ఇక బాదుడే!
కర్నూలు నగర ప్రజలకు పన్ను పోటు!
సాక్షి ప్రతినిధి, కర్నూలు : నగర ప్రజలపై పన్నుల భారం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కర్నూలు నగర పాలక సంస్థలో ఇటు నీటి బిల్లుతో పాటు అటు ఆస్తి పన్నును భారీ పెంచేందుకు రంగం సిద్ధమైంది. కార్పొరేషన్‌కు వాస్తవికంగా అయ్యే వ్యయం, వస్తున్న ఆదాయాన్ని పోల్చి చూసి... వీటి మధ్య ఉన్న తేడాను భర్తీ చేసుకునేందుకు పన్నులు పెంచాల్సిందేనని ఇప్పటికే ప్రభుత్వం తేల్చి చెప్పింది.
ఈ నేపథ్యంలో నీటి బిల్లులతోపాటు ఆస్తి పన్నులను కూడా పెంచేందుకు మునిసిపల్ కార్పొరేషన్ యంత్రాంగం ప్రణాళిక రచిస్తోంది. ఇందులో భాగంగా ఇంటి నీటి బిల్లును రూ.100 నుంచి 150కు పెంచాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం. ప్రస్తుతం ఇంటికి సరఫరా చేసే నీటి కోసం నెలకు రూ. 100ను కార్పొరేషన్ వసూలు చేస్తోంది. అంటే ఏకంగా 50 శాతం మేరకు నీటి బిల్లు భారం పెరగనుందన్నమాట. అదేవిధంగా వాణిజ్య సంస్థల నీటి బిల్లు స్లాబుల్లో తేడాలు రానున్నాయి. ఇంటి పన్ను భారం కూడా 25 శాతం నుంచి 50 శాతం పెంచాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది.
వాణిజ్య సంస్థలకు వాతలే...!
ఆదాయాన్ని పెంచుకునేందుకు మునిసిపల్ కార్పొరేషన్ యంత్రాంగం ప్రధానంగా వాణిజ్య సంస్థలపై దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించింది. ఇందుకోసం వాణిజ్య సంస్థల నీటి బిల్లు స్లాబులను సవరించాలని భావిస్తోంది. ప్రస్తుతం వాణిజ్య సంస్థలకు 15 వేల లీటర్ల వరకు ఒక స్లాబుగా నిర్ణయించారు. నెలకు 15 వేల లీటర్ల మేరకు నీటిని వినియోగిస్తే రూ. 300 వసూలు చేస్తున్నారు. ఆపై ప్రతీ వెయ్యి లీటర్లకు అదనంగా రూ. 20 మేర ఆయా సంస్థలు చెల్లించాల్సి ఉంటుంది.
అయితే, ఈ స్లాబులను కాస్తా మార్చడం ద్వారా ఆదాయాన్ని రాబట్టాలనేది ఆలోచనగా ఉంది. మొత్తం మీద ప్రస్తుతం గృహాలకు, వాణిజ్య సంస్థలకు నీటి సరఫరాకు కార్పొరేషన్‌కు ఏడాదికి రూ. 9 కోట్ల మేరక వ్యయమవుతోంది. అయితే, ప్రస్తుతం కేవలం రూ. 4.5 కోట్ల మేరకు మాత్రమే ఆదాయం వస్తోంది. అంటే రూ. 4.5 కోట్ల లోటును కేవలం చార్జీలను పెంచడం ద్వారానే భర్తీ చేసుకోవాల్సి రానుంది.
ఇందుకోసం అటు గృహాలకు నెలకు రూ. 100 నుంచి రూ. 150తో పాటు వాణిజ్య సంస్థలకు స్లాబులను మార్చడం ద్వారానే సాధ్యం అనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. కర్నూలు కార్పొరేషన్ పరిధిలో 41,860 గృహాలకు నీటి కనెక్షన్లు ఉండగా, 1500 వాణిజ్య సంస్థలకు మాత్రమే నీటి కనెక్షన్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అనధికారిక నీటి కనెక్షన్లపై కన్నేయడం ద్వారా మరింత ఆదాయం రాబట్టుకోవచ్చుననేది అధికారుల భానవగా ఉంది.
పెరగనున్న ‘ఇంటి’ బడ్జెట్!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2014-15లో ఇంటి పన్ను ద్వారా రూ.25 కోట్ల ఆదాయం కార్పొరేషన్‌కు వస్తుంది. అయితే, దీనిని 25 నుంచి 50 శాతానికి పెంచడం ద్వారా ఈ ఆదాయాన్ని రూ. 32 కోట్ల నుంచి రూ. 35 కోట్ల మేరకు రాబట్టుకోవాలనేది కార్పొరేషన్ భావిస్తోంది. ఇందుకోసం ఇంటి పన్ను మొత్తాన్ని సగటున 25 శాతం నుంచి 50 శాతం మేరకు పెంచేందుకు రంగం సిద్ధం చేసింది.
ఈ పెరిగే పన్నుల భారం ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. అదేవిధంగా కార్పొరేషన్ పరిధిలోని ప్రధాన కూడళ్లలో ఉండే అడ్వయిటైజింగ్ హోర్డింగుల ఆదాయాన్ని పెంచుకునే అంశంపైనా కసరత్తు జరుగుతోంది. దీనితో పాటు అనధికారిక కట్టడాలపై 100 శాతం మేరకు అపరాధ రుసుం భారం మోపడం ద్వారా కూడా అదనపు ఆదాయాన్ని రాబట్టుకునేందుకు సిద్ధమవుతోంది. మొత్తం మీద కొత్త ఏడాదిలో ప్రజలపై పన్నుల భారం తప్పేట్టు లేదు.