DIG Roopa
-
డీజీపీ రూప పాత్రనా.. అయితే సారీ!
సాక్షి, తమిళసినిమా: తమిళనాట రాజకీయ నాయకురాలిగా ప్రకంపనలు రేపిన శశికళ ప్రస్తుతం కర్ణాటకలో జైలులో ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. జైల్లో ఆమె రాజభోగాలు అనుభవిస్తున్నారన్న కథనాలు రావడం పెద్ద దుమారమే రేపింది. జైల్లో ఆమె బాగోతాన్ని అప్పటి కర్ణాటక జైళ్లశాఖ డీఐజీ రూప బట్టబయలు చేసి సంచలనం సృష్టించారు. శశి అనుకూలంగా జైల్లో జరిగిన అధికార దుర్వినియోగాన్ని, అవినీతిని, ఆమె అనుభవిస్తున్న రాజభోగాలను నిర్భయంగా వెలుగులోకి తెచ్చిన రూప కథ ఆధారంగా దర్శకుడు ఏఎంఆర్ రమేశ్ ఓ చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నారు. గతంలో రాజీవ్‌గాంధీ హత్యోదంతాన్ని, బాబ్రీమసీదు నేపథ్యంలో చిత్రాలు తెరకెక్కించిన ఆయన తాజాగా డీఐజీ రూప కథ ఆధారంగా సినిమా తీస్తానని ప్రకటించడం సంచలనం రేపింది. ఈ చిత్రంలో డీఐజీ రూప పాత్రలో నటి నయనతార లేదా అనుష్కను తీసుకోవాలని దర్శకుడు భావిస్తున్నారట. అయితే, ఆయన ప్రయత్నాలకు బ్రేక్ పడినట్టు సమాచారం. డీఐజీ రూప పాత్రలో నటించడానికి నయనతార నిరాకరించిందని కోలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. సారీ.. అలాంటి రాజకీయ సంబంధమున్న పాత్రలను చేయనని నయన కరాఖండీగా చెప్పేసిందట. అనుష్క కూడా సైతం అదే మాట చెప్పిందని సమాచారం. శశికళకు సంబంధమున్న కథ కావడంతో రాజకీయ బెదిరింపులు వస్తాయని ఈ బ్యూటీలు భయపడ్డటు కోలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో నటి త్రిషపై దర్శకుడు రమేశ్ దృష్టి పడిందని తెలుస్తోంది. డీఐజీ రూప పాత్రలో నటించడానికి త్రిష అయినా 'ఎస్' అంటుందా? వేచి చూడాలి అంటున్నారు తమిళ సినీ జనాలు. -
వీరిలో ‘డీఐజీ రూప’ ఎవరు?
చెన్నై: దక్షిణాదిలో అగ్ర కథానాయికలుగా రాణిస్తున్న నయనతార, అనుష్క అని గంటాపథంగా చెప్పవచ్చు. చిత్ర కథను తమ భుజాలపై వేసుకుని విజయతీరానికి చేర్చగల సత్తా ఉన్న భామలు వీరు. నయనతార మాయ చిత్రంతో హీరోయిన్ ఓరియంటెడ్ నాయకిగా మారినా, అనుష్క మాత్రం అంతకు ముందే అరుంధతి చిత్రంలో అద్భుత నటనను ప్రదర్శించి ఆ చిత్ర సంచలన విజయానికి ప్రధాన కారణంగా నిలిచారు. ఈ ఇద్దరినీ ఇటీవల నాయిక ప్రధాన కథా చిత్రాల అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం నయనతార చేతిలో ఆ తరహా చిత్రాలు నాలుగైదు ఉన్నాయి. అనుష్క భాగమతి అనే చిత్రంలో నటిస్తున్నారు. కాగా, ఈ ఇద్దరిలో కౌన్ బనేగా డీఐజీ అన్న ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. విషయం ఏమిటంటే యధార్ధ సంఘటనల ఇతి వృత్తాలతో చిత్రాలు చేసే దర్శకుడిగా పేరొందిన వ్యక్తి ఏఎంఆర్ రమేశ్. ఆ మధ్య రాజీవ్‌గాంధీ హత్య నేపథ్యంలో చిత్రం, బాబ్రీమసీద్ ఇతి వృత్తంతో మరో చిత్రం తెరకెక్కించి సంచలన దర్శకుడిగా వాసి కెక్కారు. తాజాగా కర్ణాటక డీఐజీ రూప ఇతి వృత్తంతో చిత్రం చేయడానికి సిద్దం అయ్యారు. డీఐజీ రూప అనగానే అన్నాడీఎంకే పార్టీలో ప్రకంపనలు పుట్టిస్తున్న శశికళ ఖైదీ జీవితం గుర్తుకు వస్తుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ప్రస్తుతం కర్ణాటకలో జైలు జీవితాన్ని గడుపుతున్న శశికళ ఆక్కడి జైలులో ఆడంబర జీవితాన్ని అనుభవిస్తున్న విషయాన్ని డీఐజీ రూప ఆధారాలతో సహా బట్టబయలు చేసి పెద్ద కలకలానికి దారి తీసిన విషయం తెలిసిందే. జైలు అధికారి సత్యనారాయణ రూ.2 కోట్లు లంచం తీసుకుని శశికళకు వీఐపీ వసతులు కల్పించారని ఆరోపణలు చేశారు. ఫలితంగా రూప బదిలీకి గురయ్యారు. అయితే, డీఐజీ రూప విధి నిర్వహణకు, కర్తవ్య దక్షణకు ఈ సంఘటన ఒక్కటే కాదు అంతకు ముందు కూడా చాలా అంశాలు ఉన్నాయి. రాష్ట్రపతి నుంచి మెడల్‌ను అందుకున్న రూప జీవిత సంఘటనలతో దర్శకుడు ఏఎంఆర్.రమేశ్ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందుకు డీఐజీ రూప కూడా అనుమతి ఇచ్చారట. ఇక ఆమె పాత్రలో నటించే నటీమణులు ఎవరన్న అంశంలో ఆయన కళ్ల ముందు కదలాడిన తారలు నయనతార, అనుష్కలేనట. వారిలో ఒకరిని ఈ చిత్రంలో నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు దర్శకుడు రమేశ్ వర్గాల సమాచారం. మరి నయనతార, అనుష్కలలో కౌన్ బనేగా డీఐజీ అన్నది తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
వెండితెరపై సాహస వనిత
► ఐపీఎస్ రూప జీవితం, పరప్పన జైలు అక్రమాలే కథ ► కన్నడ, తమిళంలో సినిమా నిర్మాణం ► దర్శకుడు ఏఎంఆర్ రమేష్ సన్నాహాలు ► ఈ నెల 29న ప్రకటన సాక్షి, బెంగళూరు: నిజజీవితంలో సంచలనాలు సాధించిన పోలీసు అధికారులు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు, కళాకారులపై ఎన్నో సినిమాలు వచ్చాయి. అదే కోవలో మరో సినిమా కూడా రావడం ఖాయమైంది. తాజాగా బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో గుట్టురట్టయిన అక్రమాలపై శాండల్‌వుడ్‌లో ఓ సినిమా రూపుదిద్దుకోనుంది. ఆ జైల్లో అవినీతి గురించి ధైర్యంగా బట్టబయలు చేసిన మహిళా ఐపీఎస్ అధికారి డీ.రూప జీవితం ఈ చిత్ర కథాంశం. వాస్తవ ఘటనల ఆధారంగా సైనైడ్, అట్టహాస వంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు ఏ.ఎం.ఆర్.రమేశ్ ఈ సినిమాను తెరకెక్కించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సెంట్రల్ జైల్లో శిక్షననుభవిస్తున్న అన్నా డీఎంకే నాయకురాలు శశికళకు అతిథి మర్యాదలు కల్పించడానికి అధికారులు రూ.2 కోట్లు లంచం తీసుకున్నట్లు ఐపీఎస్ అధికారి డీ.రూప తమ నివేదిక ద్వారా వెలుగులోకి తెచ్చారు. అనంతర పరిణామాలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశాలుగా మారాయి. ఈ ఘటనల ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించడానికి దర్శకుడు రమేశ్ సన్నాహాలు చేస్తున్నారు. జైలు వ్యవహారాలపై దర్యాప్తు అధికారులు నాలుగు దక్షిణాది రాష్ట్రాల అధికారులను, రాజకీయ నాయకులను, బిల్డర్లను రహస్య విచారణ చేస్తున్నారు. అందరికంటే ముందే ఈ నేపథ్యంలో రూప, పరప్పన జైలు కథను దర్శకుడు రమేష్ అందరికంటే ముందే ఎంచుకున్నారు. సినిమాను ఏక కాలంలో కన్నడ, తమిళ భాషల్లో చిత్రీకరిస్తారని తెలిసింది. తెలుగులోకి కూడా అనువదించి విడుదల చేసే అవకాశాన్ని చిత్ర యూనిట్ పరిశీలిస్తోంది. ఈ చిత్రంలోనే జైళ్లలో వాస్తవ పరిస్థితులతో పాటు గతంలో ఒక డీఐజీ ఒత్తిళ్లను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వైనాన్ని చూపించించనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో హీరోయిన్గా ఇప్పటికే పోలీసు పాత్రలకు శాండల్‌వుడ్‌లో మంచి పేరు గడించిన సీనియర్ నటి మాలాశ్రీ కాని, ఇప్పుడిప్పుడే పోలీస్పాత్రలు వేస్తున్న రాగిణి ద్వివేదిని కానీ ఎంచుకునే అవకాశం ఉంది. మరోవైపు చిత్రంలో కనీసం ఒక్క సీన్లోనైనా ఐపీఎస్ అధికారి రూపను నటింపచేయాలని చిత్ర యూనిట్ విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు గాం«ధీనగర్ వర్గాలు చెబుతున్నాయి. చిత్ర కథలో జైలు అక్రమాలు, ఐపీఎస్‌గా రూప తీసుకున్న సంచలన నిర్ణయాలు చిత్రకథలో ఉంటాయి. రూప అనుమతి తీసుకుంటాం ‘కన్నడ, తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రాన్ని తెరకెక్కించనున్నాం. తెలుగులో కూడా విడుదల చేసే విషయం కూడా పరిశీలనలో ఉంది. ఐపీఎస్ అధికారి డీ.రూప ఛేదించిన అవినీతి ఘటనల ఆధారంగా తీయనున్నాం. చిత్రం టైటిల్లో రూప పేరు కూడా ఉండనుండడంతో ఐపీఎస్ అధికారి డీ.రూప అనుమతి తప్పనిసరి. ఇప్పటికే సినిమాపై పోలీస్‌శాఖ ఉన్నతాధికారులతో చర్చించాం. జులైన 29న మరోసారి వారితోను, చిత్రానికి మూలాధారమైన ఐపీఎస్ డీ.రూపతోను చర్చించి ఆమోదాల అనంతరం షూటింగ్ ప్రారంభిస్తాం’. –ఏ.ఎం.ఆర్.రమేశ్, సినీ దర్శకుడు -
ఆ హక్కు ప్రభుత్వానికి ఉంది: రూప
బెంగళూరు: అధికారులు బదిలీ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, ప్రభుత్వ ఉత్తర్వులను పాటించానని ట్రాఫిక్ ఐజీ రూప తెలిపారు. పుదుచ్చేరి గవర్నర్ కిరణ్‌బేడీకి ఆమె ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కిరణ్ బేడీ ఇచ్చిన మద్దతు తనకు అమూల్యమైందని రూప పేర్కొన్నారు. కాగా అన్నాడీఎంకే నాయకురాలు శశికళకు పరప్పన అగ్రహార జైలులో అందుతున్న వీఐపీ ట్రీట్మెంట్, జైల్లో అవకతవకలను బయటపెట్టిన డేరింగ్ ఐపీఎస్, డీఐజీ రూప మౌద్గిల్‌కు బదిలీ వేటు పడిన విషయం తెలిసిందే. గత నెల 23న జైళ్ల డీఐజీగా చార్జ్ తీసుకున్న ఆమెపై నెల తిరక్కుండానే బదిలీ వేటు పడడం గమనార్హం. మరోవైపు విపక్ష నేతలు సర్కారు చర్యను తీవ్రంగా తప్పుబట్టాయి. ఇక జైళ్ల డీజీపీ సత్యనారాయణరావు, నిఘా డీజీపీ ఎంఎన్.రెడ్డిలు కూడా బదిలీ అయ్యారు. మరోవైపు డీజీపీ ఆర్కే దత్త మాట్లాడుతూ రహదారుల భద్రతకు సంబంధించి రూపకు కీలక, బాధ్యతయుతమైన పోస్ట్ కేటాయించడం జరిగిందే కానీ, పనిష్మెంట్ కింద బదిలీ జరగలేదని అన్నారు. -
రూపను బదిలీ చేయడం దారుణం: యెడ్డీ
న్యూఢిల్లీ: కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప సోమవారం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. జైళ్ల శాఖ డీఐజీ రూప బదిలీ వ్యవహారంపై ఆయన ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌తో చర్చించారు. భేటీ అనంతరం యడ్యూరప్ప మాట్లాడుతూ... డీఐజీ రూపను బదిలీ చేయడం దారుణమని, నిజాయితీపరులైన ప్రభుత్వ అధికారులకు రాష్ట్రంలో భద్రత లేదని వారిని సిద్ధరామయ్య సర్కార్ శిక్షిస్తోందన్నారు. డీజీపీకి రూప ఇచ్చిన నివేదికను తక్షణమే బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో జరిగిన రాజకీయ హత్యలపై విచారణ జరిపించాలని, మంగళూరులో వెంటనే ఎన్ఐఏ కార్యాలయాన్ని ప్రారంభించాలన్నారు. మరోవైపు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు సూపరిండెంటెంట్ కృష్ణ కుమార్‌పై కూడా బదిలీ వేటు పడింది. ఆయన స్థానంలో ఆర్.అనిత నియమితులయ్యారు. కాగా డీఐజీ రూప బదిలీపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. సాధారణ బదిలీల్లో భాగంగా రూప బదిలీ జరిగిందని, అందులో ఎలాంటి ఒత్తిళ్లు లేవని ఆయన స్పష్టం చేశారు. కాగా అన్నాడీఎంకే నాయకురాలు శశికళకు పరప్పన అగ్రహార జైలులో వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్నారని సంచలన ఆరోపణలు చేసిన జైళ్ల శాఖ డీఐజీ రూప పై బదీలీ వేటు పడిన విషయం తెలిసిందే. ఆమెను జైళ్లశాఖ నుంచి ట్రాఫిక్‌కు బదిలీ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. శశికళకు జైల్లో అక్రమంగా సౌకర్యాలు కల్పించినందుకు దాదాపు రూ.2 కోట్ల మేర ముడుపులు అందాయని డీఐజీ రూప డీజీపీకి ఆరు పేజీల లేఖ రాయడం కలకలం రేపింది. -
నేను ఎలాంటి తప్పు చేయలేదు: డీఐజీ రూప
బెంగళూరు : తాను ఎలాంటి తప్పు చేయలేదని, తనను టార్గెట్ చేయడం సరికాదని జైళ్ల డీఐజీ రూప మౌద్గిల్ అన్నారు. ఆమె శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ నివేదికలో తాను చెప్పిన అన్ని విషయాలకు కట్టుబడి ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు. తాను ఎక్కడా ప్రోటోకాల్ ఉల్లంఘించలేదని డీఐజీ రూప స్పష్టం చేశారు. సర్వీస్ రూల్స్ అందరికీ వర్తించాలని, తన ఒక్కదానికే కాదని అన్నారు. ప్రోటోకాల్ ఉల్లంఘిస్తే అందరిపై చర్యలు తీసుకోవాలని రూప వ్యాఖ్యానించారు. ‘జైళ్ల శాఖ డీఐజీగా నేను జూన్ 23న బాధ్యతలు స్వీకరించాను. విధుల్లో భాగంగా ఈనెల 10న నేను పరప్పన జైలుకు వెళ్లాను. ఆ తరువాతి రోజే మీ (సత్యనారాయణ) కార్యాలయం నుంచి నాకు మెమో వచ్చింది. అందులో ‘మిమ్ములను పరప్పన అగ్రహార జైలుకు ఎవరు వెళ్లమన్నారు’ అని ప్రశ్నించారు. నా అధికార పరిధి ప్రకారం జైళ్లకు వెళ్లి తనిఖీ చేయడం, తప్పు చేసిన సిబ్బంది నుంచి వివరణ కోరడం కూడా నా విధి. నా విధులను సక్రమంగా నిర్వర్తిస్తుంటే మీరు మెమో జారీ చేయడం అత్యంత శోచనీయం’ అని ఘాటుగా పేర్కొన్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో శశికళ, స్టాంపుల కేసు దోషి తెల్గీ నుంచి జైళ్ల శాఖ ఐజీపీ సత్యనారాయణరావు ముడుపులు తీసుకుని రాచమర్యాదలు చేస్తున్నారని ఆ శాఖ డీఐజీ రూప చేసిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపిస్తామని అన్నారు. అయితే డీఐజీ రూప సర్వీస్ రూల్స్‌కు వ్యతిరేకంగా డీజీపీ సత్యనారాయణ జైళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని పలుమార్లు మీడియా ముందు బహిరంగంగా మాట్లాడటం తగదని అన్నారు. ఈ విషయంపై హోం శాఖ కార్యదర్శితో చర్చించి పరప్పనజైలు వ్యవహారంపై క్షుణ్ణంగా విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాగా దావణగెరె స్వస్థలమైన జైళ్ల డీఐజీ రూప ప్రతిభావనిగా పేరు తెచ్చుకున్నారు. పనిచేసిన ప్రతిచోటా ఆమె సంచలనాలకు కేంద్ర బిందువయ్యారు. 2000లో సివిల్స్‌లో 43వ ర్యాంక్ సాధించి ఐపీఎస్‌ను ఎంచుకున్నారు. హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందారు. షార్ప్ షూటర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆ బ్యాచ్‌లో ఓవరాల్‌గా 5వ స్థానంలో నిలిచారు. పోలీసు శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్నందుకు గాను 2016 జనవరి 26న రాష్ట్రపతి పోలీసు పతకాన్ని అందుకున్నారు. ఓ కేసులో కోర్టు తీర్పు ప్రకారం అప్పటి మధ్యప్రదేశ్ సీఎం ఉమాభారతీని ఎస్పీ హోదాలో అరెస్టు చేశారు. ఆమె బెంగళూరు డీసీపీగా ఉండగా వీవీఐపీల భద్రతా సిబ్బందిని తొలగించి లా అండ్ ఆర్డర్ విభాగానికి మార్చడం అప్పట్లో సంచలనం సృష్టించింది. డీసీపీ (సిటీ ఆర్మ్డ్ రిజర్వ్) గా విధులు నిర్వర్తించే సమయంలో నిబంధనలకు విరుద్ధంగా యెడ్యూరప్ప ఓ ఊరేగింపులో ఎక్కువ వాహనాలను వినియోగించడాన్ని గుర్తించిన రూప వెంటనే వాటిని తొలగించి వార్తల్లోకెక్కారు. -
శశికళ తరలింపునకు రంగం సిద్ధం!
బెంగళూరు : అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే నాయకురాలు శశికళను అక్కడ నుంచి తరలించేందుకు రంగం సిద్ధం అవుతోంది. జైళ్లశాఖ అధికారులు ఆమెను మరో జైలుకు మార్చే యోచనలో ఉన్నారు. కాగా శశికళ తనకు కారాగారంలో సకల సౌకర్యాలు లభించేందుకు వీలుగా రూ. 2 కోట్లు జైలు అధికారులకు లంచం చెల్లించిందని, ఈ వ్యవహారంలో కర్ణాటక జైళ్లశాఖ డీజీపీ హెచ్ఎన్ సత్యనారాయణరావుకు సైతం ముడుపులు అందాయని ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. జైళ్లశాఖ డీఐజీ రూప ఈ మేరకు తన నివేదికలో సంచలన విషయాలు వెల్లడించడంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ ఆరోపణలపై విచారణకు ఆదేశించారు. మరోవైపు డీఐజీ రూప గురువారమిక్కడ మాట్లాడుతూ.. తన నివేదికలో చెప్పిన ప్రతి విషయం వాస్తవమేనన్నారు. నివేదికలో పొందుపరిచిన ప్రతి అంశానికి తాను కట్టుబడి ఉన్నానని ఆమె స్పష్టం చేశారు. తనపై ఎవరి ఒత్తిడి లేదని, విచారణలో అన్ని విషయాలు వెలుగు చూస్తాయని డీఐజీ రూప పేర్కొన్నారు. ఇక తనపై వచ్చిన ఆరోపణలను జైళ్ల శాఖ డీజీపీ సత్యనారాయణ కొట్టిపారేశారు. శశికళకు నిబంధనలకు విరుద్ధంగా జైలులో ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించలేదని తెలిపారు.