
సాక్షి, న్యూఢిల్లీ : ఊహాగానాలను నిజం చేస్తూ తెలంగాణ బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ ఈ నెల 30న ప్రమాణం స్వీకారం చేయనున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి వర్గంలో రాష్ట్రం నుంచి ఎవరికి చోటు దక్కుతుందన్న అంశంపై చర్చోపచర్చలు సాగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు, సికింద్రాబాద్ ఎంపీ జి.కిషన్‌రెడ్డి వైపే అధిష్టానం మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం ప్రధాని ఆఫీస్ నుంచి కిషన్ రెడ్డికి కాల్ రావడంతో కేంద్ర కేబినెట్‌లో ఆయన చోటు దక్కించుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా కిషన్‌రెడ్డితో పాటు నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, కరీంనగర్ నుంచి బండి సంజయ్, ఆదిలాబాద్ నుంచి బాపూరావు బీజేపీ తరఫున ఎంపీలుగా గెలుపొందిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితమైన బీజేపీ ఈసారి ఏకంగా నాలుగు స్థానాల్లో విజయబావుటా ఎగురవేయడంతో కేంద్ర కేబినెట్‌లో తెలంగాణ ప్రాతినిథ్యం లాంఛనప్రాయమే అయ్యింది. ఇక నరేంద్ర మోదీతో పాటు ఈరోజే పలువురు కేంద్రమంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.
మూడుసార్లు ఎమ్మెల్యేగా..
కిషన్‌రెడ్డి గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. అంబర్‌పేట నియోజకవర్గం నుంచి 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. శాసనసభాపక్ష నేతగా పనిచేసిన అనుభవమూ ఆయనకు ఉంది. ఈ క్రమంలో పార్టీలో అనేక పదవులు అలంకరించారు. పార్టీ పెద్దలతో సత్సంబంధాలు ఉన్న దృష్ట్యా కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్నారు. మరోవైపు నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలుపొందిన ధర్మపురి అరవింద్‌కు కూడా మంత్రి పదవి దక్కే అవకాశం ఉందనే ప్రచారం సాగిన సంగతి తెలిసిందే.
ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవితపై విజయం సాధించడం, బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, కేంద్ర మంత్రివర్గంలో యువతకు అధిక ప్రాధాన్యం ఇస్తుండటం, జాతీయ పార్టీ పెద్దలతో సంబంధాలు కలిగి ఉండటం అరవింద్‌కు కలసి వస్తుందన్న చర్చ జరిగింది. మరో బీసీ నేత బండి సంజయ్ కరీంనగర్ నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థి, సీఎం కేసీఆర్‌కు అత్యంత ఆప్తుడైన వినోద్ కుమార్‌ను ఓడించారు. ఆయనకు యువతలో మంచి క్రేజ్ ఉంది. మొదటి నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌తో అనుబంధం ఉన్న నేపథ్యంలో ఆయనకూ మంత్రి పదవి దక్కే చాన్స్ ఉండొచ్చన్న వాదన కూడా వినిపించింది.
ఆదిలాబాద్ నుంచి గెలుపొందిన సోయం బాపురావు దక్షిణ భారత్‌లోనే బీజేపీ నుంచి గెలుపొందిన ఏకైక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. దక్షిణాదిలో పాగావేయాలని భావిస్తున్న జాతీయ నాయకత్వం ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన బాబూరావుకు కేంద్రమంత్రి పదవి కట్టబెడుతుందా? అనే ఆసక్తికర చర్చకు పీఎంఓ కార్యాలయం కాల్‌తో నేటితో తెరపడినట్లైంది.
Comments
Please login to add a commentAdd a comment