శ్రీనగర్ (ఉత్తరాఖండ్): బడావ్యాపారవేత్తలు నీరవ్‌మోదీ, మెహుల్ చోక్సీలాంటి వారి జేబులు నింపడానికి సందేహించని బీజేపీకి, న్యాయ్ పథకం అమలుపై అనుమానాలెందుకని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఎత్తిపొడిచారు. ఉత్తరాఖండ్‌లో జరిగిన పార్టీ ఎన్నికల ర్యాలీల్లో ఆయన మాట్లాడారు. ‘మీ(ప్రజలు) నుంచి తీసుకున్న డబ్బును ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, అనిల్ అంబానీ లాంటి వారికి ప్రధాని మోదీ ఇచ్చేశారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడే న్యాయ్ పథకం అమలుకు డబ్బు ఎక్కడి నుంచి తెస్తారంటూ అడుగుతున్నారు’ అని తెలిపారు. ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి దుష్ప్రభావం పడకుండానే ఈ పథకాన్ని అమలు చేయవచ్చంటూ ఆర్థిక వేత్తలు చెప్పారని ఆయన అన్నారు. దాదాపు 25 కోట్ల మంది నిరుపేద ప్రజలకు ఐదేళ్లలో ఏడాదికి రూ.72 వేల చొప్పున అందించేందుకు రూ.3.6 లక్షల కోట్ల మేర అవసరమవుతాయని ఆయన తెలిపారు. 2014 ఎన్నికల్లో రైతులు, యువతకు ఇచ్చిన హామీలను బీజేపీ ప్రభుత్వం విస్మరించిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment