కోల్‌కతా : ఈ సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మధ్య గట్టి పోటీ నడిచిన సంగతి తెలిసిందే. హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఆశించిన ఫలితాలు రాబట్టలేదు. 42 లోక్‌సభ స్థానాలు ఉన్న పశ్చిమ బెంగాల్లో బీజేపీ అనూహ్యరీతిలో పుంజుకొని ఏకంగా 18 స్థానాలు సాధించింది. రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఉన్న దీదీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ కేవలం 22 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యింది. ఈ క్రమంలో ఫలితాలు వెలువడి వారం రోజులు కూడా గడవకముందే.. మమతా బెనర్జీకి గట్టి షాక్ తగిలింది.
తృణమూల్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక సీపీఎం ఎమ్మెల్యే మంగళవారం బీజేపీ గూటికి చేరారు. వీరితోపాటు 60మందికి పైగా టీఎంసీ కౌన్సిలర్లూ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రధాన కార్యదర్శి, పశ్చిమ బెంగాల్ పార్టీ ఇన్‌చార్జి కైలాష్ విజయ్‌వర్గీయ మాట్లాడుతూ.. ‘ఇది ఆరంభం మాత్రమే.. త్వరలోనే మరింత మంది టీఎంసీ నాయకులు బీజేపీలో చేరతారు. బెంగాల్‌లో ఏడు విడతల్లో ఎన్నికలు జరిగాయి.. అలానే 7 విడతల్లో టీఎంసీ నుంచి బీజేపీలోకి చేరికలు కొనసాగుతాయ’ని ఆయన స్పష్టం చేశారు.
ఈ రోజు మొదటి విడత చేరికలు జరిగాయన్నారు విజయ్‌వర్గీయ. ఏడు విడతల్లో దీదీ ప్రభుత్వం కూలిపోతుందని ఆయన పేర్కొన్నారు. టీఎంసీలో ఉన్న చాలా మంది నాయకులు అసహనంతో ఉన్నారని త్వరలోనే వారంతా బీజేపీలో చేరతారని ఆయన చెప్పుకోచ్చారు. ఇదంతా దీదీ స్వయంగా చేసుకుందని విజయ్‌వర్గీయ ఆరోపించారు. తాజాగా ఈ రోజు అనగా మంగళవారం బీజేపీ నాయకుడు ముకుల్ రాయ్ తనయుడైన టీఎంసీ ఎమ్మెల్యే సుబ్రంగ్‌షు రాయ్‌తోపాటు ఎమ్మెల్యేలు తుషార్‌కాంతి భట్టాచార్య (టీఎంసీ), దేవేంద్రనాథ్ రాయ్ (సీపీఎం) బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment