భారత్ ప్రపంచశక్తుల్లో ఒకటిగా నిలిచేందుకు రాబోయే ఐదేళ్లు అత్యంత కీలకమైనవని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం అనంతరం ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్‌లోని జేపీ చౌక్ దగ్గర నిర్వహించిన ఓ సన్మాన కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. ‘భారత చరిత్రలో 1942–47 మధ్యకాలానికి ఎంత ప్రాముఖ్యత ఉందో భారత్‌ను ప్రపంచశక్తిగా నిలబెట్టేందుకు రాబోయే ఐదేళ్లు అంతే ముఖ్యమైనవి.’ అని తెలిపారు. అదృష్టవశాత్తు ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించారు. అయినా, వినమ్రంగా ఉండాలని హితబోధ చేశారు.