![Nama Nageswara Rao Talk On lok Sabha Elections Results - Sakshi](/styles/webp/s3/article_images/2019/05/25/nama-nageswar-rav.jpg.webp?itok=tCx7d2v4)
నామాకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న నాయకులు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: లోక్‌సభ సభ్యుడిగా పనిచేసిన అనుభవంతో జిల్లా అభివృద్ధికి మరిన్ని నిధులు తెస్తానని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం టీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవిలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా ప్రజలు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమైందన్నారు. పార్టీ అభ్యర్థిగా టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనను ఆశీర్వదించి ఖమ్మం ప్రజలకు అప్పగిస్తే.. వారు తిరుగులేని విజయాన్ని చేకూర్చారని, ఈ విజయం అపూర్వమైందని అన్నారు. తన విజయానికి కృషి చేసిన టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటానని, ప్రజా సేవకుడిగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తానన్నారు.
జిల్లా అభివృద్ధికి అవసరమైన నిధులు కేంద్రం నుంచి తెచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం తీసుకుంటానన్నారు. తాను కేసీఆర్ అడుగు జాడల్లో నడిచే వ్యక్తినని, నాయకత్వం మాటే తన మాట అని, పార్టీ నిర్దేశించిన పనులు చేయడమే తన ముందున్న కర్తవ్యమన్నారు. గతంలో టీడీపీ లోక్‌సభ పక్ష నాయకుడిగా ఉన్న అనుభవం ఉన్నందున.. దానిని జిల్లా అభివృద్ధికి వినియోగిస్తానన్నారు. టీఆర్‌ఎస్ లోక్‌సభ పక్ష నాయకుడిగా ఎవరికి అవకాశం ఉందని విలేకరులు ప్రశ్నించగా.. పార్టీ అధినేత అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని, అది వ్యక్తులు నిర్ణయించేది కాదని, పార్టీ తీసుకునే నిర్ణయమని అన్నారు.
జిల్లా ప్రజలు తనను ఎంపీగానే చూడాలనుకున్నారని, అందుకే ఇంతటి ఘన విజయం అందించారని, ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే శిరోధార్యమన్నారు. సమావేశంలో మేయర్ పాపాలాల్, టీఆర్‌ఎస్ నగర పార్టీ అధ్యక్షుడు కమర్తపు మురళి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ, నల్లమల వెంకటేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖమర్, బొమ్మెర రామ్మూర్తి, తిరుమలరావు, తుళ్లూరి బ్రహ్మయ్య, మద్దినేని బేబి స్వర్ణకుమారి, బీరెడ్డి నాగచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment