ఈ వారమూ అనుమానమే! | Parliament logjam: Modi govt to hold all-party meet on Monday | Sakshi
Sakshi News home page

ఈ వారమూ అనుమానమే!

Published Mon, Aug 3 2015 2:10 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

ఈ వారమూ అనుమానమే! - Sakshi

ఈ వారమూ అనుమానమే!

పార్లమెంట్లో ప్రతిష్టంభన కొనసాగే అవకాశం
* సుష్మా, రాజే, చౌహాన్‌ల రాజీనామాలపై పట్టువీడని అధికార, విపక్షాలు.. నేడు మరోసారి అఖిలపక్షం
* నేటి సీపీపీ భేటీలో ప్రభుత్వంపై ఒత్తిడికి కాంగ్రెస్ వ్యూహరచన

న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో  సగం రోజులు తుడిచిపెట్టుకుపోయాయి. గత రెండు వారాలుగా నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించే దిశగా ఆలోచించకుండా అధికార విపక్షాలు.. పరస్పర నిందాపర్వాన్ని కొనసాగిస్తున్నాయి. ప్రతిష్టంభనకు మీరంటే మీరు కారణమంటూ ఆరోపణాస్త్రాల్ని సంధిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో నేడు(సోమవారం) ప్రభుత్వం తలపెట్టిన అఖిలపక్ష భేటీలోనూ ఇరుపక్షాల మధ్య సామరస్యం కుదిరే పరిస్థితి కనిపించడం లేదు. ప్రతికూల ధోరణి, సభను అడ్డుకునే వైఖరిపై కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాలని, అవి దేశాభివృద్ధిని, దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయన్న విషయాన్ని గుర్తించాలని మంత్రి అరుణ్ జైట్లీ ఆదివారం ఫేస్‌బుక్ వేదికగా కాంగ్రెస్‌పై చురకలు వేయగా.. ప్రధాని అహంకారం, మొండితనం వల్లనే ఈ ప్రతిష్టంభన అని, ప్రతిపక్షంలో ఉండగా తాము వ్యవహరించిన తీరును బీజేపీ ఒకసారి గుర్తుతెచ్చుకోవాలని కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. మోదీగేట్ వ్యవహారంలో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే, వ్యాపమ్ స్కామ్‌కు సంబంధించి మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌ల రాజీనామా డిమాండ్‌పై వెనకడుగు లేదని తేల్చిచెప్పింది.
 
రాజీనామా ప్రసక్తే లేదు: బీజేపీ
సుష్మా, రాజేలు రాజీనామా చేసే ప్రసక్తే లేదంటూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు మరోసారి తేల్చిచెప్పారు. అయితే, ఆ విషయంపై చర్చకు ప్రభుత్వం సిద్ధమని, చర్చలో తమ అభిప్రాయాల్ని కాంగ్రెస్ వ్యక్తం చేయొచ్చన్నారు. సభా వ్యవహారాలను అడ్డుకోవడమంటే పార్లమెంటు ధిక్కారమేనని, ప్రస్తుతం నెలకొన్న ప్రతిష్టంభనకు కాంగ్రెస్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలే కారణమని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ విమర్శించారు.

ఎటూ పాలుపోని గందరగోళ, రక్షణాత్మక స్థితిలో కాంగ్రెస్ ఉందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఎద్దేవా చేశారు. మోదీగేట్‌పై పార్లమెంట్లో చర్చించాలని మొదట డిమాండ్ చేసిన కాంగ్రెస్.. అందుకు ప్రభుత్వం ఒప్పుకోవడంతో షాక్ తిన్నదని, అందుకే చర్చ కాదు ముందు రాజీనామాలు చేయాలంటూ కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారని విమర్శించారు. వ్యాపమ్‌పై చర్చ గురించి చెబుతూ.. రాష్ట్రాల వ్యవహారాలపై పార్లమెంట్లో చర్చించకూడదని, ఒకవేళ ప్రతిపక్షం కోరితే, నిబంధనలు సవరించి కేరళ సౌర విద్యుత్ స్కామ్, హిమాచల్ ప్రదేశ్‌లో సీఎం వీరభద్రసింగ్ అవినీతి అంశాలపైనా చర్చిద్దామంటూ చురకలంటించారు.

కేరళ, హిమాచల్‌ప్రదేశ్‌ల్లో అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. అధికారుల విషయంలో వ్యవహరిస్తున్నట్లుగానే.. ఎంపీల విషయంలోనూ ‘పని చేస్తేనే వేతనం’ అంశాన్ని పరిశీలించాలన్న సూచన ప్రభుత్వం ముందు ఉందంటూ కేంద్రమంత్రి మహేశ్ శర్మ వారణాసిలో వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఏకాభిప్రాయం సాధించేందుకు సీనియర్ మంత్రులు ప్రతిపక్షాలతో చర్చలు సాగిస్తున్నారన్నారు. అయితే, తన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఆ విషయంపై మాట్లాడేందుకు తాను సరైన వ్యక్తిని కాదని ఆదివారం ఆయన వివరణ ఇచ్చారు. మహేశ్ శర్మ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్.. ఎంపీలు కష్టపడి పనిచేస్తున్నారని, పార్లమెంటరీ కమిటీల పనితీరును చూస్తే ఆ విషయం అర్థమవుతుందని అన్నారు.  
 
మరో అఖిలపక్ష భేటీ
పార్లమెంట్లో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు సోమవారం మరో అఖిలపక్ష భేటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.  నేటి భేటీకి అన్ని పార్టీలను ఆహ్వానించామని మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. అయితే, ఆ సమావేశానికి కొన్ని గంటల ముందు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ భేటీ జరగనుంది. పార్టీ చీఫ్ సోనియా నేతృత్వంలో జరిగే ఆ సమావేశంలో అఖిలపక్ష భేటీలో, పార్లమెంట్లో వ్యవహరించాల్సిన తీరును, మోదీగేట్, వ్యాపమ్‌లపై ప్రభుత్వంపై దాడి వ్యూహాన్ని నిర్ణయిస్తారు.   
 
భూ బిల్లుపై కాంగ్రెస్‌కు ఝలక్
భూ సేకరణ బిల్లుకు సంబంధించి కాంగ్రెస్‌కు ఆ పార్టీ అధికారంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ ఝలక్ ఇచ్చింది. బీజేపీకి అందివచ్చే ఆయుధాన్నిచ్చింది. యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన భూ సేకరణ చట్టం సంక్లిష్టంగా ఉందని, ఆ చట్టంలో సవరణలు అవసరమేనని అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కుండబద్దలు కొట్టింది.
 
వెనక్కుతగ్గే ఆలోచనే లేదు: కాంగ్రెస్
జైట్లీ వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయన్న కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ.. పెద్దమనిషిలా సుద్దులు చెప్పడం మానేయాలంటూ వ్యంగ్యంగా అన్నారు. గత పదేళ్లలో కన్నా తాము అధికారంలోకి వచ్చిన తరువాతే పార్లమెంటు సజావుగా నడిచిందని  బీజేపీ చెప్పుకోవడాన్ని గుర్తు చేస్తూ.. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా కాంగ్రెస్ వ్యవహరించడం వల్లనే అది సాధ్యమైందన్నారు.

బీజేపీ అలా నడుచుకోకపోవడం వల్లనే గత పదేళ్లు పార్లమెంటు సజావుగా సాగలేదంటూ ఎత్తిపొడిచారు. బీజేపీ మంత్రుల అవినీతి వ్యవహారాల లెక్క  తేలేంతవరకు పార్లమెంట్లో ప్రతిష్టంభన కొనసాగుతుందని, వారి రాజీనామాలపై కాంగ్రెస్ వెనక్కు తగ్గబోదని లోక్‌సభలో కాంగ్రెస్ చీఫ్ విప్ జ్యోతిరాదిత్య సింధియా తేల్చిచెప్పారు. విలువలతో కూడిన రాజకీయాలను కొనసాగించాలన్న బీజేపీ అగ్రనేత అద్వానీ మాటలను ఆయన గుర్తు చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement