శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, నితిన్ గడ్కరీ, రాజ్‌నా«ద్ సింగ్, అమిత్ షా, సదానంద గౌడ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం నాడిక్కడ సమావేశమైన కేంద్ర కేబినెట్ రైతులు, సాయుధ, పారామిలటరీ బలగాలకు పెద్ద పీట వేసింది. రైతులకు ఏటా రూ.6,000 ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ సిద్ధి(పీఎంకేఎస్‌ఎస్) పథకం పరిధిలోకి కొత్తగా 2 కోట్ల మంది రైతులను తీసుకురావాలని నిర్ణయించింది. 2 హెక్టార్లలోపు వ్యవసాయ భూమి ఉండే 12.5 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతుల కోసం మధ్యంతర బడ్జెట్‌లో కేంద్రం పీఎంకేఎస్‌ఎస్ పథకాన్ని ప్రకటించింది.
తాజా కేబినెట్ భేటీలో ఈ 2 హెక్టార్ల పరిమితిని(మినహాయింపులకు లోబడి) కేంద్రం ఎత్తివేసింది. దీనివల్ల కేంద్ర ప్రభుత్వ ఖజానాపై భారం ఏటా రూ.75,000 కోట్ల నుంచి రూ.87,217.50 కోట్లకు చేరుకోనుంది. ఈ విషయమై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ మాట్లాడుతూ..‘పీఎంకేఎస్‌ఎస్ పథకంలో మార్పుల కారణంగా దేశవ్యాప్తంగా మొత్తం 14.5 కోట్ల మంది రైతులు లబ్ధిపొందుతారు. ఈ పథకంలో భాగంగా ఇప్పటికే 3.12 కోట్ల మంది రైతులకు తొలివిడత నగదును, 2.66 కోట్ల మంది రైతన్నలకు రెండో విడత నగదును అందజేశాం’ అని తెలిపారు. చిరువ్యాపారులకు సంబంధించిన పెన్షన్ పథకానికీ కేబినెట్ ఆమోదం తెలిపిందనీ, దీనివల్ల దాదాపు 3 కోట్ల మంది చిల్లర వర్తకులకు లబ్ధిచేకూరుతుందని చెప్పారు.
‘కిసాన్ పెన్షన్’కు ఆమోదం
అలాగే రైతుల సంక్షేమం కోసం తీసుకొచ్చిన ప్రధానమంత్రి కిసాన్ పెన్షన్(పీఎంకేపీవై) పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపినట్లు తోమర్ చెప్పారు. ‘తొలుత 5 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతులను కేంద్రం ఈ పథకం పరిధిలోకి తీసుకురానుంది. 18–40 ఏళ్ల మధ్య వయసుండే రైతులు ఇందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. రైతన్నలు పీఎంకేపీ పథకం కింద ఎంత జమచేస్తారో, కేంద్ర ప్రభుత్వం అంతే మొత్తాన్ని డిపాజిట్ చేస్తుంది. వీరి వయసు 60 సంవత్సరాలు దాటాక ప్రతినెలా రూ.3,000 పెన్షన్ అందుకుంటారు. దీనివల్ల ఖజానాపై ఏటా రూ.10,774.5 కోట్ల భారం పడనుంది’ అని తోమర్ తెలిపారు. ఒకవేళ పెన్షన్‌దారుడు చనిపోతే, అతని జీవితభాగస్వామికి మొత్తం పెన్షన్‌లో 50 శాతం అందుతుందని వెల్లడించారు. అయితే సంబంధిత జీవితభాగస్వామి పీఎంకేపీవై పథకంలో సభ్యుడిగా/సభ్యురాలిగా ఉండరాదని పేర్కొన్నారు.
‘సాయుధ’ స్కాలర్‌షిప్ పెంపు..
శత్రుమూకలతో పోరాడుతూ అమరులైన, పదవీవిరమణ చేసిన సాయుధ, పారామిలటరీ బలగాలు, రైల్వే పోలీసుల కుటుంబసభ్యులకు లబ్ధిచేకూర్చేలా కేంద్ర కేబినెట్ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. అమరుల భార్యలు, పిల్లలకు అందిస్తున్న స్కాలర్‌షిప్ మొత్తాన్ని పెంచే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఉగ్రవాద, మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అధికారుల కుటుంబాలను కూడా ఈ జాబితాలో చేర్చింది. ప్రధానమంత్రి స్కాలర్‌షిప్ పథకం(పీఎంఎస్‌ఎస్) కింద ప్రస్తుతం అమర జవాన్ల కుమారులకు నెలకు రూ.2,000 కుమార్తెలకు రూ.2,250 అందజేస్తున్నారు.
తాజాగా కుమారులకు అందజేస్తున్న మొత్తాన్ని నెలకు రూ.2,500కు, అమ్మాయిలకు అందజేస్తున్న మొత్తాన్ని నెలకు రూ.3,000కు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో అమరులైన పోలీస్ కుటుంబాలకు చెందిన దాదాపు 500 మందికి లబ్ధిచేకూరనుంది. నేషనల్ డిఫెన్స్ ఫండ్ ద్వారా ఎంబీఏ, ఎంసీఏ, మెడికల్, ఇంజనీరింగ్, ఇతర సాంకేతిక కోర్సులు చదివే అమరుల కుటుంబసభ్యులకు ఈ స్కాలర్‌షిప్ అందజేస్తారు. పీఎంఎస్‌ఎస్ కింద ఇప్పటివరకూ అ మరులైన సాయుధబలగాల పిల్లలకు 5,500, పారామిలటరీ బలగాల పిల్లలకు 2,000, రైల్వేపోలీసుల పిల్లలకు 150 స్కాలర్‌షిప్పులను అందజేస్తున్నారు.
బిమ్స్‌టెక్ అధినేతలతో భేటీ..
తన ప్రమాణస్వీకారానికి హాజరైన బిమ్స్‌టెక్(బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, థాయ్‌లాండ్, నేపాల్, భూటాన్) దేశాల అధినేతలతో ప్రధాని మోదీ శుక్రవారం వేర్వేరుగా భేటీ అయ్యారు. తొలుత శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనతో సమావేశమైన మోదీ, ఉగ్రవాదం, తీవ్రవాదం ప్రపంచదేశాలకు పెనుసవాలుగా మారాయని అభిప్రాయపడ్డారు. దక్షిణాసియా భద్రత, శాంతి, సుస్థిరతల కోసం ఇరుదేశాలు కలసికట్టుగా పనిచేయాలని నిర్ణయించారు. అనంతరం మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నౌత్, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ, భూటాన్ ప్రధాని లోతెయ్ శెరింగ్, బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హామీద్‌లతో వేర్వేరుగా సమావేశమైన మోదీ, అన్నిరంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవాలని నిర్ణయించారు. 1997లో ఏర్పాటైన బిమ్స్‌టెక్‌లో భారత్ సహా ఏడు దేశాలు సభ్యులుగా ఉన్నాయి. మరోవైపు ప్రధాని మోదీ జూన్ 9న కొలంబోను సందర్శించే అవకాశముందని ఆ దేశ అధ్యక్షుడు సిరిసేన తెలిపారు. మోదీకి స్వాగతం పలికేందుకు ఉత్సుకతతో ఎదురుచూస్తున్నామని వెల్లడించారు. రెండోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశాక జూన్ 7–8 తేదీల్లో మాల్దీవుల్లో పర్యటించాలని మోదీ నిర్ణయించారు. అక్కడి నుంచి నేరుగా శ్రీలంక వెళతారని దౌత్యవర్గాలు తెలిపాయి.
చాలా సంతోషంగా ఉంది: మోదీ
నూతన కేంద్ర ప్రభుత్వం రైతులు, వ్యాపారుల సంక్షేమానికి సంబంధించి 4 కీలక నిర్ణయాలు తీసుకుందని ప్రధాని మోదీ తెలిపారు. ‘కేబినెట్ భేటీలో చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నందుకు సంతోషంగా ఉంది. దీనివల్ల రైతులు, వ్యాపారులు చాలా లాభపడతారు. కార్మికుల ఆత్మగౌరవం పెరుగుతుంది. వారంతా సాధికారతతో జీవించడం వీలవుతుంది. ఇప్పుడు కాదు.. ఎప్పుడైనా సరే ప్రజలే మాకు తొలి ప్రాధాన్యం’ అని మోదీ ట్వీట్ చేశారు. అంతకుముందు సౌత్‌బ్లాక్‌లోని తన కార్యాలయంలో మహాత్మాగాంధీ, పటేల్ విగ్రహాలకు నివాళులు అర్పించిన అనంతరం మోదీ బాధ్యతలు చేపట్టారు.
జూలై 5న బడ్జెట్..
17వ లోక్‌సభ తొలివిడత సమావేశాలు జూన్ 17 నుంచి జూలై 26 వరకూ జరుగుతాయని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఈ సమావేశాల్లో భాగంగా జూలై 5న బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెడతామని వెల్లడించారు. లోక్‌సభ సమావేశాల సందర్భంగా మొదటి రెండ్రోజులు ఎంపీల ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగుతుందన్నారు. జూన్ 19న లోక్‌సభ స్పీకర్‌ను ఎన్నుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి జూన్ 20న ప్రసంగిస్తారని జవదేకర్ చెప్పారు. బడ్జెట్ సమర్పణకు ఒక్కరోజు ముందుగా ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెడతామన్నారు. మొత్తం 30 రోజులపాటు లోక్‌సభ సమావేశాలు జరుగుతాయని తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 1న అప్పటి కేంద్ర ఆర్థికమంత్రి పీయూష్ గోయల్ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, జూలై 5న ప్రస్తుత కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment