తాజా బడ్జెట్లో ఆదాయపు పన్ను పరంగా.. అనుకున్నంతగా కాకపోయినా బాగానే ఉందని చెప్పాలి. ఎక్కువగా లబ్ధి పొందింది... వార్షికా దాయం రూ.5 లక్షలు దాటనివారని చెప్పొచ్చు. నికర ఆదాయం లేదా ట్యాక్సబుల్ ఆదాయం 1–4–2019 నుంచి 31–3–2020 వరకు రూ.5 లక్షలు, ఆ లోపు ఉంటే పన్ను భారం లేదు. ప్రస్తుతం అమల్లో ఉన్న శ్లాబులు, రేట్లు తదితరాల్లో ఎలాంటి మార్పులూ లేవు. శ్లాబులు మార్చకుండా... రేట్లలో మార్పు లేకుండా... ఇది ఎలా సాధ్యమనే సందేహం వస్తుంది. పన్ను తగ్గింపును సెక్షన్ 87ఎ ప్రకారం రిబేటు ద్వారా ఇచ్చారు. ఉదాహరణకు ఒకరి సేవింగ్స్ రూ.1,50,000 అనుకోండి. మెడిక్లెయిమ్ వార్షిక ప్రీమియం రూ.25,000 అనుకోండి. విద్యా రుణం మీద వడ్డీ రూ.1,00,000, ఇంటిమీద రుణంపై రూ.2,00,000 వడ్డీ అనుకోండి. వీటిన్నింటినీ కలిపితే మొత్తం రూ.4,75,000. ఈ మొత్తానికి రూ.5,00,000 కలిపితే మొత్తం రూ.9,75,000. తాజా బడ్జెట్ ప్రతిపాదనల్లో భాగంగా స్టాండర్డ్ డిడక్షన్‌ను కూడా రూ.40వేల నుంచి రూ.50 వేలకు పెంచారు. అయితే ఇది కేవలం ఉద్యోగస్తులకే వర్తిస్తుంది. దీనిని కూడా పరిగణనలోకి తీసుకుంటే మొత్తం రూ.10,25,000 అవుతుంది. ఆ లెక్కేంటో ఒకసారి చూద్దాం.
మొత్తం జీతం – 10,25,000
స్టాండర్డ్ డిడక్షన్ – 50,000
మెడిక్లెయిమ్ – 25,000
సేవింగ్స్(80సి) – 1,50,000
విద్యారుణంపై వడ్డీ – 1,00,000
గృహరుణంపై వడ్డీ – 2,00,000
మొత్తం మినహాయింపులు – 5,25,000
నికర ఆదాయం – 5,00,000
ఇలా మిగిలిన మొత్తం రూ.5,00,000 దాటలేదు కనక ఎలాంటి పన్ను భారం ఉండదు. ప్రస్తుత సంవత్సరపు పన్ను భారంతో పోల్చి చూస్తే రూ.12,500 తక్కువ. ఈ మేరకు పన్ను భారం తగ్గినట్లే. ఇది సంతోషించవలసిన విషయం. ఉద్యోగస్తులు కాని వారికి కూడా ఈ సదుపాయం వర్తిస్తుంది. కాకపోతే స్టాండర్డ్ డిడక్షన్ అనేది మాత్రం ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ మేరకు చూస్తే పై ఉదాహరణలో స్థూల ఆదాయం రూ.10,25,000 నుంచి రూ.9,75,000కు తగ్గుతుంది. అలాంటి వారికి పన్ను భారం ఉండదు.
కొసమెరుపు ఏమిటంటే... పన్ను చెల్లించాల్సిన లేదా నికర ఆదాయం రూ.5,00,000 దాటిన వారికి శ్లాబులు, రేట్లు అన్నీ యథాతథం. వీటిల్లో ఎలాంటి మార్పూ లేనందున వెసులుబాటు, ఉపశమనం వంటివేమీ లేవు. ఇది మోదీ మంత్రం. నికరాదాయం రూ.5లక్షల లోపు ఉన్నవారికే ఈ మార్పు వర్తిస్తుంది.
ఆదాయం 5 లక్షలు దాటకపోతేనే...
Published Mon, Feb 4 2019 4:48 AM | Last Updated on Tue, Jun 4 2019 6:36 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment