=అందమైన మురికి కూపం!
=జాడ లేని మల్టీ లెవల్ కాంప్లెక్స్
=ఫైళ్లలో మూలుగుతున్న కార్ పార్కింగ్ జోన్
= అడుగు ముందుకేయని టెండర్లు
గ్రేటర్ సిటీకి గుండెకాయ లాంటి స్థలం. నగరం నడిబొడ్డున హన్మకొండ చౌరస్తాకు వెళ్లే మెయిన్ రోడ్డుపై, డీసీసీ భవన్‌ను ఆనుకుని ఉన్న కోట్లాది రూపాయల విలువ చేసే ఈ స్థలం ఖాళీగా ఉంటోంది. హైదరాబాద్‌లోని సుల్తాన్‌బజార్‌ను తలపించే ఖరీదైన సెంటర్‌లో ఇదో మురికి కూపంగా నగరానికి వచ్చి వెళ్లే వారందరినీ వెక్కిరిస్తోంది. ఆరు వేల చదరపు గజాల విస్తీర్ణమున్న ఈ స్థలాన్ని... ఉపయోగించుకునే ఆలోచన లేకపోవడం అధికారుల ప్రణాళికాలోపానికి అద్దం పడుతోంది.
సాక్షి ప్రతినిధి, వరంగల్: థియేటర్లు, హోటళ్లు, బహుళ అంతస్తుల భవనాలు... ప్రధాన రహదారికి ఇరువైపులా వ్యాపార సముదాయాలు కిక్కిరిసిన చోట ఉన్న వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్‌కు చెందిన స్థిరాస్తి... పాత మునిసిపల్ కార్యాలయ ఖాళీ స్థలం వైపు కార్పొరేషన్ అధికారులు కన్నెత్తి చూడకపోవడం విస్మయం కలిగిస్తోంది. 2004లో అప్పటి పాలకవర్గం ఇక్కడ మల్టీ లెవల్ కమర్షియల్ పార్కింగ్ కాంప్లెక్స్‌ను నిర్మించాలని తీర్మానించింది. రెండు ప్రాజెక్టులకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
2005లో రాజీవ్ నగరబాటలో భాగంగా జిల్లాకు వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి రూ. 13 కోట్లతో ఇక్కడ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అంత పెద్ద మొత్తంలో బడ్జెట్ లేకపోవడంతో కార్పొరేషన్ వెనుకడుగు వేసింది. దీంతో ఈ ప్రాజెక్టును పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) పద్ధతిన పూర్తి చేయాలని టెండర్లను ఆహ్వానించింది. అప్పట్లో ఐదు సంస్థలు టెండర్లు దాఖలు చేయగా.. చివరకు రెండు సంస్థలు నిర్మాణానికి ముందుకొచ్చాయి. కానీ... అప్పటి పాలకవర్గంలో పెద్దల ఆధిపత్య పోరుతో ఈ నిర్మాణం పెండింగ్‌లో పడింది.
కమర్షియల్ కాంప్లెక్స్ టు కార్ పార్కింగ్ జోన్
గత ఏడాది ఈ ప్రాజెక్టుపై ఇటీవల బదిలీపై వెళ్లిన బల్దియూ కమిషనర్ వివేక్‌యాదవ్, ఎస్‌ఈ శ్రీధర్ దృష్టి సారించారు. ఐదంతస్తుల మల్టీ లెవల్ పార్కింగ్ కమ్ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. కార్పొరేషన్ వద్ద ప్రాజెక్టుకు సరిపడే నిధులు లేనందున పీపీపీ విధానంలో నిర్మించేందుకు ఫైళ్లు కదిపారు. అండర్ గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్‌లో వాహనాల పార్కింగ్, మూడు, నాలుగో అంతస్తులో షాపింగ్ కాంప్లెక్స్‌ను నిర్మించేందుకు డిజైన్ రూపొందించారు. వరంగల్ గ్రేటర్ సిటీగా ఆవిర్భవించనున్న నేపథ్యంలో జోనల్ కార్యాలయాలు ఏర్పాటు చేయూల్సి ఉంటుందని అధికారులు భావించారు.
ఈ మేరకు ఐదో అంతస్తులో కార్యాలయం ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా కాంప్లెక్స్ నిర్మాణానికి ప్లాన్ చేశారు. హన్మకొండ చౌరస్తా సమీపంలో ఉండడంతో.. షాపింగ్ కాంప్లెక్స్‌కు ఉన్న డిమాండ్ దృష్ట్యా నిట్ ప్రొఫెసర్లతో అధ్యయనం చేయించారు. చివరకు కాంప్లెక్స్‌కు బదులుగా 750 కార్లు పార్కింగ్ చేసేందుకు వీలుగా ‘కంప్యూటర్ కంట్రోల్డ్ మల్టీ టైర్ కార్ పార్కింగ్ జోన్’ నిర్మించాలని నిర్ణయించారు.
ఒప్పందం దశలో మూలకుపడ్డ ఫైళ్లు
కార్ పార్కింగ్ జోన్ డిజైన్ మొదలు నిర్మాణం, నిధులు, నిర్వహణ బాధ్యతలన్నీ టోల్‌గేట్ తరహాలో పీపీపీ పద్ధతిన అప్పగించేందుకు కార్పొరేషన్ అధికారులు ఈ ఏడాది ఏప్రిల్‌లో టెండర్లు పిలిచారు. నాలుగు కంపెనీలు బిడ్లు దాఖలు చేయగా... పూణేకు చెందిన ఇక్రా(ఐసీఆర్‌ఏ), హైదరాబాద్‌కు చెందిన నావోలిన్, ఇగిస్ ఇండియా కన్సల్టింగ్ సర్వీసెస్ కంపెనీలు సాంకేతికంగా అర్హత సాధించాయి. సాంకేతిక, ఆర్థిక ప్రమాణాలు, అర్హతల ఆధారంగా ఈ ప్రాజెక్టును వీటికి కట్టబెట్టాలి. తీరా.. నిర్ణయం తీసుకునే సమయంలో అధికారులు ఫైళ్లు పక్కన పడేశారు.
దీంతో ఇప్పటికీ టెండర్ల ప్రక్రియ ఒప్పందం దశకు చేరుకోలేదు. దీంతో కోట్లాది రూపాయలు విలువ చేసే ఖాళీ స్థలం మళ్లీ ఫైళ్లలోనే మూలనపడింది. పెద్ద గుంత తవ్వి ఉండడంతో నీళ్లు నిలిచి ఈ ప్రాంతం మురికికూపంలా తయూరైంది. రోడ్డు వైపు కచోరి బండ్లు, చలికాలంలో నేపాలీల స్వెటర్ల వ్యాపారం ఇక్కడ వర్ధిల్లుతోంది. కానీ.. తొమ్మిదేళ్ల కిందట తలపెట్టిన ప్రాజెక్టుకు ఇప్పటికీ మోక్షం లేకపోవడం కార్పొరేషన్ పనితీరుకు అద్దం పడుతోంది.
హార్ట్ ఆఫ్ ది సిటీ
Published Mon, Nov 25 2013 2:44 AM | Last Updated on Sat, Sep 2 2017 12:57 AM
Advertisement
Advertisement