CPP meeting
-
కొదమసింహాల్లా పోరాడుతాం: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టారు. పార్లమెంటులోని సెంట్రల్‌హాలులో శనివారం జరిగిన సమావేశంలో కాంగ్రెస్ నేతలు ఆమెను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ(సీపీపీ) నేతగా ఎన్నుకున్నారు. తొలుత సోనియాగాంధీ పేరును మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్సింగ్ ప్రతిపాదించగా, మిగతా కాంగ్రెస్ ఎంపీలు, ముఖ్య నేతలు చేతులు పైకెత్తి తమ అంగీకారం తెలియజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ లోక్‌సభ పక్షనేతను ఎంపికచేసే బాధ్యతను పార్టీ సోనియాకు అప్పగించింది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం సోనియాగాంధీ మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమితో కాంగ్రెస్ శ్రేణులు దిగులుపడొద్దని సూచించారు. పార్లమెంటులో సమర్థవంతమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలనీ, రాజ్యసభలో ఒకేరకమైన భావజాలం ఉన్న రాజకీయ పార్టీలతో కలిసి ముందుకు సాగాలని కాంగ్రెస్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తాం.. ‘ఈ సంక్షోభ సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురవుతున్న పలు సవాళ్లను మనం గుర్తించాలి. ఇటీవల సమావేశమైన సీడబ్ల్యూసీ పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించింది. పార్టీని పటిష్టం చేయడానికి తీసుకోవాల్సిననిర్ణయాలపై చర్చించాం. యూపీఏ ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిన చరిత్రాత్మక చట్టాలను గత ఐదేళ్ల కాలంలో ఎన్డీయే ప్రభుత్వం రద్దుచేయకుండా అడ్డుకోగలిగాం. సంస్కరణలు, కీలక అంశాల విషయంలో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాం. ప్రభుత్వం చేసే విభజన, తిరోగమన రాజకీయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తాం’ అని సోనియా స్పష్టం చేశారు. రాహుల్‌పై ప్రశంసలు.. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌గాంధీ అద్భుతంగా పోరాడారని సోనియా కితాబిచ్చారు. ‘కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆయన కోట్లాది మంది ఓటర్లతో పాటు ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త ప్రేమను, గౌరవాన్ని చూరగొన్నారు. రైతులు, చిరువ్యాపారులు, యువత, మహిళలు, సమాజంలోని బలహీనవర్గాల పట్ల మోదీ ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరించడాన్ని ధైర్యంగా నిలదీశారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో అవిశ్రాంతంగా, ధైర్యంగా దూసుకుపోయిన రాహుల్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. లోక్‌సభలో 44 మంది, రాజ్యసభలో 55 మంది ఎంపీల బలం మాత్రమే ఉన్నప్పటికీ రాహుల్ నాయకత్వంతో కాంగ్రెస్ ప్రభుత్వ తప్పులను వెలుగులోకి తీసుకొచ్చింది. నేనిక్కడ మాట్లాడుతున్నప్పుడు కూడా రాహుల్ పార్టీ అధ్యక్ష పదవికి చేసిన రాజీనామాను వెనక్కి తీసుకోవాలని దేశవ్యాప్తంగా విజ్ఞప్తులు వస్తున్నాయి. రాహుల్ నాయకత్వంలోనే కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది’ అని తెలిపారు. రాజ్యసభలో కాంగ్రెస్ బలం తగ్గనున్న నేపథ్యంలో భావసారూప్య పార్టీలతో కలిసి ముందుకెళ్లాలని సోనియా పునరుద్ఘాటించారు. మరోవైపు సీపీపీ నేతగా సోనియా ఎంపికపై రాహుల్ స్పందిస్తూ..‘పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికైన సోనియాకు శుభాకాంక్షలు. ఆమె నాయకత్వంలో కాంగ్రెస్ భారత రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేస్తుందని ఆశిస్తున్నా’ అని ట్వీట్ చేశారు. బీజేపీని ఇష్టానుసారం వ్యవహరించనివ్వం: రాహుల్: లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన 52 మంది కాంగ్రెస్ ఎంపీలు రాజ్యాంగాన్ని, రాజ్యాంగబద్ధమైన సంస్థలను కాపాడేందుకు కొదమసింహాల గుంపులా పోరాడుతారని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వాన్ని పార్లమెంటులో తమ ఇష్టానుసారం వ్యవహరించనివ్వబోమని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ‘బ్రిటిష్ హయాంలో ఉన్నట్టు ఈ ఎన్నికల్లో ఏ రాజ్యాంగబద్ధమైన సంస్థ కూడా సహకరించకపోయినా కాంగ్రెస్ పోరాడి గెలిచింది. ఇప్పుడు మళ్లీ పోరాడుతాం. మనమంతా కులం, మతం, రంగు, జాతి, రాష్ట్రం అనే భేదభావం లేకుండా రాజ్యాంగ పరిరక్షణకు, దేశంలోని ప్రతీఒక్కరి హక్కుల కోసం పోరాడుతున్నామని గుర్తుంచుకోవాలి. ఎన్నికల సందర్భంగా బీజేపీ విద్వేషం, ఆగ్రహాన్ని కాంగ్రెస్ ప్రేమ, ఆప్యాయతతో అడ్డుకుంది. అందుకే ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ ముక్తభారత్ అని కలవరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ లేకపోతే తమకు అడ్డుకునేవారే ఉండరని భావిస్తున్నారు’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈసారి పార్లమెంటులో మరింత తక్కువ సమయం లభించే అవకాశముందనీ, కాబట్టి ప్రజావాణిని గట్టిగా వినిపించాలని సూచించారు. ఈ ఎన్నికల్లో కొందరు పాతముఖాలు (మల్లికార్జున ఖర్గే, సునీల్ కుమార్ జాఖడ్, జ్యోతిరాదిత్య సింధియా) ఇక్కడుంటే బాగుండేదని విచారం వ్యక్తం చేశారు. అధ్యక్ష పదవి రేసులో నలుగురు.. సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తాను ఉండబోనని రాహుల్ ప్రకటించిన నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు చేపడతారన్న విషయమై రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ పదవిలో గాంధీయేతర నేతను నియమించి, ఆయనకు సాయంగా సీనియర్ నేతలతో ఓ కమిటీని నియమించవచ్చని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చసాగుతోంది. కేరళ పీసీసీ మాజీ చీఫ్, 7 సార్లు లోక్‌సభ సభ్యుడిగా గెలుపొందిన కొడికుణ్ణల్ సురేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో తొలిస్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. బెంగాల్లో టీఎంసీ, బీజేపీ హవాను తట్టుకుని ఐదోసారి ఎంపీగా గెలిచిన అధిర్ రంజన్ చౌదరి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనోజ్ తివారీ, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ పేర్లు వినిపిస్తున్నాయి. జూన్ 17 నుంచి లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సోనియా వీలైనంత త్వరగా ఈ నియామకం చేపట్టే అవకాశముందని భావిస్తున్నారు. -
ఇప్పుడు నా బాస్ రాహులే..
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఇప్పుడు తన బాస్ అని సోనియా గాంధీ పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవ ప్రక్రియలో ఉందని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించేందుకు భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి పనిచేస్తానని చెప్పారు. సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం మైనారిటీలపై హింసను బీజేపీ ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. కొద్దినెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలోనూ బీజేపీ ఇలాగే వ్యవహరిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ భేటీలో సోనియా మాట్లాడుతూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీతో కలిసి పార్టీ ఎంపీలంతా అంకితభావం, విశ్వాసంతో పనిచేయాలని పిలుపు ఇచ్చారు. ఇక తనకూ ఇప్పుడు రాహులే బాస్ అని స్పష్టం చేశారు. తనకు సహకరించిన విధంగా రాహుల్‌కూ సహకారం అందించాలని ఎంపీలకు సూచించారు. రాహుల్ నాయకత్వంలో పార్టీ పునరుజ్జీవ ప్రక్రియ సాగుతుందని, ఆ దిశగా అడుగులు పడుతున్నాయని సోనియా ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఈ వారమూ అనుమానమే!
పార్లమెంట్లో ప్రతిష్టంభన కొనసాగే అవకాశం * సుష్మా, రాజే, చౌహాన్‌ల రాజీనామాలపై పట్టువీడని అధికార, విపక్షాలు.. నేడు మరోసారి అఖిలపక్షం * నేటి సీపీపీ భేటీలో ప్రభుత్వంపై ఒత్తిడికి కాంగ్రెస్ వ్యూహరచన న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో సగం రోజులు తుడిచిపెట్టుకుపోయాయి. గత రెండు వారాలుగా నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించే దిశగా ఆలోచించకుండా అధికార విపక్షాలు.. పరస్పర నిందాపర్వాన్ని కొనసాగిస్తున్నాయి. ప్రతిష్టంభనకు మీరంటే మీరు కారణమంటూ ఆరోపణాస్త్రాల్ని సంధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు(సోమవారం) ప్రభుత్వం తలపెట్టిన అఖిలపక్ష భేటీలోనూ ఇరుపక్షాల మధ్య సామరస్యం కుదిరే పరిస్థితి కనిపించడం లేదు. ప్రతికూల ధోరణి, సభను అడ్డుకునే వైఖరిపై కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాలని, అవి దేశాభివృద్ధిని, దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయన్న విషయాన్ని గుర్తించాలని మంత్రి అరుణ్ జైట్లీ ఆదివారం ఫేస్బుక్ వేదికగా కాంగ్రెస్‌పై చురకలు వేయగా.. ప్రధాని అహంకారం, మొండితనం వల్లనే ఈ ప్రతిష్టంభన అని, ప్రతిపక్షంలో ఉండగా తాము వ్యవహరించిన తీరును బీజేపీ ఒకసారి గుర్తుతెచ్చుకోవాలని కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. మోదీగేట్ వ్యవహారంలో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే, వ్యాపమ్ స్కామ్‌కు సంబంధించి మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌ల రాజీనామా డిమాండ్‌పై వెనకడుగు లేదని తేల్చిచెప్పింది. రాజీనామా ప్రసక్తే లేదు: బీజేపీ సుష్మా, రాజేలు రాజీనామా చేసే ప్రసక్తే లేదంటూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు మరోసారి తేల్చిచెప్పారు. అయితే, ఆ విషయంపై చర్చకు ప్రభుత్వం సిద్ధమని, చర్చలో తమ అభిప్రాయాల్ని కాంగ్రెస్ వ్యక్తం చేయొచ్చన్నారు. సభా వ్యవహారాలను అడ్డుకోవడమంటే పార్లమెంటు ధిక్కారమేనని, ప్రస్తుతం నెలకొన్న ప్రతిష్టంభనకు కాంగ్రెస్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలే కారణమని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ విమర్శించారు. ఎటూ పాలుపోని గందరగోళ, రక్షణాత్మక స్థితిలో కాంగ్రెస్ ఉందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఎద్దేవా చేశారు. మోదీగేట్పై పార్లమెంట్లో చర్చించాలని మొదట డిమాండ్ చేసిన కాంగ్రెస్.. అందుకు ప్రభుత్వం ఒప్పుకోవడంతో షాక్ తిన్నదని, అందుకే చర్చ కాదు ముందు రాజీనామాలు చేయాలంటూ కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారని విమర్శించారు. వ్యాపమ్‌పై చర్చ గురించి చెబుతూ.. రాష్ట్రాల వ్యవహారాలపై పార్లమెంట్లో చర్చించకూడదని, ఒకవేళ ప్రతిపక్షం కోరితే, నిబంధనలు సవరించి కేరళ సౌర విద్యుత్ స్కామ్, హిమాచల్ ప్రదేశ్‌లో సీఎం వీరభద్రసింగ్ అవినీతి అంశాలపైనా చర్చిద్దామంటూ చురకలంటించారు. కేరళ, హిమాచల్‌ప్రదేశ్‌ల్లో అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. అధికారుల విషయంలో వ్యవహరిస్తున్నట్లుగానే.. ఎంపీల విషయంలోనూ ‘పని చేస్తేనే వేతనం’ అంశాన్ని పరిశీలించాలన్న సూచన ప్రభుత్వం ముందు ఉందంటూ కేంద్రమంత్రి మహేశ్ శర్మ వారణాసిలో వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఏకాభిప్రాయం సాధించేందుకు సీనియర్ మంత్రులు ప్రతిపక్షాలతో చర్చలు సాగిస్తున్నారన్నారు. అయితే, తన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఆ విషయంపై మాట్లాడేందుకు తాను సరైన వ్యక్తిని కాదని ఆదివారం ఆయన వివరణ ఇచ్చారు. మహేశ్ శర్మ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్.. ఎంపీలు కష్టపడి పనిచేస్తున్నారని, పార్లమెంటరీ కమిటీల పనితీరును చూస్తే ఆ విషయం అర్థమవుతుందని అన్నారు. మరో అఖిలపక్ష భేటీ పార్లమెంట్లో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు సోమవారం మరో అఖిలపక్ష భేటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నేటి భేటీకి అన్ని పార్టీలను ఆహ్వానించామని మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. అయితే, ఆ సమావేశానికి కొన్ని గంటల ముందు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ భేటీ జరగనుంది. పార్టీ చీఫ్ సోనియా నేతృత్వంలో జరిగే ఆ సమావేశంలో అఖిలపక్ష భేటీలో, పార్లమెంట్లో వ్యవహరించాల్సిన తీరును, మోదీగేట్, వ్యాపమ్‌లపై ప్రభుత్వంపై దాడి వ్యూహాన్ని నిర్ణయిస్తారు. భూ బిల్లుపై కాంగ్రెస్‌కు ఝలక్ భూ సేకరణ బిల్లుకు సంబంధించి కాంగ్రెస్‌కు ఆ పార్టీ అధికారంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ ఝలక్ ఇచ్చింది. బీజేపీకి అందివచ్చే ఆయుధాన్నిచ్చింది. యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన భూ సేకరణ చట్టం సంక్లిష్టంగా ఉందని, ఆ చట్టంలో సవరణలు అవసరమేనని అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కుండబద్దలు కొట్టింది. వెనక్కుతగ్గే ఆలోచనే లేదు: కాంగ్రెస్ జైట్లీ వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయన్న కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ.. పెద్దమనిషిలా సుద్దులు చెప్పడం మానేయాలంటూ వ్యంగ్యంగా అన్నారు. గత పదేళ్లలో కన్నా తాము అధికారంలోకి వచ్చిన తరువాతే పార్లమెంటు సజావుగా నడిచిందని బీజేపీ చెప్పుకోవడాన్ని గుర్తు చేస్తూ.. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా కాంగ్రెస్ వ్యవహరించడం వల్లనే అది సాధ్యమైందన్నారు. బీజేపీ అలా నడుచుకోకపోవడం వల్లనే గత పదేళ్లు పార్లమెంటు సజావుగా సాగలేదంటూ ఎత్తిపొడిచారు. బీజేపీ మంత్రుల అవినీతి వ్యవహారాల లెక్క తేలేంతవరకు పార్లమెంట్లో ప్రతిష్టంభన కొనసాగుతుందని, వారి రాజీనామాలపై కాంగ్రెస్ వెనక్కు తగ్గబోదని లోక్‌సభలో కాంగ్రెస్ చీఫ్ విప్ జ్యోతిరాదిత్య సింధియా తేల్చిచెప్పారు. విలువలతో కూడిన రాజకీయాలను కొనసాగించాలన్న బీజేపీ అగ్రనేత అద్వానీ మాటలను ఆయన గుర్తు చేశారు.