పన్ను భారం తగ్గించుకుందామా! | lessethen the tax burden! | Sakshi
Sakshi News home page

పన్ను భారం తగ్గించుకుందామా!

Published Mon, Jan 25 2016 12:14 AM | Last Updated on Sun, Sep 3 2017 4:15 PM

పన్ను భారం తగ్గించుకుందామా!

పన్ను భారం తగ్గించుకుందామా!

ఈ ఏడాది నుంచి  కొత్త మినహాయింపులు
ఇక ఎన్‌పీఎస్ ఇన్వెస్ట్‌మెంట్ విడిగా లెక్కింపు

పెరిగిన ఆరోగ్య బీమా పరిమితులు
పెరిగిన రవాణా భత్యం; ఆడపిల్లలకు కొత్త పథకం
రూ.4.44 లక్షల వరకూ మినహాయింపు పొందే అవకాశం

 ఈ ఆర్థిక సంవత్సరం మరో రెండు నెలల్లో ముగుస్తోంది. చాలామందికి పన్నుపోటు తగులుతోంది. జీతాల్లో భారీ కోత పడుతోంది. కనీసం... ఇప్పుడైనా జాగ్రత్త పడకుంటే మిగిలిన రెండు నెలలూ మరింత భారీ కోతలు ఖాయం. అందుకే అందరూ పన్ను భారం నుంచి ఎలా తప్పించుకోవాలన్న లెక్కల్లో పడ్డారు. నిజానికి ఈ సంవత్సరం పన్ను భారం నుంచి తప్పించుకోవటానికి కొత్త సెక్షన్లు వచ్చాయి. వీటిని పూర్తిగా వినియోగించుకుంటే పన్ను భారం మరింతగా తగ్గించుకోవచ్చు.

ఆదాయపన్ను చట్టంలోని మినహాయింపులను వినియోగించుకోవడం ద్వారా గరిష్టంగా రూ.4.44 లక్షల వరకూ పన్ను భారం తగ్గించుకోవచ్చన్నది కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గత బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. అదెలాగో... ఆ పథకాలేంటో... సెక్షన్లేంటో వివరించేదే ఈ కథనం...

 ప్రత్యేకంగా ఎన్‌పీఎస్...
గతేడాది వరకూ జాతీయ పింఛను పథకంలో (ఎన్‌పీఎస్) ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని సెక్షన్ 80సీలో భాగంగానే పరిగణించేవారు. ఈ ఏడాది నుంచి మాత్రం ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని ప్రత్యేకంగా చూపించుకునే అవకాశం కల్పించారు. ఇందుకోసం ఐటీ చట్టంలో 80 సీసీడీ అనే ప్రత్యేక సెక్షన్‌ను ఏర్పాటు చేశారు. ఈ సెక్షన్ కింద గరిష్టంగా రూ.50,000 వరకూ పన్ను మినహాయింపులు లభిస్తాయి. ఇది సెక్షన్ 80సీ కింద లభించే రూ.1.50 లక్షలకు అదనం. దీని వల్ల 30 శాతం పన్ను పరిధిలో ఉండే వారికి అదనంగా రూ.15,000 వరకు పన్ను భారం తగ్గుతుంది. 20 శాతం పన్ను పరిధిలోకి వచ్చే వారికి రూ.10,000, అదే 10 శాతం శ్లాబులో ఉన్న వారికైతే రూ. 5,000 పన్ను తగ్గుతుంది.

మరింత ఆరోగ్య ధీమా...
ఈ ఏడాది జరిగిన కీలక మార్పులో ముఖ్యమైన మరో అంశం సెక్షన్ 80డీ పరిమితులు పెంచడం. ఈ సెక్షన్ 80డీ కింద ఆరోగ్య బీమాకు చెల్లించే ప్రీమియంపై లభించే పన్ను మినహాయింపు పరిధిని పెంచారు. 60 ఏళ్ళలోపు వయస్సు ఉన్నవారికి ఇప్పటి వరకు రూ.15,000 వరకు మాత్రమే మినహాయింపు లభించేది. ఇప్పుడు ఈ మొత్తాన్ని రూ. 25,000కు పెంచారు. అదే సీనియర్ సిటిజన్స్ అయితే రూ. 30,000 వరకు ప్రయోజనం పొందవచ్చు. ముందస్తు వైద్య పరీక్షలకు చేసే వ్యయంపై గరిష్టంగా రూ.5,000 వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది.

కానీ ఈ మొత్తం రూ.25,000 పరిధిలోకే వస్తుంది. భార్యభర్తలు, పిల్లలు, తల్లిదండ్రులపై చేసే వైద్య పరీక్షలను ఇందుకోసం వినియోగించుకోవచ్చు. ఇది కాకుండా తల్లిదండ్రులకు చెల్లించే వైద్య బీమా ప్రీమియంపై కూడా మినహాయింపులు పొందవచ్చు. తల్లిదండ్రులు 60 ఏళ్ళ లోపు వారైతే రూ.25,000, అదే సీనియర్ సిటిజన్స్ అయితే రూ.30,000 అదనంగా పొందవచ్చు. అంటే ఈ సెక్షన్ ద్వారా గరిష్టంగా రూ. 60,000 వరకూ ప్రయోజనం పొందవచ్చు.

రెట్టింపైన రవాణా భత్యం...
హోదాతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరి జీతంలో రవాణా భత్యం ఉంటుంది. ప్రతి నెలా జీతంలో కన్వేయెన్స్ అలవెన్స్ కింద రూ.800 లభిస్తాయి. ఇది పూర్తిగా ట్యాక్స్ ఫ్రీ ఇన్‌కమ్. ఇప్పుడు ఈ మొత్తాన్ని కేంద్రం రూ.1,600కు పెంచింది. ప్రభుత్వం ఇలా చేయటం వల్ల ఏడాదికి అదనంగా రూ.9,600 వరకు పన్ను భారం తగ్గించుకోవచ్చు.

 సుకన్య సమృద్ధి...
అమ్మాయిల కోసం ప్రధాని నరేంద్ర మోదీ కిందటేడాది సరికొత్త డిపాజిట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ‘సుకన్య సమృద్ధి’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ పథకంపై అత్యధిక వడ్డీతో పాటు, పన్ను మినహాయింపులు లభించడం దీనిలోని ప్రధాన ఆకర్షణ. ఈ ఏడాది 9.2 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నారు. అయితే 10 ఏళ్ళ లోపు అమ్మాయిల పేరు మీద మాత్రమే ఈ పథకాన్ని తీసుకోగలరు.

అమ్మాయి వయస్సు 21 ఏళ్లు లేదా వివాహ తేది... ఏది ముందైతే అది మెచ్యూరిటీ తేదీగా వ్యవహరిస్తారు. ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు పొందవచ్చు. వడ్డీరేట్లు తగ్గుతున్న ప్రస్తుత సమయంలో ఈ పథకంపై అధిక వడ్డీరేటు లభిస్తుండటం గమనార్హం.

తొలిసారి షేర్లు కొంటున్నారా..
తొలిసారి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వారు పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. ఇందుకోసం 80 సీసీజీ రూపంలో రాజీవ్‌గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీం అందుబాటులో ఉంది. ఇది కేవలం తొలిసారిగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు చేసే వారికే వర్తిస్తుంది. ఈ పథకం కింద  గరిష్టంగా ఇన్వెస్ట్ చేసే రూ.50,000లో  సగభాగం అంటే రూ.25,000 పన్ను ఆదాయం నుంచి తగ్గించి చూపించుకోవచ్చు. ఇలా వరుసగా మూడేళ్లు చేసే ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఈ మినహాయింపు పొందవచ్చు.

వార్షికాదాయం పన్నెండు లక్షలు దాటిన వారికి ఇది వర్తించదు. ఇవన్నీ కాకుండా ఎప్పటిలాగా సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు లభించే బీమా, ఐదేళ్లు బ్యాంకు డిపాజిట్లు, పోస్టాఫీసు పథకాలు, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీం (ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్), పీపీఎఫ్, హౌసింగ్ లోన్, ట్యూషన్ ఫీజులు తదితరాలు ఎలానూ ఉన్నాయి. వీటన్నింటినీ చక్కగా వినియోగించుకోవడం ద్వారా గరిష్టంగా పన్ను ప్రయోజనాలను పొందొచ్చు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement