రాబడిలో ఎఫ్‌డీ కంటే బెస్ట్ | Safe & Higher Returns: Look beyond Bank Fixed Deposits | Sakshi
Sakshi News home page

రాబడిలో ఎఫ్‌డీ కంటే బెస్ట్

Published Sun, Mar 30 2014 2:50 AM | Last Updated on Sat, Sep 2 2017 5:20 AM

రాబడిలో ఎఫ్‌డీ కంటే బెస్ట్

రాబడిలో ఎఫ్‌డీ కంటే బెస్ట్

మనలో చాలామంది సేవింగ్స్ అనగానే బ్యాంకు డిపాజిట్లకే మొదట ప్రాధాన్యతను ఇస్తారు. దీనికి కారణం వీటిల్లో ఎటువంటి రిస్క్ లేకపోవడమే. కానీ, ఎలాంటి రిస్క్ లేకుండా బ్యాంకు డిపాజిట్ల కంటే అధిక రాబడిని అందించే ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. బ్యాంకు డిపాజిట్లు మన సంపదను పెంచకపోగా, కొనుగోలు శక్తిని ఏ విధంగా నష్టపరుస్తున్నాయి, అధిక రాబడిని ఇచ్చే ఇతర సాధనాలు ఏమిటి అన్న వాటిపై అవగాహన కల్పించేదే ఈ వారం ప్రాఫిట్ ముఖ్య కథనం.
 
ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి ఎటువంటి నష్ట భయం లేని ఇన్వెస్ట్‌మెంట్స్ సాధనాలపైనే ఎక్కువమంది మొగ్గు చూపుతుంటారు. అందుకే మనలో చాలామంది క్యాపిటల్ ప్రొటెక్షన్ (అసలుకి హామీ) ఉన్న బ్యాంకు డిపాజిట్లలోనే ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంటారు. కానీ వాస్తవంగా అసలుకి రక్షణ కల్పించే శక్తి బ్యాంకు డిపాజిట్లకు ఉందా? పెరుగుతున్న ధరలు (ద్రవ్యోల్బణం) సంపదను హరించేస్తున్న సంగతి గురించి ఎంతమందికి అవగాహన ఉంది? బ్యాంకు డిపాజిట్లలో పన్నుల భారం, దీర్ఘకాలంలో వడ్డీరేట్లలో హెచ్చుతగ్గులు వంటి అనేక ప్రతికూలాంశాలున్నాయి. అందుకే డిపాజిట్ చేసేముందు వాస్తవిక రాబడి ఎంతుంటుందో లెక్కించాలి.
 
 సగానికి సగం నష్టం..
 పెరుగుతున్న ధరలను పరిగణనలోకి తీసుకుంటే బ్యాంకు డిపాజిట్లు వాస్తవంగా ఎంత రాబడిని అందిస్తాయో ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకు 1972లో కేజీ బియ్యం ఖరీదు రూ.2 ఉండేది. అంటే, రూ.10కి 5కేజీలు వచ్చేవి. ఈ పది రూపాయలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేశారనుకుందాం. ఈ 41 ఏళ్లలో ఎస్‌బీఐ డిపాజిట్లపై సగటున 8.1 శాతం వడ్డీరేటును అందించింది. దీని ప్రకారం ఈ మొత్తం ఇప్పుడు రూ. 94 (33 శాతం ఆదాయ పన్నును లెక్కలోకి తీసుకున్న తర్వాత అవుతుంది. కానీ ఇదే సమయంలో సగటు ద్రవ్యోల్బణం రేటు 7.7 శాతం. అంటే ఈ 41 ఏళ్లలో 10 కేజీల బియ్యం ధర రూ.225కి చేరినట్లు. అంటే డిపాజిట్ చేసిన మొత్తంతో అంటే రూ.94తో కేవలం రూ.2.4 కేజీలే వస్తాయి. అంటే బ్యాంకులో డిపాజిట్ చేయడం వల్ల కొనుగోలు శక్తి సగానికి పడిపోయింది. ఇంకో విధంగా చెప్పాలంటే సంపద విలువ 52 శాతం క్షీణించినట్టు లెక్క. సంపద విలువను ద్రవ్యోల్బణం ఏ విధంగా హరిస్తుందో చెప్పడానికి ఇది చిన్న ఉదాహరణ. ఈ విధంగా చూస్తే ఎఫ్‌డీ అనేది వాస్తవంగా సంపదను పెంచకపోగా కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది.
 
 బ్యాంకు డిపాజిట్లకంటే అధిక రాబడిని పొందడానికి అనేక ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధానమైనవి డెట్ ఫండ్స్. ఇవి ఇంచుమించు మన బ్యాంక్ డిపాజిట్లవలే పనిచేస్తాయి. కానీ పన్నులు, రాబడి పరంగా చూస్తే ఇవి ఎఫ్‌డీ కంటే అధిక ప్రయోజనాన్ని అందిస్తాయి.

 పన్నుభారం తక్కువ
 రిస్క్ అంటే ఇష్టపడని వారికి ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ మ్యూచువల్ ఫండ్స్ ఒక చక్కటి ఇన్వెస్ట్‌మెంట్ సాధనంగా చెప్పొచ్చు. వీటికి ద్రవ్యోల్బణాన్ని మించి రాబడినిచ్చే శక్తి ఉండటమే కాకుండా రాబడిపై పన్ను భారం కూడా తక్కువే. బ్యాంకు డిపాజిట్లు అందించే వడ్డీపై అధిక ట్యాక్స్ బ్రాకెట్‌లో ఉన్నవారు 33 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే డెట్ ఫండ్స్‌లో దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 22.66 శాతం చెల్లిస్తే సరిపోతుంది. ఒకవేళ ఇండెక్సేషన్‌ను పరిగణనలోకి తీసుకుంటే 11.33% చెల్లిస్తే సరిపోతుంది. ఉదాహరణకు రూ.10,000 ఫిక్స్‌డ్ డిపాజిట్ ఏడాది తర్వాత రూ.10,586 అవుతుంది. ఇదే మొత్తాన్ని ఏడాది కాలపరిమితిగల ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే.. అది కూడా ఇదే విధమైన రాబడిని అందించిందనుకుందాం. కానీ ఈ ఫండ్స్ నుంచి రూ.10,874 చేతికి వస్తుంది. దీనికి కారణం పన్ను భారం తగ్గడమే. అంటే దీనివల్ల బ్యాంకు డిపాజిట్ల కంటే 2.84% అధిక రాబడిని పొందవచ్చు. అంతేకాదు ఈ ఫండ్స్ అందించే డివిడెండ్లపైన కూడా పన్ను భారం తక్కువే.
 
 అధిక రాబడి..
 ప్రస్తుతం బ్యాంకు డిపాజిట్లతో పోలిస్తే మ్యూచువల్ ఫండ్స్‌లో ఈల్డ్స్ (రాబడులు) అధికంగా ఉన్నాయి. బ్యాంకులు వాటి లాభాలను పెంచుకోవడానికి డిపాజిట్లపై తక్కువ వడ్డీరేట్లను ఆఫర్ చేస్తుంటాయి. సాధారణంగా డిపాజిట్లు, రుణాలపై ఇచ్చే వడ్డీల మధ్య 4-5 శాతం తేడా (స్ప్రెడ్) ఉండే విధంగా చూసుకుంటాయి. అదే మ్యూచువల్ ఫండ్స్‌లో రుసుములు 1-1.5 శాతం మించి ఉండవు కాబట్టి ఆ మేరకు రాబడులు పెరుగుతాయి.
 
 ట్యాక్స్ ఫ్రీనే కానీ రిస్క్ ఫ్రీ కాదు
 ఇప్పుడు చాలామంది రాబడిపై ఎటువంటి పన్ను ఉండదన్న ఉద్దేశంతో ట్యాక్స్ ఫ్రీ బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అది 10, 20 ఏళ్ల దీర్ఘకాలిక బాండ్స్ అయినప్పటికీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ దీర్ఘకాలిక బాండ్స్‌పై 8.5 శాతం వడ్డీరేటును ఇస్తుంటే, పన్ను భారం లేని విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ వడ్డీరేటు 12.6 శాతం అవుతుంది. కానీ వీటిల్లో ఉండే రిస్క్‌ను గమనించడం లేదు. ఉదాహరణకు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 10-20 ఏళ్ల కాలానికి ద్రవ్యోల్బణం ఇదే విధంగా ఉండదు. మధ్య మధ్యలో తీవ్ర హెచ్చు తగ్గులకు గురవుతుంటాయి. అటువంటి సమయంలో ఈ దీర్ఘకాలిక బాండ్స్ వడ్డీరేట్లు అక్కరకురాకపోగా, వీటి నుంచి వైదొలిగే అవకాశం కూడా ఉండదు. అదే స్వల్పకాలానికి 1-2 ఏళ్లకు ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా రాబడులను పొందే అవకాశం ఉంటుంది.

 - మనీష్ డంగి
 కో-సీఐవో, బిర్లాసన్‌లైఫ్ ఏఎంసీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement