ఆర్థికమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న నిర్మల. చిత్రంలో సహాయమంత్రి ఠాకూర్
రెండో సారి అధికారం చేపట్టిన మోదీ మంత్రివర్గంలో కీలకమైన ఆర్థిక శాఖను చేపట్టి నిర్మలా సీతారామన్ దేశంలో తొలి మహిళా ఆర్థిక మంత్రిగా చరిత్ర సృష్టించారు. గతంలో ఇందిరా గాంధీ తాత్కాలికంగా ఆర్థిక శాఖను నిర్వహించినా పూర్తి స్థాయి మంత్రిగా నియమితులయిన మహిళ నిర్మలా సీతారామనే. నిర్మల గతంలో ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ దగ్గర సహాయ మంత్రిగా పని చేశారు. వాణిజ్య, పరిశ్రమల శాఖలను నిర్వహించారు. గత ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా పని చేసిన నిర్మలా రామన్ సమర్ధురాలిగా నిరూపించుకున్నారు.
దేశం వృద్ధిరేటు తిరోగమనంలో ఉండటం,ఉపాధి కల్పన ఆశించిన మేర జరగకపోవడం,ద్రవ్యోల్బణం శృతి మించుతున్న ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో ఆర్థిక శాఖను నిర్వహించడం నిర్మలా సీతా రామన్‌కు సవాలేనని పరిశీలకులు అంటున్నారు. వృద్ధి రేటును పరుగులు పెట్టించాలంటే ప్రధానంగా ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం, ఆర్థి క సౌష్టవం, జీఎస్టీ సరళీకరణ, బ్యాంకుల పునరుజ్జీవం, ఉపాధి కల్పనలపై మంత్రి దృష్టి సారించాల్సి ఉంటుందని వారు స్పష్టం చేస్తున్నారు . కొత్త ఆర్థిక మంత్రి జీఎస్టీని మరింత సరళీకరించాల్సిన అవసరం ఉంది. ఆర్థిక రంగంలో వీలయినన్ని ఎక్కువ ఉద్యోగాలు కల్పించేలా నూతన ఆర్థిక మంత్రి చర్యలు తీసుకోవాలి. బ్యాంకులను కాపాడేందుకు కొత్త విత్త మంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
రక్షణకి రాజమార్గం
రక్షణ శాఖ మంత్రిగా రాజ్‌నాథ్ సింగ్
కొత్తగా రక్షణ శాఖ బాధ్యతల్ని అప్పగించిన బీజేపీ కీలక నేత రాజ్‌నాథ్ సింగ్‌కు కేంద్ర హోంశాఖను పరుగులు పెట్టించిన సామర్థ్యముంది. సాయుధ దళాల ఆధునీకరణ, రక్షణ రంగం పాత్ర, మేకిన్ ఇండియా కార్యక్రమాలు, కశ్మీర్ అంశంలో వ్యూహాలు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం వంటి సవాళ్లు ఆయన ఎలా ఎదుర్కొంటారు. ఇప్పుడు ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మేకిన్ ఇండియా ప్రాజెక్టులోకి రక్షణ శాఖను కూడా తీసుకువచ్చి సరికొత్త సంస్కరణలకు తెరతీసిన సమయమిది. త్రివిధ దళాలకు సమప్రాధాన్యం దక్కేలా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) అనే కొత్త పదవిని సృష్టించి కార్యకలాపాలు నిర్వహించబోతున్నారు. వీటన్నింటిని ప్రధాని ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా నడిపించడం రాజ్‌నాథ్ ముందున్న సవాల్.
వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై అడుగులు ఎటు
రక్షణ శాఖలో గేమ్‌ఛేంజర్‌గా భావించే వ్యూహాత్మక భాగస్వామ్య విధానంపై కొత్త ప్రభుత్వం స్పష్టతనివ్వాలని ప్రైవేటు రంగం డిమాండ్ చేస్తోంది. ఈ విధానం ప్రకారం విదేశీ సాంకేతిక సహకారం అందించే సంస్థతో కలిసి ప్రైవేటు సంస్థలు జలాంతర్గాములు, హెలికాప్టర్లు, సాయుధ వాహనాలు, తేలికపాటి యుద్ధ విమానాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు తయారు చేయాలి. మోదీ ప్రభుత్వం ఎన్నో తర్జనభర్జనలు, చర్చోపచర్చల తర్వాత ఈ మెగా ప్రాజెక్టుల అమలు ప్రభుత్వ రంగ సంస్థలకే అప్పగించింది. దీంతో ప్రైవేటు రంగంలో బడా బడా సంస్థలు నిరుత్సాహానికి లోనయ్యాయి. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలు పనితీరు సరిగా లేక ఒప్పందాలు ముందుకు కదలడం లేదు. ఈ పరిణామాలతో స్వదేశీ శక్తితో రక్షణ రంగాన్ని ముందుకు పరుగులు పెట్టించాలంటే ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం తప్పనిసరనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీనిపై రాజ్‌నాథ్ సింగ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న ఉత్కంఠ నెలకొంది. ఇక హోంశాఖ మంత్రిగా ఉన్న అనుభవంతో కశ్మీర్ భద్రతకు దీర్ఘ కాల ప్రణాళికలు రూపొందించడం కూడా రాజ్‌నాథ్ ముందున్న సవాలే.
జై జై శంకర్
మళ్లీ సొంత గూటికి జైశంకర్
ఒక అరుదైన వ్యక్తికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అప్పగించారు. ఆయన లోక్‌సభ సభ్యుడు కాదు. రాజ్యసభలోనూ సభ్యత్వం లేదు. అయినప్పటికీ ఆయనలో ఉన్న దౌత్యనీతికి, రాయబారం చేయడంలో నేర్పరితనానికి ప్రధాని ముగ్ధుడై ఏరికోరి కేబినెట్‌లో చేర్చుకున్నారు. ఆయనే విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి ఎస్. జైశంకర్. ప్రపంచపటంపై భారత్ హోదాను మరింత పెంచాలంటే, విదేశాంగ విధానంలో దూకుడు ప్రదర్శించాలని దానిని సమర్థవంతంగా నిర్వహించగలిగేది జైశంకరేనన్న నమ్మకంతో మోదీ ఆయనకి ఈ పదవిని అప్పగించారు. యూపీఏ హయాంలో విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేసిన నట్వర్ సింగ్ ఒకప్పుడు దౌత్యవేత్త. కానీ విదేశాంగ శాఖ కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తికి, చట్టసభల్లో ఎలాంటి ప్రాతినిధ్యం లేకుండా ఏకంగా మంత్రి పదవిని కట్టబెట్టడం ఇదే తొలిసారి. చైనా, అమెరికాలతో దౌత్యవ్యవహారాలను నడపడంలో అందెవేసిన చెయ్యిగా పేరు తెచ్చుకున్న జైశంకర్ ఇక ముందు ముందు విదేశాంగ విధానంలో ఎలాంటి మార్పులు తెస్తారోనన్న అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వివేకవంతుడు, హాస్య చతురత గల వ్యక్తిగా జైశంకర్‌కి పేరుంది.
సవాళ్లు ఇవే
ప్రపంచపటంపై భారత్ హోదాని పెంచడం, జీ–20, బ్రిక్స్ వంటి భాగస్వామ్య కూటముల వ్యవహారాలను చాకచక్యంతో నడపడం, అమెరికా, రష్యా, ఫ్రాన్స్, యూరోపియన్ యూనియన్, ఇతర పొరుగుదేశాలతో వాణిజ్య, రక్షణ సంబంధాలను బలోపేతం చేయడం వంటి సవాళ్లు ఉన్నాయి. ముఖ్యంగా డోక్లాం సంక్షోభంతో చైనా, భారత్ మధ్య క్షీణించిన సంబంధాలను బలోపేతం చేయడం జయశంకర్ ముందున్న మరో సవాల్. ఐరాసభద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించడం, అణు సరఫరా గ్రూప్‌లో భారత్ పాత్ర వంటి అంశాల్లో ఆయన పనితీరును చూడాల్సిందే.
రాయబారిగా ఎనలేని ప్రతిభ
వివిధ దేశాల్లో రాయబారిగా , విదేశాంగ శాఖ కార్యదర్శిగా ఆయన ఎంతో ప్రతిభ కనబరిచారు. 2015లో విదేశాంగ శాఖ కార్యదర్శిగా నియమితులై మోదీ అమెరికా పర్యటనని విజయవంతం చేయించారు. అణు సరఫరా గ్రూప్‌లో భారత్‌కి స్థానం దక్కాలన్న ప్రచారానికి ఊతమిచ్చారు. ఆసియా ఫసిఫిక్ ప్రాంతానికి దగ్గర అవడం ద్వారా భారత దేశపు సముద్ర ప్రాంత దౌత్య విస్తరణకు కృషి చేశారు. స్ట్రాటజిక్ ఎఫైర్స్ కామంటేటర్ కె. సుబ్రహ్మణ్యం, సులోచన దంపతులకు జనవరి 9, 1955న జన్మించారు.
సైకిల్‌పై ప్రయాణం
పూరిపాకలో నివాసం, ఒడిశా మోదీకి కలిసొచ్చిన సామాజిక సేవ
కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ప్రజల మనిషి ప్రతాప్ చంద్ర సారంగిది నిరాడంబర జీవితం.సామాజిక సేవ తప్ప మరోటి తెలీదు. ఆరెస్సెస్‌తో సుదీర్ఘ అనుబంధముంది. బజరంగ్‌దళ్ ఒడిశా రాష్ట్ర అధ్యక్షుడిగానూ చేశారు. ఇప్పటికీ పూరిపాకలోనే నివసిస్తారు. సైకిల్‌పైనే ప్రయాణం చేస్తారు. ప్రజల కోసం పెళ్లి కూడా మానుకున్న ఆయన్ను నియోజకవర్గం ప్రజలు ప్రేమతో పెద్దన్నా అని పిలుస్తారు. మరికొందరు అభిమానులు ఒడిశా మోదీ అని కీర్తిస్తారు. ఒడిశాలో బాలసోర్ నియోజకవర్గం నుంచి సిటింగ్ బీజేడీ ఎంపీ , పారిశ్రామికవేత్త రబీంద్రకుమార్ జెనాను 13 వేల ఓట్ల తేడాతో ఓడించారు.
తనకు వచ్చే ఎమ్మెల్యే పెన్షన్‌లో అత్యధిక భాగం నిరుపేద విద్యార్థులు చదువుకే వినియోగిస్తారు. మొదటిసారి లోక్‌సభకు ఎన్నికై మంత్రి పదవి చేపట్టిన ఆయన ప్రమాణస్వీకారం చేసినప్పుడు చప్పట్లే చప్పట్లు. నిరాడంబర జీవితం, కష్టపడి పనిచేసే తత్వం, ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి ఆయనకు కేంద్ర మంత్రి పదవిని వరించేలా చేసింది. బీజేపీ జాతీయ కార్యనిర్వాహక సభ్యుడైన సారంగి ఒడిశా అసెంబ్లీకి నీలగిరి నియోజకవర్గం నుంచి ఇప్పటికే రెండు సార్లు ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో బాలసోర్ లోక్‌సభ స్థానం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేశారు కానీ ఓడిపోయారు.
క్రియాశీల రాజకీయాల్లో చాలా కాలంగా ఉన్నా మట్టి, వెదురు ఇంట్లోనే ఆయన జీవనం సాగిస్తారు. సంస్కృతంలో దిట్టయిన సారంగి బాలసోర్‌లో ఫకీర్ మోహన్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత రామకృష్ణ మఠంలో ఒక సన్యాసిగా కొనసాగాలనుకున్నారు. కానీ మత పెద్దలు ఆయనని సామాజిక సేవ వైపు మళ్లమని సలహా ఇచ్చారు. అప్పట్నుంచి ఆయన తన చుట్టు పక్కల పల్లెల్లో దీనజనోద్ధరణకే నడుం బిగించారు. గిరిజన ప్రాంతాల్లో పాఠశాలలు నెలకొల్పి విద్యాసుమాలు విరబూయించారు. అప్పట్లోనే ఆరెస్సెస్‌లో చేరి క్రమక్రమంగా ఎదుగుతూ వచ్చారు. సారంగి చేసిన సామాజిక సేవే ఆయనకు కేంద్ర మంత్రి పదవిని కట్టబెట్టింది.
సుష్మా.. వుయ్ మిస్ యూ..
రెండోసారి అధికారపగ్గాలు చేపట్టిన తరువాత ఏర్పాటుచేసిన మంత్రివర్గంలో మాజీ విదేశాంగ శాఖా మంత్రి సుష్మా స్వరాజ్‌కి చోటుదక్కకపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. 2004 నుంచి 2014 వరకు ప్రతిపక్ష నేత హోదాలోనూ, గత బీజేపీ మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిత్వశాఖను సమర్థవంతంగా నిర్వహించిన సుష్మా స్వరాజ్ అనారోగ్య కారణాల రీత్యా ఎన్నికల్లో పోటీచేయడంలేదని ముందుగానే ప్రకటించారు. ‘ఈ మంత్రివర్గంలో మీరు లేకపోవడంతో భారతీయులంతా మిమ్మల్ని మిస్ అవుతున్న భావం కలుగుతోంది. ఆరోగ్యవంతమైన విలువలనూ, భావోద్వేగాలనూ మీరు మంత్రిత్వ శాఖకు కల్పించారు’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఉంటూ కాంగ్రెస్‌కి రాజీనామా చేసి, శివసేన తీర్థం పుచ్చుకున్న ప్రియాంకా చతుర్వేది ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment