సాక్షి, న్యూఢిల్లీ : ‘సబ్ కా సాథ్ సబ్ కా వికాస్’ 2014 ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన నినాదం. ‘సబ్ కా విశ్వాస్’ ఆయన తాజాగా ఇచ్చిన నినాదం. భారతీయ మైనారిటీ వర్గాలను దష్టిలో ఉంచుకొని ఆయన ఈ నినాదం ఇచ్చినట్లు స్పష్టం అవుతోంది. ఆయన మే 25వ తేదీన పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కొత్తగా ఎన్నికైన ఎన్డీయే పార్లమెంట్ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ ‘ఓటు వేసిన వారంతా మనవారే, ఓటు వేయని వారు కూడా మనవారే. వారి విశ్వాసాన్ని కూడా మనం చూరగొనాల్సిన అవసరం ఉంది’ అంటూ దేశంలోని మైనారిటీలనుద్దేశించి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. మైనారిటీలకు తాము వ్యతిరేకమని, వారిలో భయాందోళనలను సష్టించామని ప్రతిపక్షాలు చేస్తోన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదంటూ నరేంద్ర మోదీ మొదటి సారి దేశంలో మైనారిటీల దుస్థితి గురించి మాట్లాడారు.
గత బీజేపీ ఐదేళ్ల పాలనలో మైనారిటీలు భయం, భయంగానే బతికారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అందుకు గోరక్షకుల పేరిట జరిగిన దాడులను గుర్తు చేస్తున్నాయి. ఆ దాడుల్లో ఇంతవరకు ఏ ఒక్కరికైనా శిక్ష పడిందా? అని ప్రశ్నిస్తున్నాయి. మైనారిటీలైన ముస్లింలను మినహాయిస్తూ మిగతా హిందూ శరణార్థులందరికి భారతీయ పౌరసత్వం ఇస్తామంటూ 2016లో ముసాయిదా బిల్లు తీసుకరావడం నిజం కాదా? అంటూ నిలదీస్తున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ నేతలు చేసిన ప్రచారం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి. మెజారిటీలు, మైనారిటీలు అంటూ మాట్లాడిందీ బీజేపీ నేతలు కాదా? అని అడుగుతున్నాయి.
ఏదిఏమైనా ఎన్నికలు ముగిశాయి. 303 సీట్లతో బీజేపీ అఖండ విజయం సాధించింది. మొదటి సారి మైనారిటీల బాగోగుల గురించి మాట్లాడిన నరేంద్ర మోదీ తన మాట నిలబెట్టుకోవాలి. గతంలో మైనారిటీలపై జరిగిన దాడులకు సంబంధించిన కేసుల్లో దోషులకు శిక్ష పడేలా చేయాలి. మైనారిటీల సంక్షేమం కోసం పలు అభివద్ధి కార్యక్రమాలు చేపట్టి ‘సబ్ కా విశ్వాస్’ చూరగొనాలి!
Comments
Please login to add a commentAdd a comment