NYAY Scheme
-
ప్రజల్నే పాలకులుగా చేస్తాం
పట్నా/న్యూఢిల్లీ/కుషినగర్/జైపూర్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలను పాలకులుగా చేస్తూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే న్యాయ్ పథకం అమలు చేసి దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త జవసత్వాలు తీసుకువస్తామని రాహుల్ తెలిపారు. బిహార్‌లోని పట్నా, యూపీలోని కుషీనగర్‌లో గురువారం జరిగిన ఎన్నికల ర్యాలీల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ ‘మీరే ప్రభువులు. మేం ప్రభుత్వం ఏర్పాటు చేశాక మా మన్‌కీ బాత్ వినాలని మిమ్మల్ని కోరం. మీకు అవసరమైనవి తెలుసుకుని దాని ప్రకారమే విధానాలు రూపొందిస్తాం’అని అన్నారు. నోట్లరద్దు, జీఎస్టీ కారణంగా ప్రజలు కోల్పోయిన కొనుగోలు శక్తిని మళ్లీ పెంచేందుకు న్యాయ్ వంటి పథకం అవసరమని ఆర్థిక నిపుణులు చెప్పారన్నారు. ఈ పథకం అమలుతో ప్రధాని మోదీ లాగేసుకున్న సొమ్మును తిరిగి ప్రజలకే అందజేస్తామని హామీ ఇచ్చారు. మోదీ కారణంగా కొందరు పారిశ్రామికవేత్తలుమాత్రం లాభపడ్డారన్నారు. కొత్త పదం ‘మోదీలైస్’ ప్రధాని మోదీ నిత్యం చెప్పే అబద్ధాలతో ఇంగ్లిష్‌లో మోదీలైస్ (మోదీ అబద్ధాలు) అనే కొత్త పదం పుట్టుకొచ్చిందని రాహుల్ ట్విట్టర్లో వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఫొటోషాప్ చేసిన ఇంగ్లిష్ డిక్షనరీలోని ‘మోదీలై’ అనే పదం ఉన్న పేజీని స్క్రీన్‌షాట్ తీసి ట్విట్టర్లో ఆయన పోస్ట్ చేశారు. ఆ పేజీలో ‘మోదీలై’కి మూడు అర్థాలతోపాటు దాన్ని ఎలా ఉపయోగించాలో తెలుపుతూ ఉదాహరణలున్నాయి. దీంతోపాటు ‘మోదీ అబద్ధాలను ప్రజలకు తెలిపే వెబ్సైట్ ఒకటి ఉంది!’ అంటూ ఆ వెబ్సైట్ లింక్ ‘మోదీ లైస్: ది మోస్ట్ అక్యురేట్ లిస్ట్ ఆఫ్ పీఎం మోదీస్ మెనీ లైస్’ అని వ్యంగ్యంగా పేర్కొన్నారు. బాధితురాలికి న్యాయం చేస్తాం రాజస్తాన్‌లోని ఆళ్వార్‌లో సామూహిక లైంగికదాడికి గురైన దళిత మహిళను కాంగ్రెస్ చీఫ్ పరామర్శించారు. అనంతరం సీఎం అశోక్ గహ్లోత్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బాధితురాలికి న్యాయం చేస్తామన్నారు. -
మీరు ఆదేశించండి.. మేం అమలుచేస్తాం
సిందేగా/జైపూర్: ప్రజాస్వామ్యంలో ప్రజలే నిజమైన యజమానులని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ అన్నారు. ప్రధాని మోదీ, ఇతర నాయకులంతా ప్రజల సేవకులేనన్నారు. ప్రజలు ఏం ఆదేశిస్తే అది చేసేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు. తాను ప్రజల మన్‌కీ బాత్(మనసులో మాట) వినేందుకే వచ్చానని వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జార్ఖండ్, రాజస్తాన్‌లో నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొన్న రాహుల్, ప్రధాని మోదీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ప్రతీ అంశాన్ని అమలుచేస్తాం.. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే కనీస ఆదాయ భద్రత పథకం(న్యాయ్) తీసుకొస్తామని రాహుల్ తెలిపారు. జార్ఖండ్‌లోని కుంతి నియోజకవర్గం సిందేగాలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ‘నా మనసులోని మాట(మన్‌కీ బాత్) చెప్పేందుకు ఇక్కడకు రాలేదు. మీ మనసులోని మాటను వినేందుకు వచ్చా. మీరు చెప్పిన ప్రతీ అంశాన్ని అమలుచేస్తాం. ఓ విషయం మర్చిపోవద్దు. ప్రజాస్వామ్యంలో మీరే(ప్రజలు) నిజమైన యజమానులు. మీరు ఏది ఆదేశిస్తే మేం దాన్ని ఆచరిస్తాం. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, దేశంలోని ప్రతీఒక్కరి ఖాతాలో రూ.15 లక్షల నగదు ఇలా ఇచ్చిన ఏ హామీలనూ మోదీ నిలబెట్టుకోలేదు. కుంతి నుంచి పోటీచేస్తున్న కాళీచరణ్ ముండాకు మీ అమూల్యమైన ఓటేసి గెలిపించండి’ అని కోరారు. వాళ్లంతా మోదీకి యజమానులు.. ఆదివాసీల హక్కులను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని రాహుల్ స్పష్టం చేశారు. ‘మా ప్రభుత్వం రాగానే జార్ఖండ్‌లోని ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందుబాటులోకి తీసుకొస్తాం. కొత్త విశ్వవిద్యాలయాలు, సాంకేతిక సంస్థలను ఏర్పాటుచేస్తాం. కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి జల్–జంగల్–జమీన్(నీళ్లు–అడవి–భూమి)పై ఆదివాసీల హక్కులను పరిరక్షిస్తాం’ అని రాహుల్ తెలిపారు. అనంతరం రాజస్తాన్‌లోని ఛోములో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ‘ప్రధాని మోదీ ఓ 15 మంది పారిశ్రామికవేత్తలకు రూ.5.55 లక్షల కోట్ల ప్రజాధనాన్ని అప్పనంగా ఇచ్చేశారు. ఈ 15 మంది పారిశ్రామికవేత్తలు నరేంద్ర మోదీకి యజమానులు. మాకు మాత్రం ప్రజలే యజమానులు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ 15 మంది పారిశ్రామికవేత్తలకు మాఫీచేసిన మొత్తాన్ని తిరిగివసూలు చేసి పేదల సంక్షేమానికి వినియోగిస్తాం. యువత ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే మూడేళ్ల వరకూ ఎలాంటి ప్రభుత్వ అనుమతి అవసరం లేకుండా చేస్తాం’ అని పేర్కొన్నారు. తాను గత 60 రోజుల్లో 115 ర్యాలీల్లో పాల్గొన్నానని, దేశంలో భారీ మార్పు రాబోతోందని చెప్పారు. -
మహిళలకు 33 శాతం రిజర్వేషన్
హోషంగాబాద్: అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ తెలిపారు. లోక్‌సభ, రాజ్యసభతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో ఈ కోటాను అమలుచేస్తామని వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌లో ఉన్న పిపరియాలో నిర్వహించిన ర్యాలీలో రాహుల్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘దేశంలోని నిరుపేదలందరికీ న్యాయ్ పథకం కింద ఏటా రూ.72 వేలు అందజేస్తాం. ఈ మొత్తాన్ని మహిళల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తాం. ఈ పథకం మన ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజం చేస్తుంది. పెద్దనోట్ల రద్దు కారణంగా సామాన్యుల దగ్గర నగదు లేకుండా పోయింది. న్యాయ్ వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. తద్వారా ఆర్థిక వ్యవస్థలోకి నగదు ప్రవాహం జోరందుకుంటుంది’ అని పేర్కొన్నారు. 2014 తర్వాత దేశంలో బాంబు పేలుళ్లు విన్పించలేదన్న మోదీ వ్యాఖ్యలపై రాహుల్ ..‘పఠాన్‌కోట్, ఉడీ, పుల్వామా, గడ్చిరోలి.. గత ఐదేళ్లలో మొత్తం 942 ఉగ్రదాడులు జరిగాయి. చెవులు తెరిచి వింటే ఈ పేలుళ్లు విన్పిస్తాయి’ అని చురకలు అంటించారు. -
న్యాయ్‌తో ఆర్థిక వ్యవస్థ పరుగులు
బిలాస్పూర్/భిలాయ్: తాము అధికారంలోకి వస్తే అమలు చేసే ‘న్యాయ్’ పథకం ఆర్థిక వ్యవస్థను ఉత్తేజితం చేస్తుందని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ చెప్పారు. శనివారం ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్, ఉక్కునగరం భిలాయ్‌ల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్ పాల్గొన్నారు. ‘ఇంజిన్‌ను స్టార్ట్ చేయడంలో పెట్రోల్ ఉపయోగపడినట్లే ‘న్యాయ్’ అమలుతో ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుంది. ఉత్పత్తి యూనిట్లను పునరుద్ధరిస్తాం. దాంతోపాటే ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయి’ అని తెలిపారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి పేద మహిళ బ్యాంకు అకౌంట్లో ఏడాదికి రూ.72 వేలు జమ చేస్తామన్నారు. రైతులకు ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడంతోపాటు రైతులు డిమాండ్ చేసిన ప్రతిసారీ పంట రుణాలను మాఫీ చేస్తామన్నారు. గత ఎన్నికల్లో అచ్చేదిన్ నినాదం వినిపించగా ఈసారి కాపలాదారే దొంగ(చౌకీదార్ చోర్ హై)అని ప్రజలు అంటున్నారని ప్రధాని మోదీని ఉద్దేశించి పరోక్షంగా ఎద్దేవా చేశారు. ‘అమలు చేసేవైతేనే వాగ్దానం చేస్తా, మీరు ఎంతగా ఒత్తిడి తెచ్చినా రూ.15 లక్షలను మాత్రం మీ అకౌంట్లలో జమ చేయలేను’ అని బీజేపీ 2014 ఎన్నికల హామీని ఉద్దేశిస్తూ వ్యంగ్యంగా అన్నారు. -
నల్లధనం కోసం నోట్ల రద్దు
బాజీపుర(గుజరాత్): పాత రూ. 500, రూ. 1,000 నోట్లతో ఎక్కువ మొత్తం నల్లధనం సృష్టించేందుకు సాధ్యపడటం లేదు కాబట్టే ప్రధాని మోదీ అకస్మాత్తుగా నోట్ల రద్దు చేసి ఏకంగా రూ. 2,000 నోటును ప్రవేశపెట్టారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం ఆరోపించారు. రూ. 2 వేల నోటైతే భారీస్థాయిలో బ్లాక్‌మనీని ఎక్కువగా దాచేయొచ్చని మోదీ ఇలా చేశారని రాహుల్ అన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీని సక్రమంగా అమలు చేయకపోవడం వంటి మోదీ చర్య వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదనీ, తాము తేనున్న కనీస ఆదాయ భద్రత పథకం (న్యాయ్)తో ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకుంటుందని రాహుల్ చెప్పారు. గుజరాత్‌లోని బర్దోలీ జిల్లా బాజీపురలో రాహుల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. న్యాయ్ పథకం కింద తాము పేద కుటుంబాలకు ఏడాదికి రూ. 72 వేల ఆదాయం ఉండేలా చేస్తామనీ, దీంతో ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకుని దేశ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు. రైతులు బ్యాంకులకు అప్పులు చెల్లించకపోయినా వారు జైలుకు వెళ్లకుండా ఉండేలా తాము కొత్త చట్టం తెస్తామని రాహుల్ హామీనిచ్చారు. పంజాబ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌ల్లో తమ ప్రభుత్వాలు రైతు రుణమాఫీ చేశాయని ఆయన చెప్పారు. గురు, శుక్రవారాల్లో రాహుల్ గుజరాత్లో లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కర్ణాటకలోని రాయచూరులోనూ రాహుల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నరేంద్ర మోదీని పదవి నుంచి దింపేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారనీ, లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసేది తమ పార్టీయేనని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. ‘దేశాన్ని పటిష్టం చేయడం గురించి మోదీ మాట్లాడతారు. కానీ యువతకు ఉద్యోగాలు లేకపోతే దేశం పటిష్టం కాదు. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న వారంతా గెలుస్తారు. ఢిల్లీ నుంచి మోదీని ప్రజలు పంపిస్తారు’ అని అన్నారు. ఆచూకీ చెబితే లక్ష ఇస్తాం: సిబల్ అహ్మదాబాద్‌లో పాతనోట్లను అక్రమంగా మారుస్తున్నట్లుగా వచ్చిన వీడియోలో ఉన్న వ్యక్తి గుర్తింపు వివరాలు చెప్పినవారికి కాంగ్రెస్ లక్ష రూపాయల బహుమానం ఇస్తుందని ఆ పార్టీ నేత కపిల్ సిబల్ శుక్రవారం ప్రకటించారు. పాతనోట్ల మార్పిడికి గడువ ముగిశాక రూ. 5 కోట్ల పాత నోట్లను అహ్మదాబాద్‌లో మార్చి ఇస్తున్నట్లుగా గతంలో ఓ వీడియో బయటకు రావడం తెలిసిందే. -
మన్‌కీ బాత్’ మేనిఫెస్టో కాదు
సాక్షి ప్రతినిధి, చెన్నై / హోసూరు / తేని: కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోకు దేశవ్యాప్తంగా ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించిందని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ తెలిపారు. ఈ మేనిఫెస్టో సామాన్య ప్రజల గొంతుకగా నిలిచిందన్నారు. ప్రధాని మోదీ ‘మన్‌కీ బాత్’ రేడియో కార్యక్రమంపై ఈ సందర్భంగా రాహుల్ పరోక్ష విమర్శలు గుప్పించారు. తమ మేనిఫెస్టో అధికారం కోసం పరితపించే వ్యక్తి ‘మన్ కీ బాత్’ కాదనీ, అది జాతి నిర్మాణానికి సంబంధించినదని(కామ్ కీ బాత్) స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులో కాంగ్రెస్–డీఎంకే కూటమి తరఫున శుక్రవారం ప్రచారం నిర్వహించిన మోదీపై రాహుల్ విరుచుకుపడ్డారు. అబద్ధాలు చెప్పేందుకు రాలేదు.. దేశంలోని అత్యంత నిరుపేదలకు ఏటా రూ.72 వేలు ఇచ్చేందుకు ఉద్దేశించిన కనీస ఆదాయ భద్రత పథకం(న్యాయ్) విప్లవాత్మకమైనదని అభిప్రాయపడ్డారు. ‘మోదీ తీసుకున్న తప్పుడు ఆర్థిక నిర్ణయాల కారణంగా ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది. దీంతో అమ్మకాలు తగ్గి వస్తువులు ఫ్యాక్టరీలలోనే ఉండిపోయాయి. చివరికి ఉత్పత్తి ఆగిపోవడంతో నిరుద్యోగం పెరిగిపోయింది. దేశంలోని ప్రతీఒక్కరికి రూ.15 లక్షలు ఇస్తామని మోదీ అబద్ధం చెప్పారు. కానీ మేం రూ.15 లక్షలు ఇవ్వలేం. మీకు అబద్ధాలు చెప్పేందుకు నేనిక్కడకు రాలేదు. ఎందుకంటే రూ.15 లక్షలు ఇస్తే దేశ ఆర్థిక వ్యవస్థ నాశనమైపోతుంది. కానీ ‘న్యాయ్’ కింద పేదలకు ఐదేళ్లకు గానూ రూ.3.6 లక్షలు అందిస్తాం. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ పటిష్టం కావడంతో పాటు ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది’ అని రాహుల్ తెలిపారు. పెరియార్, కరుణ పుస్తకాలను పంపుతా.. తమిళనాడులో అధికార అన్నాడీఎంకే బీజేపీకి అనుబంధంగా మారిపోయిందని రాహుల్ దుయ్యబట్టారు. ‘ మోదీకి తమిళనాడు చరిత్ర గురించి ఏమాత్రం తెలియదు. తమిళ స్ఫూర్తి, తమిళ భాష ఆయనకు తెలియవు. కేంద్ర సాయం కోసం తమిళ రైతులు ఢిల్లీలో ధర్నా చేస్తే మోదీ పట్టించుకోలేదు. జీఎస్టీ వల్ల జౌళి పరిశ్రమకు పేరుగాంచిన తిరుప్పూర్, పట్టు పరిశ్రమకు కేరాఫ్‌గా మారిన కాంచీపురంలో వ్యాపారాలు దెబ్బతిన్నాయి. తమిళులు మాత్రమే తమ భవిష్యత్‌ను నిర్దేశించుకున్నట్లు చరిత్ర చెబుతోంది. తమిళనాడు గురించి అర్థం చేసుకునేందుకు మోదీకి నేను ప్రముఖ హేతువాది పెరియార్(ఈవీ రామస్వామి)తో పాటు తమిళనాడు మాజీ సీఎం, దివంగత కరుణానిధికి సంబంధించిన పుస్తకాలను పంపుతాను’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్–డీఎంకే కూటమి ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
కనీస ఆదాయంతో రైతుకు భరోసా
దేశంలోని సగటు రైతు ఆదాయం ఏడాదికి రూ. 20,000 కంటే తక్కువగానే ఉందని ఎకనమిక్ సర్వే–2016 తేల్చిచెప్పింది. అదే సమయంలో సుప్రీంకోర్టు అధికారులకు రూ.21 వేలు వాషింగ్ అలవెన్స్ ఇస్తూ మాకు రూ. 20 వేలు మాత్రమే ఇస్తున్నారెందుకని రక్షణ బలగాలు కోర్టులో జగడమాడటం వార్తలకెక్కింది. సగం దేశంలో సగటు వ్యవసాయ కుటుంబం ఆదాయం.. ప్రభుత్వోద్యోగులకు ఇస్తున్న మొత్తం 108 రకాల అలవెన్సులలో ఒకే ఒక్క అలవెన్సుకు సమానంగా ఉంటూండటం చూస్తే, మన దేశంలో ఆదాయాల మధ్య వ్యత్యాసం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. రైతుల జీవితంలో మృత్యుతాండవానికి వారి పంటలకు సరైన ధరలు లేకపోవడమే కారణం. భారతదేశంలోని 17 రాష్ట్రాల్లో అంటే దాదాపు సగం దేశంలో సగటు రైతు ఆదాయం సంవత్సరానికి రూ.20,000 కంటే తక్కువగానే ఉందని ఎకనమిక్ సర్వే–2016 దిగ్భ్రాంతికరమైన వాస్తవాన్ని వెల్ల డిం చిన తర్వాత సుప్రీంకోర్టు అధికారులకు, రక్షణ బలగాలకు మధ్య వాషింగ్ అలవెన్స్‌పై కొనసాగుతున్న జగడం గురించి ఒక వార్తాపత్రిక మరింత ఆశ్చర్యకరమైన వార్తను నివేదించింది. సుప్రీంకోర్టు అధికారులకు బట్టలు ఉతుక్కోవడానికి రూ.21,000 అలవెన్స్‌ని ఇన్కమ్ ప్యాకేజీలో భాగంగా అందిస్తూండగా తమకెందుకు రూ. 20,000 మాత్రమే ఇస్తున్నారని రక్షణ రంగ ఉద్యోగులు ప్రశ్నించారని ఆ వార్త సారాంశం. రైతులు బట్టలు ఉతుక్కోరా? దాదాపు సగం దేశంలో సగటు వ్యవసాయ కుటుంబం ఆదాయం 7వ పే కమిషన్‌లో భాగంగా ప్రభుత్వోద్యోగులకు ఇస్తున్న మొత్తం 108 రకాల అలవెన్సులలో ఒకే ఒక్క అలవెన్సుకు సమానంగా ఉంటోందని గమనిం చినట్లయితే, మన దేశంలో ఆదాయాల మధ్య వ్యత్యాసం ఎంత తీవ్రస్థాయిలో ఉందో అర్థమవుతుంది. వ్యవసాయ ఆదాయం సగటున ఏడాదికి రూ. 20,000 మాత్రమే అంటే నెలకు రూ.1,700 అన్నమాట. గత 70 ఏళ్లుగా దేశ రైతులను ఎంత దారిద్య్రంలో ముంచెత్తుతున్నారో చూస్తే రగిలిపోతుంది. 2018 అక్టోబర్–డిసెంబర్ మాసాల్లో వ్యవసాయంలో స్థూల విలువ గత 14 ఏళ్లల్లో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయికి దిగజారిపోయిందని కేంద్ర గణాంకాల కార్యాలయం తన తాజా వ్యవసాయ అభివృద్ధి అంచనాల్లో తేల్చి చెప్పింది. కానీ ఈ వాస్తవం సైతం జాతి చైతన్యాన్ని కుదపలేకపోయింది. జాతీయవాదంపై చర్చనుంచి దేశం కాస్త దృష్టిని మరలించినప్పటికీ వ్యవసాయరంగ రాబడులలో ఇంత భారీ పతనం విధానపరంగా కాస్తయినా స్పందనను రేపుతుందంటే నాకు సందేహమే మరి. వాస్తవానికి వ్యవసాయరంగ దుస్థితి, సంవత్సరాలుగా ఉద్దేశపూర్వకంగా దాన్ని క్షీణింపజేస్తున్న విధానాలను సరైనవే అని అందరినీ నమ్మించే పరిస్థితులు ఉన్నాయేమో అనిపిస్తోంది. సరైన గిట్టుబాటు ధరలు అందించని కారణంగా 2000 నుంచి 2017 వరకు దేశ రైతులు రూ. 45 లక్షల కోట్ల వరకు నష్టపోయారని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ పేర్కొంది. 2011 నుంచి 2015 వరకు అయిదేళ్ల కాలంలో రైతుల నిజ ఆదాయాలు ఏటా అర్ధ శాతం కంటే తక్కువగా మాత్రమే పెరుగుతూ వచ్చాయని నీతి ఆయోగ్ అంచనా. గత రెండేళ్లుగా రైతుల ఆదాయం సున్నాకు సమానంగా ఉంటున్న దారుణ వాస్తవాన్ని గమనించిన తర్వాతే దేశంలోని చిన్న రైతులకు ప్రతి ఏటా రూ. 6,000 నగదును నేరుగా వారి ఖాతాలకు బదిలీ చేసే విధంగా ప్రత్యక్ష నగదు సహాయ పథకాన్ని అందించడానికి కేంద్రం తప్పనిసరి పరిస్థితుల్లో పూనుకుందని గమనిం చాలి. గత 12 నెలల్లోనే దేశంలో 56.6 లక్షల మంది ఉపాధి కోల్పోయారని సీఎమ్ఐఈ అధ్యయనం పేర్కొంది. వీరిలో 82 శాతం మంది లేక 46 లక్షల మంది గ్రామీణ ప్రాంతాలకు చెందినవారే. ఇంత బీభత్సం నెలకొన్నా గ్రామీణ భారతం కనీవినీ ఎరుగని దుస్థితి నుంచి ఎలాగోలా బతికి బట్టకడుతోందంటే ఒకరకంగా అద్భుతమే అని చెప్పాలి. ఇంత భారీ నష్టాలకు దేశంలో ఏ ఇతర రంగమైనా గురై ఉంటే కుప్పకూలిపోవడమే కాదు ఆర్థిక దిజ్ఞ్మండలం నుంచి అదృశ్యమైపోయేదంటే అతిశయోక్తి కాదు. గత 20 ఏళ్ల నుంచే కాదు.. అంతకుముందు కూడా వ్యవసాయ రంగం కునారిల్లిపోతూ వస్తోంది. గత నాలుగు దశాబ్దాలుగా వ్యవసాయ రాబడులు స్తంభించిపోయాయి. నలభై ఏళ్లుగా వ్యవసాయ కుటుంబాలు ఎలా మనగలుగుతూ వచ్చాయన్నది ఆలోచించడానికే నాకు భయమేస్తుంది. అమెరికన్ రైతు మైక్ కల్లిక్రేట్ ప్రకారం, 44 ఏళ్ల క్రితం 1974లో తన తండ్రి ఒక బుషెల్ (25.40 కేజీలకు సమానం) మొక్కజొన్నను 3.58 డాలర్లకు అమ్మారట. 2018లో మైక్ అదే మొక్కజొన్న బుషెల్ని 3.56 డాలర్లకు అమ్మారు. అంటే 44 ఏళ్ల క్రితం తన తండ్రి అమ్మినదానికంటే రెండు సెంట్లు తక్కువ అన్నమాట. అధికోత్పత్తి అనేది వ్యవసాయ మార్కెట్లలో ధరలను అమాంతంగా క్షీణింప జేస్తోంది. దీంతో రైతులు రుణ ఊబిలో చిక్కుకుపోతున్నారు. ’’అప్పులతోటే పుట్టడం, అప్పులతోటే జీవించడం.. వాస్తవానికి నరకంలో గడుపుతున్నట్లే ఉంటుంద’’ని బ్రస్సెల్ సమీపంలోని లెషోన్నెల్స్ గ్రామానికి చెందిన 93 ఏళ్ల రైతు డెక్లెర్క్ గిల్బర్ట్ గత సంవత్సరం నాతో స్వయంగా అన్నమాటలు ఇప్పటికీ గుర్తున్నాయి. గత యాభై ఏళ్లుగా వ్యవసాయరంగ రాబడులు ఎలా స్తబ్దుగా ఉండిపోయాయో అర్థం చేసుకోవడానికి కనీస మద్దతు ధర వృద్ధిని, వివిధ రంగాల్లోని ఉద్యోగుల మూలవేతనంతో సరిపోల్చి చూశాను. ఇన్నేళ్లుగా రైతులు తమకు రావలసిన న్యాయమైన ధరల విషయంలో ఎంత తిరస్కరణకు గురవుతున్నారో దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. 1970లో, క్వింటాల్ గోధుమ ధరకు కనీస మద్దతు ధర రూ. 76లు ఉండేది. 45 ఏళ్ల తర్వాత అంటే 2015లో క్వింటాల్ గోధుమ కనీస మద్దతు ధర రూ. 1,450లకు చేరింది. అంటే 19 రెట్లు పెరిగింది. ఇదే కాలంలో దేశంలోని వివిధ రంగాల ఉద్యోగుల మూలవేతనం ప్లస్ డీఏ (ఇతర అలవెన్సులు కలపకుండానే) ఎంత పెరిగిందో అంచనా వేశాను. ఇది ప్రభుత్వోద్యోగులకు 120 నుంచి 150 రెట్లు పెరిగింది. కాలేజీ, యూనివర్సిటీ లెక్చరర్, ప్రొఫెసర్లకు 150 నుంచి 170 రెట్లు పెరిగింది. పాఠశాల ఉపాధ్యాయులకు 280 నుంచి 320 రెట్లు పెరిగింది. గత 45 ఏళ్లలో గోధుమ కనీస మద్దతు ధర వంద రెట్లు పెరిగి ఉంటుందని భావించినట్లయితే రైతులు క్వింటాల్ గోధుమకు కనీసం రూ. 7,600 పొందగలిగేవారు. కానీ 2015 లో గోధుమ రైతులు క్వింటాల్ గోధుమలకు పొందిన కనీస మద్దతు ధర రూ.1,450లు మాత్రమే. అంటే ఆహార ధరలను తక్కువగా ఉంచుతూరావడం వల్ల కలిగే భారాన్ని మొత్తంగా రైతులపైనే మోపుతున్నారు. గోధుమలు మాత్రమే కాదు. టమాటా, బంగాళదుంపలు, ఉల్లిపాయలను మన రైతులు గిట్టుబాటు ధరలు లేక వీధుల్లో విసిరిపోస్తుండటం తరచుగా జరుగుతోంది. పంట చేతికొచ్చాక గత మూడేళ్లుగా మండీల్లో వీటి ధరలు 25 నుంచి 40 శాతం వరకు పడిపోతూండటమే దీనికి కారణం. అదే సమయంలో గోధుమలు, వరి, మొక్కజొన్న వంటి ప్రధాన పంటల ఉత్పత్తి ఖర్చులకు, వాటి రాబడులకు మధ్య వ్యత్యాసం భారీగా పెరిగిపోతోంది. రైతుల మెడలు ఉరితాళ్లకు వేలాడుతున్నాయంటే ఇదే కారణం. పైగా దేశవ్యాప్తంగా ఇంతవరకూ 6 శాతం మంది రైతులు మాత్రమే కనీస మద్దతు ధర ప్రయోజనాలను పొందగలిగారని శాంతకుమార్ కమిటీ తేల్చిచెప్పింది. ఇక సూక్ష్మ ఆర్థిక విధానంలో భాగంగా వ్యవసాయ ధరలను అత్యంత తక్కువ స్థాయిలో కొనసాగిస్తారు. చాలా సందర్భాల్లో ఇది రైతుల ఉత్పత్తి ఖర్చుకుంటే తక్కువగానే ఉంటుంది. అంటే రైతులు పంటలను పండిస్తున్నారంటే వాస్తవానికి వారు తమకు కలగబోయే నష్టాలను పండిస్తున్నట్లు లెక్క. ఎలాంటి పంటలు పండించినా, ఏ టెక్నాలజీని వాడినా సరే వ్యవసాయరంగాన్ని రైతులకు వ్యతిరేకంగా మలుస్తుండటం పరిపాటి అయింది. రైతులకు వారి న్యాయమైన ఆదాయాన్ని తిరస్కరించడం అనేది వ్యవసాయ సమాజంపై తీవ్ర ప్రభావం కలిగిస్తోంది. మహారాష్ట్రలోని యావత్మాల్ గ్రామంలోని సన్నకారు రైతు కుమారుడు గోపాల్ బాబూరావ్ రాథోడ్ అనే 22 ఏళ్ల పట్టభద్ర విద్యార్థి రెండేళ్లక్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. నగరాల్లోని తోటి సహచర యువతలాగే గ్రామీణ యువతకు కూడా భవిష్యత్తుపై ఆశలూ, ఆకాంక్షలూ ఉంటాయని చెబుతూ ఆత్మహత్యకు ముందు నోట్ రాశాడు. ‘మనదేశంలో ఒక టీచర్ కుమారుడు సులువుగా లక్ష రూపాయల ఫీజు చెల్లించి ఇంజనీరు అవుతున్నాడు. కానీ రైతు బిడ్డ అంత మొత్తం ఫీజు ఎలా కట్టగలడో ఎవరైనా చెప్పగలరా?’ అంటూ మరో కీలకమైన ప్రశ్నను సంధించాడు. ‘రైతులు తమ ఉత్పత్తికి తగిన పరిహారాన్ని అడిగితే ప్రభుత్వాలు తిరస్కరిస్తున్నప్పుడు వేతనాలు పొందుతున్న ఉద్యోగులు ఆ అన్యాయాన్ని కనీసం ప్రశ్నించకుండానే డీఏలు (డియర్నెస్ అలవెన్స్) ఎలా తీసుకుంటారు?’ ఈ ప్రశ్నను దాటి చూస్తే 1995 నుంచి 2015 వరకు 20 ఏళ్లలో దేశవ్యాప్తంగా 3,18,528 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మన రైతు జీవితాల్లో చోటు చేసుకుంటున్న ఈ సీరియల్ మృత్యు తాండవానికి ప్రధాన కారణం రుణభారమే. దేశంలో 6 శాతం రైతులు మాత్రమే కనీస మద్దతు ధర పొందుతూ మిగిలిన 94 శాతం రైతులు దోపిడీ మార్కెట్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ధాన్య సేకరణ వ్యవస్థను బలోపేతం చేయడం చాలా అవసరం. రైతులు మార్కెట్లకు ఎంత అదనపు పంటను తీసుకొచ్చినా సరే.. ప్రభుత్వం ప్రకటించిన ధరకు మొత్తం పంటను కొనుగోలు చేసే వ్యవస్థ రావాలి. ప్రధానమంత్రి ఆశా పథకం దీనికి హామీ ఇచ్చినా అమలు విషయంలో విఫలమైంది. మార్కెట్ మౌలికవసతులు తగినంతగా ఏర్పర్చలేకపోతే ఎలాంటి అర్థవంతమైన సంస్కరణలు కూడా వ్యవసాయాన్ని గట్టెక్కించలేవు. అదే సమయంలో పబ్లిక్ సెక్టార్‌ను పక్కకు తోసివేసి ప్రైవేట్ కంపెనీలను వాటి స్థానంలో భర్తీ చేస్తే ప్రతి ప్రభుత్వ సంస్కరణ పరాజయం పాలుకాక తప్పదు. తెలంగాణలో రైతుబంధు, ఒడిశాలో కాలియా స్కీమ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, కర్ణాటక, ఏపీ వంటి రాష్ట్రాల్లో రైతులకు ప్రత్యక్ష నగదు పథకాలు ప్రవేశపెట్టడం గణనీయమైన మార్పు. రాబోయే సంవత్సరాల్లో ఇది రైతుకు స్వావలంబనను చేకూరుస్తుంది. ఇది జాతీయ పథకంగా మారి సార్వత్రికంగా అమలైనప్పుడు రైతుల ఆదాయానికి కనీస హామీ ఉంటుంది. ఏడాదికి కనీసం రూ. 18,000లను రైతు కుటుంబానికి అందించగలిగితే రైతుల జీవితంలో కొత్త మార్పుకు నాంది పలికినట్లే అవుతుంది. వ్యాసకర్త : దేవిందర్‌శర్మ, వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
బీజేపీకి ఓటమి భయం
దియోబంద్(సహరాన్పూర్): బీజేపీకి భయంతో వణికిపోతోందని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి పరాజయం తప్పదని బీఎస్పీ అధినేత్రి మాయావతి విమర్శించారు. తమ కూటమి గెలవడం ఇష్టంలేని కాంగ్రెస్ ఓట్లు చీల్చడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. విద్వేష పూరిత విధానాలు, ముఖ్యంగా చౌకీదార్(మోదీ) ప్రచారం తీరుతో ఆ పార్టీ ఓడిపోవడం ఖాయమన్నారు. ఎస్పీ– బీఎస్పీ– ఆర్ఎల్డీ పార్టీల మహాకూటమి తొలి ఎన్నికల సభలో మాయావతి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్, ఆర్ఎల్డీ చీఫ్ అజిత్ సింగ్ ప్రసంగించారు. న్యాయ్ సరైన పరిష్కారం కాదు ఈ సందర్భంగా మాయావతి.. ‘రోడ్డు షోలు, గంగ, యమున నదుల్లో పవిత్ర స్నానాలు, సినీ తారలకు టికెట్లు.. వంటివి కాంగ్రెస్, బీజేపీలకు ఎన్నికల్లో గెలుపు వ్యూహాలు. బీజేపీకి గట్టి పోటీ ఇచ్చే సత్తా కాంగ్రెస్‌కు లేదు. మహాకూటమి మాత్రమే బీజేపీని ఎదుర్కోగలదు. గతంలో ఇందిరాగాంధీ పేదరిక నిర్మూలన కోసమంటూ పథకాన్ని ప్రవేశపెట్టారు. అది ఫలితం చూపిందా? పేదరికాన్ని రూపుమాపడానికి న్యాయ్ సరైన పరిష్కారం కాదు’ అని తెలిపారు. చౌకీదార్లను తొలగిస్తాం: ‘కోట్ల ఉద్యోగాలు ఇస్తామన చాయ్‌వాలా(టీ కొట్టు వ్యాపారి)ను 2014లో నమ్మాం. ఇప్పుడు చౌకీదార్‌ను నమ్మమంటున్నారు. ఈ చౌకీదార్ల(వాచ్మెన్)ను వాళ్ల చౌకీ(కాపలా పోస్ట్)ల నుంచి తొలగిస్తాం’ అని ర్యాలీలో అఖిలేశ్ ప్రకటించారు. తమ గఠ్ బంధన్(కూటమి) అవినీతిపరుల కూటమి కాదు, మహాపరివర్తన్(పూర్తిమార్పు) అని తెలిపారు. తనను తాను ఫకీర్(సన్యాసి)అని మోదీ చెప్పుకుంటుంటారు. హామీల అమల్లో విఫలమైతే నేను ఫకీర్‌ను వెళ్లిపోతున్నా అంటారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఉంచుదామా? వెళ్లగొడదామా? అని అఖిలేశ్ ప్రశ్నించారు. అచ్చేదిన్ (మంచి రోజు) అంటే మోదీ ఉద్దేశం తన గురించే తప్ప, ప్రజలకు వచ్చే మంచి రోజుల గురించి కాదని అజిత్ సింగ్ ఎద్దేవా చేశారు. -
మనసులు గెలుద్దాం
న్యూఢిల్లీ: ప్రజల మనసులు గెలుచుకోవడమే ధ్యేయంగా ‘అబ్ హోగా న్యాయ్’ అనే నినాదంతో లోక్‌సభ ఎన్నికలకు వెళ్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. న్యాయ్ అనే పదం పార్టీ అధ్యక్షుడు రాహుల్ ప్రకటించిన కనీస ఆదాయ పథకంతో పాటు అన్ని వర్గాలకు దక్కాల్సిన న్యాయాన్ని సూచిస్తుందని సీనియర్ నాయకుడు ఆనంద్ శర్మ ఆదివారం చెప్పారు. కాంగ్రెస్ ప్రధాన ప్రచార గీతం ‘మై హీ తో హిందుస్తాన్ హూ’ను జావెద్ అక్తర్ రచించారు. ప్రచార చిత్రానికి నిఖిల్ అడ్వానీ దర్శకత్వం వహించారు. సినిమాటోగ్రఫీని తుషార్ కాంతి రే, స్క్రిప్టును అనుజా చౌహాన్ అందించారు. అర్జునా హర్జాయ్ స్వరాలు సమకూర్చారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ప్రచార కమిటీ సభ్యులు తదితరులు చర్చించి ప్రచార వ్యూహాన్ని ఖరారు చేశారని ఆనంద్ శర్మ తెలిపారు. మేనిఫెస్టోలో ప్రతిపాదించిన న్యాయ్ పథకం, పేదరిక నిర్మూలన, ఉద్యోగ కల్పన, రైతులు, మహిళా రిజర్వేషన్, సులభతర జీఎస్టీ, సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ, విద్య తదితరాలే ఇతివృత్తంగా ప్రచార గీతం సాగుతుందని వెల్లడించారు. హిందీతో పాటు మరాఠీ, బెంగాలీ, గుజరాతీ, అస్సామీ, మలయాళం భాషల్లో ఈ గీతాన్ని రూపొందించామని తెలిపారు. అన్ని రకాల మాధ్యమాల్లోనూ ప్రచారం టెలివిజన్, రేడియో, సినిమా థియేటర్లు, హోర్డింగ్‌లు, డిజిటల్ తెరలు, ప్రింట్ అడ్వర్టైజ్మెంట్లు, సోషల్ మీడియా, రవాణా వాహనాలు..ఇలా అన్ని రకాల విధానాల్లో, అన్ని మాధ్యమాల్లో ప్రచారం నిర్వహిస్తామని ఆనంద్ శర్మ తెలిపారు. కాంగ్రెస్ సందేశాన్ని దేశవ్యాప్తంగా ప్రజలకు చేరువ చేసేందుకు వేలాది కంటైనర్ ట్రక్కులు ఆదివారమే బయల్దేరాయని, తమ ప్రచారంలో ఈ ప్రయోగం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ఆనంద్ శర్మ పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వ విధానాలు, హామీలను విమర్శిస్తూ కూడా కాంగ్రెస్ కొన్ని వీడియోలు విడుదల చేసింది. కాంగ్రెస్ వారసత్వం, గతంలో ఆ పార్టీ సాధించిన ఘనతల్ని వివరిస్తూ అందులో ఓ వీడియో ఉంది. ప్రజలు ఫోన్లో మాట్లాడాలంటేనే జంకుతున్నారని, దేశంలో అలాంటి భీతావహ వాతావరణం ఉందని ఆనంద్ శర్మ తెలిపారు. ధనబలంతోనే 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, అధికార పార్టీకి ఉన్నంత డబ్బు కాంగ్రెస్ పార్టీ లేదని, సత్యంతో, ప్రజలకు చేరవై కాషాయ పార్టీని ఓడిస్తామని ఆనంద్ శర్మ అన్నారు. దేశభక్తి గురించి మాట్లడే హక్కు ఒక్క ప్రధాని మోదీకే లేదని, దేశం కోసమే కాంగ్రెస్ ఇద్దరు ప్రధానులను కోల్పోయిందని గుర్తుచేశారు. -
న్యాయ్‌పై అనుమానమెందుకు?
శ్రీనగర్ (ఉత్తరాఖండ్): బడావ్యాపారవేత్తలు నీరవ్‌మోదీ, మెహుల్ చోక్సీలాంటి వారి జేబులు నింపడానికి సందేహించని బీజేపీకి, న్యాయ్ పథకం అమలుపై అనుమానాలెందుకని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఎత్తిపొడిచారు. ఉత్తరాఖండ్‌లో జరిగిన పార్టీ ఎన్నికల ర్యాలీల్లో ఆయన మాట్లాడారు. ‘మీ(ప్రజలు) నుంచి తీసుకున్న డబ్బును ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, అనిల్ అంబానీ లాంటి వారికి ప్రధాని మోదీ ఇచ్చేశారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడే న్యాయ్ పథకం అమలుకు డబ్బు ఎక్కడి నుంచి తెస్తారంటూ అడుగుతున్నారు’ అని తెలిపారు. ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి దుష్ప్రభావం పడకుండానే ఈ పథకాన్ని అమలు చేయవచ్చంటూ ఆర్థిక వేత్తలు చెప్పారని ఆయన అన్నారు. దాదాపు 25 కోట్ల మంది నిరుపేద ప్రజలకు ఐదేళ్లలో ఏడాదికి రూ.72 వేల చొప్పున అందించేందుకు రూ.3.6 లక్షల కోట్ల మేర అవసరమవుతాయని ఆయన తెలిపారు. 2014 ఎన్నికల్లో రైతులు, యువతకు ఇచ్చిన హామీలను బీజేపీ ప్రభుత్వం విస్మరించిందన్నారు. -
‘న్యాయ్’ భారం మీపై వేయం
పుణే: కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ అన్నారు. తాము ప్రకటించిన ‘న్యాయ్’ పథకం నిధుల కోసం మధ్యతరగతిపై పన్ను భారం వేస్తారంటూ వస్తున్న అనుమానాలను ఆయన కొట్టిపారేశారు. ఆర్జే మలిష్క, నటుడు సుబోధ్ సమన్వయకర్తలుగా పుణేలో విద్యార్థులతో జరిగిన ముఖాముఖిలో రాహుల్ మాట్లాడారు. దేశంలోని 25 కోట్ల మంది నిరుపేద ప్రజల ఖాతాల్లో ఏడాదికి రూ.72 వేలు చొప్పున జమ చేస్తామనీ, న్యాయ్‌కు కావాల్సిన నిధుల కోసం మధ్యతరగతి వారిపై భారం వేయం.. ఆదాయ పన్ను పెంచబోమన్నారు. ప్రధాని మోదీపై ప్రేముంది. కానీ.. ప్రధాని మోదీపై అభిమానం ఉంది. నిజంగా, ఆయనపై నాకు ఎలాంటి ద్వేషం, కోపం లేదు. కానీ, ఆయన నాపై కోపంగా ఉన్నారు. నోట్లరద్దు ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. ప్రణాళిక సంఘం వ్యూహరచన సంస్థగా పనిచేయగా ప్రస్తుతమున్న నీతి ఆయోగ్ అమలు, ఎత్తుగడలపైనే మాట్లాడుతోంది. అధికారంలోకి వస్తే విద్య, ఆరోగ్య వ్యవస్థల బలోపేతంపై దృష్టి పెడతాం. బాలాకోట్‌పై దాడి ఐఏఎఫ్ ఘనత మాత్రమే. ఈ విషయాన్ని ప్రధాని మోదీ రాజకీయం చేయడం నాకు నచ్చలేదు. నన్ను ఇబ్బందిపెట్టే ప్రశ్నలు కూడా అడగాలని మిమ్మల్ని కోరుతున్నా. ఆత్మ విమర్శ చేసుకుని, జవాబు వెతకడానికి ప్రయత్నిస్తా. ప్రియాంక మంచి స్నేహితురాలు ‘చెల్లి ప్రియాంక నాకు మంచి స్నేహితురాలు. ఇంతకుముందు కొట్లాడుకునేవాళ్లం. రాఖీ పండుగరోజు ప్రియాంక కట్టే రాఖీని దానంతట అది తెగిపోయే దాకా అలాగే చేతికి ఉంచుకుంటా. తీసేయను’ అని అన్నారు. చిన్నతనంలోనే ఉగ్రవాదుల చేతుల్లో దారుణ హత్యకు గురైన నానమ్మ(ఇందిరాగాంధీ), తండ్రి(రాజీవ్‌గాంధీ)ని రాహుల్ గుర్తుచేసుకున్నారు. ‘అప్పట్లో నానమ్మ ఆఫీసు రూంలో కర్టెన్ల వెనక దాక్కొని ఆమె లోపలికి రాగానే భయపెట్టే వాడిని’ అని ఇందిరతో అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. అల్లావుద్దీన్ కథల్లో ఉండే భూతం ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటారని అడగ్గా ‘నేను ప్రేమించే ప్రజంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటా’ అని బదులిచ్చారు. 60 ఏళ్లు నిండిన రాజకీయ నేతలను రిటైర్ కావాలని కోరడం సబబు కాదన్నారు. నాకు పెళ్లయింది రాహుల్‌పై బయోపిక్ తీయాలనుకుంటున్నాననీ, ఇందు లో హీరోయిన్ ఎవరై ఉంటే బాగుం టుందని భావిస్తున్నారని సుబోధ్ ప్రశ్నించగా ‘దురదృష్టకరం ఏంటంటే, ఇప్పటికే నాకు నా బాధ్యతలతో పెళ్లయిపోయింది’ అంటూ రాహుల్ చమత్కరించారు. (లోకమాన్య తిలక్, బాల్ గంగాధర్ వంటి బయోపిక్‌లలో సుబోధ్ నటించారు) -
ఎన్నికల నిబంధనల్ని రాజీవ్ ఉల్లంఘించారు
న్యూఢిల్లీ: ‘న్యాయ్’ పథకంపై చేసిన విమర్శలకు నీతిఆయోగ్ వైస్‌చైర్మన్ రాజీవ్‌కుమార్ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) తెలిపింది. రాజీవ్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని తెలిపింది. భవిష్యత్‌లో ఇలాంటి అంశాలపై ఆచితూచి స్పందించాలని సూచించింది. ప్రభుత్వ అధికారులు నిష్పాక్షికంగా ఉండాలనీ, అది వారి ప్రవర్తనలో కన్పించాలని వ్యాఖ్యానించింది. రాజీవ్ విషయంలో అది కొరవడిందని చురకలు అంటించింది. నిరుపేద కుటుంబాలకు కనీస ఆదాయ భద్రత(న్యాయ్) కింద ఏటా రూ.72 వేలు అందిస్తామని కాంగ్రెస్ ప్రకటించడం తెల్సిందే. ఇలాంటి పథకాల వల్ల ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతింటుందన్న కుమార్ వ్యాఖ్యలపై ఈసీ పైవిధంగా స్పందించింది. యోగికి ఈసీ మందలింపు భారత సైన్యం మోదీ సేనగా పేర్కొన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ఈసీ మందలించింది. భవిష్యత్తులో అలాంటి వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ ఎలాంటి శిక్ష విధించకుండానే వదిలిపెట్టినట్లు తెలిసింది. సీనియర్ నేత అయిన యోగి మాటలు ఆయన హోదాను ప్రతిబింబించేలా ఉండాలంది. ఆదివారం ఘజియాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో యోగి మాట్లాడుతూ ‘ కాంగ్రెస్ నాయకులు ఉగ్రవాదులకు బిర్యానీ తినిపిస్తారు. కానీ మోదీ సైన్యం తూటాలు, బాంబులతో బదులిస్తుంది’ అని వ్యాఖ్యానించడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. -
కాంగ్రెస్ హామీలకు ఏటా అయ్యే ఖర్చెంత?
కాంగ్రెస్ పార్టీ మంగళవారం విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో కనీస ఆదాయ పథకం నుంచి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, రైతులకు ప్రత్యేక బడ్జెట్,ఆరోగ్య సంరక్షణ వరకు అనేక హామీలు ఇచ్చింది.అయితే, ఈ హామీల అమలుకు ఏటా పది లక్షల కోట్ల రూపాయలు కావలసి ఉంటుందని, అది దేశ ఆర్థిక వ్యవస్థనే కుదేలు పరుస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ► కనీస ఆదాయ పథకం (న్యాయ్) ఈ పథకం కింద దేశవ్యాప్తంగా ఉన్న 20శాతం నిరుపేద కుటుంబాలకు ఏటా 72వేల చొప్పున ఇవ్వాలి.అయితే, దీన్ని యథాతథంగా అమలు చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థే తల్లకిందులవుతుందని నిపుణులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.కనీస ఆదాయ పథకం కోసం ఏటా 3.60 లక్షల కోట్లు కావాలి. మొదటి సంవత్సరం దీనికయ్యే ఖర్చు దేశ జీడీపీలో దాదాపు 1శాతం ఉంటుంది. రెండో ఏడాది అది 1.5శాతానికి పెరుగుతుంది. ► జీడీపీలో 6శాతం విద్యకే కావాలి విద్యారంగం వ్యయాన్ని పెంచడం మంచిదే.ఈ సొమ్ములో అధికభాగం మౌలిక సదుపాయాలు, టీచర్లకు వేతనాల కోసం వెచ్చించాల్సి ఉంటుంది.ప్రస్తుతం ప్రభుత్వం జీడీపీలో 4.6శాతాన్ని విద్యకోసం వెచ్చిస్తోందని హెచ్ఆర్డీ మంత్రి ప్రకాశ్‌జవదేకర్ చెబుతున్నారు. ఇది 8.76 లక్షల కోట్లకు సమానం.కాంగ్రెస్ తాజా హామీ అమలు పరచాలంటే అదనంగా ఏటా మరో 2.66 లక్షల కోట్లు అవసరం.అంటే, ఏటా మొత్తం 11.4 లక్షల కోట్ల రూపాయలు కావాలన్నమాట. ► ఆరోగ్య సంరక్షణకు 5 లక్షల కోట్లు 2023–24నాటికి ఆరోగ్య సంరక్షణ కోసం జీడీపీలో 3శాతం వరకు వెచ్చించనున్నట్టు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొంది. ప్రస్తుత వ్యయం కంటే ఇది రెండింతలు ఎక్కువ.నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం ప్రస్తుతం ఆరోగ్యంపై ఏటా 2.47 లక్షల కోట్లు (జీడీపీలో1.3శాతం) ఖర్చు చేస్తున్నారు. పౌరులందరికీ ఉచితంగా ఆరోగ్య సంరక్షణ కల్పించడం, వైద్య సదుపాయాలను మెరుగుపరచడం వంటి రాహుల్ గాంధీ హామీలను అమలు పరచాలంటే ఏటా 5.71లక్షల కోట్లు అవుతుంది. మొత్తం మీద కాంగ్రెస్ ఎన్నికల హామీలు వార్షిక బడ్జెట్‌పై 10 లక్షల కోట్ల అదనపు భారాన్ని వేస్తాయి. 2019–20 సంవత్సరంలో బడ్జెట్ వ్యయం 27.84 లక్షల కోట్లు మాత్రమే. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే రాహుల్ హామీలు ఎంత భారమో అర్థమవుతుంది. ప్రభుత్వ ఆదాయం ఏటా 12 నుంచి 14శాతం పెరుగుతోంది. 2018–19లో 24.57 లక్షల కోట్లు ఉన్న ఆదాయం 2023–24 నాటికి 45 లక్షల కోట్లకు పెరుగుతుంది. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అయితే, హామీల అమలుకు ఏటా 10లక్షల కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. ఇప్పటికే సిబ్బంది వేతనాలు, వడ్డీల చెల్లింపులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, సామాజిక పథకాల వ్యయం మొదలయిన వాటికి అయ్యే ఖర్చు ఆదాయానికి మించిపోతోంది. ఇలాంట పరిస్థితుల్లో ఏటా అదనంగా పది లక్షల కోట్లు భరించడం భారమేనని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సర్కారీ కొలువుల భర్తీ భారం 8వేల కోట్లకుపైనే.. 2020 మార్చి నాటికి 4 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, రాష్ట్రాలు మరో 20 లక్షల ఖాళీలు భర్తీ చేసేలా చూస్తామని కాంగ్రెస్ మానిఫెస్టో హామీ ఇచ్చింది.7వ వేతన సంఘం సిఫారసు ప్రకారం ఉద్యోగి కనీస వేతనం 18వేలు. అంటే ఏడాదికి 2.16లక్షలు. రాహుల్ చెప్పినట్టు 4లక్షల మందిని నియమిస్తే వారికి కనీస వేతనం లెక్కన చూసినా ఏడాదికి 8,640 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది.రాష్ట్రాలు కూడా మరో 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తే ఈ భారం తడిసిమోపెడవుతుంది. -
‘న్యాయ్’కు నిధులు దొంగ వ్యాపారుల నుంచే..
