కోల్‌కతా నుంచి ఢిల్లీకి బయల్దేరిన బీజేపీ కార్యకర్తల కుటుంబసభ్యులు
కోల్‌కతా: న్యూఢిల్లీలో గురువారం జరిగే ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి తాను హాజరు కావడం లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. తృణమూల్ కార్యకర్తల చేతిలో హతమైన బీజేపీ కార్యకర్తల కుటుంబీకులను ప్రమాణస్వీకారోత్సవానికి తీసుకెళుతున్నట్టు బీజేపీ నేతలు ప్రకటించిన నేపథ్యంలో తాను ప్రమాణస్వీకారానికి రావట్లేదని మమత ట్వీట్‌చేశారు. మరోవైపు గత ఏడాది కాలంలో తృణమూల్ దాడుల్లో హతులైన 50కి పైగా బీజేపీ కార్యకర్తల కుటుంబాలను అమరుల గౌరవసూచికగా ప్రమాణస్వీకారానికి ఢిల్లీ తీసుకెళుతున్నట్టు బీజేపీ నేత ముకుల్ రాయ్ చెప్పారు.
కాగా, బీజేపీ ఆరోపణలను తృణమూల్ ఖండించింది. తమ రాష్ట్రంలో రాజకీయ హత్యలేమీ లేవని టీఎంసీ వ్యాఖ్యానించింది. అమరుల కుటుంబాలను గౌరవించాలని బీజేపీ భావిస్తే ఘర్షణల్లో అమరుడైన తృణమూల్ కార్యకర్తల కుటుంబాలను ఢిల్లీకి తీసుకెళ్లాలని టీఎంసీ నేత సవాల్ విసిరారు. ప్రమాణానికి వెళ్లొద్దని మరో ఇద్దరు సీఎంలతో మాట్లాడిన తర్వాత మమత ఈ ప్రకటన చేశారు. అయితే, 24 గంటల్లోనే ఆమె తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. బీజేపీ ఆరోపిస్తున్నట్టు వారి కార్యకర్తలు తమ కార్యకర్తల దాడుల్లో చనిపోలేదని, కుటుంబ కలహాలు, వ్యక్తిగత కారణాల వల్ల మరణించారని మమత తెలిపారు.
ప్రజాస్వామ్య ఉత్సవాన్ని బీజేపీ సంకుచిత రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నందున ప్రమాణస్వీకారోత్సవానికి హాజరు కారాదని నిర్ణయించుకున్నానని మమత ట్వీట్ చేశారు.‘నూతన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారూ..శుభాకాంక్షలు. మీ ఆహ్వానాన్ని మన్నించి, ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలనుకున్నాను. అయితే, బెంగాల్‌లో తమ కార్యకర్తలు రాజకీయ హత్యకు గురయ్యారని బీజేపీ చెబుతున్నట్టు మీడియాలో చూశాను. ఇది అబద్ధం. వ్యక్తిగతకుటుంబ కలహాలు, ఇతరత్రా కారణాలు వారి మరణానికి కారణం కావచ్చు. ప్రమాణస్వీకారాన్ని తమ రాజకీయ ప్రయోజనాలకు వాడి ఏ రాజకీయ పార్టీ కూడా ఈ కార్యక్రమం విలువను తగ్గించకూడదు. ఈ పరిస్థితుల్లో నేను మీ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నాను. క్షమించండి’ అని పేర్కొన్నారు.
నేడు తృణమూల్ ధర్నా
తృణమూల్ కార్యకర్తలు, నేతలపై జరుగుతున్న దాడులకు నిరసనగా తృణమూల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం నైహతి మునిసిపల్ కార్యాలయం ముందు ధర్నా జరగనుంది. ఈ ధర్నాలో మమత పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment