తాండూరు, న్యూస్‌లైన్: నింగినంటిన నిత్యావసరాల ధరలతో బతుకుబండిని లాగడం కష్టమైన తరుణంలో పేద, మధ్య తరగతి వర్గాలపై సర్కా రు మరో భారం మోపేందుకు రంగం సిద్ధం చేస్తోంది. పన్నుపోటుతో ఆస్తిపన్ను ఆదాయాన్ని మరింత పెంచుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం చెల్లిస్తున్న ఆస్తిపన్నుకు అదనంగా వంద శాతం పెరగనున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని రూ.100-రూ.500 ఆస్తిపన్ను చెల్లించే ఇళ్ల సర్వేకు ఆదేశించింది. నిర్మాణం, వాడుక స్వభావం మారిన ఇళ్లపై పన్ను పెంచడమే సర్వే ముఖ్యోద్దేశం. ప్రస్తుతం ఈ గృహాల నుంచి తక్కువగా ఆదాయం వస్తున్నందునే ఆస్తిపన్ను పెంపునకు కారణమని తెలుస్తోంది. ఈ మేరకు గత నెల 25వ తేదీన తాండూరు మున్సిపల్ అధికారులకు డెరైక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మిస్ట్రేషన్ (డీఎంఏ) నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.
4,360 ఇళ్ల సర్వే లక్ష్యం
ఇందులోభాగంగా మూడు రోజులుగా మున్సిపల్ అధికారులు మున్సిపాలిటీలోని 31వార్డుల్లో సర్వే చేపట్టారు. ఆయా వార్డుల్లో మొత్తం 11,079 ఇళ్లున్నాయి. వీటిపై మున్సిపాలిటీకి ఏడాదికి ఆస్తిపన్ను రూపంలో సుమారు రూ.1.74కోట్ల ఆదాయం సమకూరుతోంది. మొత్తం ఇళ్లలో రూ.500లోపు ఆస్తిపన్ను చెల్లించేవాటి సంఖ్య సుమారు 4,360 ఉన్నాయి. వీటిపై ఏడాదికి 11 లక్షల,69వేల, 359 రూపాయల ఆదాయం వస్తోంది.
పొడవు, వెడల్పు కొలతల సేకరణ
అధికారులు తమ సర్వేలో ఇళ్ల పొడవు, వైశాల్యం కొలతలు సేకరిస్తున్నారు. రికార్డుల్లో పేర్కొన్న విధంగానే ప్రస్తుత ఇళ్ల నిర్మాణాలు ఉన్నాయా? పొడవు, వైశాల్యంలో నిర్మాణాలు పెరిగాయా అని సర్వే చేస్తున్నారు. అధికారుల సర్వేలో రికార్డుల్లో పేర్కొన్న విధంగా కాకుండా నిర్మాణాల్లో మార్పులు జరిగితే వాటికి ఆస్తిపన్నును పెంచుతున్నారు. అదేవిధంగా ఇళ్ల వాడుక, నిర్మాణ స్వభావానికనుగుణంగా పన్నును విధిస్తున్నారు.
వంద శాతం పెంపునకు ఉదాహరణ..
గొల్లచెరువులో 89.60చదరపు మీటర్ల ఒక బండల ఇంటికి ప్రస్తుతం ఏడాదికి రూ.328 ఆస్తిపన్ను విధిస్తున్నారు. తాజాగా అధికారులు చేసిన సర్వే ప్రకారం నిర్మాణ స్వభావం మారినందున 2002 గెజిట్ ఆధారంగా ఒక చదరపు మీటరకు రూ.3.50 చొప్పున పన్ను విధించడం ద్వారా రూ.657 పెరిగింది. అంటే దాదాపు వంద శాతం ఆస్తిపన్ను పెరిగినట్టు స్పష్టమవుతోంది. ఆస్తిపన్ను పెంపుతో పేద, మధ్యతరగతి వర్గాలపై అదనపు భారం పడనుంది.
525 ఇళ్ల సర్వే పూర్తి
రూ.500 ఆస్తిపన్ను చెల్లించే 4,360 ఇళ్లలో ఇప్పటికే అధికారులు ఆయా వార్డుల్లో 525 గృహాలను సర్వే చేశారు. ఇందులో సుమారు 120 ఇళ్లకు ఆస్తిపన్ను పెంచారు. దీంతో రూ.22,480 అదనంగా ఆస్తిపన్ను సమకూరనుంది. మరో నెల రోజులపాటు మిగతా ఇళ్లను సర్వే చేసి, పన్ను పరిధిలోకి వచ్చే ఇళ్లను గుర్తించనున్నారు. ఆస్తిపన్ను పెంపు పరిధిలోకి వచ్చే ఇళ్ల యజమానులకు అధికారులు నోటీసులు జారీ చేసేందుకు కసరత్తు ప్రారంభించారు.
అన్ని ఇళ్లకు ఆస్తిపన్ను పెంపు ఉండదు
రూ.500 లోపు పన్ను చెల్లించే ఇళ్ల పొడవు, వైశాల్యంలో మార్పులు ఉన్న వాటికి మాత్రమే ఆస్తిపన్ను పెంపు వరిస్తుంది. ఇళ్లు హోటళ్లుగా ఇతర కమర్షియల్ అవసరాలకు వినియోగించడం తదితర వాడుక స్వభావం మారినా ఆస్తిపన్ను పెంచుతాం. పెంపు అన్ని ఇళ్లకు ఉండదు.
- రమణాచారి, తాండూరు మున్సిపల్ కమిషనర్
పట్టణవాసులపై ‘పన్నుపోటు’
Published Fri, Sep 6 2013 2:09 AM | Last Updated on Tue, Oct 16 2018 6:35 PM
Advertisement