
సాక్షి, న్యూఢిల్లీ : 2019 లోక్‌సభ ఎన్నికల్లో పాలకపక్ష బీజేపీ అఖండ విజయం సాధించడానికి దారితీసిన కారణాలేమిటీ అనే విషయంలో రాజకీయ శాస్త్రవేత్తలకే ఇంకా స్పష్టత రావడం లేదు. కేవలం నరేంద్ర మోదీ వ్యక్తిగత ప్రతిష్ట వల్ల అఖండ విజయం సిద్ధించిందా? దానికి బీజేపీ పట్ల ఉన్న అభిమానం తోడయిందా ? బ్రాహ్మణ్, బనియన్ పార్టీగా ఉన్న ముద్ర కూడా ఆ వర్గాలను ఆకర్షించడం వల్ల విజయం సాధ్యమైందా? పోటీ చేసిన అభ్యర్థుల బలం వల్ల లేదా చేపట్టిన అభివద్ధి కార్యక్రమాల వల్ల విజయం సాధించిందా? హిందూత్వవాదం గెలిపించిందా ? ఈ అన్ని అంశాలు కలియడం వల్లన విజయం అంత సులువైందా? అన్న అంశాలపై రాజకీయ పండితులు తర్జనభర్జన పడుతున్నారు.
నరేంద్ర మోదీకి వ్యక్తిగత ప్రతిష్ట ఉందన్న విషయంలో ఎలాంటి సందేహం లేదుగానీ, అది 2014లో జరిగిన ఎన్నికల సందర్భంగా ఇంతకన్నా ఎక్కువ కనిపించిందని, అలాంటప్పుడు అప్పటికన్నా ఇప్పుడు 21 సీట్లు ఎక్కువ రావడం ఏమిటని అమెరికాలోని వండర్‌బిల్ట్ యూనివర్శిటీలో పొలిటికల్ సైన్సెస్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న తారిక్ థాచిల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 2014లో నరేంద్ర మోదీ అనుకూల పవనాలు బలంగా కనిపించినప్పటికీ నాటి విజయం వెనక రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లో పార్టీ బలోపేతానికి బీజేపీ చేసిన పదేళ్ల కషి కూడా ఉందని ఆయన చెప్పారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ భారం, పెరిగిన నిరుద్యోగం ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెంచింది. కానీ అది ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపకపోవడం కూడా ఆశ్చర్యంగా ఉందని అమెరికా టెంపుల్ యూనివర్శిటీలో పొలిటికల్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తోన్న ఆడమ్ జైగ్‌ఫెల్డ్ వ్యాఖ్యానించారు. పీఎం ఆవాస్ యోజన కింద పెదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వడం, స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్ల నిర్మాణం లాంటి కొన్ని పథకాలు మాత్రమే విజయవంతమయ్యాయని, మోదీ ప్రభుత్వం ప్రకటించిన పలు పథకాలు విజయవంతం కాలేదని, అలాంటప్పుడు అభివద్ధిని చూసి ఓటేశారని భావించలేమని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో నిరుద్యోగం, పెరిగిన ఆర్థిక ద్రవ్యోల్బణం ప్రధాన సమస్యలు అవుతాయని ‘లోక్‌నీతి’ సంస్థ సర్వేతోపాటు పలు సర్వేలు చెప్పినప్పటికీ వాటి ప్రభావం కూడా కనిపించక పోవడం ఆశ్చర్యమేనని ఇరువురు ప్రొఫెసర్లు వ్యాఖ్యానించారు.
నరేంద్ర మోదీ వ్యక్తిగత ప్రతిష్టకు ‘హిందూత్వ’ వాదం తోడవడం వల్లనే బీజేపీకి అఖండ విజయం సిద్ధించి ఉంటుందని చివరకు ఇరువురు ప్రొఫెసర్లు అభిప్రాయపడ్డారు. హిందూత్వవాదం బయటకు కనిపించలేదన్న విషయాన్ని వారి దృష్టికి మీడియా తీసుకెళ్లగా భారత్‌లోని అన్ని హిందూ వర్గాల్లో అది అంతర్లీనంగా ఉందని, మోదీకి ఎందుకు ఓటేశారని అడిగితే ఆయన హిందూత్వ వాదానికే వేశామని ఎవరు చెప్పరని వారన్నారు. అమెరికా ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్‌కు ఎందుకు ఓటేశారని శ్వేతజాతీయులను ప్రశ్నిస్తే ఆసియన్లు, ఆఫ్రికన్లు అంటే భయం కనుక ట్రంప్ బెటరనుకున్నామని వారు చెప్పలేదని, జాతి పరమైన చర్చల్లో వారి ఆ విషయాన్ని అంగీకరించారని అన్నారు. భారత్ ఎన్నికల్లో నరేంద్ర మోదీ భారత సైనిక సేవల గురించి ప్రస్తావించడం, కొత్త ఓటర్లు తమ తొలి ఓటును సైన్యానికి అంకితమివ్వడంటూ మోదీ పిలుపునివ్వడం కూడా పనిచేసి ఉంటుందని వారన్నారు. ఇలాంటి వాటికి స్పందన మౌనంగానే ఉంటుందని వారు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment