దేశంలోని సగటు రైతు ఆదాయం ఏడాదికి రూ. 20,000 కంటే తక్కువగానే ఉందని ఎకనమిక్ సర్వే–2016 తేల్చిచెప్పింది. అదే సమయంలో సుప్రీంకోర్టు అధికారులకు రూ.21 వేలు వాషింగ్ అలవెన్స్ ఇస్తూ మాకు రూ. 20 వేలు మాత్రమే ఇస్తున్నారెందుకని రక్షణ బలగాలు కోర్టులో జగడమాడటం వార్తలకెక్కింది. సగం దేశంలో సగటు వ్యవసాయ కుటుంబం ఆదాయం.. ప్రభుత్వోద్యోగులకు ఇస్తున్న మొత్తం 108 రకాల అలవెన్సులలో ఒకే ఒక్క అలవెన్సుకు సమానంగా ఉంటూండటం చూస్తే, మన దేశంలో ఆదాయాల మధ్య వ్యత్యాసం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. రైతుల జీవితంలో మృత్యుతాండవానికి వారి పంటలకు సరైన ధరలు లేకపోవడమే కారణం.
భారతదేశంలోని 17 రాష్ట్రాల్లో అంటే దాదాపు సగం దేశంలో సగటు రైతు ఆదాయం సంవత్సరానికి రూ.20,000 కంటే తక్కువగానే ఉందని ఎకనమిక్ సర్వే–2016 దిగ్భ్రాంతికరమైన వాస్తవాన్ని వెల్ల డిం చిన తర్వాత సుప్రీంకోర్టు అధికారులకు, రక్షణ బలగాలకు మధ్య వాషింగ్ అలవెన్స్‌పై కొనసాగుతున్న జగడం గురించి ఒక వార్తాపత్రిక మరింత ఆశ్చర్యకరమైన వార్తను నివేదించింది. సుప్రీంకోర్టు అధికారులకు బట్టలు ఉతుక్కోవడానికి రూ.21,000 అలవెన్స్‌ని ఇన్‌కమ్ ప్యాకేజీలో భాగంగా అందిస్తూండగా తమకెందుకు రూ. 20,000 మాత్రమే ఇస్తున్నారని రక్షణ రంగ ఉద్యోగులు ప్రశ్నించారని ఆ వార్త సారాంశం.
రైతులు బట్టలు ఉతుక్కోరా?
దాదాపు సగం దేశంలో సగటు వ్యవసాయ కుటుంబం ఆదాయం 7వ పే కమిషన్‌లో భాగంగా ప్రభుత్వోద్యోగులకు ఇస్తున్న మొత్తం 108 రకాల అలవెన్సులలో ఒకే ఒక్క అలవెన్సుకు సమానంగా ఉంటోందని గమనిం చినట్లయితే, మన దేశంలో ఆదాయాల మధ్య వ్యత్యాసం ఎంత తీవ్రస్థాయిలో ఉందో అర్థమవుతుంది. వ్యవసాయ ఆదాయం సగటున ఏడాదికి రూ. 20,000 మాత్రమే అంటే నెలకు రూ.1,700 అన్నమాట. గత 70 ఏళ్లుగా దేశ రైతులను ఎంత దారిద్య్రంలో ముంచెత్తుతున్నారో చూస్తే రగిలిపోతుంది. 2018 అక్టోబర్–డిసెంబర్ మాసాల్లో వ్యవసాయంలో స్థూల విలువ గత 14 ఏళ్లల్లో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయికి దిగజారిపోయిందని కేంద్ర గణాంకాల కార్యాలయం తన తాజా వ్యవసాయ అభివృద్ధి అంచనాల్లో తేల్చి చెప్పింది.
కానీ ఈ వాస్తవం సైతం జాతి చైతన్యాన్ని కుదపలేకపోయింది. జాతీయవాదంపై చర్చనుంచి దేశం కాస్త దృష్టిని మరలించినప్పటికీ వ్యవసాయరంగ రాబడులలో ఇంత భారీ పతనం విధానపరంగా కాస్తయినా స్పందనను రేపుతుందంటే నాకు సందేహమే మరి. వాస్తవానికి వ్యవసాయరంగ దుస్థితి, సంవత్సరాలుగా ఉద్దేశపూర్వకంగా దాన్ని క్షీణింపజేస్తున్న విధానాలను సరైనవే అని అందరినీ నమ్మించే పరిస్థితులు ఉన్నాయేమో అనిపిస్తోంది.
సరైన గిట్టుబాటు ధరలు అందించని కారణంగా 2000 నుంచి 2017 వరకు దేశ రైతులు రూ. 45 లక్షల కోట్ల వరకు నష్టపోయారని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ పేర్కొంది. 2011 నుంచి 2015 వరకు అయిదేళ్ల కాలంలో రైతుల నిజ ఆదాయాలు ఏటా అర్ధ శాతం కంటే తక్కువగా మాత్రమే పెరుగుతూ వచ్చాయని నీతి ఆయోగ్ అంచనా. గత రెండేళ్లుగా రైతుల ఆదాయం సున్నాకు సమానంగా ఉంటున్న దారుణ వాస్తవాన్ని గమనించిన తర్వాతే దేశంలోని చిన్న రైతులకు ప్రతి ఏటా రూ. 6,000 నగదును నేరుగా వారి ఖాతాలకు బదిలీ చేసే విధంగా ప్రత్యక్ష నగదు సహాయ పథకాన్ని అందించడానికి కేంద్రం తప్పనిసరి పరిస్థితుల్లో పూనుకుందని గమనిం చాలి. గత 12 నెలల్లోనే దేశంలో 56.6 లక్షల మంది ఉపాధి కోల్పోయారని సీఎమ్‌ఐఈ అధ్యయనం పేర్కొంది. వీరిలో 82 శాతం మంది లేక 46 లక్షల మంది గ్రామీణ ప్రాంతాలకు చెందినవారే. ఇంత బీభత్సం నెలకొన్నా గ్రామీణ భారతం కనీవినీ ఎరుగని దుస్థితి నుంచి ఎలాగోలా బతికి బట్టకడుతోందంటే ఒకరకంగా అద్భుతమే అని చెప్పాలి. ఇంత భారీ నష్టాలకు దేశంలో ఏ ఇతర రంగమైనా గురై ఉంటే కుప్పకూలిపోవడమే కాదు ఆర్థిక దిజ్ఞ్మండలం నుంచి అదృశ్యమైపోయేదంటే అతిశయోక్తి కాదు.
గత 20 ఏళ్ల నుంచే కాదు.. అంతకుముందు కూడా వ్యవసాయ రంగం కునారిల్లిపోతూ వస్తోంది. గత నాలుగు దశాబ్దాలుగా వ్యవసాయ రాబడులు స్తంభించిపోయాయి. నలభై ఏళ్లుగా వ్యవసాయ కుటుంబాలు ఎలా మనగలుగుతూ వచ్చాయన్నది ఆలోచించడానికే నాకు భయమేస్తుంది. అమెరికన్ రైతు మైక్ కల్లిక్రేట్ ప్రకారం, 44 ఏళ్ల క్రితం 1974లో తన తండ్రి ఒక బుషెల్ (25.40 కేజీలకు సమానం) మొక్కజొన్నను 3.58 డాలర్లకు అమ్మారట. 2018లో మైక్ అదే మొక్కజొన్న బుషెల్‌ని 3.56 డాలర్లకు అమ్మారు. అంటే 44 ఏళ్ల క్రితం తన తండ్రి అమ్మినదానికంటే రెండు సెంట్లు తక్కువ అన్నమాట. అధికోత్పత్తి అనేది వ్యవసాయ మార్కెట్లలో ధరలను అమాంతంగా క్షీణింప జేస్తోంది. దీంతో రైతులు రుణ ఊబిలో చిక్కుకుపోతున్నారు. ’’అప్పులతోటే పుట్టడం, అప్పులతోటే జీవించడం.. వాస్తవానికి నరకంలో గడుపుతున్నట్లే ఉంటుంద’’ని బ్రస్సెల్ సమీపంలోని లెషోన్నెల్స్ గ్రామానికి చెందిన 93 ఏళ్ల రైతు డెక్లెర్క్ గిల్బర్ట్ గత సంవత్సరం నాతో స్వయంగా అన్నమాటలు ఇప్పటికీ గుర్తున్నాయి.
గత యాభై ఏళ్లుగా వ్యవసాయరంగ రాబడులు ఎలా స్తబ్దుగా ఉండిపోయాయో అర్థం చేసుకోవడానికి కనీస మద్దతు ధర వృద్ధిని, వివిధ రంగాల్లోని ఉద్యోగుల మూలవేతనంతో సరిపోల్చి చూశాను. ఇన్నేళ్లుగా రైతులు తమకు రావలసిన న్యాయమైన ధరల విషయంలో ఎంత తిరస్కరణకు గురవుతున్నారో దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. 1970లో, క్వింటాల్ గోధుమ ధరకు కనీస మద్దతు ధర రూ. 76లు ఉండేది. 45 ఏళ్ల తర్వాత అంటే 2015లో క్వింటాల్ గోధుమ కనీస మద్దతు ధర రూ. 1,450లకు చేరింది. అంటే 19 రెట్లు పెరిగింది. ఇదే కాలంలో దేశంలోని వివిధ రంగాల ఉద్యోగుల మూలవేతనం ప్లస్ డీఏ (ఇతర అలవెన్సులు కలపకుండానే) ఎంత పెరిగిందో అంచనా వేశాను. ఇది ప్రభుత్వోద్యోగులకు 120 నుంచి 150 రెట్లు పెరిగింది. కాలేజీ, యూనివర్సిటీ లెక్చరర్, ప్రొఫెసర్లకు 150 నుంచి 170 రెట్లు పెరిగింది. పాఠశాల ఉపాధ్యాయులకు 280 నుంచి 320 రెట్లు పెరిగింది. గత 45 ఏళ్లలో గోధుమ కనీస మద్దతు ధర వంద రెట్లు పెరిగి ఉంటుందని భావించినట్లయితే రైతులు క్వింటాల్ గోధుమకు కనీసం రూ. 7,600 పొందగలిగేవారు. కానీ 2015 లో గోధుమ రైతులు క్వింటాల్ గోధుమలకు పొందిన కనీస మద్దతు ధర రూ.1,450లు మాత్రమే. అంటే ఆహార ధరలను తక్కువగా ఉంచుతూరావడం వల్ల కలిగే భారాన్ని మొత్తంగా రైతులపైనే మోపుతున్నారు.
గోధుమలు మాత్రమే కాదు. టమాటా, బంగాళదుంపలు, ఉల్లిపాయలను మన రైతులు గిట్టుబాటు ధరలు లేక వీధుల్లో విసిరిపోస్తుండటం తరచుగా జరుగుతోంది. పంట చేతికొచ్చాక గత మూడేళ్లుగా మండీల్లో వీటి ధరలు 25 నుంచి 40 శాతం వరకు పడిపోతూండటమే దీనికి కారణం. అదే సమయంలో గోధుమలు, వరి, మొక్కజొన్న వంటి ప్రధాన పంటల ఉత్పత్తి ఖర్చులకు, వాటి రాబడులకు మధ్య వ్యత్యాసం భారీగా పెరిగిపోతోంది. రైతుల మెడలు ఉరితాళ్లకు వేలాడుతున్నాయంటే ఇదే కారణం.
పైగా దేశవ్యాప్తంగా ఇంతవరకూ 6 శాతం మంది రైతులు మాత్రమే కనీస మద్దతు ధర ప్రయోజనాలను పొందగలిగారని శాంతకుమార్ కమిటీ తేల్చిచెప్పింది. ఇక సూక్ష్మ ఆర్థిక విధానంలో భాగంగా వ్యవసాయ ధరలను అత్యంత తక్కువ స్థాయిలో కొనసాగిస్తారు. చాలా సందర్భాల్లో ఇది రైతుల ఉత్పత్తి ఖర్చుకుంటే తక్కువగానే ఉంటుంది. అంటే రైతులు పంటలను పండిస్తున్నారంటే వాస్తవానికి వారు తమకు కలగబోయే నష్టాలను పండిస్తున్నట్లు లెక్క. ఎలాంటి పంటలు పండించినా, ఏ టెక్నాలజీని వాడినా సరే వ్యవసాయరంగాన్ని రైతులకు వ్యతిరేకంగా మలుస్తుండటం పరిపాటి అయింది.
రైతులకు వారి న్యాయమైన ఆదాయాన్ని తిరస్కరించడం అనేది వ్యవసాయ సమాజంపై తీవ్ర ప్రభావం కలిగిస్తోంది. మహారాష్ట్రలోని యావత్మాల్ గ్రామంలోని సన్నకారు రైతు కుమారుడు గోపాల్ బాబూరావ్ రాథోడ్ అనే 22 ఏళ్ల పట్టభద్ర విద్యార్థి రెండేళ్లక్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. నగరాల్లోని తోటి సహచర యువతలాగే గ్రామీణ యువతకు కూడా భవిష్యత్తుపై ఆశలూ, ఆకాంక్షలూ ఉంటాయని చెబుతూ ఆత్మహత్యకు ముందు నోట్ రాశాడు. ‘మనదేశంలో ఒక టీచర్ కుమారుడు సులువుగా లక్ష రూపాయల ఫీజు చెల్లించి ఇంజనీరు అవుతున్నాడు. కానీ రైతు బిడ్డ అంత మొత్తం ఫీజు ఎలా కట్టగలడో ఎవరైనా చెప్పగలరా?’ అంటూ మరో కీలకమైన ప్రశ్నను సంధించాడు. ‘రైతులు తమ ఉత్పత్తికి తగిన పరిహారాన్ని అడిగితే ప్రభుత్వాలు తిరస్కరిస్తున్నప్పుడు వేతనాలు పొందుతున్న ఉద్యోగులు ఆ అన్యాయాన్ని కనీసం ప్రశ్నించకుండానే డీఏలు (డియర్నెస్ అలవెన్స్) ఎలా తీసుకుంటారు?’ ఈ ప్రశ్నను దాటి చూస్తే 1995 నుంచి 2015 వరకు 20 ఏళ్లలో దేశవ్యాప్తంగా 3,18,528 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మన రైతు జీవితాల్లో చోటు చేసుకుంటున్న ఈ సీరియల్ మృత్యు తాండవానికి ప్రధాన కారణం రుణభారమే.
దేశంలో 6 శాతం రైతులు మాత్రమే కనీస మద్దతు ధర పొందుతూ మిగిలిన 94 శాతం రైతులు దోపిడీ మార్కెట్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ధాన్య సేకరణ వ్యవస్థను బలోపేతం చేయడం చాలా అవసరం. రైతులు మార్కెట్లకు ఎంత అదనపు పంటను తీసుకొచ్చినా సరే.. ప్రభుత్వం ప్రకటించిన ధరకు మొత్తం పంటను కొనుగోలు చేసే వ్యవస్థ రావాలి. ప్రధానమంత్రి ఆశా పథకం దీనికి హామీ ఇచ్చినా అమలు విషయంలో విఫలమైంది. మార్కెట్ మౌలికవసతులు తగినంతగా ఏర్పర్చలేకపోతే ఎలాంటి అర్థవంతమైన సంస్కరణలు కూడా వ్యవసాయాన్ని గట్టెక్కించలేవు. అదే సమయంలో పబ్లిక్ సెక్టార్‌ను పక్కకు తోసివేసి ప్రైవేట్ కంపెనీలను వాటి స్థానంలో భర్తీ చేస్తే ప్రతి ప్రభుత్వ సంస్కరణ పరాజయం పాలుకాక తప్పదు.
తెలంగాణలో రైతుబంధు, ఒడిశాలో కాలియా స్కీమ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, కర్ణాటక, ఏపీ వంటి రాష్ట్రాల్లో రైతులకు ప్రత్యక్ష నగదు పథకాలు ప్రవేశపెట్టడం గణనీయమైన మార్పు. రాబోయే సంవత్సరాల్లో ఇది రైతుకు స్వావలంబనను చేకూరుస్తుంది. ఇది జాతీయ పథకంగా మారి సార్వత్రికంగా అమలైనప్పుడు రైతుల ఆదాయానికి కనీస హామీ ఉంటుంది. ఏడాదికి కనీసం రూ. 18,000లను రైతు కుటుంబానికి అందించగలిగితే రైతుల జీవితంలో కొత్త మార్పుకు నాంది పలికినట్లే అవుతుంది.
వ్యాసకర్త : దేవిందర్‌శర్మ, వ్యవసాయ నిపుణులు
ఈ–మెయిల్ : hunger55@gmail.com
Comments
Please login to add a commentAdd a comment