బొకాఖత్/లఖింపూర్(అస్సాం): ‘న్యాయ్’పథకానికి అవసరమైన నిధులను ప్రధాని మోదీకి సన్నిహితులైన దొంగ వ్యాపారవేత్తల నుంచి రాబడతామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ తెలిపారు. బుధవారం ఆయన అస్సాంలోని బొకాఖత్, లఖింపూర్ ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడారు. ‘ప్రజల అకౌంట్లలో డబ్బు జమ చేస్తామంటూ మోదీ ఇచ్చిన హామీ ..అంబానీల వంటి కొందరు ధనిక వ్యాపారవేత్తలకే మేలు చేశారు. గత నాలుగేళ్లుగా ప్రధాని మోదీ ద్వారా పొందిన అనిల్ అంబానీ వంటి దొంగ వ్యాపారవేత్తల నుంచి న్యాయ్ పథకానికి కావాల్సిన నిధులను రాబడతాం. పేదలు ముఖ్యంగా మహిళల అకౌంట్లలో జమ చేస్తాం’అని అన్నారు. విదేశాల్లో భారతీయులు దాచిన నల్లధనాన్ని వెనక్కి తీసుకువచ్చి రూ.15 లక్షలు చొప్పున ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్న ప్రధాని మోదీ హామీ వట్టిదేనంటూ హత్యా నేరంలో నిందితుడైన బీజేపీ చీఫ్ అమిత్‌షాయే కొట్టిపారేశారని పేర్కొన్నారు. ధనికులకు మాత్రమే వాచ్మెన్(చౌకీదార్లు) ఉంటారనీ, వారికి మాత్రమే ప్రధాని కాపలాదారు అయ్యారని ఎద్దేవా చేశారు. ‘బీజేపీ పాలనలో దేశంలో నిరుద్యోగిత తీవ్రంగా పెరిగిపోయింది. వివాదాస్పద పౌరత్వ సవరణ బిల్లును అమల్లోకి రాకుండా చేస్తాం. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను పునరుద్ధరించి, ఉత్పత్తి కేంద్రంగా మార్చేందుకు ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తాం. మోదీ, బీజేపీ వణికిపోతున్నారు కాంగ్రెస్ ప్రకటించిన కనీస ఆదాయ భద్రత పథకాన్ని(న్యాయ్) చూసి మోదీ, బీజేపీ వణికిపోతున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా విమర్శించారు. ఈ విషయంలో ప్రధాని మోదీ నిరాశ, నిస్పృహకు గురయ్యారన్నారు. ‘న్యాయ్’ను కాంగ్రెస్ పార్టీ ‘మాగ్నాకార్టా’గా ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను అన్నివర్గాలు స్వాగతించాయన్నారు. ఎన్నికల్లో ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేని నేతలు ఇతర పార్టీలు ఇచ్చే హామీలపై విమర్శలు చేసే నైతిక హక్కును కోల్పోతారని స్పష్టం చేశారు. నేడు వయనాడ్‌లో నామినేషన్ కోజికోడ్: కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానానికి రాహుల్ గురువారం నామినేషన్ వేయనున్నారు. ఉదయం 11 గంటలకు కోజికోడ్ నుంచి హెలికాప్టర్లో వయనాడ్‌కు వెళ్లి నామినేషన్ దాఖలు చేస్తారని, ఆయన వెంట సోదరి ప్రియాంకగాంధీ ఉంటారని సీనియర్ నేత ముకుల్ వాస్నిక్ చెప్పారు. బుధవారం రాత్రి 8.30 గంటలకు రాహుల్ కోజికోడ్‌కు చేరుకుంటారు. దక్షిణాది రాష్ట్రాలను కూడా కాంగ్రెస్ కలుపుకుపోతుందనే భరోసా ప్రజల్లో కల్పించేందుకే వయనాడ్ నుంచి బరిలోకి దిగుతున్నట్లు రాహుల్ ప్రకటించారు. -
రైతుకు రుణ విముక్తి
న్యూఢిల్లీ: నిరుద్యోగులు, పేదలు, మహిళలు, రైతుల ఓట్లే లక్ష్యంగా ఆకర్షణీయ తాయిలాలతో కాంగ్రెస్ తన మేనిఫెస్టోను ప్రకటించింది. అధికారంలోకి వస్తే ఏటా వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెడతామని, ఓ మోస్తరు రేటుతో జీఎస్టీలో ఒకే రేటును అమల్లోకి తెస్తామని హామీ ఇచ్చింది. రైతులకు రుణమాఫీ కాకుండా, నేరుగా రుణాల నుంచే విముక్తి కల్పిస్తామని వాగ్దానం చేసింది. అధ్యక్షుడు రాహుల్ ప్రతిపాదించిన కనీస ఆదాయ హామీ పథకం ‘న్యాయ్’కు జాబితాలో పెద్దపీట వేసింది. ‘మేము నెరవేరుస్తాం’ పేరిట రూపొందించిన 55 పేజీల ఈ మేనిఫెస్టో పత్రాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీయే చైర్పర్సన్ సోనియా, మాజీ ప్రధాని మన్మోహన్æ, చిదంబరం తదితరులు ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో విడుదల చేశారు. ► కోట్లాది మందికి గొంతుక: రాహుల్ ఐదేళ్ల పాలనలో బీజేపీ దేశవ్యాప్తంగా విద్వేషం, విభజన రేఖల్ని విస్తరించిందని మేనిఫెస్టో విడుదల సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రజలను సమైక్యపరచడానికి కాంగ్రెస్ పాటుపడుతుందని తెలిపారు. తమ మేనిఫెస్టో ఫలానా వ్యక్తి మనోగతం కాదని, కోట్లాది ప్రజలకు గొంతుక అని పేర్కొన్నారు. దేశ ప్రజల స్వేచ్ఛ, మర్యాద, ఆత్మగౌరవం, అభివృద్ధికి అలుపెరగకుండా కృషిచేస్తున్న ఏకైక ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అని చాటిచెప్పేలా మేనిఫెస్టో రూపొందించామని చెప్పారు. మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు ఆయా రంగాల వారీగా.. ► వ్యవసాయం పంటలకు మెరుగైన మద్దతు ధరలు కల్పించడంతో పాటు పెట్టుబడి ఖర్చులు తగ్గిస్తాం. వ్యవస్థాగత రుణ పరపతి సౌకర్యం రైతులందరికీ అందుబాటులో ఉండేలా చూస్తాం. ఈ చర్యలతో రైతు ‘రుణమాఫీ’ నుంచి రైతుకు ‘రుణాల నుంచి విముక్తి’ కల్పించే దిశగా సాగుతాం. ఏటా సాధారణ బడ్జెట్‌తో పాటు వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెడతాం. ► విద్య, వైద్యం విద్య, వైద్యానికి జీడీపీలో 6 శాతం నిధులు కేటాయిస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 12 తరగతుల వరకు ఉచిత, నిర్బంధ విద్యను అమలుచేస్తాం. ప్రభుత్వ ఆసుపత్రులను పరిపుష్టం చేసి పేదలకు నాణ్యమైన వైద్య సౌకర్యాలు అందుబాటులోకి తెస్తాం. ఆరోగ్య సంరక్షణ హక్కు చట్టం రూపొందించి ప్రతి పౌరుడికి ఉచితంగా వైద్య పరీక్షలు చేయిస్తాం. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల నెట్వర్క్ ద్వారా పేదలకు ఉచితంగా ఓపీ సేవలు, ఔషధాలు, వైద్యం అందిస్తాం. ► న్యాయ్ దేశంలో అత్యంత నిరుపేదలైన 20 శాతం కుటుంబాలకు కనీస ఆదాయ హామీ కింద ఏటా రూ.72 వేలు వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తాం. పేదరికంపై నిజమైన సర్జికల్ స్ట్రైక్స్ ఇదే కాబోతోంది. ఈ పథకం కోసం తొలి ఏడాది జీడీపీలో 1 శాతం, రెండో ఏడాది 2 శాతం ఖర్చు చేస్తాం. ► ఏపీకి ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తాం. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను పునరుద్ధరిస్తాం. వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లును ఉపసంహరించుకుంటాం. పుదుచ్చేరికి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇస్తాం. ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ సంపూర్ణ అధికారాల్ని కేవలం మూడింటి(రెవెన్యూ, పోలీస్, శాంతిభద్రతలు)కే పరిమితం చేస్తూ చట్ట సవరణ చేస్తాం. ► ఉపాధి ప్రభుత్వ రంగంలో 34 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. అందులో 4 లక్షల ఖాళీల్ని 2020 మార్చి నాటికే నింపుతాం. మరో 20 లక్షల ఖాళీల్ని భర్తీచేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచిస్తాం. ప్రతి గ్రామ పంచాయతీ, స్థానిక సంస్థల్లో కొత్తగా 10 లక్షల సేవా మిత్ర ఉద్యోగాల్ని సృష్టిస్తాం. ఉద్యోగ కల్పనతో పాటు మహిళలకు ఎక్కువ అవకాశాలు కల్పించే ప్రైవేట్ సంస్థలకు ప్రోత్సాహకాలిస్తాం. ► జీఎస్టీ సంస్కరణలు ఒకే ఒక మోస్తారు రేటు ఉండేలా వస్తు, సేవల పన్ను జీఎస్టీలో సమూల మార్పులు తెస్తాం. ఎగుమతులు, అత్యవసర వస్తువులు, సేవలకు పన్ను మినహాయింపునిస్తాం. జీఎస్టీ ఆదాయంలో పంచాయతీలు, మునిసిపాలిటీలకు వాటా కేటాయిస్తాం. రిజర్వ్ బ్యాంకు విధుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా చూస్తాం. ► గ్రామీణాభివృద్ధి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిదినాలను 150 రోజులకు పెంచుతాం. 250 మంది జనాభా ఉన్న గ్రామాలన్నింటిని పక్కా రోడ్లతో అనుసంధానిస్తాం. ఇళ్లు, సొంత భూమిలేని ప్రతి కుటుంబం సొంతిళ్లు కలిగి ఉండేలా ప్రత్యేక చట్టం తెస్తాం. ► మహిళా సాధికారత చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కొత్తగా కొలువుదీరబోయే లోక్‌సభ తొలి సమావేశంలోనే ఆమోదం తెలుపుతాం. అన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో కూడా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పస్తాం. ► విద్వేష నేరాల కట్టడి మూక హత్యలు, విద్వేష నేరాల నియంత్రణకు పార్లమెంట్ తొలి సెషన్లోనే నూతన చట్టం తెస్తాం. బాధితులకు పరిహారం చెల్లించడంతో పాటు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులు, ఇతర ఉన్నతాధికారుల్ని బాధ్యుల్ని చేసేలా నిబంధనలు రూపొందిస్తాం. దేశాన్ని ముక్కలు చేస్తుంది: బీజేపీ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ఆచరణీయ సాధ్యం కాదని, అది ప్రమాదకరంగా, దేశాన్ని ముక్కలుగా విడగొట్టేలా ఉందని బీజేపీ ఆరోపించింది. కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాల్ని బట్టి చూస్తే ఆ పార్టీకి ఒక్క ఓటు కూడా పొందే అర్హత లేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఐదు రాష్ట్రాల్లో కనీసం కంటితుడుపుగానైనా రుణమాఫీని అమలుచేయలేదని మండిపడ్డారు. జమ్మూ కశ్మీర్‌కు సంబంధించి మేనిఫెస్టోలో చేర్చిన భాగాల్ని రాహుల్ సన్నిహితులు(2016లో జేఎన్‌యూలో జాతి వ్యతిరేక నినాదాలు చేసిన వారిని ఉద్దేశించి) రచించారేమోనని సందేహం వ్యక్తం చేశారు. దేశద్రోహం చట్టాన్ని రద్దుచేస్తామని ప్రకటించడంపై స్పందిస్తూ..జిహాదీలు, మావోయిస్టుల చెప్పుచేతల్లో కాంగ్రెస్ ఉండటం ఇకపై నేరం కాబోదని ఎద్దేవా చేశారు. న్యాయ్ పథకం అమలుకు కాంగ్రెస్ నేతలు పరస్పరం విరుద్ధ వ్యాఖ్యలు చేశారని అన్నారు. ఈ పథకానికి నిధుల సమీకరణ కోసం కొందరేమో పన్నులు పెంచాలని సూచించారని, మరి కొందరు ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని అన్నారని తెలిపారు. వయనాడ్ నుంచే పోటీ ఎందుకంటే... మోదీ దక్షిణాదిపై విద్వేషం పెంచుకున్నట్లు అక్కడి ప్రజలు భావిస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. దక్షిణ భారత ప్రజలకు మద్దతుగా ఉన్నానని తెలిపేందుకే వయనాడ్ నుంచి పోటీచేస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తమని కలుపుకుపోవడం లేదని, కీలక నిర్ణయాల్లో తమ అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకోవడం లేదని దక్షిణాది ప్రజలు భావిస్తున్నట్లు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీతో పాటు వయనాడ్‌లో కూడా రాహుల్ పోటీచేస్తున్నట్లు కాంగ్రెస్ ఆదివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. పొత్తులకు సిద్ధమే: దేశవ్యాప్తంగా పొత్తులకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని రాహుల్ చెప్పారు. ఢిల్లీలో ఆప్‌తో పొత్తుపై సందిగ్ధత నెలకొనడంపై ఓ విలేకరి ప్రశ్నించినపుడు ఆయన ఇలా స్పందించారు. దేశంలోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ ఇతర పార్టీలతో కలసి పనిచేయడం లేదన్న వార్తల్ని తోసిపుచ్చారు. మహారాష్ట్ర, బిహార్, జార్ఖండ్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో భావసారూప్య పార్టీలతో ముందస్తు అవగాహన కుదుర్చుకున్న సంగతిని ప్రస్తావించారు. అనంతరం ఆప్ స్పందిస్తూ పొత్తు కుదుర్చుకునేందుకు ఉన్న అవకాశాలపై కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతామని వెల్లడించింది. -
నాడు ‘గరీబీ హఠావో’ నేడు ‘న్యాయ్’!
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అత్యయిక పరిస్థితి అనంతరం ఎన్నికల్లో విజయం సాధించడం కోసం ఆకర్షణీయమైన నినాదాలతో ప్రజల ముందుకు వచ్చేవారు. ‘గరీబీ హఠావో’ అంటూ ఆమె ఇచ్చిన నినాదం కూడా అలాంటిదే. ఆ నినాదం సూటిగా పేద ప్రజల గుండెలను తాకడంతో ఆమె విజయం సాధించారు. ఆ నినాదమే ఆమె అధికారానికి సోపానమైనదని కూడా చెప్పవచ్చు. ఇప్పుడు ఆమె మనవడు అయిన రాహుల్ గాంధీ పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ‘న్యాయ్’ అనే సరికొత్త నగద భరోసా స్కీమ్‌తో ప్రజల ముందుకు వచ్చారు. నాటి ‘గరీబీ హఠావో’ నినాదంలా న్యాయ్ స్కీమ్ రాహుల్ గాంధీకి అధికారాన్ని కట్టబెడుతుందా, లేదా అన్నది కాలమే తేల్చాలి. ఎన్నో గంటలు, ఎన్నో రోజులు ఆర్థిక నిపుణలతో సంప్రతింపులు జరిపి న్యాయ్‌ను అమలు చేయగలమనే పూర్తి విశ్వాసంతోనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో దీన్ని చేర్చామని రాహుల్ గాంధీ ఈ రోజు ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ, అనిల్ అంబానీకి 30 వేల కోట్ల రూపాయలను కట్టబెట్టినప్పుడు నేను పేదల కోసం ఒక్కో కుటుంబానికి ఏడాదికి 72 వేల రూపాయలకు ఖర్చు పెట్టలేనా ? అంటూ కూడా రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఐదు కోట్ల పేద కుటుంబాలకు ఏటా 72 వేల రూపాయలంటే ఏటా 3,60,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. ఇంత పెద్ద మొత్తం డబ్బును ఎక్కడి నుంచి వస్తుందో ఎన్నికల ప్రణాళికలో రాహుల్ గాంధీ వివరించి ఉంటే బాగుండేది. పార్టీ తరఫున రాహుల్ గాంధీ దేశంలో పేదరికం పెరిగిపోతోందని, వారిని ఆదుకునేందుకే తానొచ్చినట్లు చెబుతున్నారు, మరి మోదీకి ముందు పదేళ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పేదరికం నిర్మూలన కోసం ఎందుకు తగిన చర్యలు తీసుకోలేదు? తాము అధికారంలోకి వస్తే గతంలో రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్లు వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెడతామని కూడా రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. సరైన ప్రణాళిక లేకుండా ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టినంత మాత్రాన నేడు వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభం పరిష్కారం అవుతుందని అనుకోవడం అర్థరహితమే అవుతుంది. దేశవ్యాప్తంగా శీతలీకరణ గిడ్డంగులను పెంచడం, సరైన మార్కెట్ సౌకర్యాలను కల్పించడంతోపాటు రైతులకు సరైన గిట్టుబాటు ధర చెల్లించాలి, సకాలంలో రుణ సౌకర్యం కల్పించాలి. వీటి గురించి కాంగ్రెస్ మేనిఫెస్టోలో సమగ్ర వివరణ లేకపోవడం విచారకరం. (చదవండి: ‘అంత డబ్బు’ రాహుల్ వల్ల అవుతుందా?)