పుణేలో విద్యార్థులతో రాహుల్ సెల్ఫీ
పుణే: కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ అన్నారు. తాము ప్రకటించిన ‘న్యాయ్’ పథకం నిధుల కోసం మధ్యతరగతిపై పన్ను భారం వేస్తారంటూ వస్తున్న అనుమానాలను ఆయన కొట్టిపారేశారు. ఆర్‌జే మలిష్క, నటుడు సుబోధ్ సమన్వయకర్తలుగా పుణేలో విద్యార్థులతో జరిగిన ముఖాముఖిలో రాహుల్ మాట్లాడారు. దేశంలోని 25 కోట్ల మంది నిరుపేద ప్రజల ఖాతాల్లో ఏడాదికి రూ.72 వేలు చొప్పున జమ చేస్తామనీ, న్యాయ్‌కు కావాల్సిన నిధుల కోసం మధ్యతరగతి వారిపై భారం వేయం.. ఆదాయ పన్ను పెంచబోమన్నారు.
ప్రధాని మోదీపై ప్రేముంది. కానీ..
ప్రధాని మోదీపై అభిమానం ఉంది. నిజంగా, ఆయనపై నాకు ఎలాంటి ద్వేషం, కోపం లేదు. కానీ, ఆయన నాపై కోపంగా ఉన్నారు. నోట్లరద్దు ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. ప్రణాళిక సంఘం వ్యూహరచన సంస్థగా పనిచేయగా ప్రస్తుతమున్న నీతి ఆయోగ్ అమలు, ఎత్తుగడలపైనే మాట్లాడుతోంది. అధికారంలోకి వస్తే విద్య, ఆరోగ్య వ్యవస్థల బలోపేతంపై దృష్టి పెడతాం. బాలాకోట్‌పై దాడి ఐఏఎఫ్ ఘనత మాత్రమే. ఈ విషయాన్ని ప్రధాని మోదీ రాజకీయం చేయడం నాకు నచ్చలేదు. నన్ను ఇబ్బందిపెట్టే ప్రశ్నలు కూడా అడగాలని మిమ్మల్ని కోరుతున్నా. ఆత్మ విమర్శ చేసుకుని, జవాబు వెతకడానికి ప్రయత్నిస్తా.
ప్రియాంక మంచి స్నేహితురాలు
‘చెల్లి ప్రియాంక నాకు మంచి స్నేహితురాలు. ఇంతకుముందు కొట్లాడుకునేవాళ్లం. రాఖీ పండుగరోజు ప్రియాంక కట్టే రాఖీని దానంతట అది తెగిపోయే దాకా అలాగే చేతికి ఉంచుకుంటా. తీసేయను’ అని అన్నారు. చిన్నతనంలోనే ఉగ్రవాదుల చేతుల్లో దారుణ హత్యకు గురైన నానమ్మ(ఇందిరాగాంధీ), తండ్రి(రాజీవ్‌గాంధీ)ని రాహుల్ గుర్తుచేసుకున్నారు. ‘అప్పట్లో నానమ్మ ఆఫీసు రూంలో కర్టెన్ల వెనక దాక్కొని ఆమె లోపలికి రాగానే భయపెట్టే వాడిని’ అని ఇందిరతో అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. అల్లావుద్దీన్ కథల్లో ఉండే భూతం ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటారని అడగ్గా ‘నేను ప్రేమించే ప్రజంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటా’ అని బదులిచ్చారు. 60 ఏళ్లు నిండిన రాజకీయ నేతలను రిటైర్ కావాలని కోరడం సబబు కాదన్నారు.
నాకు పెళ్లయింది
రాహుల్‌పై బయోపిక్ తీయాలనుకుంటున్నాననీ, ఇందు లో హీరోయిన్ ఎవరై ఉంటే బాగుం టుందని భావిస్తున్నారని సుబోధ్ ప్రశ్నించగా ‘దురదృష్టకరం ఏంటంటే, ఇప్పటికే నాకు నా బాధ్యతలతో పెళ్లయిపోయింది’ అంటూ రాహుల్ చమత్కరించారు. (లోకమాన్య తిలక్, బాల్ గంగాధర్ వంటి బయోపిక్‌లలో సుబోధ్ నటించారు)
Comments
Please login to add a commentAdd a comment