![Mamata Banerjee warns BJP against clashing in West Bengal - Sakshi](/styles/webp/s3/article_images/2019/06/6/923951.jpg.webp?itok=4b5E95Wh)
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీపై విరుచుకుపడ్డారు. తమతో ఎవరైనా పెట్టుకుంటే నాశనమైపోతారని హెచ్చరించారు. రంజాన్(ఈద్–ఉల్–ఫితర్) సందర్భంగా కోల్‌కతాలోని రెడ్ రోడ్డులో ప్రార్థనలకు హాజరైన 25,000 మందికిపైగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ..‘మాతో ఎవరైనా పెట్టుకుంటే నాశనమైపోతారు.. ఇకపై ఇదే మా నినాదం. బీజేపీ మతాన్ని రాజకీయం చేస్తోంది. హిందువులు త్యాగానికి ప్రతీకలు. ముస్లింలు ఇమాన్(సత్యప్రియత)కు, క్రైస్తవులు ప్రేమకు, సిక్కులు బలిదానానికి ప్రతీకలు. మనమంతా ప్రేమించే భారతదేశం ఇదే.
దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రక్షించుకుంటాం’ అని మమత తెలిపారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై స్పందిస్తూ.. ‘ఎవ్వరూ భయపడాల్సిన పనిలేదు. కొన్నిసార్లు సూర్యుడు ఉదయించినప్పుడు ఆ కిరణాల తీవ్రత అధికంగా ఉంటుంది. కానీ కొంతసేపటికే అది తగ్గిపోతుంది. ఈవీఎంల సాయంతో వాళ్లు(బీజేపీ) ఎంతత్వరగా అధికారంలోకి వచ్చారో, అంతేత్వరగా తెరమరుగైపోతారు’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ముస్లింలకు బెంగాల్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి, సీఎం మమత రంజాన్ శుభాకాంక్షలు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment