న్యూఢిల్లీ: ప్రజల మనసులు గెలుచుకోవడమే ధ్యేయంగా ‘అబ్ హోగా న్యాయ్’ అనే నినాదంతో లోక్‌సభ ఎన్నికలకు వెళ్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. న్యాయ్ అనే పదం పార్టీ అధ్యక్షుడు రాహుల్ ప్రకటించిన కనీస ఆదాయ పథకంతో పాటు అన్ని వర్గాలకు దక్కాల్సిన న్యాయాన్ని సూచిస్తుందని సీనియర్ నాయకుడు ఆనంద్ శర్మ ఆదివారం చెప్పారు. కాంగ్రెస్ ప్రధాన ప్రచార గీతం ‘మై హీ తో హిందుస్తాన్ హూ’ను జావెద్ అక్తర్ రచించారు. ప్రచార చిత్రానికి నిఖిల్ అడ్వానీ దర్శకత్వం వహించారు. సినిమాటోగ్రఫీని తుషార్ కాంతి రే, స్క్రిప్టును అనుజా చౌహాన్ అందించారు.
అర్జునా హర్జాయ్ స్వరాలు సమకూర్చారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ప్రచార కమిటీ సభ్యులు తదితరులు చర్చించి ప్రచార వ్యూహాన్ని ఖరారు చేశారని ఆనంద్ శర్మ తెలిపారు. మేనిఫెస్టోలో ప్రతిపాదించిన న్యాయ్ పథకం, పేదరిక నిర్మూలన, ఉద్యోగ కల్పన, రైతులు, మహిళా రిజర్వేషన్, సులభతర జీఎస్టీ, సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ, విద్య తదితరాలే ఇతివృత్తంగా ప్రచార గీతం సాగుతుందని వెల్లడించారు. హిందీతో పాటు మరాఠీ, బెంగాలీ, గుజరాతీ, అస్సామీ, మలయాళం భాషల్లో ఈ గీతాన్ని రూపొందించామని తెలిపారు.
అన్ని రకాల మాధ్యమాల్లోనూ ప్రచారం
టెలివిజన్, రేడియో, సినిమా థియేటర్లు, హోర్డింగ్‌లు, డిజిటల్ తెరలు, ప్రింట్ అడ్వర్టైజ్‌మెంట్లు, సోషల్ మీడియా, రవాణా వాహనాలు..ఇలా అన్ని రకాల విధానాల్లో, అన్ని మాధ్యమాల్లో ప్రచారం నిర్వహిస్తామని ఆనంద్ శర్మ తెలిపారు. కాంగ్రెస్ సందేశాన్ని దేశవ్యాప్తంగా ప్రజలకు చేరువ చేసేందుకు వేలాది కంటైనర్ ట్రక్కులు ఆదివారమే బయల్దేరాయని, తమ ప్రచారంలో ఈ ప్రయోగం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ఆనంద్ శర్మ పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వ విధానాలు, హామీలను విమర్శిస్తూ కూడా కాంగ్రెస్ కొన్ని వీడియోలు విడుదల చేసింది.
కాంగ్రెస్ వారసత్వం, గతంలో ఆ పార్టీ సాధించిన ఘనతల్ని వివరిస్తూ అందులో ఓ వీడియో ఉంది. ప్రజలు ఫోన్లో మాట్లాడాలంటేనే జంకుతున్నారని, దేశంలో అలాంటి భీతావహ వాతావరణం ఉందని ఆనంద్ శర్మ తెలిపారు. ధనబలంతోనే 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, అధికార పార్టీకి ఉన్నంత డబ్బు కాంగ్రెస్ పార్టీ లేదని, సత్యంతో, ప్రజలకు చేరవై కాషాయ పార్టీని ఓడిస్తామని ఆనంద్ శర్మ అన్నారు. దేశభక్తి గురించి మాట్లడే హక్కు ఒక్క ప్రధాని మోదీకే లేదని, దేశం కోసమే కాంగ్రెస్ ఇద్దరు ప్రధానులను కోల్పోయిందని గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment