అమిత్ షా, గోయెల్, తోమర్, స్మృతి ఇరానీ
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ కూర్పుపై ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వరసగా రెండోరోజు బుధవారం సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కొత్త మంత్రివర్గానికి తుది రూపు ఇచ్చారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మంత్రివర్గం సైజు 60 వరకు ఉండొచ్చనే సమాచారం నేపథ్యంలో నాలుగు కీలక శాఖలు హోం, ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాలు ఎవరికి దక్కుతాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సీనియర్ మంత్రుల్లో చాలామందికి తిరిగి కేబినెట్‌లో స్థానం దక్కుతుందని, వారితో పాటు కొన్ని కొత్త ముఖాలు ఉంటాయని తెలుస్తోంది.
బీజేపీకి తగిన రాజకీయ వ్యూహాన్ని రచించి భారీ విజయాన్ని చేకూర్చినట్టుగా ప్రశంసలందుకుంటున్న అమిత్ షా తొలిసారిగా కేంద్ర కేబినెట్‌లో చేరి కీలక శాఖను దక్కించుకుంటారనే ఊహాగానాలు సాగుతున్నా దీనిపై స్పష్టతలేదు. వచ్చే ఏడాదిలోగా పలు కీలక రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో షా బీజేపీ అధ్యక్షుడిగానే కొనసాగు చాన్సుంది. పాత కేబినెట్‌లోని ప్రధాన సభ్యులందరికీ తిరిగి అవకాశం వస్తుందని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
రాజ్‌నాథ్, గడ్కారీ, నిర్మలా సీతారామన్, స్మృతీ ఇరానీ, రవిశంకర్ ప్రసాద్, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, నరేంద్రసింగ్ తోమర్, ప్రకాశ్ జవదేకర్‌లు కొనసాగే అవకాశం ఉంది. అమేథీలో రాహుల్ గాంధీని ఓడించి జెయింట్ కిల్లర్‌గా పేరు గడించిన స్మృతీ ఇరానీకి మంచి శాఖ దక్కే అవకాశం ఉంది. తోమర్ స్పీకర్‌గా కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఒడిశా, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో పెరుగుతున్న బీజేపీ బలాన్ని కొత్త కేబినెట్ ప్రతిబింబించవచ్చనే సంకేతాలు ఉన్నాయి. అనారోగ్య కారణాల వల్లే ఇటీవలి ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ సుష్మాస్వరాజ్‌కు మోదీ కొత్త కేబినెట్‌లో చోటు దక్కవచ్చని పార్టీవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
శివసేన, జేడీయూలకు చెరో రెండు
ఇక మిత్రపక్షాల విషయానికొస్తే శివసేన, జేడీ(యూ)లకు ఒక కేబినెట్, మరొక సహాయమంత్రి చొప్పున రెండేసి బెర్తులు దక్కే వీలుంది. లోక్ జన్‌శక్తి, శిరోమణి అకాలీ దళ్ పార్టీలకు చెరొక పదవి రావచ్చు. బుధవారం అమిత్ షాతో బిహార్ సీఎం నితీశ్ భేటీ అయ్యారు. కేబినెట్‌లో జేడీ(యూ) ప్రాతినిధ్యంపై ఉభయులూ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. మోదీ ప్రభుత్వంలో తమ ప్రతినిధిగా పార్టీ అధ్యక్షుడు రాంవిలాస్ పాశ్వాన్ పేరును సిఫారసు చేస్తూ ఎల్‌జేపీ ఇప్పటికే తీర్మానం ఆమోదించింది. గత మంత్రివర్గంలో భాగస్వామి కాని ఏఐఏడీఎంకే ఒక సీటు గెలిచిన నేపథ్యంలో ఆ పార్టీ తమిళనాడులో అధికారంలో ఉండటం, కీలక ద్రవిడ మిత్రపక్షం కావడాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ పార్టీ నేత ఒకరికి స్థానం కల్పించవచ్చు. కర్ణాటక నుంచి సదానందగౌడ, ప్రహ్లాద్ జోషిల పేర్లు, మహారాష్ట్ర నుంచి గడ్కారి, జవదేకర్, సురేశ్‌ప్రభులతో పాటురావు సాహెబ్ దాన్వే పేరు ఖరారైనట్లు సమాచారం.
బీజేపీ అధ్యక్ష రేసులో నడ్డా, భూపేందర్
అరుణ్ జైట్లీ కేబినెట్‌లో చేరలేనని స్పష్టం చేయడంతో.. కీలకమైన ఆర్థిక శాఖపై ఊహాగానాలు మొదలయ్యాయి. జైట్లీ స్థానంలో బాధ్యతలు చేపట్టి ఎన్నికల ముందు ప్రజా బడ్జెట్ ప్రవేశపెట్టిన రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఈ పదవికి ప్రధాన పోటీదారు కావచ్చని తెలుస్తోంది. ఇక గాంధీనగర్ నుంచి లోక్‌సభకు ఎన్నికైన అమిత్ షా కనుక కేబినెట్‌లో చేరితే.. జేపీ నడ్డా, భూపేందర్ యాదవ్ బీజేపీ అధ్యక్షుడి రేసులో మొదటిస్థానంలో ఉంటారని తెలుస్తోంది. మంత్రులు, మంత్రుల శాఖలపై బీజేపీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment