వీరిలో ‘డీఐజీ రూప’ ఎవరు?
చెన్నై: దక్షిణాదిలో అగ్ర కథానాయికలుగా రాణిస్తున్న నయనతార, అనుష్క అని గంటాపథంగా చెప్పవచ్చు. చిత్ర కథను తమ భుజాలపై వేసుకుని విజయతీరానికి చేర్చగల సత్తా ఉన్న భామలు వీరు. నయనతార మాయ చిత్రంతో హీరోయిన్ ఓరియంటెడ్ నాయకిగా మారినా, అనుష్క మాత్రం అంతకు ముందే అరుంధతి చిత్రంలో అద్భుత నటనను ప్రదర్శించి ఆ చిత్ర సంచలన విజయానికి ప్రధాన కారణంగా నిలిచారు. ఈ ఇద్దరినీ ఇటీవల నాయిక ప్రధాన కథా చిత్రాల అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం నయనతార చేతిలో ఆ తరహా చిత్రాలు నాలుగైదు ఉన్నాయి. అనుష్క భాగమతి అనే చిత్రంలో నటిస్తున్నారు. కాగా, ఈ ఇద్దరిలో కౌన్ బనేగా డీఐజీ అన్న ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది.
విషయం ఏమిటంటే యధార్ధ సంఘటనల ఇతి వృత్తాలతో చిత్రాలు చేసే దర్శకుడిగా పేరొందిన వ్యక్తి ఏఎంఆర్ రమేశ్. ఆ మధ్య రాజీవ్‌గాంధీ హత్య నేపథ్యంలో చిత్రం, బాబ్రీమసీద్ ఇతి వృత్తంతో మరో చిత్రం తెరకెక్కించి సంచలన దర్శకుడిగా వాసి కెక్కారు. తాజాగా కర్ణాటక డీఐజీ రూప ఇతి వృత్తంతో చిత్రం చేయడానికి సిద్దం అయ్యారు. డీఐజీ రూప అనగానే అన్నాడీఎంకే పార్టీలో ప్రకంపనలు పుట్టిస్తున్న శశికళ ఖైదీ జీవితం గుర్తుకు వస్తుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ప్రస్తుతం కర్ణాటకలో జైలు జీవితాన్ని గడుపుతున్న శశికళ ఆక్కడి జైలులో ఆడంబర జీవితాన్ని అనుభవిస్తున్న విషయాన్ని డీఐజీ రూప ఆధారాలతో సహా బట్టబయలు చేసి పెద్ద కలకలానికి దారి తీసిన విషయం తెలిసిందే.
జైలు అధికారి సత్యనారాయణ రూ.2 కోట్లు లంచం తీసుకుని శశికళకు వీఐపీ వసతులు కల్పించారని ఆరోపణలు చేశారు. ఫలితంగా రూప బదిలీకి గురయ్యారు. అయితే, డీఐజీ రూప విధి నిర్వహణకు, కర్తవ్య దక్షణకు ఈ సంఘటన ఒక్కటే కాదు అంతకు ముందు కూడా చాలా అంశాలు ఉన్నాయి. రాష్ట్రపతి నుంచి మెడల్‌ను అందుకున్న రూప జీవిత సంఘటనలతో దర్శకుడు ఏఎంఆర్.రమేశ్ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందుకు డీఐజీ రూప కూడా అనుమతి ఇచ్చారట. ఇక ఆమె పాత్రలో నటించే నటీమణులు ఎవరన్న అంశంలో ఆయన కళ్ల ముందు కదలాడిన తారలు నయనతార, అనుష్కలేనట. వారిలో ఒకరిని ఈ చిత్రంలో నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు దర్శకుడు రమేశ్ వర్గాల సమాచారం. మరి నయనతార, అనుష్కలలో కౌన్ బనేగా డీఐజీ అన్నది తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.