూతం ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటారని అడగ్గా ‘నేను ప్రేమించే ప్రజంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటా’ అని బదులిచ్చారు. 60 ఏళ్లు నిండిన రాజకీయ నేతలను రిటైర్ కావాలని కోరడం సబబు కాదన్నారు. నాకు పెళ్లయింది రాహుల్‌పై బయోపిక్ తీయాలనుకుంటున్నాననీ, ఇందు లో హీరోయిన్ ఎవరై ఉంటే బాగుం టుందని భావిస్తున్నారని సుబోధ్ ప్రశ్నించగా ‘దురదృష్టకరం ఏంటంటే, ఇప్పటికే నాకు నా బాధ్యతలతో పెళ్లయిపోయింది’ అంటూ రాహుల్ చమత్కరించారు. (లోకమాన్య తిలక్, బాల్ గంగాధర్ వంటి బయోపిక్‌లలో సుబోధ్ నటించారు) -
ఆదాయం 5 లక్షలు దాటకపోతేనే...
తాజా బడ్జెట్లో ఆదాయపు పన్ను పరంగా.. అనుకున్నంతగా కాకపోయినా బాగానే ఉందని చెప్పాలి. ఎక్కువగా లబ్ధి పొందింది... వార్షికా దాయం రూ.5 లక్షలు దాటనివారని చెప్పొచ్చు. నికర ఆదాయం లేదా ట్యాక్సబుల్ ఆదాయం 1–4–2019 నుంచి 31–3–2020 వరకు రూ.5 లక్షలు, ఆ లోపు ఉంటే పన్ను భారం లేదు. ప్రస్తుతం అమల్లో ఉన్న శ్లాబులు, రేట్లు తదితరాల్లో ఎలాంటి మార్పులూ లేవు. శ్లాబులు మార్చకుండా... రేట్లలో మార్పు లేకుండా... ఇది ఎలా సాధ్యమనే సందేహం వస్తుంది. పన్ను తగ్గింపును సెక్షన్ 87ఎ ప్రకారం రిబేటు ద్వారా ఇచ్చారు. ఉదాహరణకు ఒకరి సేవింగ్స్ రూ.1,50,000 అనుకోండి. మెడిక్లెయిమ్ వార్షిక ప్రీమియం రూ.25,000 అనుకోండి. విద్యా రుణం మీద వడ్డీ రూ.1,00,000, ఇంటిమీద రుణంపై రూ.2,00,000 వడ్డీ అనుకోండి. వీటిన్నింటినీ కలిపితే మొత్తం రూ.4,75,000. ఈ మొత్తానికి రూ.5,00,000 కలిపితే మొత్తం రూ.9,75,000. తాజా బడ్జెట్ ప్రతిపాదనల్లో భాగంగా స్టాండర్డ్ డిడక్షన్‌ను కూడా రూ.40వేల నుంచి రూ.50 వేలకు పెంచారు. అయితే ఇది కేవలం ఉద్యోగస్తులకే వర్తిస్తుంది. దీనిని కూడా పరిగణనలోకి తీసుకుంటే మొత్తం రూ.10,25,000 అవుతుంది. ఆ లెక్కేంటో ఒకసారి చూద్దాం. మొత్తం జీతం – 10,25,000 స్టాండర్డ్ డిడక్షన్ – 50,000 మెడిక్లెయిమ్ – 25,000 సేవింగ్స్(80సి) – 1,50,000 విద్యారుణంపై వడ్డీ – 1,00,000 గృహరుణంపై వడ్డీ – 2,00,000 మొత్తం మినహాయింపులు – 5,25,000 నికర ఆదాయం – 5,00,000 ఇలా మిగిలిన మొత్తం రూ.5,00,000 దాటలేదు కనక ఎలాంటి పన్ను భారం ఉండదు. ప్రస్తుత సంవత్సరపు పన్ను భారంతో పోల్చి చూస్తే రూ.12,500 తక్కువ. ఈ మేరకు పన్ను భారం తగ్గినట్లే. ఇది సంతోషించవలసిన విషయం. ఉద్యోగస్తులు కాని వారికి కూడా ఈ సదుపాయం వర్తిస్తుంది. కాకపోతే స్టాండర్డ్ డిడక్షన్ అనేది మాత్రం ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ మేరకు చూస్తే పై ఉదాహరణలో స్థూల ఆదాయం రూ.10,25,000 నుంచి రూ.9,75,000కు తగ్గుతుంది. అలాంటి వారికి పన్ను భారం ఉండదు. కొసమెరుపు ఏమిటంటే... పన్ను చెల్లించాల్సిన లేదా నికర ఆదాయం రూ.5,00,000 దాటిన వారికి శ్లాబులు, రేట్లు అన్నీ యథాతథం. వీటిల్లో ఎలాంటి మార్పూ లేనందున వెసులుబాటు, ఉపశమనం వంటివేమీ లేవు. ఇది మోదీ మంత్రం. నికరాదాయం రూ.5లక్షల లోపు ఉన్నవారికే ఈ మార్పు వర్తిస్తుంది. -
ఏడాది మారింది... మరి మీరు?
గతేడాది చాలా పెట్టుబడి సాధనాలు సగటు కంటే తక్కువ రాబడులే ఇచ్చాయి. ఇటీవలి కాలంలో ఎక్కువ అస్థిరతలు చూసింది గతేడాదిలోనే. అయితే, 2019లో పరిస్థితులు ఆశాజనకంగానే ఉంటాయన్నది ఎక్కువ మంది నిపుణుల అభిప్రాయం. ప్రతికూలతలను అధిగమించి, పెట్టుబడి అవకాశాలను అందుకోవాలంటే అందుకు ప్రతి ఒక్కరూ పాటించతగిన ఆర్థిక విధానాలు కొన్ని ఉన్నాయి. అవేంటన్నది నిపుణుల మాటల్లోనే... – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం ఈ ఏడాది ఎన్నికలు ఉన్నందున మార్కెట్లలో అస్థిరతలు కొనసాగేందుకు అధిక అవకాశాలున్నాయి. ఈ అస్థిరతలను అధిగమించేందుకు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ఉపయోగపడుతుంది. ఎన్నికల వరకు స్టాక్స్ ధరలు పరిమిత పరిధిలోనే కదలాడే అవకాశం ఉంది. ఫలితాలు వెలువడ్డాక దిశను ఎటువైపు అయినా మార్చుకోవచ్చు. కాబట్టి ఈ సమయంలో ఇన్వెస్టర్లు సిప్ ద్వారా ప్రతి నెలా నిర్ణీత మొత్తం ఇన్వెస్ట్ చేయడమే సరైన మార్గం. మార్కెట్లు గరిష్టాల్లో ఉన్నప్పుడు ఎన్ఏవీ ధరలు పెరగడం వల్ల తక్కువ ఫండ్స్ యూనిట్లు, మార్కెట్లు కరెక్షన్ బాట పడితే ఎన్ఏవీ ధరల పతనంతో ఎక్కువ యూనిట్లు సొంతం చేసుకోవచ్చు. మార్కెట్లు కొంతమేర కరెక్షన్కు గురైన ఈ సమయంలో సిప్‌ను ఆపకూడదు. దీనివల్ల తక్కువ ధరలకు ఎన్ఏవీలను కొనుగోలు చేసుకునే అవకాశం కోల్పోతారు. ముఖ్యంగా 12–18 నెలల క్రితం సిప్ ఆరంభించిన వారు కచ్చితంగా ఈ సమయంలో ఆపకుండా కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఏడాది, ఏడాదిన్నర క్రితం మార్కెట్ల వ్యాల్యూషన్లు గరిష్ట స్థాయిల్లో ఉన్నాయి. కనుక గరిష్ట ధరల్లో పెట్టుబడి పెట్టిన వారు, ఇప్పుడు తక్కువ ధరకే కొనే అవకాశాన్ని కోల్పోకూడదు. లార్జ్‌క్యాప్‌నకు ప్రత్యామ్నాయాలు చాలా వరకు ప్రధాన లార్జ్‌క్యాప్ ఫండ్స్ గతేడాది మెరుగైన పనితీరు చూపించలేకపోయాయి. ఈ ఏడాది కూడా వీటి పనితీరు అంత బాగుండకపోవచ్చనే అంచనా ఉంది. అధిక రాబడులు కోరుకునే వారు అధిక రిస్క్ తీసుకోవాల్సి ఉంటుందని మరిచిపోవద్దు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్లూచిప్ ఫండ్, హెచ్డీఎఫ్సీ టాప్ 100, రిలయన్స్ లార్జ్‌క్యాప్, యూటీఐ మాస్టర్‌షేర్ పథకాలన్నీ గతేడాది ఒక శాతం నుంచి రెండున్నర శాతం నష్టాలను మిగిల్చాయి. ఇదే కాలంలో నిఫ్టీ– 50 సూచీ 3 శాతం రాబడులను ఇచ్చింది. కనుక లార్జ్‌క్యాప్ ఫండ్స్‌కు బదులు ఈ సమయంలో మల్టీక్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచి నిర్ణయంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. మల్టీక్యాప్ ఫండ్స్ భిన్న మార్కెట్ విలువతో కూడిన స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాయని వారు సూచిస్తున్నారు. దీంతో అధిక రాబడులిచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. అదే సమయంలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌తో పోలిస్తే రిస్క్ కాస్త తక్కువగానే ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే... మల్టీక్యాప్ ఫండ్స్ అయినప్పటికీ క్రమానుగత పెట్టుబడుల విధానం (సిప్) ద్వారా కనీసం ఐదేళ్లు ఆపైన ఇన్వెస్ట్ చేయడం ద్వారానే మెరుగైన రాబడులను సొంతం చేసుకునే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి. పన్ను భారం తగ్గించుకోవచ్చు ఈక్విటీలు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌పై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును కేంద్ర ప్రభుత్వం తిరిగి ప్రవేశపెట్టడం తెలిసిందే. ఈ నిర్ణయం తర్వాత కూడా ఈక్విటీల్లోకి, మ్యూచువల్ ఫండ్స్‌లోకి రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఆగలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. సిప్ ద్వారా 2018లో వచ్చిన పెట్టుబడుల్లో 20 శాతం వృద్ధి నెలకొంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.లక్షకు మించి దీర్ఘకాల మూలధన లాభం పొందితే దానిపై 10 శాతం పన్ను చెల్లించాలి. అయితే, ఈక్విటీ ఫండ్స్‌లో వచ్చే లాభాల్లో ఇది స్వల్ప మొత్తమేనని ఇన్వెస్టర్లు అర్థం చేసుకున్నట్టున్నారు. నిజానికి 10 శాతం పన్ను రాబడులను పెద్దగా ప్రభావం చేసేది కాదని నిపుణుల అభిప్రాయం కూడా. నెలకు సిప్ ద్వారా రూ.5,000– 10,000 మొత్తం ఇన్వెస్ట్ చేసే వారిపై ఇప్పటికిప్పుడు ఈ పన్ను ప్రభావం కూడా ఏమీ ఉండదు. ఎందుకంటే ఈ స్వల్ప మొత్తంపై ఏడాదిలో వచ్చే లాభాలు పన్ను పడే స్థాయిలో ఉండవు. అదే రూ.30,000– 50,000 మధ్య ఇన్వెస్ట్ చేసే వారయితే వార్షికంగా 12 శాతం రాబడులు వచ్చాయనుకుంటే రెండేళ్ల తర్వాత మూలధన లాభాల పన్ను పరిధిలోకి వస్తారు. రెండేళ్లలో వారు పొందే లాభం రూ.లక్ష దాటుతుంది. ఆ మొత్తాన్ని ఒకే ఆర్థిక సంవత్సరంలో తీసుకుంటేనే పన్ను చెల్లించాల్సి వస్తుంది. అయితే, ఈ పన్ను కూడా చెల్లించకుండా మార్గం ఉంది. ఏడాది దాటాక ప్రతీ నెలా అంతే మొత్తాన్ని విత్‌డ్రా చేసుకుంటూ తిరిగి అదే ఫండ్ లేదా మరో ఫండ్ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచి ఆలోచన అవుతుంది. దీంతో పన్ను వర్తించేంత లాభాలు రాకముందే తిరిగి ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకు 2018 ఏప్రిల్ నెలలో ఓ ఫండ్‌లో ఎన్ఏవీ రూ.25 వద్ద రూ.25,000 ఇన్వెస్ట్ చేశారనుకోండి. 1,000 యూనిట్లు వచ్చి ఉంటాయి. 2019 ఏప్రిల్ నెలతో ఏడాది పూర్తవుతుంది. ఆ మరుసటి నెలలోనే వెయ్యి యూనిట్లను రెడీమ్ చేసుకుని తిరిగి ఇన్వెస్ట్ చేయాలి. ఇలా ప్రతీ సిప్‌కు ఏడాది పూర్తయిన వెంటనే తిరిగి ఇన్వెస్ట్ చేస్తుంటే సరి. మల్టీ ఇయర్ హెల్త్ ప్లాన్ వైద్య బీమాకు ఏటా ప్రీమియం చెల్లించాలి. లేదంటే కవరేజీ ఆగిపోతుంది. దీనికి బదులు ఒకేసారి రెండేళ్లకు ప్లాన్ తీసుకుని ప్రీమియం చెల్లించడం వల్ల తగ్గింపుతోపాటు... ఏడాదికే ప్రీమియం చెల్లించాల్సిన ఇబ్బందీ తప్పుతుంది. న్యూఇండియా అష్యూరెన్స్ కంపెనీ 2017లో వృద్ధుల వైద్య బీమా ప్రీమియంను ఒకేసారి రెట్టింపునకు పైగా పెంచింది. కనుక ఒకేసారి ఎక్కువ సంవత్సరాలకు పాలసీ తీసుకోవడం వల్ల తగ్గింపు ఒక్కటే కాదు, ప్రీమియం పెరిగే భారం కూడా కొంత వరకు తప్పించుకున్నట్టు అవుతుంది. ఎన్పీఎస్ కూడా చూడొచ్చు.. జాతీయ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్) విశ్రాంత జీవనం కోసం ప్రణాళికలు వేసుకునే వారికి అనువైన సాధనాల్లో ఒకటి. ఇందులో చార్జీలు ఇతర సాధనాలతో పోలిస్తే తక్కువ. ఈక్విటీ, డెట్‌లోనూ ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. 60 ఏళ్లు వచ్చాక ఉపసంహరించుకునే 60 శాతం మొత్తంలో 20 శాతంపై పన్ను ఉండేది. ఇది నచ్చక చాలా మంది దీనికి దూరంగా ఉండిపోయారు. అయితే, ఎన్పీఎస్ పథకం నుంచి రిటైర్మెంట్ వయసులో ఉపసంహరించుకునే 60 శాతం మొత్తంపైనా పన్నును తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. మిగిలిన 40 శాతాన్ని యాన్యుటీ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయాలని తెలిసిందే. ఇక ఈక్విటీల్లో యాక్టివ్ చాయిస్ కింద 75 శాతం వరకు ఇన్వెస్ట్ చేసుకునేందుకు అనుమతిస్తూ ఎన్పీఎస్ నిర్వహణను చూసే పీఎఫ్ఆర్డీఏ గతేడాది అక్టోబర్‌లో మరో నిర్ణయం తీసుకుంది. 70 ఏళ్లు వచ్చే వరకూ కూడా ఇన్వెస్ట్ చేసుకునేందుకు అనుమతించింది. గత ఐదేళ్ల కాలంలో చూసుకుంటే వార్షికంగా రెండంకెల రాబడులు ఎన్‌పీఎస్‌లో ఉన్నాయి. ఈక్విటీలకు 50 శాతం వరకు కేటాయించుకునే వారికి 11.31 శాతం చొప్పున వార్షిక రాబడులు, పూర్తిగా డెట్‌కే పరిమితమైన వారికి వార్షికంగా 10.55 శాతం చొప్పున పెట్టుబడుల వృద్ధి ఉంది. ఇక పన్ను ప్రయోజనాలు అదనం. బేసిక్ వేతనంలో 10 శాతాన్ని సెక్షన్ 80సీసీడీ(2) కింద ఉద్యోగి తరఫున కంపెనీ ఎన్పీఎస్కు జమ చేస్తే పన్ను ఉండదు. అలాగే, సెక్షన్ 80సీసీడీ(1బీ) కింద ఎన్‌పీఎస్‌లో అదనంగా మరో రూ.50,000 పెట్టుబడిపైనా పన్ను ఉండదు. కనుక దీన్ని తప్పకుండా పరిశీలించాల్సిన పథకంగా ఫైనాన్షియల్ అడ్వైజర్ల సూచన. విదేశీ ఫండ్స్‌లో కూడా... అమెరికా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ ఎన్ఏవీల ధరలు కొంత కాలం క్రితం వరకూ బాగా పెరిగాయి. తాజాగా అమెరికా మార్కెట్ల పతనం నేపథ్యంలో వాటి ఎన్ఏవీలు తగ్గుముఖం పట్టాయి. అంతమాత్రాన అమెరికా ఫండ్స్‌లో పెట్టుబడులు ఆపేయాల్సిన అవసరం లేదన్నది నిపుణుల విశ్లేషణ. అమెరికన్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ ఎన్నో అంశాలను అధ్యయనం చేశాకే పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటుంటాయి. బలమైన బ్రాండ్, మార్కెట్ వ్యాల్యూ, బలమైన నగదు ప్రవాహాలు వంటి అంశాలను చూస్తాయి. పైగా డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణత కూడా పెట్టుబడుల విలువ పెరిగేందుకు దోహదపడుతుంది. కనుక తమ పిల్లలను విదేశీ విద్యకు పంపించాలనుకునే వారు ఈ తరహా ఫండ్స్‌లో ముందునుంచే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రుణాన్ని బదలాయించుకుంటే...? రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయించే విషయంలో బ్యాంకులు వాటి అంతర్గత బెంచ్ మార్క్ రేటుకు అనుగుణంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో పారదర్శకత తక్కువగా ఉంటోంది. దీనికి బదులు రెపో రేటు, 91, 182 రోజుల ట్రెజరీ బిల్లు ఈల్డ్ రేటు లేదా ఏదైనా ఇతర బెంచ్ మార్క్ మార్కెట్ రేటుకు అనుగుణంగా వడ్డీ రేట్లను అనుసరించాలని ఆర్బీఐ ఇటీవలే ఆదేశించింది. గృహ, ఆటోమొబైల్, వ్యక్తిగత రుణాలకూ ఇది అమలుకానుంది. బ్యాంకుల మధ్య పోటీ పెరిగి కస్టమర్లకు తక్కువ రేట్లకే రుణం లభించే పరిస్థితులకు ఇది దారితీస్తుంది. కనుక అధిక వడ్డీ రేటుకు రుణం తీసుకున్న వారు దాన్ని తక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేసే బ్యాంకు లేదా ఆర్థిక సంస్థకు బదలాయించుకోవడం మంచి ఆలోచన అవుతుంది. రుణం తొలి నాళ్లలో ఈఎంఐలో ఎక్కువ మొత్తం వడ్డీకే వెళుతుంది. కనుక మొదట్లోనే రుణాన్ని బదలాయించుకోవడం వల్ల ప్రయోజనం ఎక్కువ. పెద్దల పేరు మీద పెట్టుబడి 60 ఏళ్లు దాటిన వారు వార్షికంగా పొందే రూ.50వేల వడ్డీ ఆదాయానికి పన్నును మినహాయిస్తూ కేంద్రం గతేడాది నిర్ణయం తీసుకున్న విషయం గుర్తుండే ఉంటుంది. 60 ఏళ్ల లోపు వయసులో ఉన్న వారు ఏటా వడ్డీ ఆదాయం రూ.10,000 దాటితే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కనుక తమ తల్లిదండ్రులకు పన్ను వర్తించేంత ఆదాయం లేకపోతే, వారికి గిఫ్ట్‌గా ఇచ్చి, వారి పేరిట డిపాజిట్ చేయడం మంచి ఆలోచన. ఇది చట్టబద్ధం కూడా. పైగా బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు అర శాతం వరకు అధిక వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్న విషయం తెలిసిందే. భార్యా, పిల్లలకు గిఫ్ట్ ఇచ్చి వారి పేరిట ఇన్వెస్ట్ చేసినా, అది గిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి ఆదాయం కిందే చట్టం పరిగణిస్తుంది. తల్లిదండ్రులకు గిఫ్ట్ ఇస్తే మోసపూరిత లావాదేవీగా చట్టం పరిగణించదని ట్యాక్స్‌స్పానర్ సంస్థ సహ వ్యవస్థాపకుడు సుధీర్కౌశిక్ తెలిపారు. షార్ట్‌టర్మ్ డెట్ ఫండ్స్ ప్రస్తుతం వడ్డీ రేట్ల పరంగా ఆటుపోట్లు ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. కనుక ఈ సమయంలో దీర్ఘకాల డెట్ ఫండ్స్ కంటే షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్ అనుకూలమని నిపుణులు పేర్కొంటున్నారు. దీర్ఘకాల ఫండ్స్, దీర్ఘకాలంలో గడువు తీరే బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తాయి. ఇంక్రిమెంటల్ రిస్క్ తీసుకున్నా గానీ దీర్ఘకాల డెట్ ఫండ్స్ తగినంత రాబడులను ఆఫర్ చేయడం లేదని, వీటికి బదులు మూడేళ్ల లోపు గడువు తీరే షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చని ఎడెల్వీజ్ మ్యూచువల్ ఫండ్ సీఐవో ధావల్ దలాల్ సూచించారు. బలమైన క్రెడిట్ ప్రొఫైల్ (రుణ చరిత్ర) ఉన్న కార్పొరేట్ బాండ్ ఫండ్స్‌ను కూడా పరిశీలించొచ్చని కెనరా రొబెకో మ్యూచువల్ ఫండ్ ఫిక్స్డ్ ఇన్కమ్ విభాగం హెడ్ అవనీష్ జెయిన్ సూచన. 2–5 ఏళ్ల కాలానికి ఇవి మంచి రాబడులను ఆఫర్ చేస్తున్నట్టు తెలిపారు. ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్లు డెట్ ఫండ్స్‌లో వడ్డీ రేట్ల రిస్క్ ఉంటుంది. వడ్డీ రేట్లు పెరిగితే డెట్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసిన వారు ఆ ప్రయోజనం నష్టపోతారు. ఈ రకమైన రిస్క్ వద్దనుకునేవారు ఎఫ్ఎంపీలను పరిశీలించొచ్చు. ఇవి డెట్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసి గడువు తీరే వరకు కొనసాగుతాయి. దాంతో బాండ్ ఈల్డ్స్‌కు అనుగుణంగానే రాబడులు ఉంటాయి. -
జీఎస్టీ అంటే ఆర్ఎస్ఎస్ ట్యాక్స్
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)ని ఆర్ఎస్ఎస్ ట్యాక్స్‌గా మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం అభివర్ణించారు. దీని కారణంగా ప్రజలపై విపరీతంగా పన్ను భారం పెరిగిందనీ, అందుకే ఇది ‘చెడుమాట’గా మారిందన్నారు. ‘అది ఒక విచిత్రమైన జంతువు లాంటిది. సగటు జీవిపై జీఎస్టీతో విపరీత భారం మోపారు. ఒకే పన్ను రేటు ఉంటే జీఎస్టీ అనొచ్చు. అనేకమార్లు పన్నులు వసూలు చేస్తుంటే మాత్రం ఆర్ఎస్ఎస్ ట్యాక్స్ అని పిలవాల్సి ఉంటుంది’ అన్నారు. అధికారులు మాత్రమే జీఎస్టీ వల్ల సంతోషంగా ఉన్నారని తెలిపారు. పరోక్ష పన్నుల విధానంలోకి పెట్రోలియం ఉత్పత్తులను కూడా తీసుకురావాలని ప్రభుత్వానికి సూచించారు. -
ఆర్టీసీకి చమురుదెబ్బ!
సాక్షి, రాజంపేట : పెరుగుతున్న డీజిల్ ధరలతో ఆర్టీసీ సంస్థ కుదేలవుతోంది. చమురుదెబ్బతో విలవిలాడుతోంది. దీంతో మరింత నష్టాల్లో కూరుకుపోతోంది. ఇంధన ధరల పెరుగుదలే నష్టాలకు కారణమని ఆర్టీసీ కార్మికవర్గాలు వాపోతున్నాయి. జిల్లాలో కడప, పులివెందుల, రాజంపేట, రాయచోటి, జమ్మలమడుగు, మైదుకూరు, ప్రొద్దుటూరు, బద్వేలు డిపోలు ఉన్నాయి. రెండు నెలల్లో డిజిల్ లీటరుకు రూ.5 పెరిగింది. దీంతో రోజుకు రూ.10 లక్షల అదనపు భారం ఆర్టీసీపై పడింది. తరచూ ఇంధన ధరల పెరుగుదల ఆర్టీసీకి గుదిబండలా మారింది. డీజిల్ ధరలు పెరగడం వల్ల పరోక్షంగా ఆర్టీసీ చార్జీలు పెంచాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. రోజుకు 3.75 లక్షల కిలోమీటర్లు మేర బస్సులు నడుస్తున్నాయి. ప్రతిరోజు 3లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరుస్తోంది. గతంలో డీజిల్ ధరలు పెరిగితే చార్జీలను పెంచేవారు. ప్రస్తుతం చార్జీలు పెంచితే ప్రజావ్యతిరేకత పెల్లుబుకుతోందనే భయంతో ప్రభుత్వం వెనకడుగు వేస్తోంది. డీజిల్ ధరల ప్రభావం ఇలా.. జిల్లాలోని డిపోల పరిధిలో 564 ఆర్టీసీ బస్సులను సొంతంగా నడుపుతోంది. 294 అద్దె బస్సులను వినియోగిస్తోంది. మొత్తం మీద 858 బస్సులకు రోజుకు 65వేల లీటర్ల డీజిల్ వినియోగిస్తున్నట్లు ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. దీని కోసం రోజుకు రూ.4 లక్షలకుపైగా వెచ్చించాల్సి ఉంది. నెలకు రూ.8 కోట్లు డీజిల్‌కే ఖర్చు చేయాల్సి వస్తోం ది. నెల రోజులపాటు బస్సులను రోడ్డెక్కిస్తే రూ.27 కోట్లు ఆదాయం వస్తోంది. జిల్లాలోని కడప, మైదుకూరు, ప్రొద్దుటూ రు, జమ్మలమడుగు, రాయచోటì, రాజం పేట డిపోలకు చిత్తూరు నుంచి డీజిల్ సరఫరా చేస్తోంది. బద్వేలుకు ఒంగోలు, పులివెందులకు గుంతకల్లు నుంచి అందుతోంది. నెలకు రూ.3కోట్లు అదనపుభారం పడుతోంది. ఇంధన పొదుపు తప్పనసరి.. ఆర్టీసీకి వస్తున్న ఆదాయంలో మూడో వంతు డీజిల్, జీతభత్యాలు, విడిభాగాల కొనుగోలుకు ఖర్చు అవుతోంది. నష్టాల ఊబిలో కూరుకున్న సంస్థను గట్టెక్కించేందుకు అధికారులు యత్నాలు చేస్తున్నారు. మరోవైపు డీజిల్‌తోపాటు ఇతర ధరలు పెరుగుదల శాపంగా మారుతోంది. ఇంధనపొదుపుపై డ్రైవర్లకు అధికారులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నారు. నష్టాలను తగ్గించేందుకు అంతర్గతంగా ప్రణాళికలను రూపొందించుకొని ముందుకెళుతున్నారు. ట్యాక్స్ ఎత్తివేయాలి ఆర్టీసీకి సరఫరా చేసే డీజిల్‌పై ట్యాక్స్ ఎత్తివేయాల్సిన ఆవశ్యకత ఉంది. కెఎంపీఎల్ సాధించే విషయంలో డ్రైవర్లపై విపరీతంగా మానసిక ఒత్తిడి కలుగుతోంది. మానసిక ప్రశాంతతో విధులు నిర్వర్తించాలంటే ప్రభుత్వం డీజిల్ సరఫరా విషయంలో సముచిత నిర్ణయం తీసుకోవాలి. –శివారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఎన్ఎంయూ, కడప -
అంతర్జాతీయ ఫండ్స్.. పన్ను భారం ఎంత?
నేను హెచ్డీఎఫ్సీ ఎస్ఎల్ యంగ్ స్టార్ సూపర్ టూ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను తీసుకున్నాను. ఏడాదికి రూ.40,000 ప్రీమియమ్ చొప్పున ఐదేళ్లు చెల్లించాను. ఈ పాలసీలో కొనసాగమంటారా? లేక వైదొలగమంటారా? - స్పందన, విజయవాడ హెచ్డీఎఫ్సీ ఎస్ఎల్ యంగ్ స్టార్ సూపర్ టూ అనేది యూనిట్ లింక్డ్ ప్లాన్. ఈ తరహా ప్లాన్‌ల్లో మీరు చెల్లించే ప్రీమియం నుంచి సదరు మ్యూచువల్ ఫండ్ సంస్థ వివిధ చార్జీలను(మోర్టాలిటీ చార్జీలు, నిర్వహణ వ్యయాలు, ఫండ్ మేనేజ్మెంట్ చార్జీలు... తదితర చార్జీలు) మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తుంది. ఇలాంటి వ్యయాల కారణంగా మీరు ఎక్కువ ప్రీమియం చెల్లించినప్పటికీ, నికరంగా ఇన్వెస్ట్ చేసే మొత్తం తక్కువగా ఉంటుంది. ఫలితంగా మీరు పెద్ద మొత్తంలో ప్రీమియం చెల్లించినప్పటికీ, మీకు వచ్చే రాబడులు తక్కువగా ఉంటాయి. మార్కెట్ మంచి ఊపుమీద ఉన్నప్పటికీ, ఈ వ్యయాల కారణంగా మీరు స్వల్ప రాబడులతోనే సరిపెట్టుకోవలసి వస్తుంది. అయితే ఈ పాలసీలను విక్రయిస్తే ఏజెంట్లకు భారీగా కమీషన్లు వస్తాయి. ఈ కమీషన్ల కోసం ఏజెంట్లు ఈ పాలసీల గురించి అతిగా చెప్పి ఇన్వెస్టర్లకు అంటగడతారు. ఇక మీ విషయానికొస్తే, ఈ పాలసీ పరంగా మీకు ఎదురయ్యే భవిష్యత్ నష్టాలను తగ్గించుకోవడానికి ఈ ప్లాన్‌ను సరెండర్ చేయడమే సరైన పని. ఈ ప్లాన్‌కు లాక్-ఇన్-పీరియడ్ ఐదేళ్లుగా ఉంది. మీ ప్లాన్ తీసుకొని ఐదేళ్లు పూర్తయింది. కాబట్టి, ఈ ప్లాన్‌ను సరెండర్ చేసినా, మీరు ఎలాంటి సరెండర్ చార్జీలు చెల్లించాల్సిన పనిలేదు. మీరు సరెండర్ చేసే సమయానికి ఈ ఫండ్ విలువ ఎంత ఉంటుందో, అదే సరెండర్ విలువగా మీరు పొందవచ్చు. ఇక భవిష్యత్ ఇన్వెస్ట్మెంట్స్ విషయానికొస్తే, బీమా, ఇన్వెస్ట్మెంట్ కలగలసిన ఈ తరహా ప్లాన్‌ల్లో ఎప్పుడూ ఇన్వెస్ట్ చేయకండి. ఇవి తగిన బీమాను, ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులను కూడా ఇవ్వలేవు. జీవిత బీమా కోసం పూర్తిగా టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను తీసుకోండి. వీటికి బీమా కవర్ అధికంగానూ, చెల్లించాల్సిన ప్రీమియమ్‌లు తక్కువగానూ ఉంటాయి. పిల్లల ఉన్నత విద్యాభ్యాసం, స్వగృహం ఏర్పాటు చేసుకోవడం.. తదితర దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం మంచి బ్యాలెన్స్డ్ లేదా ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఏ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసినా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానాన్ని అనుసరించడం మరచిపోకండి. సాధారణంగా పలు బీమా సంస్థలు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకునే కవరేజ్ ఉన్న ఆరోగ్య బీమా పాలసీలను ఆఫర్ చేస్తాయి. అయితే డొమిసిలియరీ వ్యయాల(ఇంటి వద్ద ట్రీట్మెంట్ తీసుకుంటే అయ్యే ఖర్చులు) కవరేజ్ ఉన్న ఆరోగ్య బీమా పాలసీలను ఏయే సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి? వీటి వివరాలను వెల్లడించండి. - మహేందర్, హైదరాబాద్ డొమిసిలియరీ వ్యయాలను కూడా కవర్ చేసే ఆరోగ్య బీమా పాలసీలను పలు సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. మీ అవసరాలను బట్టి అపోలో మ్యూనిక్ ఆప్టిమ రిస్టోర్, రెలిగేర్ హెల్త్ ఇన్సూరెన్స్ కేర్లను పరిశీలించవచ్చు. ఈ ప్లాన్లకు మంచి క్లెయిమ్ రికార్డ్ ఉంది. మీ లైఫ్ స్టైల్, ప్రస్తుత ఆరోగ్య స్థితిగతులు, జబ్బులకు సంబంధించి మీ కుటుంబ చరిత్ర తదితర అంశాలను ఆధారంగా ఎంత మొత్తానికి బీమా తీసుకోవాలో నిర్ణయించుకోండి. మీ వయస్సును బట్టి వివిధ సంస్థలు ఎంత ప్రీమియమ్‌లు వసూలు చేస్తున్నాయో పరిశీలించి, మీకు అనువైన ప్లాన్‌ను ఎంచుకోండి. మీరు పాలసీ తీసుకున్న 30 రోజుల తర్వాతనే పాలసీ అమల్లోకి వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. పాలసీ తీసుకున్న 30 రోజుల లోపు మీరు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నా, వాటికి అయిన ఖర్చులు రీయింబర్స్మెంట్ కావు. నేను 2010, జనవరి నుంచి ఫ్రాంక్లిన్ ఏషియన్ ఈక్విటీ ఫండ్‌లో నెలకు రూ.1,000 చొప్పన ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాను. 2014,జూన్ వరకూ ఇలా ఇన్వెస్ట్ చేశాను. 2014 సెప్టెంబర్ నుంచి ఈ ఫండ్ నుంచి సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్(ఎస్‌డబ్ల్యూపీ) ద్వారా నెలకు రూ.4,500 విత్‌డ్రా చేసుకుంటున్నాను. ఇది కొనసాగుతోంది. ఈ ఇన్వెస్ట్మెంట్స్, విత్డ్రాయల్స్పై మూలధన లాభాల పన్నును ఎలా లెక్కించాలి? దీనికి రెండు పద్దతులున్నాయని మిత్రులు చెబుతున్నారు. ఒకటి ఫస్ట్ఇన్ఫస్ట్ అవుట్(ఫిఫో-మొదటగా ఇన్వెస్ట్ చేసింది మొదటిగా ఉపసంహరించుకోవడం), రెండవది లాస్ట్ఇన్ ఫస్ట్అవుట్(లిఫో-చివర్లో ఇన్వెస్ట్ చేసింది మొదటగా ఉపసంహరించుకోవడం). ఫిఫో పద్ధతిని అనుసరిస్తే నేను ఇన్వెస్ట్ చేసిన సిప్‌లకు ఏడాది దాటింది కాబట్టి నేను ఎలాంటి మూలధన లాభాల పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని భావిస్తున్నాను. ఇక రెండో పద్ధతి(లిఫో)ను అనుసరిస్తే, కొన్ని సిప్‌లకు ఏడాది దాటలేదు కాబట్టి, కొన్నింటికే నేను మూలధన లాభాల పన్నుల చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయమై తగిన సూచనలివ్వండి. - కార్తికేయ, ఈ మెయిల్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి ఫిఫో పద్ధతినే అనుసరిస్తారు. అంటే తొలిసారిగా కొనుగోలు చేసిన యూనిట్లను తొలిసారిగా విక్రయించడం. ఇక మీ ఇన్వెస్ట్మెంట్స్, విత్‌డ్రాయల్స్‌ను పరిశీలిస్తే మీరు కొన్ని విత్‌డ్రాయల్స్‌కు మూలధన లాభాల పన్నును, చాలావాటికి స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లంచాల్సి ఉంటుంది. ఫ్రాంక్లిన్ ఏషియన్ ఈక్విటీ ఫండ్ అనేది అంతర్జాతీయ ఫండ్. డెట్ ఫండ్స్‌కు ఎలాంటి పన్ను నియమాలు వర్తిస్తాయో, అవే నియమాలు అంతర్జాతీయ ఫండ్స్‌కు వర్తిస్తాయి. అంటే ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే, ఇలా ఇన్వెస్ట్ చేసిన యూనిట్లను మూడేళ్ల తర్వాత విక్రయిస్తే, దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను, మూడేళ్లలోపు విక్రయిస్తే స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ ఫండ్స్‌కు దీర్ఘకాల మూలధన లాభాల పన్ను-20 శాతంగా (ఇండేక్సేషన్‌తో కలిపి) ఉంటుంది. స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను-ఆ వ్యక్తి ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి ఉంటుంది. మీ విషయానికొస్తే మీరు ఎక్కువ భాగం స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఈ ఫండ్ విక్రయాలపై మీకు వచ్చిన రాబడులను, మీ మొత్తం ఆదాయానికి కలిపి మీ ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం పన్ను విధిస్తారు. కొన్నింటికి మాత్రమే మీరు దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. - ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
వీటికి పన్ను భారం లేదు..
చాలా మంది మదుపరులు, పెట్టుబడిదారులు పన్ను భారం తగ్గించుకోవడమెలాగనేది తరచూ ఆలోచిస్తుంటారు. పన్ను భారం అసలు లేని, 100 శాతం పన్ను రహిత ఆదాయ మార్గాల గురించి పెద్దగా తెలియని వారు చాలా మంది ఉంటారు. అలాంటి వారికోసమే ‘కొన్ని అంశాలకు లోబడి’ ఈ పన్నెండు అవగాహనా అంశాలు. ఇలాంటి పన్ను మినహాయింపులు మరిన్ని అంశాలక్కూడా వర్తిస్తాయి. మరింత సమగ్ర,సవివరమైన సమాచారం కోసం క్వాలిఫైడ్ సీఏను సంప్రదిస్తే మంచిది. ఆ 12 అంశాల వివరాలివీ... బ్యాంకింగ్ వడ్డీపై మినహాయింపు! 2013 నుంచి 80టీటీఏ అనే సెక్షన్ అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం, మీ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై వచ్చే వడ్డీకి రూ.10,000 వరకూ ఎటువంటి పన్ను భారం ఉండదు. ఒకవేళ ఇలాంటి వడ్డీ ఆదాయం రూ.20,000 ఉంటే, అందులో కేవలం రూ.10,000 మొత్తానికే పన్ను వర్తిస్తుంది. వారసత్వం, విల్లు... భారత్‌లో వారసత్వంగా వచ్చే సంపదపై పన్ను భారం లేదు. విల్లు ద్వారా లభించే సంపదకు సైతం ఇదే విషయం వర్తిస్తుంది. అయితే ఇలా మీ కు లభించిన సంపదకు సంబంధించి మీ పెట్టుబడులు, దానిపై ఆర్జించే వడ్డీ పై మాత్రం పన్ను భారం తప్పదు. ఈపీఎఫ్ అకౌంట్ ఐదేళ్లు సేవలు పూర్తిచేసిన తర్వాత ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) అకౌంట్ నుంచి పొందే మొత్తానికి కూడా పన్ను మినహాయింపును ఇచ్చారు. నిర్దిష్ట కాల పరిమితికి ముందే ఉద్యోగాలు మారే వారు అదే సమయంలో ఈపీఎఫ్ డబ్బు ఉపసంహరించుకుంటే పన్ను భారం తప్పదు. షేర్లు, ఫండ్స్.. పెట్టుబడిపెట్టిన ఏడాది తరువాత షేర్లు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ నుంచి పొందే లాభాలపై కూడా పన్ను భారం లేదు. లాంగ్ టర్మ్ గెయిన్స్‌గా పరిగణించే ఈ మొత్తాలపై 100 శాతం పన్ను మినహాయింపు ఉంది. అయితే ఇక్కడ సెక్యూరిటీ లావాదేవీల పన్నును చెల్లించాల్సి ఉంటుంది. ఎన్ఆర్ఈ అకౌంట్ వడ్డీ.. ఎన్ఆర్ఈ అకౌంట్‌పై సంపాదించే వడ్డీకి కూడా భారత్‌లో 100 శాతం పన్ను రాయితీ లభిస్తుంది. ఈ అకౌంట్లకు సంబంధించి ఫిక్స్డ్ డిపాజిట్, సాధారణ సేవింగ్ బ్యాంక్ వడ్డీ రెండింటికీ ఇది వర్తిస్తుంది. ఎన్ఆర్ఐ అకౌంట్ డిపాజిట్స్ టీడీఎస్ కూడా వర్తించకపోవడం మరో అంశం. డివిడెండ్లు... మీ స్టాక్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ (డివిడెండ్ ఆప్షన్) నుంచి డివిడెండ్స్ పొందితే దీనిపై కూడా పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే షేర్హోల్డర్లకు డివిడెండ్లు చెల్లించే ముందే కంపెనీ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ పన్నును ప్రభుత్వానికి చెల్లిస్తుందన్న విషయం ఇక్కడ గమనార్హం. సంస్థలో లాభాల వాటాలు.. ఒక సంస్థలో ‘ఏ’, ‘బీ’ భాగస్వాములు. సంస్థ సాధించిన లాభాల్లో భాగంగా వార్షికంగా చెరొక రూ.5 లక్షలు పొందారు. ఈ మొత్తానికి పన్ను వర్తించదు. సంపాదించిన లాభానికి సంస్థే పన్ను చెల్లించేస్తుంది కనక వారికి పన్నుండదు. సంస్థ నుంచి వేతనం పొందితే దానికి వారు పన్ను చెల్లించాల్సిందే. వివాహం.. బహుమతులు. వివాహాల సమయంలో లభించే బహుమతులపై కూడా పన్ను మినహాయింపు లభిస్తుంది. ఇక్కడ మీకు ఎవరైనా విలువైన బహుమానాలు ఇవ్వదలిచారనుకోండి. పెళ్లి సమయానికి దానిని లింక్ చేసుకుంటే మీకు పన్ను ప్రయోజనాలూ లభిస్తాయి. జీవిత బీమా నుంచి డబ్బు... మెచ్యూరిటీ, క్లెయిమ్ లేదా సరెండర్‌పై జీవిత బీమా కంపెనీల నుంచి పొందే మొత్తానికి కూడా పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే బీమా మొత్తంలో ప్రీమియం 20 శాతం మించి ఉండకూడదని నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. ఎల్‌టీఏ మొత్తం.. పలు కంపెనీలు ప్రతి యేడాదీ ఉద్యోగులకు ఎల్టీఏను చెల్లిస్తుంటాయి. పర్యటన వ్యయాల నిమిత్తం సంస్థ ఉద్యోగికి చెల్లించే ఈ మొత్తాలపై కూడా పన్ను భారం ఉండదు. ఒకవేళ మీకు కంపెనీ ఎల్‌టీఏ చెల్లించకపోతే... మీ వేతనంలో కొంత ఈ కేటగిరీకి కేటాయించాలని కోరే వీలుంది కూడా. వీఆర్ఎస్ స్కీమ్.. ఒక వ్యక్తి వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ (వీఆర్ఎస్) తీసుకుంటే.. ఇందులో వచ్చే మొత్తంపై రూ. 5 లక్షల వరకూ పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే అందరికీ ఇది వర్తించదు. ప్రభుత్వ, సంబంధిత సంస్థల ఉద్యోగులకు మాత్రమే ఈ వెసులుబాటు ఉంది. 15 జీ, 15 హెచ్... స్థిర డిపాజిట్లపై వడ్డీపై సోర్స్ వద్ద పన్ను (టీడీఎస్) మినహాయింపునకు ఈ డాక్యుమెంట్లు దోహదపడతాయి. ఇందులో ఫామ్ 15 హెచ్ సీనియర్ సిటిజన్లకు ఉద్దేశించినది కాగా, ఇతరులకు 15 జీ . క్లుప్తంగా వడ్డీనే జీవనాధారమనీ, పన్ను నిబంధనలు దీనికి వర్తించవనీ ఇచ్చే ధ్రువీకరణ పత్రాలివి. ఈ పత్రాలు, లేదా పాన్ కార్డ్ సమర్పించకపోతే భారీ పన్ను భారం తప్పదు. -
పన్ను భారం తగ్గించుకుందామా!
ఈ ఏడాది నుంచి కొత్త మినహాయింపులు ♦ ఇక ఎన్పీఎస్ ఇన్వెస్ట్మెంట్ విడిగా లెక్కింపు ♦ పెరిగిన ఆరోగ్య బీమా పరిమితులు ♦ పెరిగిన రవాణా భత్యం; ఆడపిల్లలకు కొత్త పథకం ♦ రూ.4.44 లక్షల వరకూ మినహాయింపు పొందే అవకాశం ఈ ఆర్థిక సంవత్సరం మరో రెండు నెలల్లో ముగుస్తోంది. చాలామందికి పన్నుపోటు తగులుతోంది. జీతాల్లో భారీ కోత పడుతోంది. కనీసం... ఇప్పుడైనా జాగ్రత్త పడకుంటే మిగిలిన రెండు నెలలూ మరింత భారీ కోతలు ఖాయం. అందుకే అందరూ పన్ను భారం నుంచి ఎలా తప్పించుకోవాలన్న లెక్కల్లో పడ్డారు. నిజానికి ఈ సంవత్సరం పన్ను భారం నుంచి తప్పించుకోవటానికి కొత్త సెక్షన్లు వచ్చాయి. వీటిని పూర్తిగా వినియోగించుకుంటే పన్ను భారం మరింతగా తగ్గించుకోవచ్చు. ఆదాయపన్ను చట్టంలోని మినహాయింపులను వినియోగించుకోవడం ద్వారా గరిష్టంగా రూ.4.44 లక్షల వరకూ పన్ను భారం తగ్గించుకోవచ్చన్నది కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గత బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. అదెలాగో... ఆ పథకాలేంటో... సెక్షన్లేంటో వివరించేదే ఈ కథనం... ప్రత్యేకంగా ఎన్పీఎస్... గతేడాది వరకూ జాతీయ పింఛను పథకంలో (ఎన్పీఎస్) ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని సెక్షన్ 80సీలో భాగంగానే పరిగణించేవారు. ఈ ఏడాది నుంచి మాత్రం ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని ప్రత్యేకంగా చూపించుకునే అవకాశం కల్పించారు. ఇందుకోసం ఐటీ చట్టంలో 80 సీసీడీ అనే ప్రత్యేక సెక్షన్‌ను ఏర్పాటు చేశారు. ఈ సెక్షన్ కింద గరిష్టంగా రూ.50,000 వరకూ పన్ను మినహాయింపులు లభిస్తాయి. ఇది సెక్షన్ 80సీ కింద లభించే రూ.1.50 లక్షలకు అదనం. దీని వల్ల 30 శాతం పన్ను పరిధిలో ఉండే వారికి అదనంగా రూ.15,000 వరకు పన్ను భారం తగ్గుతుంది. 20 శాతం పన్ను పరిధిలోకి వచ్చే వారికి రూ.10,000, అదే 10 శాతం శ్లాబులో ఉన్న వారికైతే రూ. 5,000 పన్ను తగ్గుతుంది. మరింత ఆరోగ్య ధీమా... ఈ ఏడాది జరిగిన కీలక మార్పులో ముఖ్యమైన మరో అంశం సెక్షన్ 80డీ పరిమితులు పెంచడం. ఈ సెక్షన్ 80డీ కింద ఆరోగ్య బీమాకు చెల్లించే ప్రీమియంపై లభించే పన్ను మినహాయింపు పరిధిని పెంచారు. 60 ఏళ్ళలోపు వయస్సు ఉన్నవారికి ఇప్పటి వరకు రూ.15,000 వరకు మాత్రమే మినహాయింపు లభించేది. ఇప్పుడు ఈ మొత్తాన్ని రూ. 25,000కు పెంచారు. అదే సీనియర్ సిటిజన్స్ అయితే రూ. 30,000 వరకు ప్రయోజనం పొందవచ్చు. ముందస్తు వైద్య పరీక్షలకు చేసే వ్యయంపై గరిష్టంగా రూ.5,000 వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. కానీ ఈ మొత్తం రూ.25,000 పరిధిలోకే వస్తుంది. భార్యభర్తలు, పిల్లలు, తల్లిదండ్రులపై చేసే వైద్య పరీక్షలను ఇందుకోసం వినియోగించుకోవచ్చు. ఇది కాకుండా తల్లిదండ్రులకు చెల్లించే వైద్య బీమా ప్రీమియంపై కూడా మినహాయింపులు పొందవచ్చు. తల్లిదండ్రులు 60 ఏళ్ళ లోపు వారైతే రూ.25,000, అదే సీనియర్ సిటిజన్స్ అయితే రూ.30,000 అదనంగా పొందవచ్చు. అంటే ఈ సెక్షన్ ద్వారా గరిష్టంగా రూ. 60,000 వరకూ ప్రయోజనం పొందవచ్చు. రెట్టింపైన రవాణా భత్యం... హోదాతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరి జీతంలో రవాణా భత్యం ఉంటుంది. ప్రతి నెలా జీతంలో కన్వేయెన్స్ అలవెన్స్ కింద రూ.800 లభిస్తాయి. ఇది పూర్తిగా ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్. ఇప్పుడు ఈ మొత్తాన్ని కేంద్రం రూ.1,600కు పెంచింది. ప్రభుత్వం ఇలా చేయటం వల్ల ఏడాదికి అదనంగా రూ.9,600 వరకు పన్ను భారం తగ్గించుకోవచ్చు. సుకన్య సమృద్ధి... అమ్మాయిల కోసం ప్రధాని నరేంద్ర మోదీ కిందటేడాది సరికొత్త డిపాజిట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ‘సుకన్య సమృద్ధి’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ పథకంపై అత్యధిక వడ్డీతో పాటు, పన్ను మినహాయింపులు లభించడం దీనిలోని ప్రధాన ఆకర్షణ. ఈ ఏడాది 9.2 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నారు. అయితే 10 ఏళ్ళ లోపు అమ్మాయిల పేరు మీద మాత్రమే ఈ పథకాన్ని తీసుకోగలరు. అమ్మాయి వయస్సు 21 ఏళ్లు లేదా వివాహ తేది... ఏది ముందైతే అది మెచ్యూరిటీ తేదీగా వ్యవహరిస్తారు. ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు పొందవచ్చు. వడ్డీరేట్లు తగ్గుతున్న ప్రస్తుత సమయంలో ఈ పథకంపై అధిక వడ్డీరేటు లభిస్తుండటం గమనార్హం. తొలిసారి షేర్లు కొంటున్నారా.. తొలిసారి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వారు పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. ఇందుకోసం 80 సీసీజీ రూపంలో రాజీవ్‌గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీం అందుబాటులో ఉంది. ఇది కేవలం తొలిసారిగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు చేసే వారికే వర్తిస్తుంది. ఈ పథకం కింద గరిష్టంగా ఇన్వెస్ట్ చేసే రూ.50,000లో సగభాగం అంటే రూ.25,000 పన్ను ఆదాయం నుంచి తగ్గించి చూపించుకోవచ్చు. ఇలా వరుసగా మూడేళ్లు చేసే ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఈ మినహాయింపు పొందవచ్చు. వార్షికాదాయం పన్నెండు లక్షలు దాటిన వారికి ఇది వర్తించదు. ఇవన్నీ కాకుండా ఎప్పటిలాగా సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు లభించే బీమా, ఐదేళ్లు బ్యాంకు డిపాజిట్లు, పోస్టాఫీసు పథకాలు, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీం (ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్), పీపీఎఫ్, హౌసింగ్ లోన్, ట్యూషన్ ఫీజులు తదితరాలు ఎలానూ ఉన్నాయి. వీటన్నింటినీ చక్కగా వినియోగించుకోవడం ద్వారా గరిష్టంగా పన్ను ప్రయోజనాలను పొందొచ్చు. -
పన్ను భారం.. ఇలా దూరం
రెండు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగిసిపోతోంది. ఉద్యోగులకు ఆదాయపు పన్ను కోతలు పెరిగేది ఈ రెండు నెలలే. ఇక స్వయం ఉపాధి పొందేవారితో సహా ప్రొఫెషనల్స్ తదితరులంతా పన్ను భారం తగ్గించుకోవటానికి ఏం చేయాలనుకున్నా... చేసినా చేయాల్సింది ఈ రెండు నెలల్లోనే. నిజం చెప్పాలంటే చేసే పొదుపుతో పాటు... పెట్టే పెట్టుబడులను... కొన్నింటిపై చేసే ఖర్చుల్ని కూడా పన్ను మినహాయింపునకు ఉపయోగించుకోవచ్చు. ఆదాయపు పన్ను చట్టంలో వివిధ సెక్షన్లు ఇలాంటి వాటికి వీలు కల్పిస్తున్నాయి. ఈ వివరాలన్నిటితో పన్ను భారం తగ్గించుకోవటానికి ఎన్ని మార్గాలున్నాయనే అంశంపై ‘సాక్షి ప్రాఫిట్’ అందిస్తున్న ప్రధాన కథనమిది... * ఆదాయపు పన్ను మినహాయింపులకు ఎన్నో మార్గాలు * పొదుపు, పెట్టుబడులే కాదు... చేసే ఖర్చులపైనా ఆదా పొదుపు సెక్షన్ 80సీ పన్ను భారం తగ్గించుకోవటమంటే అందరికీముందు గుర్తొచ్చేది సెక్షన్ 80సీ. ఈ సెక్షన్ కింద చేసిన కొన్ని రకాలైన పొదుపులు, చెల్లింపుల ద్వారా గరిష్టంగా రూ.1.5 లక్షల వరకూ పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. గడిచిన ఆర్థిక సంవత్సరం దాకా ఈ మొత్తం కేవలం లక్షే ఉండేది. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ మేరకు పెంచింది. ప్రధానంగా ఈ కింది వాటికి చేసే చెల్లింపులన్నిటినీ పన్ను మినహాయింపు కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు. ⇒ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ⇒ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ⇒ ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ (ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్) ⇒ ఐదేళ్లకు చేసే బ్యాంక్ డిపాజిట్లు ⇒ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు ⇒ సీనియర్ సిటిజన్ ట్యాక్స్ సేవింగ్ ఫండ్ ⇒ ఇన్సూరెన్స్ పాలసీలు ⇒ యూనిట్ లింక్డ్ బీమా పథకాలు (యులిప్) ⇒ పెన్షన్ పథకాలు ఇన్వెస్ట్మెంట్స్ మూలధన లాభాలు (సెక్షన్ 54ఈసీ) ఈ మధ్య బంగారం, షేర్ల ధరలు బాగా పెరిగాయి. పెరిగినపుడు అమ్మితే వాటిపై లాభాలూ వస్తాయి. కానీ ఇలా వచ్చే లాభాలపై దీర్ఘకాలిక మూల ధన పన్ను (లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్) చెల్లించాలి. కానీ దీన్ని తప్పించుకోవటానికి చట్టంలో ప్రత్యేకంగా 54ఈసీ పేరుతో ఒక సెక్షన్ ఉంది. 54ఈసీ పరిధిలోకి వచ్చే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ బాండ్స్‌లో గనక ఈ లాభాలను ఇన్వెస్ట్ చేస్తే పన్ను భారం నుంచి తప్పించుకోవచ్చు. దీని ప్రకారం బంగారం, షేర్లు, స్థలాలు, ఇల్లు వంటివి అమ్మినప్పుడు వచ్చే లాభాలను ఈ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. ఈ బాండ్లలో పెట్టుబడి పెడితే మూడేళ్ల దాకా వెనక్కి తీయటం కుదరదు. అయితే ఈ బాండ్లపై వచ్చే వడ్డీని ఆదాయంగా పరిగణిస్తారు. సెక్షన్ 80సీసీజీ రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీం పేరుతో కొత్తగా సెక్షన్ 80సీసీజీ అందుబాటులోకి వచ్చింది. ఇది కేవలం తొలిసారిగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారికే వర్తిస్తుంది. ఈ పథకం కింద గరిష్టంగా ఇన్వెస్ట్ చేసే రూ.50,000లో సగభాగం అంటే రూ.25,000 పన్ను ఆదాయం నుంచి తగ్గించి చూపించుకోవచ్చు. ఇలా వరుసగా మూడేళ్లు ఇన్వెస్ట్ చేయడం ద్వారా మూడేళ్లపాటు ఈ పన్ను ప్రయోజనాలు పొందొచ్చు. వార్షికాదాయం పన్నెండు లక్షలు దాటిన వారికి ఇది వర్తించదు. ఖర్చులు ఇంటి కోసం (సెక్షన్ 80 సీ, 24బీ) బ్యాంకు రుణం తీసుకుని ఇల్లు నిర్మిస్తే రెండు సెక్షన్ల ద్వారా పన్ను ప్రయోజనాలుంటాయి. అవి ఎలా వర్తిస్తాయంటే... మనం రుణానికి చెల్లించే వాయిదాల్లో కొంత అసలు, కొంత వడ్డీ ఉంటుంది. పన్ను ప్రయోజనానికి సంబంధించి ఈ రెండింటినీ విడిగా లెక్కిస్తారు. అసలు కింద చెల్లించే మొత్తంపై సెక్షన్ 80సీ కింద గరిష్టంగా రూ.1.50 లక్షల వరకూ మినహాయింపు పొందొచ్చు. అయితే తొలినాళ్లలో చెల్లించే వాయిదాల్లో అసలు కన్నా వడ్డీయే ఎక్కువ ఉంటుంది. అందుకే వడ్డీపై సెక్షన్ 24(బి) కింద గరిష్టంగా రూ.2 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. ఇది 80సీకి అదనం. అంటే మిగతా పొదుపులు, బీమా ఏవీ లేకున్నా కేవలం గృహ రుణంతోనే గరిష్టంగా ఏడాదికి రూ.3.5 లక్షల మేర పన్ను ప్రయోజనం పొందవచ్చు. చదువు కోసం (సెక్షన్ 80సీ, 80ఈ) చదువుల ఖర్చును పన్ను మినహాయింపు కోసం చూపించుకోవచ్చు. దీనికోసం సెక్షన్ 80సీ, సెక్షన్ 80ఈ అందుబాటులో ఉన్నాయి. స్కూలు ఫీజులో ట్యూషన్ ఫీజుకు 80సీ కింద పన్ను లాభం పొందొచ్చు. అయితే ఇది కుటుంబంలో ఇద్దరు పిల్లలకు మాత్రమే... అది కూడా 80సీ పరిధిలో రూ.లక్ష వరకే వర్తిస్తుంది. ఒకవేళ అసెస్సీ తన చదువు కోసమో, తన కుటుంబీకుల ఉన్నత విద్య కోసమో రుణం తీసుకుంటే దానికి చెల్లించే వాయిదాల్లో వడ్డీ మొత్తానికి సెక్షన్ 80ఈ ప్రకారం పన్ను మినహాయింపు పొందొచ్చు. ఈ వడ్డీ మినహాయింపులపై ఎలాంటి పరిమితీ లేదు. అయితే పన్ను మినహాయింపు లభించేది వడ్డీ చెల్లింపులపై మాత్రమే. అసలుపై ఏ మినహాయింపూ ఉండదు. అలాగే గరిష్టంగా 8 ఏళ్ల వరకు ఈ మినహాయింపులను పొందవచ్చు. రుణం తీసుకున్నాక ఎనిమిదేళ్ల తరవాత చెల్లించే వడ్డీపై సెక్షన్ 80ఈ మినహాయింపులు లభించవు. ఆరోగ్యం(సెక్షన్ 80డీ/80డీడీ/80డీడీబీ) ఇలాంటి అనుకోని ఖర్చుల్ని భరించడానికి బీమా పాలసీలుంటాయి. బీమా కోసమే కాక, చికిత్స కోసం, వైద్య పరీక్షల కోసం, మందుల కోసం... వీటన్నిటికీ చేసే ఖర్చుల్ని పన్ను నుంచి మినహాయించవచ్చు. ప్రధానంగా సెక్షన్ 80డీ, 80డీడీ, 80డీడీబీ ఈ వెసులుబాటు కల్పిస్తున్నాయి. అదెలాగంటే... ఆరోగ్య బీమా (80డీ): హెల్త్ ఇన్సూరెన్స్‌కు చెల్లించే ప్రీమియంలను సెక్షన్ 80డీ కింద మినహాయిస్తారు. ఇది గరిష్టంగా రూ.15,000 వరకు... సీనియర్ సిటిజన్స్‌కు అయితే రూ.20,000 వరకు ఉంటుంది. అదే తల్లిదండ్రులకు కూడా వైద్య బీమా తీసుకుంటే అదనంగా మరో రూ.15,000 (సీనియర్ సిటిజన్స్‌కి రూ.20,000) ప్రయోజనం లభిస్తుంది. ఇదికాక ఈ ఏడాది నుంచి ముందుజాగ్రత్త చర్యగా చేయించుకునే వైద్య పరీక్షలపై కూడా గరిష్టంగా రూ.5,000 వరకు పన్ను మినహాయింపు కోసం పరిగణిస్తారు. తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల వైద్యపరీక్షలకూ ఇది వర్తిస్తుంది. చికిత్స ఖర్చు (80డీడీబీ): కొన్ని ప్రధానమైన వ్యాధులకు చికిత్స చేయించుకుంటే సెక్షన్ 80డీడీబీ కింద గరిష్టంగా 40,000 వరకు పన్ను మినహాయింపు ప్రయోజనం పొందవచ్చు. ఏయే వ్యాధి చికిత్సలకు మినహాయింపులు లభిస్తాయన్నది ఈ సెక్షన్లో వివరంగా పేర్కొనడం జరిగింది. అదే సీనియర్ సిటిజన్ అయితే రూ.60,000 వరకు చూపించుకోవచ్చు. ఒక వేళ ఈ మొత్తం హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా రీ-యింబర్స్‌మెంట్ పొందితే మాత్రం పన్ను ప్రయోజనం లభించదు. అంగ వైకల్యం ఉంటే... (80యూ): పన్ను చెల్లించే వ్యక్తికి వైకల్యం ఉంటే కనుక సెక్షన్ 80యూ ప్రకారం మినహాయింపులు పొందవచ్చు. అంగవైకల్యం తీవ్రతపై ఈ మినహాయింపు ఆధారపడి ఉంటుంది. వైకల్యం సాధారణ స్థాయిలో ఉంటే ఆదాయం నుంచి రూ.50,000 తగ్గించి చూపించుకోవచ్చు. అదే తీవ్రత ఎక్కువగా ఉంటే రూ.75,000 వరకు మినహాయించి చూపించవచ్చు. డిపెండెంట్ల కోసం... (80డీడీ): వైకల్యం ఉన్న వారు మీపై ఆధారపడి ఉంటే (తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, అక్కా చెల్లెల్లు, అన్నదమ్ములు) సెక్షన్ 80డీడీ కింద మినహాయింపు కోరవచ్చు. ఒక మాదిరి వైకల్యం అయితే గరిష్టంగా రూ.50,000, అదే తీవ్ర వైకల్యమైతే గరిష్టంగా రూ.1,00,000 వరకు ఆదాయాన్ని తగ్గించి చూపించుకోవచ్చు. దీనికి డాక్టర్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. ఎల్ఐసీ జీవన్ ఆథార్ పాలసీకి చెల్లించే ప్రీమియంలు కూడా ఈ సెక్షన్ పరిధిలోకే వస్తాయి. విరాళాలు (సెక్షన్ 80జీ) ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80జీ ద్వారా కొన్నిటికి ఇచ్చే విరాళాలపై పన్ను మినహాయింపులుంటాయి. మినహాయింపు వర్తించే విరాళాలకు సంబంధించి సెక్షన్ 80జీలో పలు నిబంధనలున్నాయి. కొన్ని విరాళాలపై పూర్తిగా 100 శాతం తగ్గింపు (డిడక్షన్) లభిస్తే మరికొన్నింటిపై 50 శాతం మాత్రమే లభిస్తుంది.జాతీయ రక్షణ నిధి, ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి సహాయ నిధి, నేషనల్ ఫౌండేషన్ ఫర్ కమ్యునల్ హార్మోని, జిల్లా సాక్షరతా మిషన్, నేషనల్ టెక్నాలజీ ఫండ్ వాటికి ఇచ్చే విరాళాలపై ఎలాంటి పరిమితులు లేకుండా పూర్తిగా 100 శాతం మినహాయింపులు లభిస్తాయి. కాగా, స్థూల జీతంలో 10 శాతం దాటని విరాళాలకు మాత్రమే ఈ డిడక్షన్స్ వర్తిస్తాయి. హెచ్ఆర్ఏ (సెక్షన్ 10(13ఏ)) ఉద్యోగులు అద్దె ఇంట్లో ఉంటే కంపెనీ ఇంటిఅద్దె భత్యాన్ని (హెచ్ఆర్ఏ) అందిస్తుంది. సొంతిల్లు లేకుండా అద్దింట్లో నివసించే వారు హెచ్ఆర్ఏని క్లెయిమ్ చేసుకోవడం ద్వారా పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు. అయితే కుటుంబ సభ్యుల్లో ఎక్కువ మంది ఉద్యోగులుంటే ఒకరు మాత్రమే దీనిని వినియోగించుకోగలరు. ఈ హెచ్ఆర్ఏను లెక్కించేటపుడు మూడు అంశాలు పరిగణనలోకి తీసుకుంటారు. అవి... 1- జీతంలో 40 శాతం 2- యజమాని ఇంటిఅద్దె అలవెన్స్‌గా ఇచ్చిన మొత్తం 3- చెల్లించిన అద్దెలోంచి జీతంలో పదవభాగాన్ని తీసివేయగా మిగిలిన మొత్తం పైన పేర్కొన్న మూడింటినీ చూశాక వీటిలో అన్నిటికన్నా తక్కువ ఉన్నదానికే మినహాయింపు లభిస్తుంది. హెచ్ఆర్ఏ లేకపోతే సెక్షన్ 80జీజీ హెచ్ఆర్ఏలేకపోయినా చెల్లించే ఇంటిఅద్దెపై పన్ను ప్రయోజనాలు పొందడానికి ప్రత్యేకంగా ఒక సెక్షన్ ఉందన్న సంగతి చాలా మందికి తెలియదు. సెక్షన్ 80జీజీ ప్రకారం హెచ్ఆర్ఏ సౌలభ్యం లేని వృత్తి నిపుణులు, వ్యాపారస్తుల వంటి వారు ఈ ప్రయోజనం పొందచ్చు. ఈ సెక్షన్ ప్రకారం చెల్లించిన అద్దెలోంచి జీతంలో పదవభాగాన్ని తీసివేయగా మిగిలిన మొత్తంకానీ, మీ ఆదాయంలో గరిష్టంగా 25 శాతంకానీ లేదా నెలకు గరిష్టంగా రూ.2,000 గానీ మినహాయింపు కోరవచ్చు. ఈ మూడింట్లో ఏది తక్కువైతే దానికి మాత్రమే మినహాయింపు వర్తిస్తుంది. ఈ ప్రయోజనం పొందాలంటే ఉంటున్న ఊళ్లో మీ పేరు మీద లేక భార్య, పిల్లల పేర సొంతిల్లు ఉండకూడదు. అలాగే ఇంటికి సంబంధించిన ఎటువంటి ఇతర పన్ను ప్రయోజనాలూ పొంది ఉండకూడదు. -
నగర వాసులపై పన్నుల భారం
నగరవాసులపై వివిధ రూపాల్లో పన్నుల భారం మోపేందుకు నెల్లూరు కార్పొరేషన్ రంగం సిద్ధం చేసింది. అందుకు ఈ నెల 31వ తేదీన నిర్వహించనున్న నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం నెల్లూరు, సిటీ: నెల్లూరు కార్పొరేషన్ కొత్త కౌన్సిల్ ఏర్పాటైన నాలుగు నెలల తరువాత ఈ నెల 31వ తేదీన రెండో సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కౌన్సిల్ ఆమోదాన్ని కార్పొరేషన్ అధికారులు తీసుకోనున్నారు. ఇందులో నగర వాసులపై పన్నుల భారం మోపే నిర్ణయాలతో పాటు అభివృద్ధికి సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. పాత భవనాల కూల్చివేతకు కౌన్సిల్ అనుమతి తీసుకోనున్నారు. పిల్లల పార్క్ నిర్వహణను బీఓటీ (బిల్ట్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్) పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ఒప్పందం, ఆయా డివిజన్ల పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు 70:30 పద్ధతిలో ఆయా ప్రాంత వాసుల నుంచి నిధుల సేకరణకు అనుమతి వంటి కీలక అంశాలు కూడా కౌన్సిల్లో చర్చకు రానున్నాయి. గతంలో జన్మభూమి కార్యక్రమంలో ఈ తరహా అభివృద్ధికి ప్రభుత్వం అనుమతించింది. అయితే ప్రజల భాగస్వామ్యం కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. మళ్లీ ఈ పద్ధతిలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు కార్పొరేషన్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మొత్తంగా ఈ సమావేశంలో చర్చించేందుకు భారీ అజెండాను అధికారులు రూపొందించారు. పార్కింగ్ బాదుడు నగరంలోని కీలక ప్రాంతాల్లో ఇకపై వాహనాలు పార్కింగ్ చేసేందుకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఆ మేరకు గుర్తించిన ఎనిమిది ప్రాంతాల్లో సైకిళ్ల నుంచి నాలుగు చక్రాల వాహనాల వరకు పార్కింగ్ రుసుం వసూలు చేసేందుకు అనుమతి కోరనున్నారు. వేలం పాట ద్వారా పెయిడ్ పార్కింగ్ నిర్వహణకు కౌన్సిల్ ఆమోదం కోరనున్నారు. ఏసీ కూరగాయల మార్కెట్, ప్రకాశం పంతులు విగ్రహం, అర్చన థియేటర్, ఆత్మకూరు బాస్టాండ్, నర్తకీ, గాంధీబొమ్మ, మినీ బైపాస్ తదితర ప్రాంతాల్లో వాహనాలు నిలపాలంటే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కాగా నగరంలో భవన నిర్మాణాలకు సంబంధించి ఒక్క శాతం లేబర్ సెస్ వసూళ్లకు సంబంధించి కౌన్సిల్ నుంచి ఆమోదం తీసుకోనున్నారు. భవనాల నిర్మాణ వ్యయం భారీగా పెరిగిన పరిస్థితుల్లో లేబర్ సెస్ వసూళ్లు చేయాలని కార్పొరేషన్ నిర్ణయించడంతో నిర్మాణ వ్యయం మరింత పెరిగి ప్రజలకు భారం కానుంది. కొండాయపాళెం రోడ్డు వెడల్పు 60 అడుగులు చేయాలన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి డిమాండ్ మేరకు మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు కోరుతూ కార్పొరేషన్ అధికారులు అజెండాలో ప్రతిపాదించారు. నెల్లూరు చెరువు చుట్టూ నక్లెస్ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపేందుకు కౌన్సిల్ ఆమోదం కోరుతున్నారు. చెరువు చుట్టూ పార్క్‌లు, ఎంటర్టైన్మెంట్ జోన్లు, ఫుడ్ కోర్టుల అభివృద్ధికి పీ.పీ.పీ (పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్) పద్ధతిన అభివృద్ధి చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు రూపొందించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వివిధ విభాగాల్లో పని చేస్తున్న 1476 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బందిని కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించేందుకు అనుమతి కోరనున్నారు. అయితే నగరంలోని పలు మురుగు నీటి కాలువల్లో పూడిక తొలగింపునకు టెండర్లు పిలవనున్నారు. లక్షలాది రూపాయలు వ్యయం చేసే ఎలక్ట్రికల్ పరికరాల కొనుగోలుకు ఈ ప్రక్యూర్మెంట్ టెండర్లు పిలిచేందుకు అనుమతి తీసుకోనున్నారు. కార్పొరేషన్ నిర్వహణలోని పాత వాహనాల వేలం ద్వారా వచ్చే సొమ్ముతో కొత్త వాహనాలు కొనుగోలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఆ మేరకు 15 ఏళ్లకు పైబడి, రెండున్నర లక్షల కిలోమీటర్లు నడిచిన పాత వాహనాలను 11 గుర్తించారు. వీటన్నింటినీ వేలం ద్వారా అమ్మకం చేసి వచ్చే నిధులతో మున్సిపల్ కమిషనర్‌కు కొత్త వాహనం కొనుగోలు చేసేందుకు కౌన్సిల్ అనుమతి తీసుకోనున్నారు. శతాబ్దం చరిత్ర కలిగిన పాత మున్సిపల్ కార్యాలయాన్ని కూల్చివేసి ఆ స్థానంలో ప్రజా ఉపయోగ భవనాల నిర్మాణానికి అనుమతి కోరనున్నారు. నగరంలో ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లు, లాలీపాప్స్ తదితరాల నుంచి వచ్చే వ్యాపార ప్రకటనల లాభాలపై కూడా కార్పొరేషన్ దృష్టి సారించింది. మొత్తానికి పలు కీలక నిర్ణయాలు తీసుకోనుండడంతో ఈ సమావేశంపై ప్రజల్లో ఆసక్తి రేగుతోంది. -
ఇక బాదుడే!
కర్నూలు నగర ప్రజలకు పన్ను పోటు! సాక్షి ప్రతినిధి, కర్నూలు : నగర ప్రజలపై పన్నుల భారం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కర్నూలు నగర పాలక సంస్థలో ఇటు నీటి బిల్లుతో పాటు అటు ఆస్తి పన్నును భారీ పెంచేందుకు రంగం సిద్ధమైంది. కార్పొరేషన్‌కు వాస్తవికంగా అయ్యే వ్యయం, వస్తున్న ఆదాయాన్ని పోల్చి చూసి... వీటి మధ్య ఉన్న తేడాను భర్తీ చేసుకునేందుకు పన్నులు పెంచాల్సిందేనని ఇప్పటికే ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో నీటి బిల్లులతోపాటు ఆస్తి పన్నులను కూడా పెంచేందుకు మునిసిపల్ కార్పొరేషన్ యంత్రాంగం ప్రణాళిక రచిస్తోంది. ఇందులో భాగంగా ఇంటి నీటి బిల్లును రూ.100 నుంచి 150కు పెంచాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం. ప్రస్తుతం ఇంటికి సరఫరా చేసే నీటి కోసం నెలకు రూ. 100ను కార్పొరేషన్ వసూలు చేస్తోంది. అంటే ఏకంగా 50 శాతం మేరకు నీటి బిల్లు భారం పెరగనుందన్నమాట. అదేవిధంగా వాణిజ్య సంస్థల నీటి బిల్లు స్లాబుల్లో తేడాలు రానున్నాయి. ఇంటి పన్ను భారం కూడా 25 శాతం నుంచి 50 శాతం పెంచాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. వాణిజ్య సంస్థలకు వాతలే...! ఆదాయాన్ని పెంచుకునేందుకు మునిసిపల్ కార్పొరేషన్ యంత్రాంగం ప్రధానంగా వాణిజ్య సంస్థలపై దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించింది. ఇందుకోసం వాణిజ్య సంస్థల నీటి బిల్లు స్లాబులను సవరించాలని భావిస్తోంది. ప్రస్తుతం వాణిజ్య సంస్థలకు 15 వేల లీటర్ల వరకు ఒక స్లాబుగా నిర్ణయించారు. నెలకు 15 వేల లీటర్ల మేరకు నీటిని వినియోగిస్తే రూ. 300 వసూలు చేస్తున్నారు. ఆపై ప్రతీ వెయ్యి లీటర్లకు అదనంగా రూ. 20 మేర ఆయా సంస్థలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈ స్లాబులను కాస్తా మార్చడం ద్వారా ఆదాయాన్ని రాబట్టాలనేది ఆలోచనగా ఉంది. మొత్తం మీద ప్రస్తుతం గృహాలకు, వాణిజ్య సంస్థలకు నీటి సరఫరాకు కార్పొరేషన్‌కు ఏడాదికి రూ. 9 కోట్ల మేరక వ్యయమవుతోంది. అయితే, ప్రస్తుతం కేవలం రూ. 4.5 కోట్ల మేరకు మాత్రమే ఆదాయం వస్తోంది. అంటే రూ. 4.5 కోట్ల లోటును కేవలం చార్జీలను పెంచడం ద్వారానే భర్తీ చేసుకోవాల్సి రానుంది. ఇందుకోసం అటు గృహాలకు నెలకు రూ. 100 నుంచి రూ. 150తో పాటు వాణిజ్య సంస్థలకు స్లాబులను మార్చడం ద్వారానే సాధ్యం అనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. కర్నూలు కార్పొరేషన్ పరిధిలో 41,860 గృహాలకు నీటి కనెక్షన్లు ఉండగా, 1500 వాణిజ్య సంస్థలకు మాత్రమే నీటి కనెక్షన్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అనధికారిక నీటి కనెక్షన్లపై కన్నేయడం ద్వారా మరింత ఆదాయం రాబట్టుకోవచ్చుననేది అధికారుల భానవగా ఉంది. పెరగనున్న ‘ఇంటి’ బడ్జెట్! ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2014-15లో ఇంటి పన్ను ద్వారా రూ.25 కోట్ల ఆదాయం కార్పొరేషన్‌కు వస్తుంది. అయితే, దీనిని 25 నుంచి 50 శాతానికి పెంచడం ద్వారా ఈ ఆదాయాన్ని రూ. 32 కోట్ల నుంచి రూ. 35 కోట్ల మేరకు రాబట్టుకోవాలనేది కార్పొరేషన్ భావిస్తోంది. ఇందుకోసం ఇంటి పన్ను మొత్తాన్ని సగటున 25 శాతం నుంచి 50 శాతం మేరకు పెంచేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ పెరిగే పన్నుల భారం ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. అదేవిధంగా కార్పొరేషన్ పరిధిలోని ప్రధాన కూడళ్లలో ఉండే అడ్వయిటైజింగ్ హోర్డింగుల ఆదాయాన్ని పెంచుకునే అంశంపైనా కసరత్తు జరుగుతోంది. దీనితో పాటు అనధికారిక కట్టడాలపై 100 శాతం మేరకు అపరాధ రుసుం భారం మోపడం ద్వారా కూడా అదనపు ఆదాయాన్ని రాబట్టుకునేందుకు సిద్ధమవుతోంది. మొత్తం మీద కొత్త ఏడాదిలో ప్రజలపై పన్నుల భారం తప్పేట్టు లేదు. -
రాబడిలో ఎఫ్డీ కంటే బెస్ట్
మనలో చాలామంది సేవింగ్స్ అనగానే బ్యాంకు డిపాజిట్లకే మొదట ప్రాధాన్యతను ఇస్తారు. దీనికి కారణం వీటిల్లో ఎటువంటి రిస్క్ లేకపోవడమే. కానీ, ఎలాంటి రిస్క్ లేకుండా బ్యాంకు డిపాజిట్ల కంటే అధిక రాబడిని అందించే ఇన్వెస్ట్మెంట్ సాధనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. బ్యాంకు డిపాజిట్లు మన సంపదను పెంచకపోగా, కొనుగోలు శక్తిని ఏ విధంగా నష్టపరుస్తున్నాయి, అధిక రాబడిని ఇచ్చే ఇతర సాధనాలు ఏమిటి అన్న వాటిపై అవగాహన కల్పించేదే ఈ వారం ప్రాఫిట్ ముఖ్య కథనం. ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి ఎటువంటి నష్ట భయం లేని ఇన్వెస్ట్మెంట్స్ సాధనాలపైనే ఎక్కువమంది మొగ్గు చూపుతుంటారు. అందుకే మనలో చాలామంది క్యాపిటల్ ప్రొటెక్షన్ (అసలుకి హామీ) ఉన్న బ్యాంకు డిపాజిట్లలోనే ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంటారు. కానీ వాస్తవంగా అసలుకి రక్షణ కల్పించే శక్తి బ్యాంకు డిపాజిట్లకు ఉందా? పెరుగుతున్న ధరలు (ద్రవ్యోల్బణం) సంపదను హరించేస్తున్న సంగతి గురించి ఎంతమందికి అవగాహన ఉంది? బ్యాంకు డిపాజిట్లలో పన్నుల భారం, దీర్ఘకాలంలో వడ్డీరేట్లలో హెచ్చుతగ్గులు వంటి అనేక ప్రతికూలాంశాలున్నాయి. అందుకే డిపాజిట్ చేసేముందు వాస్తవిక రాబడి ఎంతుంటుందో లెక్కించాలి. సగానికి సగం నష్టం.. పెరుగుతున్న ధరలను పరిగణనలోకి తీసుకుంటే బ్యాంకు డిపాజిట్లు వాస్తవంగా ఎంత రాబడిని అందిస్తాయో ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకు 1972లో కేజీ బియ్యం ఖరీదు రూ.2 ఉండేది. అంటే, రూ.10కి 5కేజీలు వచ్చేవి. ఈ పది రూపాయలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేశారనుకుందాం. ఈ 41 ఏళ్లలో ఎస్బీఐ డిపాజిట్లపై సగటున 8.1 శాతం వడ్డీరేటును అందించింది. దీని ప్రకారం ఈ మొత్తం ఇప్పుడు రూ. 94 (33 శాతం ఆదాయ పన్నును లెక్కలోకి తీసుకున్న తర్వాత అవుతుంది. కానీ ఇదే సమయంలో సగటు ద్రవ్యోల్బణం రేటు 7.7 శాతం. అంటే ఈ 41 ఏళ్లలో 10 కేజీల బియ్యం ధర రూ.225కి చేరినట్లు. అంటే డిపాజిట్ చేసిన మొత్తంతో అంటే రూ.94తో కేవలం రూ.2.4 కేజీలే వస్తాయి. అంటే బ్యాంకులో డిపాజిట్ చేయడం వల్ల కొనుగోలు శక్తి సగానికి పడిపోయింది. ఇంకో విధంగా చెప్పాలంటే సంపద విలువ 52 శాతం క్షీణించినట్టు లెక్క. సంపద విలువను ద్రవ్యోల్బణం ఏ విధంగా హరిస్తుందో చెప్పడానికి ఇది చిన్న ఉదాహరణ. ఈ విధంగా చూస్తే ఎఫ్డీ అనేది వాస్తవంగా సంపదను పెంచకపోగా కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది. బ్యాంకు డిపాజిట్లకంటే అధిక రాబడిని పొందడానికి అనేక ఇన్వెస్ట్మెంట్ సాధనాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధానమైనవి డెట్ ఫండ్స్. ఇవి ఇంచుమించు మన బ్యాంక్ డిపాజిట్లవలే పనిచేస్తాయి. కానీ పన్నులు, రాబడి పరంగా చూస్తే ఇవి ఎఫ్డీ కంటే అధిక ప్రయోజనాన్ని అందిస్తాయి. పన్నుభారం తక్కువ రిస్క్ అంటే ఇష్టపడని వారికి ఫిక్స్డ్ ఇన్కమ్ మ్యూచువల్ ఫండ్స్ ఒక చక్కటి ఇన్వెస్ట్మెంట్ సాధనంగా చెప్పొచ్చు. వీటికి ద్రవ్యోల్బణాన్ని మించి రాబడినిచ్చే శక్తి ఉండటమే కాకుండా రాబడిపై పన్ను భారం కూడా తక్కువే. బ్యాంకు డిపాజిట్లు అందించే వడ్డీపై అధిక ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నవారు 33 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే డెట్ ఫండ్స్‌లో దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 22.66 శాతం చెల్లిస్తే సరిపోతుంది. ఒకవేళ ఇండెక్సేషన్‌ను పరిగణనలోకి తీసుకుంటే 11.33% చెల్లిస్తే సరిపోతుంది. ఉదాహరణకు రూ.10,000 ఫిక్స్డ్ డిపాజిట్ ఏడాది తర్వాత రూ.10,586 అవుతుంది. ఇదే మొత్తాన్ని ఏడాది కాలపరిమితిగల ఫిక్స్డ్ ఇన్కమ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే.. అది కూడా ఇదే విధమైన రాబడిని అందించిందనుకుందాం. కానీ ఈ ఫండ్స్ నుంచి రూ.10,874 చేతికి వస్తుంది. దీనికి కారణం పన్ను భారం తగ్గడమే. అంటే దీనివల్ల బ్యాంకు డిపాజిట్ల కంటే 2.84% అధిక రాబడిని పొందవచ్చు. అంతేకాదు ఈ ఫండ్స్ అందించే డివిడెండ్లపైన కూడా పన్ను భారం తక్కువే. అధిక రాబడి.. ప్రస్తుతం బ్యాంకు డిపాజిట్లతో పోలిస్తే మ్యూచువల్ ఫండ్స్‌లో ఈల్డ్స్ (రాబడులు) అధికంగా ఉన్నాయి. బ్యాంకులు వాటి లాభాలను పెంచుకోవడానికి డిపాజిట్లపై తక్కువ వడ్డీరేట్లను ఆఫర్ చేస్తుంటాయి. సాధారణంగా డిపాజిట్లు, రుణాలపై ఇచ్చే వడ్డీల మధ్య 4-5 శాతం తేడా (స్ప్రెడ్) ఉండే విధంగా చూసుకుంటాయి. అదే మ్యూచువల్ ఫండ్స్‌లో రుసుములు 1-1.5 శాతం మించి ఉండవు కాబట్టి ఆ మేరకు రాబడులు పెరుగుతాయి. ట్యాక్స్ ఫ్రీనే కానీ రిస్క్ ఫ్రీ కాదు ఇప్పుడు చాలామంది రాబడిపై ఎటువంటి పన్ను ఉండదన్న ఉద్దేశంతో ట్యాక్స్ ఫ్రీ బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అది 10, 20 ఏళ్ల దీర్ఘకాలిక బాండ్స్ అయినప్పటికీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ దీర్ఘకాలిక బాండ్స్‌పై 8.5 శాతం వడ్డీరేటును ఇస్తుంటే, పన్ను భారం లేని విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ వడ్డీరేటు 12.6 శాతం అవుతుంది. కానీ వీటిల్లో ఉండే రిస్క్‌ను గమనించడం లేదు. ఉదాహరణకు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 10-20 ఏళ్ల కాలానికి ద్రవ్యోల్బణం ఇదే విధంగా ఉండదు. మధ్య మధ్యలో తీవ్ర హెచ్చు తగ్గులకు గురవుతుంటాయి. అటువంటి సమయంలో ఈ దీర్ఘకాలిక బాండ్స్ వడ్డీరేట్లు అక్కరకురాకపోగా, వీటి నుంచి వైదొలిగే అవకాశం కూడా ఉండదు. అదే స్వల్పకాలానికి 1-2 ఏళ్లకు ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా రాబడులను పొందే అవకాశం ఉంటుంది. - మనీష్ డంగి కో-సీఐవో, బిర్లాసన్లైఫ్ ఏఎంసీ -
పట్టణవాసులపై ‘పన్నుపోటు’
తాండూరు, న్యూస్‌లైన్: నింగినంటిన నిత్యావసరాల ధరలతో బతుకుబండిని లాగడం కష్టమైన తరుణంలో పేద, మధ్య తరగతి వర్గాలపై సర్కా రు మరో భారం మోపేందుకు రంగం సిద్ధం చేస్తోంది. పన్నుపోటుతో ఆస్తిపన్ను ఆదాయాన్ని మరింత పెంచుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం చెల్లిస్తున్న ఆస్తిపన్నుకు అదనంగా వంద శాతం పెరగనున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని రూ.100-రూ.500 ఆస్తిపన్ను చెల్లించే ఇళ్ల సర్వేకు ఆదేశించింది. నిర్మాణం, వాడుక స్వభావం మారిన ఇళ్లపై పన్ను పెంచడమే సర్వే ముఖ్యోద్దేశం. ప్రస్తుతం ఈ గృహాల నుంచి తక్కువగా ఆదాయం వస్తున్నందునే ఆస్తిపన్ను పెంపునకు కారణమని తెలుస్తోంది. ఈ మేరకు గత నెల 25వ తేదీన తాండూరు మున్సిపల్ అధికారులకు డెరైక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మిస్ట్రేషన్ (డీఎంఏ) నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. 4,360 ఇళ్ల సర్వే లక్ష్యం ఇందులోభాగంగా మూడు రోజులుగా మున్సిపల్ అధికారులు మున్సిపాలిటీలోని 31వార్డుల్లో సర్వే చేపట్టారు. ఆయా వార్డుల్లో మొత్తం 11,079 ఇళ్లున్నాయి. వీటిపై మున్సిపాలిటీకి ఏడాదికి ఆస్తిపన్ను రూపంలో సుమారు రూ.1.74కోట్ల ఆదాయం సమకూరుతోంది. మొత్తం ఇళ్లలో రూ.500లోపు ఆస్తిపన్ను చెల్లించేవాటి సంఖ్య సుమారు 4,360 ఉన్నాయి. వీటిపై ఏడాదికి 11 లక్షల,69వేల, 359 రూపాయల ఆదాయం వస్తోంది. పొడవు, వెడల్పు కొలతల సేకరణ అధికారులు తమ సర్వేలో ఇళ్ల పొడవు, వైశాల్యం కొలతలు సేకరిస్తున్నారు. రికార్డుల్లో పేర్కొన్న విధంగానే ప్రస్తుత ఇళ్ల నిర్మాణాలు ఉన్నాయా? పొడవు, వైశాల్యంలో నిర్మాణాలు పెరిగాయా అని సర్వే చేస్తున్నారు. అధికారుల సర్వేలో రికార్డుల్లో పేర్కొన్న విధంగా కాకుండా నిర్మాణాల్లో మార్పులు జరిగితే వాటికి ఆస్తిపన్నును పెంచుతున్నారు. అదేవిధంగా ఇళ్ల వాడుక, నిర్మాణ స్వభావానికనుగుణంగా పన్నును విధిస్తున్నారు. వంద శాతం పెంపునకు ఉదాహరణ.. గొల్లచెరువులో 89.60చదరపు మీటర్ల ఒక బండల ఇంటికి ప్రస్తుతం ఏడాదికి రూ.328 ఆస్తిపన్ను విధిస్తున్నారు. తాజాగా అధికారులు చేసిన సర్వే ప్రకారం నిర్మాణ స్వభావం మారినందున 2002 గెజిట్ ఆధారంగా ఒక చదరపు మీటరకు రూ.3.50 చొప్పున పన్ను విధించడం ద్వారా రూ.657 పెరిగింది. అంటే దాదాపు వంద శాతం ఆస్తిపన్ను పెరిగినట్టు స్పష్టమవుతోంది. ఆస్తిపన్ను పెంపుతో పేద, మధ్యతరగతి వర్గాలపై అదనపు భారం పడనుంది. 525 ఇళ్ల సర్వే పూర్తి రూ.500 ఆస్తిపన్ను చెల్లించే 4,360 ఇళ్లలో ఇప్పటికే అధికారులు ఆయా వార్డుల్లో 525 గృహాలను సర్వే చేశారు. ఇందులో సుమారు 120 ఇళ్లకు ఆస్తిపన్ను పెంచారు. దీంతో రూ.22,480 అదనంగా ఆస్తిపన్ను సమకూరనుంది. మరో నెల రోజులపాటు మిగతా ఇళ్లను సర్వే చేసి, పన్ను పరిధిలోకి వచ్చే ఇళ్లను గుర్తించనున్నారు. ఆస్తిపన్ను పెంపు పరిధిలోకి వచ్చే ఇళ్ల యజమానులకు అధికారులు నోటీసులు జారీ చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. అన్ని ఇళ్లకు ఆస్తిపన్ను పెంపు ఉండదు రూ.500 లోపు పన్ను చెల్లించే ఇళ్ల పొడవు, వైశాల్యంలో మార్పులు ఉన్న వాటికి మాత్రమే ఆస్తిపన్ను పెంపు వరిస్తుంది. ఇళ్లు హోటళ్లుగా ఇతర కమర్షియల్ అవసరాలకు వినియోగించడం తదితర వాడుక స్వభావం మారినా ఆస్తిపన్ను పెంచుతాం. పెంపు అన్ని ఇళ్లకు ఉండదు. - రమణాచారి, తాండూరు మున్సిపల్ కమిషనర్