పట్నా ర్యాలీలో అభివాదం చేస్తున్న రాహుల్
పట్నా/న్యూఢిల్లీ/కుషినగర్/జైపూర్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలను పాలకులుగా చేస్తూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే న్యాయ్ పథకం అమలు చేసి దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త జవసత్వాలు తీసుకువస్తామని రాహుల్ తెలిపారు. బిహార్‌లోని పట్నా, యూపీలోని కుషీనగర్‌లో గురువారం జరిగిన ఎన్నికల ర్యాలీల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ ‘మీరే ప్రభువులు.
మేం ప్రభుత్వం ఏర్పాటు చేశాక మా మన్‌కీ బాత్ వినాలని మిమ్మల్ని కోరం. మీకు అవసరమైనవి తెలుసుకుని దాని ప్రకారమే విధానాలు రూపొందిస్తాం’అని అన్నారు. నోట్లరద్దు, జీఎస్టీ కారణంగా ప్రజలు కోల్పోయిన కొనుగోలు శక్తిని మళ్లీ పెంచేందుకు న్యాయ్ వంటి పథకం అవసరమని ఆర్థిక నిపుణులు చెప్పారన్నారు. ఈ పథకం అమలుతో ప్రధాని మోదీ లాగేసుకున్న సొమ్మును తిరిగి ప్రజలకే అందజేస్తామని హామీ ఇచ్చారు. మోదీ కారణంగా కొందరు పారిశ్రామికవేత్తలుమాత్రం లాభపడ్డారన్నారు.
కొత్త పదం ‘మోదీలైస్’
ప్రధాని మోదీ నిత్యం చెప్పే అబద్ధాలతో ఇంగ్లిష్‌లో మోదీలైస్ (మోదీ అబద్ధాలు) అనే కొత్త పదం పుట్టుకొచ్చిందని రాహుల్ ట్విట్టర్‌లో వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఫొటోషాప్ చేసిన ఇంగ్లిష్ డిక్షనరీలోని ‘మోదీలై’ అనే పదం ఉన్న పేజీని స్క్రీన్‌షాట్ తీసి ట్విట్టర్‌లో ఆయన పోస్ట్ చేశారు. ఆ పేజీలో ‘మోదీలై’కి మూడు అర్థాలతోపాటు దాన్ని ఎలా ఉపయోగించాలో తెలుపుతూ ఉదాహరణలున్నాయి. దీంతోపాటు ‘మోదీ అబద్ధాలను ప్రజలకు తెలిపే వెబ్‌సైట్ ఒకటి ఉంది!’ అంటూ ఆ వెబ్‌సైట్ లింక్ ‘మోదీ లైస్: ది మోస్ట్ అక్యురేట్ లిస్ట్ ఆఫ్ పీఎం మోదీస్ మెనీ లైస్’ అని వ్యంగ్యంగా పేర్కొన్నారు.
బాధితురాలికి న్యాయం చేస్తాం
రాజస్తాన్‌లోని ఆళ్వార్‌లో సామూహిక లైంగికదాడికి గురైన దళిత మహిళను కాంగ్రెస్ చీఫ్ పరామర్శించారు. అనంతరం సీఎం అశోక్ గహ్లోత్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బాధితురాలికి న్యాయం చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment