‘గేమ్’ చిత్రంపై కాంగ్రెస్ గుబులు
చెన్నై: సమాజంలో జరిగిన యధార్థ సంఘటనలనే ఇతివృత్తంగా తీసుకొని సినిమాలు తీసి సంచలనం సృష్టించే ప్రముఖ కన్నడ, తమిళ దర్శకుడు ఏఎంఆర్ రమేశ్, మరో యధార్థ సంఘటన ఆధారంగా తీస్తున్న ‘గేమ్’ చిత్రం కాంగ్రెస్ గుండెల్లో గుబులు రేపుతోంది. కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ భార్య సునంద పుష్కర్ ఆత్మహత్య సంఘటననే ఇతివృత్తంగా తీసుకొని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని, ఇందులో సునంద పుష్కర్ పాత్రను మనీషా కోయిరాల నటిస్తున్నారని ప్రచారం కావడంతో కాంగ్రెస్ పార్టీ కలవర పడుతోంది.
సినిమా స్క్రిప్ట్ ఏమిటో తెలుసుకునేందుకు సినీ వర్గాల నుంచి కూపీ లాగేందుకు ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఒకప్పటి ప్రముఖ హీరోయిన్ కుష్బూ కూడా విషయం ఏమిటో తెలుసుకునేందుకు తనవంతు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించిన దర్శకుడు రమేశ్. చిత్రం కథా కమామిషు గురించి వెల్లడించడం లేదు. సునంద పుష్కర్ అనుమానాస్పద మృతిపైనే సినిమా తీస్తున్నారనే ప్రచారాన్ని ఆయన ఖండించనూ లేదు. అలా అని ధ్రువీకరించనూ లేదు. ఓ వీఐపీ మరణం చుట్టూ తిరిగే క్రైమ్ స్టోరీ అని ముక్తిసరిగా చెప్పారు. అంతకుమించి వివరాలు వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు.
ఎవరికైనా సినిమా తీయడానికి పనికొచ్చే అంశం సునంద పుష్కర్ జీవితమని కర్నాటక కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఎం. రామచంద్రప్ప వ్యాఖ్యానించారు. అయితే నిజ జీవితంపై సినిమా తీయాలనుకున్నప్పుడు సంబంధిత వ్యక్తుల నుంచి అనుమతి తీసుకోవడం తప్పనిసరని చలన చిత్ర వాణిజ్య మండలి నిబంధన తెలియజేస్తోందని ఆయన చెప్పారు. జరుగుతున్న ప్రచారం నిజమే అయితే సినిమా విడుదల సందర్భంగా సరైన వేదికపై సరైన పోరాటానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. ఇంతకుముందు దర్శకుడు రమేశ్, మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్యపై ‘సైనైడ్’ చిత్రాన్ని, స్మగ్లర్ వీరప్పన్ ఎన్‌కౌంటర్‌పై ‘అట్టహాస’ చిత్రాలను తీసి సంచలనం సృష్టించారు.