అది అబద్ధాల మేనిఫెస్టో | Congress manifesto a document of lies | Sakshi
Sakshi News home page

అది అబద్ధాల మేనిఫెస్టో

Published Thu, Apr 4 2019 4:34 AM | Last Updated on Thu, Apr 4 2019 4:56 AM

Congress manifesto a document of lies - Sakshi

కోల్‌కతా సభలో మోదీ అభివాదం

పాసిగాట్‌(అరుణాచల్‌ప్రదేశ్‌)/సిలిగురి: లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ ప్రకటించిన మేనిఫెస్టో అబద్ధాలతో నిండి, గొప్పలు చెప్పుకునేదిగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. రాబోయే లోక్‌సభ ఎన్నికలను విశ్వాసం–అవినీతి, దృఢసంకల్పం–కుట్రల మధ్య జరిగే పోరుగా అభివర్ణించారు. దేశాన్ని అవమానించిన వారి పట్ల కాంగ్రెస్‌ సానుభూతి కనబరుస్తోందని, ఆ పార్టీ చిహ్నం హస్తం దేశంతో ఉందా లేక కుట్రదారులకు మద్దతుగా ఉందా? అని ప్రశ్నించారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని పాసిగాట్‌లో బుధవారం జరిగిన ప్రచార సభలో మోదీ ప్రసంగించారు. వారం వ్యవధిలో ఈ రాష్ట్రంలో ప్రధాని ప్రచారం నిర్వహించడం ఇది రెండోసారి కావడం గమనార్హం.

2004, 09 ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను అమలుచేయడంలో కాంగ్రెస్‌ విఫలమైందని పేర్కొన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన ఎన్డీయేనే సంపూర్ణ విద్యుదీకరణను సాకారం చేసిందని తెలిపారు. కాంగ్రెస్‌ మాదిరిగా బీజేపీ బూటకపు హామీలు ఇవ్వదని,  60 కోట్ల మంది మహిళలకు ఉచితంగా ఎల్పీజీ కనెక్షన్‌ ఇచ్చి మాట నిలబెట్టుకున్నామని అన్నారు. ప్రతి గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించామని, ఆయుష్మాన్‌ భారత్‌ పథకంతో ఆరోగ్య సంరక్షణ వసతులను మెరుగుపరిచామని తెలిపారు. కాంగ్రెస్‌ హృదయంలో అరుణాచల్‌ప్రదేశ్‌కు అసలు చోటేలేదని అన్నారు. ప్రధానినయ్యాక అభివృద్ధి పనులు అన్నింటినీ పూర్తిచేశానని ప్రకటించనని, కానీ దేశం ఎదుర్కొంటున్న సవాళ్లకు ఎదురొడ్డి నిలుస్తానని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్‌ హామీని మేము నెరవేర్చాం..
‘దేశాన్ని ముక్కలు చేస్తామని బెదిరించే వారిపై, త్రివర్ణ పతాకాన్ని దగ్ధం చేసే వారిపై, విదేశీ శక్తుల మాటలు విని అంబేడ్కర్‌ విగ్రహాలను ధ్వంసం చేసే వారిపై కాంగ్రెస్‌ సానుభూతి కనబరుస్తోంది. 2009 నాటికి ఇంటింటికీ విద్యుత్‌ సౌకర్యం కల్పిస్తామని 2004 మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ ప్రకటించింది. కానీ 2014 నాటికి కూడా 18 వేల గ్రామాలు చీకట్లోనే మగ్గుతూ ఉన్నాయి. కాంగ్రెస్‌ నాయకుల లాగే ఆ పార్టీ మేనిఫెస్టోను కూడా అబద్ధాలతో నింపేశారు. కాబట్టి దాన్ని మేనిఫెస్టో కాకుండా గొప్పలు చాటుకునే పత్రంగా భావించొచ్చు. 2014లో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే వేయి రోజుల్లో కాంగ్రెస్‌ వాగ్దానాన్ని నెరవేర్చి 18 వేల గ్రామాల్లో విద్యుత్‌ వెలుగులు నింపింది. ఆయుష్మాన్‌ భారత్‌ పథకంలో అరుణాచల్‌ప్రదేశ్‌ నుంచి సుమారు 3 లక్షల మంది లబ్ధిదారులున్నారు. బీజేపీ ప్రభుత్వం అన్నదాలకు అండగా ఉంది’ అని మోదీ అన్నారు.

అభివృద్ధికి మమతే స్పీడ్‌బ్రేకర్‌: మోదీ
పశ్చిమ బెంగాల్‌ అభివృద్ధికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పీడ్‌బ్రేకర్‌లా అడ్డుపడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. అన్ని రాష్ట్రాలతో సమానంగా బెంగాల్‌ వేగంగా ముందుకు సాగాలంటే మమత పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ లోక్‌సభ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తూ, సిలిగురిలో జరిగిన సభలో మోదీ ప్రసంగించారు. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టంలో కొన్ని నిబంధనల్ని సమీక్షిస్తామన్న కాంగ్రెస్‌  మేనిఫెస్టోను ప్రస్తావిస్తూ, చట్టంలో చేసే మార్పులు ఉగ్ర వ్యతిరేక పోరులో బలగాలకు అడ్డుగా మారుతాయని, సైనికుల భద్రతను ప్రమాదంలోకి నెడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. బాలాకోట్‌ దాడిపై సందేహాలు వ్యక్తం చేసిన విపక్షాలపై మండిపడుతూ ముష్కరులను హతమార్చడంపై రావల్పిండిలో కన్నా కోల్‌కతాలోనే ఎక్కువగా బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. ‘దేశంలోని మిగతా ప్రాంతాల మాదిరిగా బెంగాల్‌ అభివృద్ధి చెందడం లేదు. దీనికి కారణం బెంగాల్‌లో ఓ స్పీడ్‌బ్రేకర్‌ ఉంది. ఆ స్పీడ్‌బ్రేకర్‌ పేరు దీదీ’ అని అన్నారు.

మోదీ.. గడువు తీరిన ప్రధాని
మోదీ ‘స్పీడ్‌బ్రేకర్‌’ ఆరోపణల్ని వెంటనే తిప్పికొట్టిన మమత
దిన్హాటా(పశ్చిమ బెంగాల్‌): బెంగాల్‌ అభివృద్ధికి తాను స్పీడ్‌బ్రేకర్‌లా మారానని ప్రధాని చేసిన వ్యాఖ్యల్ని మమతా బెనర్జీ తిప్పికొడుతూ మోదీని గడువు తీరిన ప్రధానిగా అభివర్ణించారు. గురువారం నుంచి ప్రారంభం కావాల్సిన టీఎంసీ ప్రచార కార్యక్రమాన్ని ఒక రోజుకు ముందు జరిపి మోదీ విమర్శల్ని తిప్పికొట్టారు. బహిరంగ ర్యాలీ లేదా టీవీ కార్యక్రమంలో తనతో చర్చకు రావాలని మోదీకి సవాలు విసిరారు. ఉగ్రదాడి జరగబోతోందని పక్కా సమాచారం ఉన్నా పుల్వామా ఘటనను నివారించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ‘జాతీయవాదం గురించి నాకు బోధించనక్కర్లేదు. చౌకీదార్‌ ఫాసిస్ట్‌ లాగా ప్రవర్తిస్తున్నారు. మీరు వైమానిక దాడుల గురించి మాట్లాడుతూ రాజకీయాలు చేస్తున్నారు. మీకు ఓటర్ల దాడి తప్పదు. నేను మోదీని కాను. నేను అబద్ధాలు చెప్పను. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సమర్థంగా అమలుచేసిన ఉత్తమ రాష్ట్రంగా బెంగాల్‌కు కేంద్ర ప్రభుత్వమే గుర్తింపునిచ్చింది. ఈ మాట నేను చెబుతున్నది కాదు. మీ ప్రభుత్వమే  అవార్డు ఇచ్చింది. మూతపడిన టీ తోటలను తెరుస్తానని హామీనిచ్చి మోదీ ఆ మాటను మరిచారు’ అని అన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement