సేలంలో నాగలితో రాహుల్ గాంధీ
సాక్షి ప్రతినిధి, చెన్నై / హోసూరు / తేని: కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోకు దేశవ్యాప్తంగా ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించిందని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ తెలిపారు. ఈ మేనిఫెస్టో సామాన్య ప్రజల గొంతుకగా నిలిచిందన్నారు. ప్రధాని మోదీ ‘మన్‌కీ బాత్’ రేడియో కార్యక్రమంపై ఈ సందర్భంగా రాహుల్ పరోక్ష విమర్శలు గుప్పించారు. తమ మేనిఫెస్టో అధికారం కోసం పరితపించే వ్యక్తి ‘మన్ కీ బాత్’ కాదనీ, అది జాతి నిర్మాణానికి సంబంధించినదని(కామ్ కీ బాత్) స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులో కాంగ్రెస్–డీఎంకే కూటమి తరఫున శుక్రవారం ప్రచారం నిర్వహించిన మోదీపై రాహుల్ విరుచుకుపడ్డారు.
అబద్ధాలు చెప్పేందుకు రాలేదు..
దేశంలోని అత్యంత నిరుపేదలకు ఏటా రూ.72 వేలు ఇచ్చేందుకు ఉద్దేశించిన కనీస ఆదాయ భద్రత పథకం(న్యాయ్) విప్లవాత్మకమైనదని అభిప్రాయపడ్డారు. ‘మోదీ తీసుకున్న తప్పుడు ఆర్థిక నిర్ణయాల కారణంగా ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది. దీంతో అమ్మకాలు తగ్గి వస్తువులు ఫ్యాక్టరీలలోనే ఉండిపోయాయి. చివరికి ఉత్పత్తి ఆగిపోవడంతో నిరుద్యోగం పెరిగిపోయింది. దేశంలోని ప్రతీఒక్కరికి రూ.15 లక్షలు ఇస్తామని మోదీ అబద్ధం చెప్పారు. కానీ మేం రూ.15 లక్షలు ఇవ్వలేం. మీకు అబద్ధాలు చెప్పేందుకు నేనిక్కడకు రాలేదు. ఎందుకంటే రూ.15 లక్షలు ఇస్తే దేశ ఆర్థిక వ్యవస్థ నాశనమైపోతుంది. కానీ ‘న్యాయ్’ కింద పేదలకు ఐదేళ్లకు గానూ రూ.3.6 లక్షలు అందిస్తాం. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ పటిష్టం కావడంతో పాటు ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది’ అని రాహుల్ తెలిపారు.
పెరియార్, కరుణ పుస్తకాలను పంపుతా..
తమిళనాడులో అధికార అన్నాడీఎంకే బీజేపీకి అనుబంధంగా మారిపోయిందని రాహుల్ దుయ్యబట్టారు. ‘ మోదీకి తమిళనాడు చరిత్ర గురించి ఏమాత్రం తెలియదు. తమిళ స్ఫూర్తి, తమిళ భాష ఆయనకు తెలియవు. కేంద్ర సాయం కోసం తమిళ రైతులు ఢిల్లీలో ధర్నా చేస్తే మోదీ పట్టించుకోలేదు. జీఎస్టీ వల్ల జౌళి పరిశ్రమకు పేరుగాంచిన తిరుప్పూర్, పట్టు పరిశ్రమకు కేరాఫ్‌గా మారిన కాంచీపురంలో వ్యాపారాలు దెబ్బతిన్నాయి. తమిళులు మాత్రమే తమ భవిష్యత్‌ను నిర్దేశించుకున్నట్లు చరిత్ర చెబుతోంది. తమిళనాడు గురించి అర్థం చేసుకునేందుకు మోదీకి నేను ప్రముఖ హేతువాది పెరియార్(ఈవీ రామస్వామి)తో పాటు తమిళనాడు మాజీ సీఎం, దివంగత కరుణానిధికి సంబంధించిన పుస్తకాలను పంపుతాను’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్–డీఎంకే కూటమి ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment