నగర వాసులపై పన్నుల భారం
నగరవాసులపై వివిధ రూపాల్లో పన్నుల భారం మోపేందుకు నెల్లూరు కార్పొరేషన్ రంగం సిద్ధం చేసింది. అందుకు ఈ నెల 31వ తేదీన నిర్వహించనున్న నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం
నెల్లూరు, సిటీ: నెల్లూరు కార్పొరేషన్ కొత్త కౌన్సిల్ ఏర్పాటైన నాలుగు నెలల తరువాత ఈ నెల 31వ తేదీన రెండో సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కౌన్సిల్ ఆమోదాన్ని కార్పొరేషన్ అధికారులు తీసుకోనున్నారు. ఇందులో నగర వాసులపై పన్నుల భారం మోపే నిర్ణయాలతో పాటు అభివృద్ధికి సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. పాత భవనాల కూల్చివేతకు కౌన్సిల్ అనుమతి తీసుకోనున్నారు.
పిల్లల పార్క్ నిర్వహణను బీఓటీ (బిల్ట్ ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్) పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ఒప్పందం, ఆయా డివిజన్‌ల పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు 70:30 పద్ధతిలో ఆయా ప్రాంత వాసుల నుంచి నిధుల సేకరణకు అనుమతి వంటి కీలక అంశాలు కూడా కౌన్సిల్‌లో చర్చకు రానున్నాయి.
గతంలో జన్మభూమి కార్యక్రమంలో ఈ తరహా అభివృద్ధికి ప్రభుత్వం అనుమతించింది. అయితే ప్రజల భాగస్వామ్యం కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. మళ్లీ ఈ పద్ధతిలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు కార్పొరేషన్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మొత్తంగా ఈ సమావేశంలో చర్చించేందుకు భారీ అజెండాను అధికారులు రూపొందించారు.
పార్కింగ్ బాదుడు
నగరంలోని కీలక ప్రాంతాల్లో ఇకపై వాహనాలు పార్కింగ్ చేసేందుకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఆ మేరకు గుర్తించిన ఎనిమిది ప్రాంతాల్లో సైకిళ్ల నుంచి నాలుగు చక్రాల వాహనాల వరకు పార్కింగ్ రుసుం వసూలు చేసేందుకు అనుమతి కోరనున్నారు. వేలం పాట ద్వారా పెయిడ్ పార్కింగ్ నిర్వహణకు కౌన్సిల్ ఆమోదం కోరనున్నారు. ఏసీ కూరగాయల మార్కెట్, ప్రకాశం పంతులు విగ్రహం, అర్చన థియేటర్, ఆత్మకూరు బాస్టాండ్, నర్తకీ, గాంధీబొమ్మ, మినీ బైపాస్ తదితర ప్రాంతాల్లో వాహనాలు నిలపాలంటే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
కాగా నగరంలో భవన నిర్మాణాలకు సంబంధించి ఒక్క శాతం లేబర్ సెస్ వసూళ్లకు సంబంధించి కౌన్సిల్ నుంచి ఆమోదం తీసుకోనున్నారు. భవనాల నిర్మాణ వ్యయం భారీగా పెరిగిన పరిస్థితుల్లో లేబర్ సెస్ వసూళ్లు చేయాలని కార్పొరేషన్ నిర్ణయించడంతో నిర్మాణ వ్యయం మరింత పెరిగి ప్రజలకు భారం కానుంది.
కొండాయపాళెం రోడ్డు వెడల్పు 60 అడుగులు చేయాలన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి డిమాండ్ మేరకు మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు కోరుతూ కార్పొరేషన్ అధికారులు అజెండాలో ప్రతిపాదించారు. నెల్లూరు చెరువు చుట్టూ నక్లెస్ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపేందుకు కౌన్సిల్ ఆమోదం కోరుతున్నారు.
చెరువు చుట్టూ పార్క్‌లు, ఎంటర్‌టైన్‌మెంట్ జోన్లు, ఫుడ్ కోర్టుల అభివృద్ధికి పీ.పీ.పీ (పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్) పద్ధతిన అభివృద్ధి చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు రూపొందించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వివిధ విభాగాల్లో పని చేస్తున్న 1476 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బందిని కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించేందుకు అనుమతి కోరనున్నారు. అయితే నగరంలోని పలు మురుగు నీటి కాలువల్లో పూడిక తొలగింపునకు టెండర్లు పిలవనున్నారు.
లక్షలాది రూపాయలు వ్యయం చేసే ఎలక్ట్రికల్ పరికరాల కొనుగోలుకు ఈ ప్రక్యూర్‌మెంట్ టెండర్లు పిలిచేందుకు అనుమతి తీసుకోనున్నారు. కార్పొరేషన్ నిర్వహణలోని పాత వాహనాల వేలం ద్వారా వచ్చే సొమ్ముతో కొత్త వాహనాలు కొనుగోలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఆ మేరకు 15 ఏళ్లకు పైబడి, రెండున్నర లక్షల కిలోమీటర్లు నడిచిన పాత వాహనాలను 11 గుర్తించారు. వీటన్నింటినీ వేలం ద్వారా అమ్మకం చేసి వచ్చే నిధులతో మున్సిపల్ కమిషనర్‌కు కొత్త వాహనం కొనుగోలు చేసేందుకు కౌన్సిల్ అనుమతి తీసుకోనున్నారు.
శతాబ్దం చరిత్ర కలిగిన పాత మున్సిపల్ కార్యాలయాన్ని కూల్చివేసి ఆ స్థానంలో ప్రజా ఉపయోగ భవనాల నిర్మాణానికి అనుమతి కోరనున్నారు. నగరంలో ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లు, లాలీపాప్స్ తదితరాల నుంచి వచ్చే వ్యాపార ప్రకటనల లాభాలపై కూడా కార్పొరేషన్ దృష్టి సారించింది. మొత్తానికి పలు కీలక నిర్ణయాలు తీసుకోనుండడంతో ఈ సమావేశంపై ప్రజల్లో ఆసక్తి రేగుతోంది.