సహరాన్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో మాయావతి, అఖిలేశ్, అజిత్ సింగ్ అభివాదం
దియోబంద్(సహరాన్‌పూర్): బీజేపీకి భయంతో వణికిపోతోందని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి పరాజయం తప్పదని బీఎస్‌పీ అధినేత్రి మాయావతి విమర్శించారు. తమ కూటమి గెలవడం ఇష్టంలేని కాంగ్రెస్ ఓట్లు చీల్చడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. విద్వేష పూరిత విధానాలు, ముఖ్యంగా చౌకీదార్(మోదీ) ప్రచారం తీరుతో ఆ పార్టీ ఓడిపోవడం ఖాయమన్నారు. ఎస్పీ– బీఎస్పీ– ఆర్‌ఎల్డీ పార్టీల మహాకూటమి తొలి ఎన్నికల సభలో మాయావతి, ఎస్‌పీ అధ్యక్షుడు అఖిలేశ్, ఆర్‌ఎల్‌డీ చీఫ్ అజిత్ సింగ్ ప్రసంగించారు.
న్యాయ్ సరైన పరిష్కారం కాదు
ఈ సందర్భంగా మాయావతి.. ‘రోడ్డు షోలు, గంగ, యమున నదుల్లో పవిత్ర స్నానాలు, సినీ తారలకు టికెట్లు.. వంటివి కాంగ్రెస్, బీజేపీలకు ఎన్నికల్లో గెలుపు వ్యూహాలు. బీజేపీకి గట్టి పోటీ ఇచ్చే సత్తా కాంగ్రెస్‌కు లేదు. మహాకూటమి మాత్రమే బీజేపీని ఎదుర్కోగలదు. గతంలో ఇందిరాగాంధీ పేదరిక నిర్మూలన కోసమంటూ పథకాన్ని ప్రవేశపెట్టారు. అది ఫలితం చూపిందా? పేదరికాన్ని రూపుమాపడానికి న్యాయ్ సరైన పరిష్కారం కాదు’ అని తెలిపారు.
చౌకీదార్లను తొలగిస్తాం: ‘కోట్ల ఉద్యోగాలు ఇస్తామన చాయ్‌వాలా(టీ కొట్టు వ్యాపారి)ను 2014లో నమ్మాం. ఇప్పుడు చౌకీదార్‌ను నమ్మమంటున్నారు. ఈ చౌకీదార్ల(వాచ్‌మెన్)ను వాళ్ల చౌకీ(కాపలా పోస్ట్)ల నుంచి తొలగిస్తాం’ అని ర్యాలీలో అఖిలేశ్ ప్రకటించారు. తమ గఠ్ బంధన్(కూటమి) అవినీతిపరుల కూటమి కాదు, మహాపరివర్తన్(పూర్తిమార్పు) అని తెలిపారు.
తనను తాను ఫకీర్(సన్యాసి)అని మోదీ చెప్పుకుంటుంటారు. హామీల అమల్లో విఫలమైతే నేను ఫకీర్‌ను వెళ్లిపోతున్నా అంటారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఉంచుదామా? వెళ్లగొడదామా? అని అఖిలేశ్ ప్రశ్నించారు. అచ్చేదిన్ (మంచి రోజు) అంటే మోదీ ఉద్దేశం తన గురించే తప్ప, ప్రజలకు వచ్చే మంచి రోజుల గురించి కాదని అజిత్ సింగ్ ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment