కొదమసింహాల్లా పోరాడుతాం: రాహుల్‌ గాంధీ | Sonia Gandhi re-elected as leader of CPP | Sakshi
Sakshi News home page

సీపీపీ నేతగా సోనియా

Published Sun, Jun 2 2019 4:15 AM | Last Updated on Sun, Jun 2 2019 8:58 AM

Sonia Gandhi re-elected as leader of CPP - Sakshi

కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చీఫ్‌గా సోనియాను ఎన్నుకుంటున్న దృశ్యం. చిత్రంలో రాహుల్, మన్మోహన్‌

న్యూఢిల్లీ: యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ కాంగ్రెస్‌ పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టారు. పార్లమెంటులోని సెంట్రల్‌హాలులో శనివారం జరిగిన సమావేశంలో కాంగ్రెస్‌ నేతలు ఆమెను కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ(సీపీపీ) నేతగా ఎన్నుకున్నారు. తొలుత సోనియాగాంధీ పేరును మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మన్మోహన్‌సింగ్‌ ప్రతిపాదించగా, మిగతా కాంగ్రెస్‌ ఎంపీలు, ముఖ్య నేతలు చేతులు పైకెత్తి తమ అంగీకారం తెలియజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ లోక్‌సభ పక్షనేతను ఎంపికచేసే బాధ్యతను పార్టీ సోనియాకు అప్పగించింది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం సోనియాగాంధీ మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమితో కాంగ్రెస్‌ శ్రేణులు దిగులుపడొద్దని సూచించారు. పార్లమెంటులో సమర్థవంతమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలనీ, రాజ్యసభలో ఒకేరకమైన భావజాలం ఉన్న రాజకీయ పార్టీలతో కలిసి ముందుకు సాగాలని కాంగ్రెస్‌ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.

నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తాం..
‘ఈ సంక్షోభ సమయంలో కాంగ్రెస్‌ పార్టీకి ఎదురవుతున్న పలు సవాళ్లను మనం గుర్తించాలి. ఇటీవల సమావేశమైన సీడబ్ల్యూసీ పార్టీ భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించింది. పార్టీని పటిష్టం చేయడానికి తీసుకోవాల్సిననిర్ణయాలపై చర్చించాం. యూపీఏ ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిన చరిత్రాత్మక చట్టాలను గత ఐదేళ్ల కాలంలో ఎన్డీయే ప్రభుత్వం రద్దుచేయకుండా అడ్డుకోగలిగాం. సంస్కరణలు, కీలక అంశాల విషయంలో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాం. ప్రభుత్వం చేసే విభజన, తిరోగమన రాజకీయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తాం’ అని సోనియా స్పష్టం చేశారు.

రాహుల్‌పై ప్రశంసలు..
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌గాంధీ అద్భుతంగా పోరాడారని సోనియా కితాబిచ్చారు. ‘కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా ఆయన కోట్లాది మంది ఓటర్లతో పాటు ప్రతీ కాంగ్రెస్‌ కార్యకర్త ప్రేమను, గౌరవాన్ని చూరగొన్నారు. రైతులు, చిరువ్యాపారులు, యువత, మహిళలు, సమాజంలోని బలహీనవర్గాల పట్ల మోదీ ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరించడాన్ని ధైర్యంగా నిలదీశారు.  కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో అవిశ్రాంతంగా, ధైర్యంగా దూసుకుపోయిన రాహుల్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. లోక్‌సభలో 44 మంది, రాజ్యసభలో 55 మంది ఎంపీల బలం మాత్రమే ఉన్నప్పటికీ రాహుల్‌ నాయకత్వంతో కాంగ్రెస్‌ ప్రభుత్వ తప్పులను వెలుగులోకి తీసుకొచ్చింది.

నేనిక్కడ మాట్లాడుతున్నప్పుడు కూడా రాహుల్‌ పార్టీ అధ్యక్ష పదవికి చేసిన రాజీనామాను వెనక్కి తీసుకోవాలని దేశవ్యాప్తంగా విజ్ఞప్తులు వస్తున్నాయి. రాహుల్‌ నాయకత్వంలోనే కాంగ్రెస్‌ ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది’ అని తెలిపారు. రాజ్యసభలో కాంగ్రెస్‌ బలం తగ్గనున్న నేపథ్యంలో భావసారూప్య పార్టీలతో కలిసి ముందుకెళ్లాలని సోనియా పునరుద్ఘాటించారు. మరోవైపు సీపీపీ నేతగా సోనియా ఎంపికపై రాహుల్‌ స్పందిస్తూ..‘పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికైన సోనియాకు శుభాకాంక్షలు. ఆమె నాయకత్వంలో కాంగ్రెస్‌ భారత రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేస్తుందని ఆశిస్తున్నా’ అని ట్వీట్‌ చేశారు.  

బీజేపీని ఇష్టానుసారం వ్యవహరించనివ్వం: రాహుల్‌: లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన 52 మంది కాంగ్రెస్‌ ఎంపీలు రాజ్యాంగాన్ని, రాజ్యాంగబద్ధమైన సంస్థలను కాపాడేందుకు కొదమసింహాల గుంపులా పోరాడుతారని కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వాన్ని పార్లమెంటులో తమ ఇష్టానుసారం వ్యవహరించనివ్వబోమని రాహుల్‌ గాంధీ  స్పష్టం చేశారు. ‘బ్రిటిష్‌ హయాంలో ఉన్నట్టు ఈ ఎన్నికల్లో ఏ రాజ్యాంగబద్ధమైన సంస్థ కూడా సహకరించకపోయినా కాంగ్రెస్‌ పోరాడి గెలిచింది. ఇప్పుడు మళ్లీ పోరాడుతాం.

మనమంతా కులం, మతం, రంగు, జాతి, రాష్ట్రం అనే భేదభావం లేకుండా రాజ్యాంగ పరిరక్షణకు, దేశంలోని ప్రతీఒక్కరి హక్కుల కోసం పోరాడుతున్నామని గుర్తుంచుకోవాలి. ఎన్నికల సందర్భంగా బీజేపీ విద్వేషం, ఆగ్రహాన్ని కాంగ్రెస్‌ ప్రేమ, ఆప్యాయతతో అడ్డుకుంది. అందుకే ఆ పార్టీ నేతలు కాంగ్రెస్‌ ముక్తభారత్‌ అని కలవరిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ లేకపోతే తమకు అడ్డుకునేవారే ఉండరని భావిస్తున్నారు’ అని రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. ఈసారి పార్లమెంటులో మరింత తక్కువ సమయం లభించే అవకాశముందనీ, కాబట్టి ప్రజావాణిని గట్టిగా వినిపించాలని సూచించారు. ఈ ఎన్నికల్లో కొందరు పాతముఖాలు (మల్లికార్జున ఖర్గే, సునీల్‌ కుమార్‌ జాఖడ్, జ్యోతిరాదిత్య సింధియా) ఇక్కడుంటే బాగుండేదని విచారం వ్యక్తం చేశారు.

అధ్యక్ష పదవి రేసులో నలుగురు..
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా తాను ఉండబోనని రాహుల్‌ ప్రకటించిన నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు చేపడతారన్న విషయమై రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ పదవిలో గాంధీయేతర నేతను నియమించి, ఆయనకు సాయంగా సీనియర్‌ నేతలతో ఓ కమిటీని నియమించవచ్చని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చసాగుతోంది. కేరళ పీసీసీ మాజీ చీఫ్, 7 సార్లు లోక్‌సభ సభ్యుడిగా గెలుపొందిన కొడికుణ్ణల్‌ సురేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి రేసులో తొలిస్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ హవాను తట్టుకుని ఐదోసారి ఎంపీగా గెలిచిన అధిర్‌ రంజన్‌ చౌదరి, కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి మనోజ్‌ తివారీ, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్‌ పేర్లు వినిపిస్తున్నాయి. జూన్‌ 17 నుంచి లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సోనియా వీలైనంత త్వరగా ఈ నియామకం చేపట్టే అవకాశముందని భావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement