లక్నో : దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ అన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని, తాము అన్నింటికీ సిద్ధంగానే ఉన్నామని పేర్కొన్నారు. గురువారం వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో దాదాపు లక్షన్నర ఓట్ల మెజారిటీతో సోనియా గాంధీ గెలుపొందిన సంగతి తెలిసిందే. గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీ నుంచి ఎన్నికల బరిలో ఉన్న ఆమె... బీజేపీ అభ్యర్థి దినేశ్ ప్రతాప్ సింగ్‌ను ఓడించారు. ఈ నేపథ్యంలో తన విజయానికి దోహదపడిన పార్టీ కార్యకర్తలు, ఇతర పార్టీలు, నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి సోనియా గాంధీ లేఖ రాశారు.
‘ నా జీవితం తెరచిన పుస్తకం. మీరే నా కుటుంబం. నాకున్న నిజమైన ఆస్తి మీరే. దేశ ప్రాథమిక విలువలను కాపాడతానని, కాంగ్రెస్ పూర్వపు నేతలు అనుసరించిన విధానాలను కొనసాగిస్తానని మాట ఇస్తున్నాను. ఈ క్రమంలో నా జీవితాన్ని త్యాగం చేయడానికి ఏమాత్రం వెనుకాడను. రాబోయే రోజులు ఎంతో కఠినంగా ఉంటాయని నాకు తెలుసు. మీ ఆదరణ, మా పట్ల మీరు ప్రదర్శించే విశ్వాసం, మీ అండదండలతో ప్రతీ సవాలును ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. ప్రతీ లోక్‌సభ ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా నాపై నమ్మకాన్ని ఉంచి నన్ను ఎన్నుకున్నారు. నా విజయానికి పాటుపడిన ప్రతీ కాంగ్రెస్ కార్యకర్తకు, ఎస్పీ, బీఎస్పీ, స్వాభిమాన్ దళ్ పార్టీ నాయకులు.. అందరికీ పేరు పేరునా నా ధన్యవాదాలు’ అని లేఖలో పేర్కొన్నారు.
కాగా ఉత్తరప్రదేశ్‌లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పొత్తు పెట్టుకున్న ఎస్పీ-బీఎస్పీ చెరో 38 స్థానాల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, యూపీఏ చైర్ పర్సన్ సోనియా సొంత నియోజకవర్గాలు ఆమేథీ, రాయ్‌బరేలీల్లో తమ అభ్యర్థులను నిలపకుండా పరోక్ష మద్దతు తెలిపారు. ఈ క్రమంలో ఇరు పార్టీలకు కూడా సోనియా కృతఙ్ఞతలు తెలిపారు. ఇక ఆమేథీ నుంచి పోటీ చేసిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. దీంతో యూపీలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Comments
Please login to add a commentAdd a comment