అదానీ చేతికి మరో మూడు విమానాశ్రయాలు | Union Cabinet approves proposal to lease out 3 AAI airports | Sakshi
Sakshi News home page

అదానీ చేతికి మరో మూడు విమానాశ్రయాలు

Published Thu, Aug 20 2020 4:27 AM | Last Updated on Thu, Aug 20 2020 5:06 AM

Union Cabinet approves proposal to lease out 3 AAI airports - Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్‌ మూడు విమానాశ్రయాలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం విధానంలో(పీపీపీ) లీజుకు ఇచ్చేందుకు బుధవారం ఆమోదం తెలియజేసింది. ఈ మూడు.. జైపూర్, తిరువనంతపురం, గువాహటి విమానాశ్రయాలు కాగా, వీటి నిర్వహణ హక్కులను అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ బిడ్‌ రూపంలో గతేడాది గెలుచుకుంది. ఈ మూడింటితోపాటు లక్నో, అహ్మదాబాద్, మంగళూరు విమానాశ్రయాలను కూడా 2019 ఫిబ్రవరిలో అదానీ దక్కించుకుంది.

ఈ ఆరింటిలో అహ్మదాబాద్, మంగళూరు, లక్నో విమానాశ్రయాలను అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు లీజుకు ఇచ్చేందుకు అనుకూలంగా 2019 జూలైలోనే కేంద్రం ఆమోదం తెలిపింది. మిగిలిన మూడు విమానాశ్రయాలనూ పీపీపీ విధానంలో లీజునకు తాజాగా ఆమోదముద్ర వేసింది. ఈ వివరాలను కేబినెట్‌ భేటీ తర్వాత కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ మీడియాకు తెలియజేశారు. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ సొంతం చేసుకున్న ఆరు విమానాశ్రయాలు ప్రస్తుతం ఎయిర్‌ పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) నిర్వహణలో ఉన్నాయి.

కేంద్ర కేబినెట్‌ తొలుత ఆమోదం తెలిపిన లక్నో, మంగళూరు, అహ్మదాబాద్‌ విమానాశ్రయాల నిర్వహణ, కార్యకలాపాలు, అభివృద్ధి కి సంబంధించి రాయితీ ఒప్పందాన్ని ఈ ఏడాది ఫి బ్రవరి 14న ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాతో అదానీ కుదుర్చుకుంది. వాస్తవానికి వీటిని ఆగస్ట్‌ 12 నాటికే అదానీ స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. కరోనా కారణంగా ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో నవంబర్‌ 12 వరకు గడువును ఏఏఐ పొడిగించింది. తాజాగా లీజునకు ఆమోదం తెలియజేసిన వాటిల్లో గువాహటి, తిరువనంతపురం విమానాశ్రయాల  ప్రైవేటీకరణపై కోర్టుల్లో విచారణ కొనసాగుతోంది.

కాగా, కోర్టు నుంచి ఎటువంటి స్టే ఆదేశాలు లేనందున, వీటి లీజు విషయంలో ముందుకు వెళ్లొచ్చని కేంద్రం భావించింది. ‘‘ఈ విమానాశ్రయాలను పీపీపీ కిందకు బదిలీ చేయ డం అంటే సమర్థవంతమైన, నాణ్యమైన సేవలను ప్రయాణికులకు అందించేందుకు వీలు కల్పించడం. ఏఏఐ ఆదా యం పెరగడమే కాకుండా, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో మరిన్ని విమానాశ్రయాల అభివద్ధిపై ఏఏఐ దృష్టిసారించేందుకు అవకాశం లభిస్తుంది’’ అంటూ పౌర విమానయాన మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి ట్వీట్‌ చేశారు. ‘‘జైపూర్, గువాహటి, తిరువనంతపురం విమానాశ్రయాలను శాశ్వతం గా ప్రైవేటు ఆపరేటర్‌కు ఇవ్వడం లేదు. 50 ఏళ్ల నిర్వహణ తర్వాత  ఆయా విమానాశ్రయాలను ఏఏఐకి తిరిగి ఇచ్చేయాలి.  ఈ లీజు వల్ల ఏఏఐకి ప్రారంభంలోనే రూ.1,070 కోట్లు లభిస్తాయి. ప్రయాణికులకు మంచి సేవలు లభిస్తాయి‘‘అని ప్రకాశ్‌ జవదేకర్‌ మీడియాకు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement