సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్‌రావు షెల్ కంపెనీలతో బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టడమే కాకుండా రుణంగా పొందిన కోట్ల రూపాయలను తన జేబులోకి మళ్లించుకున్న వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కొరడా ఝుళిపించింది. మధుకాన్ సంస్థలకు చెందిన రూ. 96.21 కోట్లను అటాచ్ చేసింది. ఈ మేరకు ఈడీ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.
జార్ఖండ్‌లోని రాంచీ నుంచి జంషెడ్‌పూర్ వరకు 163 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల రహదారి నిర్మించేందుకు 2011లో నామా నాగేశ్వర్‌రావుకు చెందిన మధుకాన్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) నుంచి కాంట్రాక్టు దక్కించుకుంది. దీని నిర్మాణం కోసం కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్షియం నుంచి రూ.1,030 కోట్ల రుణం పొందింది.
కానీ నిర్ణీత సమయంలో రోడ్డు నిర్మాణం పూర్తి చేయలేదు. 50.24 శాతం మాత్రమే చేసి చేతులెత్తేసింది. దీనిపై ఎన్‌హెచ్‌ఏఐ సీబీఐకి ఫిర్యాదు చేసింది. రోడ్డు నిర్మాణం నిమిత్తం 90 శాతం మేర రుణం పొంది నిర్మాణ పనులు ఆపేసిందని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో సీబీఐ 2019లో కేసు నమోదు చేసింది.
రంగంలోకి దిగిన ఈడీ...
ఈ కేసును ఆధారంగా చేసుకొని మనీల్యాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో రంగంలోకి దిగిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. అనేక సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది. రాంచీ ఎక్స్‌ప్రెస్ వేస్ లిమిటెడ్ అనే అనుబంధ కంపెనీ ద్వారా రోడ్డు నిర్మాణం కోసం బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాన్ని నామా నాగేశ్వర్‌రావు, కంపెనీ ప్రమోటర్లు నామా సీతయ్య, కమ్మ శ్రీనివాస్‌రావు, నామా పృథ్వీతేజ కుట్రపూరితంగా షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి తమ ఇతర ప్రాజెక్టుల్లోకి మళ్లించినట్లు ఈడీ గుర్తించింది.
రూ. 75 కోట్లకుపైగా నిధులను షెల్ కంపెనీలైన ఉషా ప్రాజెక్ట్స్, శ్రీ బీఆర్ విజన్స్, శ్రీ ధర్మశాస్త కన్‌స్ట్రక్షన్స్, శ్రీ నాగేంద్ర కన్‌స్ట్రక్షన్స్, రాగిని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, వరలక్ష్మీ కన్‌స్ట్రక్షన్స్‌లోకి మళ్లించినట్లు ఈడీ ఆధారాలు సేకరించింది. ఈ కంపెనీలకు సబ్ కాంట్రాక్ట్ కింద పనులు ఇచ్చినట్లు నకిలీ అలాట్‌మెంట్ లెటర్లు సృష్టించి నిధులను మళ్లించి మళ్లీ అక్కడ నుంచి నామా నాగేశ్వర్‌రావు తన జేబులోకి వచ్చేలా చేసుకున్నట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. 2021 జూన్‌లో మధుకాన్ కంపెనీ చైర్మన్ నామా నాగేశ్వర్‌రావు కార్యాలయం, నివాస సముదాయాలు, ఆ కంపెనీల డైరెక్టర్ల ఇళ్లపై ఈడీ సోదాలు నిర్వహించింది.
నామా ఇంట్లో రూ. 34 లక్షల లెక్కచూపిన సొమ్ముతోపాటు నేరపూరితమైన ఆధారాలను సీజ్ చేసినట్లు వివరించింది. మొత్తంగా ఈ కేసులో రూ. 361.29 కోట్ల రుణం సొమ్మును షెల్ కంపెనీలతోపాటు ఇతర మార్గాల ద్వారా దారి మళ్లించినట్లు తేల్చింది. ఈ కేసు దర్యాప్తు లో భాగంగా హైదరాబాద్, పశ్చిమ బెంగాల్‌లో ఉన్న రూ. 88.85 కోట్ల విలువగల స్థిరాస్తులు, విశా ఖ, ప్రకాశం, కృష్ణా జిల్లాలో ఉన్న రూ.7.36 కోట్ల చరాస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment