లోక్‌సభలో తొలి అడుగులు | 300 Freshers, Highest Number Of Women And More Muslims MPs | Sakshi
Sakshi News home page

లోక్‌సభలో తొలి అడుగులు

Published Sun, May 26 2019 5:02 AM | Last Updated on Sun, May 26 2019 7:56 AM

300 Freshers, Highest Number Of Women And More Muslims MPs - Sakshi

ప్రపంచంలోనే భారీ ఎన్నికలుగా నమోదైన 2019 లోక్‌సభ ఎన్నికల్లో అనేక రికార్డులు నమోదయ్యాయి. రాజకీయ ఉద్దండులైన ఎంతోమంది సీనియర్లను ఈ ఎన్నికల్లో మట్టికరిపించి ఓ సరికొత్త తరం పార్లమెంట్‌లో అడుగు పెట్టింది. ఈసారి ఏకంగా 300 మంది కొత్తవారు చట్టసభకు ఎన్నికవ్వడం ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓ ప్రత్యేకత. అందులో తొలిసారి లోక్‌సభకు ఎన్నికైన వారిలో బీజేపీ రాజకీయ వ్యూహకర్తగా పేరొందిన అమిత్‌ షా మొదలుకుని క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్, తేజస్వీ సూర్య, జర్నలిస్టు ఇంతియాజ్, దళిత ప్రతినిధి రమ్యా హరిదాస్‌తోపాటుగా గాయకులు, సినీరంగ ప్రముఖులు వంటి వారెందరో ఉన్నారు.

అమిత్‌ షా (బీజేపీ– గుజరాత్‌)
బీజేపీ అధ్యక్షుడు, నేషనల్‌ డెమొక్రటిక్‌ అలయెన్స్‌ (ఎన్డీయే) చైర్‌పర్సన్, అమిత్‌షా లోక్‌సభలోకి తొలిసారిగా అడుగుపెడుతున్నారు. చిన్నప్పటి నుంచీ ఆరెస్సెస్‌లో చురుకైన కార్యకర్తగా ఉన్న అమిత్‌షా గుజరాతీ వ్యాపారవేత్త కుమారుడు.

1986లో బీజేపీలో చేరి 33 ఏళ్ళ వయస్సులో 1997లో తొలిసారిగా గుజరాత్‌ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రెండు దశాబ్దాల పాటు ఎమ్మెల్యేగా, హోంమంత్రిగా పనిచేసిన అనుభవం ఆయన్ను గత ఐదేళ్ళుగా భారత రాజకీయాల్లో ప్రముఖ పాత్రపోషించేలా చేసింది. 1990 నుంచి ప్రధాని మోదీ తలలో నాలుకలా ఉంటూ, గుజరాత్‌లోనూ, దేశవ్యాప్తంగానూ బీజేపీని బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించారు.

జోతిమణి (కాంగ్రెస్‌– తమిళనాడు)

తమిళనాడులో కాంగ్రెస్‌ తరఫున ఎన్నికైన ఏకైక మహిళా అభ్యర్థి జోతిమణి. కరూర్‌ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికై తొలిసారి లోక్‌సభలో అడుగుపెడుతున్నారు. 22 ఏళ్ళకే రాజకీయాల్లోకి వచ్చిన జోతిమణి, మాజీ డిప్యూటీ స్పీకర్, నాలుగుసార్లు ఎంపీ అయిన ఎం.తంబిదురైని 4 లక్షలకుపైగా ఓట్ల తేడాతో ఓడించారు.

ఇంతియాజ్‌ జలీల్‌ (ఎంఐఎం–ఔరంగాబాద్‌)

ఎంఐఎం నుంచి లోక్‌సభలోకి ప్రవేశిస్తున్న పాత్రికేయుడు ఇంతియాజ్‌కి లోక్‌సభ సభ్యుడిగా ఇది తొలి అనుభవం. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌నుంచి తొలుత ఈయన అభ్యర్థిత్వం తిరస్కరణకు గురైనా ప్రకాష్‌ అంబేడ్కర్‌ వంచిత్‌ బహుజన్‌ అఘాదీ పొత్తులో అదృష్టవశాత్తూ ఇంతియాజ్‌కి ఈ సీటు దక్కింది. శివసేన సీనియర్‌ నాయకుడు చంద్రకాంత్‌ ఖయిరేని అతితక్కువ ఓట్ల మెజారిటీతో ఓడించారు. పదిహేనేళ్ళ అనంతరం మహారాష్ట్ర నుంచి ఓ ముస్లిం లోక్‌సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

మిమీ చక్రవర్తి (తృణమూల్‌– పశ్చిమబెంగాల్‌)

చిత్రపరిశ్రమనుంచి వచ్చి ఈ ఎన్నికల్లో రాణించిన వారిలో పశ్చిమబెంగాల్‌కి చెందిన మిమీ చక్రవర్తి, పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ నుంచి పోటీ చేసిన సన్నీడియోల్‌ ప్రముఖులు. ప్రముఖ సినీతార మిమీ చక్రవర్తి పశ్చిమబెంగాల్‌లోని జాదవ్‌పూర్‌ నుంచి లోక్‌సభకు తొలిసారిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి అనుపమ్‌ హజ్రాని దాదాపు మూడు లక్షల ఓట్ల మెజారిటీతో ఓడించి ఘన విజయం సాధించారు మిమీ చక్రవర్తి. బీజేపీ అభ్యర్థిగా గురుదాస్‌పూర్‌నుంచి పోటీ చేసిన సన్నీడియోల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి సునీల్‌ జాఖడ్‌పై 82,459 ఓట్ల మెజారిటీతో గెలుపొంది తొలిసారిగా లోక్‌సభలోకి అడుగిడుతున్నారు.

గౌతమ్‌ గంభీర్‌ (బీజేపీ–తూర్పు ఢిల్లీ)

రాజకీయవేత్తగా మారిన సుపరిచిత క్రికెట్‌ క్రీడాకారుడు గౌతమ్‌ గంభీర్‌ కూడా తొలిసారి లోక్‌సభలో అడుగుపెడుతున్నారు. తూర్పు ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన గౌతమ్‌ గంభీర్‌ ఆప్‌ అభ్యర్థి అతిషీ మర్లేనాపై గెలుపొందారు.


హన్స్‌రాజ్‌ హన్స్‌ (బీజేపీ– నార్త్‌వెస్ట్‌ ఢిల్లీ )

నార్త్‌వెస్ట్‌ ఢిల్లీనుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన ప్రముఖ పంజాబీ సూఫీ గాయకుడు హన్స్‌రాజ్‌ హన్స్‌ కూడా మొదటిసారిగా లోక్‌సభలో అడుగుపెడుతున్నారు. మాజీ ఎంపీ ఉదిత్‌రాజ్‌ స్థానంలో చివరి క్షణంలో హన్స్‌రాజ్‌ హన్స్‌ని బీజేపీ అభ్యర్థిగా ఎంపిక చేసింది. తొలినుంచి రాజకీయాల్లో ఆసక్తి కలిగిన హన్స్‌రాజ్‌హన్స్‌ పంజాబ్‌లోని జలంధర్‌ నుంచి శిరోమణి అకాలీదళ్‌ పార్టీతరఫున 2009 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2014లో ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. 2016లో బీజేపీలో చేరారు.

ప్రజ్ఞాఠాకూర్‌ (బీజేపీ–భోపాల్‌)

మాలెగావ్‌ బాంబు పేలుళ్ళ కేసులో నిందితురాలు, సొంతపార్టీ బీజేపీలోనూ, బయటా విమర్శలనెదుర్కొంటున్న ప్రజ్ఞాఠాకూర్‌ సైతం తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. భోపాల్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసిన ప్రజ్ఞాఠాకూర్‌ కాంగ్రెస్‌ దిగ్గజం దిగ్విజయ్‌సింగ్‌ను మట్టికరిపించారు.

రవిశంకర్‌ ప్రసాద్‌ (బీజేపీ–బిహార్‌)

బిహార్‌లోని పాట్నా సాహిబ్‌ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన రవిశంకర్‌ ప్రసాద్‌ సమీప ప్రత్యర్థి, బాలీవుడ్‌ నటుడు శత్రుఘ్న సిన్హాను 2.84 లక్షల ఓట్ల మెజార్టీతో ఓడించి తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టబోతున్నారు.

స్మృతీ ఇరానీ (బీజేపీ–అమేథీ)

గాంధీ కుటుంబాన్ని చిరకాలంగా ఆదరిస్తోన్న యూపీలోని అమేథీ నియోజకర్గం నుంచి బీజేపీ తరఫున పోటీచేసిన మాజీ          మంత్రి స్మృతీ ఇరానీ ఏకంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై 55,120 ఓట్ల మెజార్టీతో గెలుపొంది తొలిసారి లోక్‌సభలో అడుగుపెడుతున్నారు.

రమ్యా హరిదాస్‌ (కాంగ్రెస్‌– కేరళ)

కేరళలోని అలత్తూర్‌ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ తరఫున రమ్యాహరిదాస్‌ పోటీచేసి గెలుపొందారు. ఈ స్థానానికి ఓ దళిత మహిళ రమ్యాహరిదాస్‌ పేరు వినిపించగానే అంతా ముక్కున వేలేసుకున్నారు. హేమాహేమీలను వదిలేసి రాజకీయ అక్షరాభ్యాసం చేస్తోన్న పంచాయతీ స్థాయి నాయకురాలు రమ్యని ఎంచుకోవడం కాంగ్రెస్‌ సీనియర్లకు ససేమిరా మింగుడుపడలేదు. ఎన్ని విమర్శలెదురైనా, ఎంతమంది అగౌరవ పరిచినా మొక్కవోని దీక్షతో పోరాడి ఈ ఎన్నికల్లో గెలుపొందారు. రెండుసార్లు ఎంపీగా ఉన్న సీపీఎం నాయకుడు పీకే బిజూని ఓడించి తొలిసారి లోక్‌సభలోకి అడుపెడుతున్నారు రమ్యాహరిదాస్‌.

మహువా మోయిత్రా (తృణమూల్‌ – పశ్చిమ బెంగాల్‌)

పశ్చిమబెంగాల్‌లో బీజేపీ «సునామీకి తట్టుకొని నిలబడిన తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి మహువా మోయిత్రా తొలిసారిగా లోక్‌సభలోకి ప్రవేశించబోతున్నారు. కోల్‌కతాలో పుట్టిపెరిగి, అమెరికాలో చదువుకున్న మోయిత్రా 2008లో కాంగ్రెస్‌లో చేరి, ఆ తర్వాత తృణమూల్‌కి మారారు. 2016లో నదియా జిల్లాలోని కరీంపూర్‌ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈసారి అదే జిల్లాలోని కృష్ణానగర్‌ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు కల్యాణ్‌ చౌబేపై 65,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

తేజస్వీ సూర్య (బీజేపీ– కర్ణాటక)

దక్షిణ బెంగళూరు నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎన్నికైన తేజస్వీ సూర్య అత్యంత పిన్నవయస్కుడైన ఎంపీగా తొలిసారి లోక్‌సభలోకి అడుగుపెట్టబోతున్నారు. న్యాయవాద వృత్తిలో ఉన్న తేజస్వీ సూర్య ఏబీవీపీ నాయకుడిగా, ఆరెస్సెస్‌లో క్రియాశీలక కార్యకర్తగా ఉంటూ బీజేపీ యువమోర్చా నాయకుడిగా ఎదిగారు. నామినేషన్‌ దాఖలు చేసిన అనంతరం ‘‘మీరు మోదీతో ఉంటే దేశం పక్షాన ఉన్నట్టు, లేదంటే దేశానికి వ్యతిరేకంగా ఉన్నట్టు’’అంటూ తేజస్వీ చేసిన వీడియో వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయ్యాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement