తిరువనంతపురం : పాలనలో గాంధీ సిద్ధాంతాలను అవలంబించినందు వల్లే నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని అయ్యారంటూ కేరళ కాంగ్రెస్ నేత ఏపీ అబ్దుల్లాకుట్టి ప్రశంసలు కురిపించారు. మోదీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు ఘన విజయానికి దోహదం చేశాయని పేర్కొన్నారు. ముఖ్యంగా స్వచ్ఛ భారత్ అభియాన్ వంటి పథకాలు బీజేపీకి అనుకూల పవనాలు వీచేలా చేశాయని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు.. ‘ నరేంద్ర మోదీ విజయం’ పేరిట ఫేస్‌బుక్ పోస్టులో తన అభిప్రాయాలు పంచుకున్నారు. బీజేపీ ఏకపక్ష విజయం కేవలం విపక్షాలనే కాదు.. ఆ పార్టీ వాళ్లను కూడా విస్మయానికి గురిచేసిందని పేర్కొన్నారు. భేషజాలకు పోకుండా పార్టీలకు అతీతంగా నాయకులంతా సార్వత్రిక ఫలితాలను స్వాగతించాలని హితవు పలికారు. గాంధీ సిద్ధాంతాలను అనుసరించడమే నరేంద్ర మోదీ విజయ రహస్యమని పేర్కొన్నారు.
కాగా ఏపీ అబ్దుల్లాకుట్టి 1999-2004 మధ్య కన్నూరు నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహించారు. నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలోనూ అబ్దుల్లా.. ఆయనపై ప్రశంసలు కురిపించారు. దీంతో క్రమశిక్షణా ఉల్లంఘన చర్యల కింద 2009లో సీపీఐ(ఎం) పార్టీ ఆయనను సస్పెండ్ చేసింది. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా మరోసారి మోదీని ప్రశంసించి చిక్కుల్లో పడ్డారు. ఇక అబ్దుల్లా వ్యాఖ్యలపై స్పందించిన కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు రామచంద్రన్.. ఆయనపై కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment