వికటించిన గట్‌బంధన్‌ | Gathbandhan fails in uttarpradesh | Sakshi
Sakshi News home page

వికటించిన గట్‌బంధన్‌

Published Sat, May 25 2019 3:26 AM | Last Updated on Sat, May 25 2019 3:26 AM

Gathbandhan fails in uttarpradesh - Sakshi

లక్నో: సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీని నిలువరించాలనుకున్న ప్రతిపక్షాలకు మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 80 స్థానాలకు గానూ 71 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి మిత్రపక్షాలతో కలిసి 64 స్థానాల్లో విజయదుందుభి మోగించింది.  బీజేపీకి చెక్‌ పెట్టేందుకు సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ), రాష్ట్రీయ లోక్‌దళ్‌(ఆర్‌ఎల్డీ) పార్టీలు కలిసి ఏర్పాటుచేసిన మహాకూటమి(గట్‌బంధన్‌) కనీసం పోటీ ఇవ్వలేక చతికిలపడింది. ఈ కూటమి వేర్వేరుగా పోటీచేయడంతో కమలనాధుల విజయం సులువైందని  విశ్లేషకులు చెబుతున్నారు.

సోనియా ప్రయత్నాలకు చెక్‌..
యూపీలో బీజేపీ విజయావకాశాలను దెబ్బతీయడం ద్వారా ప్రధాని మోదీని నిలువరించాలని యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ భావించారు. ఇందుకు అనుగుణంగానే మహాకూటమిలో చేరేందుకు ముందుకొచ్చారు. యూపీలో తమకు కేవలం 15 లోక్‌సభ స్థానాలు ఇస్తే చాలన్నారు. అయితే బీఎస్పీ అధినేత్రి మాయావతి కాంగ్రెస్‌ పార్టీతో కలిస్తే విజయావకాశాలు దెబ్బతింటాయన్న అనుమానంతో ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. # కంచుకోట అమేథీలో కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ ఓటమి చవిచూడగా, సోనియా రాయ్‌బరేలీలో గెలిచి పరువు కాపాడుకున్నారు. ఈ ఎన్నికల్లో మహాకూటమిలో లాభపడ్డది ఎవరైనా ఉన్నారంటే అది బీఎస్పీ చీఫ్‌ మాయావతియే. ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ–ఎస్పీ–ఆర్‌ఎల్డీ కూటమికి మొత్తం 15 సీట్లురాగా, వీటిలో బీఎస్పీనే 10 స్థానాలను గెలుచుకుంది. ఎస్పీకి 5 లోక్‌సభ సీట్లు దక్కగా, మరో మిత్రపక్షం ఆర్‌ఎల్డీ ఖాతానే తెరవలేదు. సమాజ్‌వాదీ పార్టీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బే తగలింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement