మీ డిపాజిట్లు భద్రమేనా?
- ముందు బ్యాంకు పరిస్థితి తెలుసుకోవటం ముఖ్యం
- బ్యాంకు దివాలా తీస్తే రూ. లక్ష వరకు డీఐసీజీసీ బీమా
ఇన్వెస్ట్‌మెంట్ సాధనాల్లో బ్యాంక్ డిపాజిట్లది ప్రత్యేక స్థానం. ఎందుకంటే ఇవే అన్నిటికన్నా సురక్షితమైనవని జనం భావిస్తారు. పెపైచ్చు గడువు తీరాక చేతికి ఎంత వస్తుందో ముందే తెలుస్తుంది. ఇదంతా బాగానే ఉన్నా... బ్యాంకులు దివాలా తీస్తే!!? ఇతర బ్యాంకుల్లో విలీనమైతే? అప్పుడు మీ డిపాజిట్ల సంగతేంటి? ఎప్పుడైనా ఆలోచించారా?
రిస్క్ ఆస్తులతో ఆందోళన...
ఒకవైపు బ్యాంకుల రిస్క్ ఆస్తులు పెరిగిపోతున్నాయి. 2011 మార్చి నుంచి 2015 మార్చి వరకు చూస్తే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రిస్క్ ఆస్తులతో పోల్చినపుడు మూలధన పటిష్టత 1.8 శాతం పాయింట్లు తగ్గింది. ఈ ఏడాది మార్చి నాటికి పీఎస్‌యూ బ్యాంకుల రిస్క్ ఆస్తుల విలువ 13.5 శాతం. ఇదే సమయంలో నికర ఎన్‌పీఏల నిష్పత్తి 3.1 శాతం. ఇవన్నీ చూసినపుడే డిపాజిట్ల గురించి ఆలోచించాల్సిన అవసరం ఏర్పడుతుంది. రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వైస్ ప్రెసిడెంట్ విభా బాత్రా మాటల్లో చెప్పాలంటే... ‘‘పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. బయట పడటానికి వాటిక్కొంత సమయం పడుతుంది. తగినంత మూలధనం ఉంది కనక ఈ బ్యాంకులకు వేరొకదాంట్లో విలీనమయ్యే అవసరం ప్రస్తుతానికి లేదు. కానీ కొన్ని బ్యాంకులు ఆర్థికంగా చాలా బలంగా ఉన్నాయి కనక వాటిలో విలీనాలనూ కొట్టిపారేయలేం’’.
డిపాజిట్లకు డీఐసీజీసీ రక్ష!
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కేంద్రానికి అధిక వాటా ఉంటుంది. ఒక బ్యాంకు దివాలా అంచులకు వచ్చినప్పుడు కేంద్రం దాన్ని ఆర్థికంగా బలంగా ఉన్న మరో బ్యాంకుతో విలీనం చేస్తుంది. అలాంటపుడు ఆందోళన అవసరం లేదు. దివాలా తీసే బ్యాంకులో రూ.లక్ష వరకు డిపాజిట్లుంటే వాటికి డిపాజిట్ ఇన్సూరెన్స్, క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) రక్షణ ఉంటుంది. బ్యాంకులన్నీ డీఐసీజీసీకి కొంత ప్రీమియం చెల్లించి ఈ బీమా చేస్తాయి. ప్రీమియం చెల్లించిన డిపాజిట్లకే బీమా రక్షణ ఉంటుందనేది గుర్తించాలి. ఎఫ్‌ఎస్‌ఆర్ నివేదిక ప్రకారం ఈ ఏడాది మార్చి చివరికి రూ.26 లక్షల కోట్ల విలువైన 134 కోట్ల డిపాజిట్లకు డీఐసీజీసీ బీమా రక్షణ ఉంది. ఇది మొత్తం బ్యాంకు డిపాజిట్లలో (145 కోట్లు) 92 శాతం. అయితే ఒక బ్యాంకులో ఒక వ్యక్తి పేరిట ఎన్ని డిపాజిట్లున్నా డీఐసీజీసీ బీమా మాత్రం ఒక్కదానికే వర్తిస్తుంది. అదే జాయింట్ ఖాతా అయితే ఇద్దరికి విడిగా రూ.లక్ష చొప్పున రూ.2 లక్షల వరకు బీమా ఉంటుంది.
బ్యాంకు గురించి అవగాహన ఉండాలి...
ఏదైనా బ్యాంకులో డిపాజిట్ చేసే ముందు దాని ఆర్థిక పరిస్థితిని గమనించాలి. బ్యాంకు మొండిబకాయిలు, వాటికి చేసిన కేటాయింపులు, రీస్ట్రక్చర్డ్ ఖాతాలను పరిగణనలోకి తీసుకోవాలి. మీరు డిపాజిట్ చేసిన బ్యాంకు ఇబ్బందుల్లో ఉందని భావిస్తే వెంటనే దాన్నుంచి డబ్బులు వెనక్కి తీసుకోవడం మంచిది. ఇక మీరు లోన్ తీసుకున్న బ్యాంకు మరొక బ్యాంకుతో విలీనమైతే పరిస్థితేంటనే ప్రశ్న రావచ్చు. వడ్డీ రేటులో మార్పు ఉండొచ్చు. ఒకోసారి ఉండకపోవచ్చు కూడా. విలీనం చేసుకున్న బ్యాంకు లోన్ బుక్‌తో పోల్చినపుడు మీ బ్యాంకు లోన్ బుక్ చిన్నదైతే విలీనం చేసుకున్న బ్యాంకు మీకు తక్కువ వడ్డీని ఆఫర్ చేయొచ్చు. లేదా ప్రస్తుతం ఉన్న లోన్ రేటునే చెల్లించమని కోరవచ్చు.