వీటికి పన్ను భారం లేదు.. | They do not have Tax burden .. | Sakshi
Sakshi News home page

వీటికి పన్ను భారం లేదు..

Published Mon, Jul 11 2016 1:16 AM | Last Updated on Mon, Sep 4 2017 4:33 AM

వీటికి పన్ను భారం లేదు..

వీటికి పన్ను భారం లేదు..

చాలా మంది మదుపరులు, పెట్టుబడిదారులు పన్ను భారం తగ్గించుకోవడమెలాగనేది తరచూ ఆలోచిస్తుంటారు. పన్ను భారం అసలు లేని, 100 శాతం పన్ను రహిత ఆదాయ మార్గాల గురించి పెద్దగా తెలియని వారు చాలా మంది ఉంటారు. అలాంటి వారికోసమే ‘కొన్ని అంశాలకు లోబడి’ ఈ పన్నెండు అవగాహనా అంశాలు. ఇలాంటి పన్ను మినహాయింపులు మరిన్ని అంశాలక్కూడా వర్తిస్తాయి. మరింత సమగ్ర,సవివరమైన సమాచారం కోసం క్వాలిఫైడ్ సీఏను సంప్రదిస్తే మంచిది. ఆ 12 అంశాల వివరాలివీ...
 
బ్యాంకింగ్ వడ్డీపై మినహాయింపు!
 2013 నుంచి 80టీటీఏ అనే సెక్షన్ అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం, మీ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై వచ్చే వడ్డీకి రూ.10,000 వరకూ ఎటువంటి పన్ను భారం ఉండదు. ఒకవేళ ఇలాంటి వడ్డీ ఆదాయం రూ.20,000 ఉంటే, అందులో కేవలం రూ.10,000 మొత్తానికే పన్ను వర్తిస్తుంది.
 
వారసత్వం, విల్లు...
భారత్‌లో వారసత్వంగా వచ్చే సంపదపై పన్ను భారం లేదు. విల్లు ద్వారా లభించే సంపదకు సైతం ఇదే విషయం వర్తిస్తుంది. అయితే ఇలా మీ కు లభించిన సంపదకు సంబంధించి మీ పెట్టుబడులు, దానిపై ఆర్జించే వడ్డీ పై మాత్రం పన్ను భారం తప్పదు.
 
ఈపీఎఫ్ అకౌంట్
ఐదేళ్లు సేవలు పూర్తిచేసిన తర్వాత ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) అకౌంట్ నుంచి పొందే మొత్తానికి కూడా పన్ను మినహాయింపును ఇచ్చారు. నిర్దిష్ట కాల పరిమితికి ముందే ఉద్యోగాలు మారే వారు అదే సమయంలో ఈపీఎఫ్ డబ్బు ఉపసంహరించుకుంటే పన్ను భారం తప్పదు.
 
షేర్లు, ఫండ్స్..
పెట్టుబడిపెట్టిన ఏడాది తరువాత షేర్లు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ నుంచి పొందే లాభాలపై కూడా పన్ను భారం లేదు. లాంగ్ టర్మ్ గెయిన్స్‌గా పరిగణించే ఈ మొత్తాలపై 100 శాతం పన్ను మినహాయింపు ఉంది. అయితే ఇక్కడ సెక్యూరిటీ లావాదేవీల పన్నును చెల్లించాల్సి ఉంటుంది.
 
ఎన్‌ఆర్‌ఈ అకౌంట్ వడ్డీ..

ఎన్‌ఆర్‌ఈ అకౌంట్‌పై సంపాదించే వడ్డీకి కూడా భారత్‌లో 100 శాతం పన్ను రాయితీ లభిస్తుంది. ఈ అకౌంట్లకు సంబంధించి ఫిక్స్‌డ్ డిపాజిట్, సాధారణ సేవింగ్ బ్యాంక్ వడ్డీ రెండింటికీ ఇది వర్తిస్తుంది. ఎన్‌ఆర్‌ఐ అకౌంట్ డిపాజిట్స్ టీడీఎస్ కూడా వర్తించకపోవడం మరో అంశం.
 
డివిడెండ్లు...
మీ స్టాక్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ (డివిడెండ్ ఆప్షన్) నుంచి డివిడెండ్స్ పొందితే దీనిపై కూడా పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే షేర్‌హోల్డర్లకు డివిడెండ్లు చెల్లించే ముందే కంపెనీ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ పన్నును ప్రభుత్వానికి చెల్లిస్తుందన్న విషయం ఇక్కడ గమనార్హం.
 
సంస్థలో లాభాల వాటాలు..
ఒక సంస్థలో ‘ఏ’, ‘బీ’ భాగస్వాములు. సంస్థ సాధించిన లాభాల్లో భాగంగా వార్షికంగా చెరొక రూ.5 లక్షలు పొందారు. ఈ మొత్తానికి పన్ను వర్తించదు. సంపాదించిన లాభానికి సంస్థే పన్ను చెల్లించేస్తుంది కనక వారికి పన్నుండదు. సంస్థ నుంచి వేతనం పొందితే దానికి వారు పన్ను చెల్లించాల్సిందే.
 
వివాహం.. బహుమతులు.
వివాహాల సమయంలో లభించే బహుమతులపై కూడా పన్ను మినహాయింపు లభిస్తుంది. ఇక్కడ మీకు ఎవరైనా విలువైన బహుమానాలు ఇవ్వదలిచారనుకోండి. పెళ్లి సమయానికి దానిని లింక్ చేసుకుంటే మీకు పన్ను ప్రయోజనాలూ లభిస్తాయి.
 
జీవిత బీమా నుంచి డబ్బు...
మెచ్యూరిటీ, క్లెయిమ్ లేదా సరెండర్‌పై జీవిత బీమా కంపెనీల నుంచి పొందే మొత్తానికి కూడా పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే బీమా మొత్తంలో ప్రీమియం 20 శాతం మించి ఉండకూడదని నిబంధనలు నిర్దేశిస్తున్నాయి.
 
ఎల్‌టీఏ మొత్తం..
పలు కంపెనీలు ప్రతి యేడాదీ ఉద్యోగులకు ఎల్‌టీఏను చెల్లిస్తుంటాయి. పర్యటన వ్యయాల నిమిత్తం సంస్థ ఉద్యోగికి చెల్లించే ఈ మొత్తాలపై కూడా పన్ను భారం ఉండదు. ఒకవేళ మీకు కంపెనీ ఎల్‌టీఏ చెల్లించకపోతే... మీ వేతనంలో కొంత ఈ కేటగిరీకి కేటాయించాలని కోరే వీలుంది కూడా.
 
వీఆర్‌ఎస్ స్కీమ్..
ఒక వ్యక్తి వాలంటరీ రిటైర్‌మెంట్ స్కీమ్ (వీఆర్‌ఎస్) తీసుకుంటే.. ఇందులో వచ్చే మొత్తంపై రూ. 5 లక్షల వరకూ పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే అందరికీ ఇది వర్తించదు. ప్రభుత్వ, సంబంధిత సంస్థల ఉద్యోగులకు మాత్రమే ఈ వెసులుబాటు ఉంది.
 
15 జీ, 15 హెచ్...
స్థిర డిపాజిట్‌లపై వడ్డీపై సోర్స్ వద్ద పన్ను (టీడీఎస్) మినహాయింపునకు ఈ డాక్యుమెంట్లు దోహదపడతాయి. ఇందులో ఫామ్ 15 హెచ్ సీనియర్ సిటిజన్లకు ఉద్దేశించినది కాగా, ఇతరులకు 15 జీ . క్లుప్తంగా వడ్డీనే జీవనాధారమనీ, పన్ను నిబంధనలు దీనికి వర్తించవనీ ఇచ్చే ధ్రువీకరణ పత్రాలివి. ఈ పత్రాలు, లేదా పాన్ కార్డ్ సమర్పించకపోతే భారీ పన్ను భారం తప్పదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement