amr ramesh
-
వీరిలో ‘డీఐజీ రూప’ ఎవరు?
చెన్నై: దక్షిణాదిలో అగ్ర కథానాయికలుగా రాణిస్తున్న నయనతార, అనుష్క అని గంటాపథంగా చెప్పవచ్చు. చిత్ర కథను తమ భుజాలపై వేసుకుని విజయతీరానికి చేర్చగల సత్తా ఉన్న భామలు వీరు. నయనతార మాయ చిత్రంతో హీరోయిన్ ఓరియంటెడ్ నాయకిగా మారినా, అనుష్క మాత్రం అంతకు ముందే అరుంధతి చిత్రంలో అద్భుత నటనను ప్రదర్శించి ఆ చిత్ర సంచలన విజయానికి ప్రధాన కారణంగా నిలిచారు. ఈ ఇద్దరినీ ఇటీవల నాయిక ప్రధాన కథా చిత్రాల అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం నయనతార చేతిలో ఆ తరహా చిత్రాలు నాలుగైదు ఉన్నాయి. అనుష్క భాగమతి అనే చిత్రంలో నటిస్తున్నారు. కాగా, ఈ ఇద్దరిలో కౌన్ బనేగా డీఐజీ అన్న ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. విషయం ఏమిటంటే యధార్ధ సంఘటనల ఇతి వృత్తాలతో చిత్రాలు చేసే దర్శకుడిగా పేరొందిన వ్యక్తి ఏఎంఆర్ రమేశ్. ఆ మధ్య రాజీవ్‌గాంధీ హత్య నేపథ్యంలో చిత్రం, బాబ్రీమసీద్ ఇతి వృత్తంతో మరో చిత్రం తెరకెక్కించి సంచలన దర్శకుడిగా వాసి కెక్కారు. తాజాగా కర్ణాటక డీఐజీ రూప ఇతి వృత్తంతో చిత్రం చేయడానికి సిద్దం అయ్యారు. డీఐజీ రూప అనగానే అన్నాడీఎంకే పార్టీలో ప్రకంపనలు పుట్టిస్తున్న శశికళ ఖైదీ జీవితం గుర్తుకు వస్తుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ప్రస్తుతం కర్ణాటకలో జైలు జీవితాన్ని గడుపుతున్న శశికళ ఆక్కడి జైలులో ఆడంబర జీవితాన్ని అనుభవిస్తున్న విషయాన్ని డీఐజీ రూప ఆధారాలతో సహా బట్టబయలు చేసి పెద్ద కలకలానికి దారి తీసిన విషయం తెలిసిందే. జైలు అధికారి సత్యనారాయణ రూ.2 కోట్లు లంచం తీసుకుని శశికళకు వీఐపీ వసతులు కల్పించారని ఆరోపణలు చేశారు. ఫలితంగా రూప బదిలీకి గురయ్యారు. అయితే, డీఐజీ రూప విధి నిర్వహణకు, కర్తవ్య దక్షణకు ఈ సంఘటన ఒక్కటే కాదు అంతకు ముందు కూడా చాలా అంశాలు ఉన్నాయి. రాష్ట్రపతి నుంచి మెడల్‌ను అందుకున్న రూప జీవిత సంఘటనలతో దర్శకుడు ఏఎంఆర్.రమేశ్ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందుకు డీఐజీ రూప కూడా అనుమతి ఇచ్చారట. ఇక ఆమె పాత్రలో నటించే నటీమణులు ఎవరన్న అంశంలో ఆయన కళ్ల ముందు కదలాడిన తారలు నయనతార, అనుష్కలేనట. వారిలో ఒకరిని ఈ చిత్రంలో నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు దర్శకుడు రమేశ్ వర్గాల సమాచారం. మరి నయనతార, అనుష్కలలో కౌన్ బనేగా డీఐజీ అన్నది తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
‘గేమ్’ చిత్రంపై కాంగ్రెస్ గుబులు
చెన్నై: సమాజంలో జరిగిన యధార్థ సంఘటనలనే ఇతివృత్తంగా తీసుకొని సినిమాలు తీసి సంచలనం సృష్టించే ప్రముఖ కన్నడ, తమిళ దర్శకుడు ఏఎంఆర్ రమేశ్, మరో యధార్థ సంఘటన ఆధారంగా తీస్తున్న ‘గేమ్’ చిత్రం కాంగ్రెస్ గుండెల్లో గుబులు రేపుతోంది. కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ భార్య సునంద పుష్కర్ ఆత్మహత్య సంఘటననే ఇతివృత్తంగా తీసుకొని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని, ఇందులో సునంద పుష్కర్ పాత్రను మనీషా కోయిరాల నటిస్తున్నారని ప్రచారం కావడంతో కాంగ్రెస్ పార్టీ కలవర పడుతోంది. సినిమా స్క్రిప్ట్ ఏమిటో తెలుసుకునేందుకు సినీ వర్గాల నుంచి కూపీ లాగేందుకు ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఒకప్పటి ప్రముఖ హీరోయిన్ కుష్బూ కూడా విషయం ఏమిటో తెలుసుకునేందుకు తనవంతు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించిన దర్శకుడు రమేశ్. చిత్రం కథా కమామిషు గురించి వెల్లడించడం లేదు. సునంద పుష్కర్ అనుమానాస్పద మృతిపైనే సినిమా తీస్తున్నారనే ప్రచారాన్ని ఆయన ఖండించనూ లేదు. అలా అని ధ్రువీకరించనూ లేదు. ఓ వీఐపీ మరణం చుట్టూ తిరిగే క్రైమ్ స్టోరీ అని ముక్తిసరిగా చెప్పారు. అంతకుమించి వివరాలు వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. ఎవరికైనా సినిమా తీయడానికి పనికొచ్చే అంశం సునంద పుష్కర్ జీవితమని కర్నాటక కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఎం. రామచంద్రప్ప వ్యాఖ్యానించారు. అయితే నిజ జీవితంపై సినిమా తీయాలనుకున్నప్పుడు సంబంధిత వ్యక్తుల నుంచి అనుమతి తీసుకోవడం తప్పనిసరని చలన చిత్ర వాణిజ్య మండలి నిబంధన తెలియజేస్తోందని ఆయన చెప్పారు. జరుగుతున్న ప్రచారం నిజమే అయితే సినిమా విడుదల సందర్భంగా సరైన వేదికపై సరైన పోరాటానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. ఇంతకుముందు దర్శకుడు రమేశ్, మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్యపై ‘సైనైడ్’ చిత్రాన్ని, స్మగ్లర్ వీరప్పన్ ఎన్‌కౌంటర్‌పై ‘అట్టహాస’ చిత్రాలను తీసి సంచలనం సృష్టించారు. -
అర్జున్, శ్యామ్లతో ద్విభాషా చిత్రం
యాక్షన్‌కింగ్ అర్జున్, యువ నటుడు శ్యామ్‌లు కలిసి తమిళం, కన్నడం భాషల్లో రూపొందనున్న ఓ భారీ చిత్రంలో నటించనున్నారు. ఇంతకుముందు కుప్పి, కావలన్కుడి యిరుప్పు, వనయుద్ధం వంటి వైవిధ్యభరిత చిత్రాలను తెరకెక్కించిన ఏఎంఆర్ రమేష్ దర్శకత్వం వహించనున్న చిత్రం ఇది. ఆ చిత్ర వివరాలను ఆయన వివరించారు. తానెప్పుడూ యదార్థ సంఘటనల కథా చిత్రాలనే రూపొందిస్తానన్నారు. గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రం సమాజంలో జరిగిన సంఘటనలతోనే ఉంటుందన్నారు. ది ఒక వ్యక్తి గురించిన కథ కాదని అన్నారు. చిత్ర కథనం ఊహాతీతంగా ఉంటుందని తెలిపారు. అర్జున్, శ్యామ్, తమిళంతో పాటు కన్నడంలోనూ ప్రాచుర్యం పొందినవారు కావడంతో ఈ చిత్రాన్ని తమిళం, కన్నడం భాషల్లో రూపొందించనున్నట్లు వివరించారు. కథానాయకి ఎంపిక జరుగుతుందన్నారు. ఈ చిత్రానికి కన్నడంలో గేమ్ అనే టైటిల్‌ను నిర్ణయించినట్టు తమిళంలో ఇంకా పేరు నిర్ణయం కాలేదని దర్శకుడు ఏఎంఆర్ రమేష్ తెలిపారు.