ED Attaches Over Rs 80 Cr Assets Belonging To TRS MP Nama Nageswara Rao - Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ ఎంపీకి ఈడీ మరో షాక్‌..

Published Mon, Oct 17 2022 3:07 PM | Last Updated on Tue, Oct 18 2022 7:44 AM

ED Attaches Properties Of TRS MP Nama Nageswara Rao - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/ఢిల్లీ: టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాక్‌ ఇచ్చింది. నామా, ఆయన కుటుంబసభ్యులకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని మొత్తం 28 స్థిరాస్తు లను సోమవారం జప్తు చేసింది. వీటి విలువ రూ.80.65 కోట్లు ఉంటుందని స్పష్టం చేసింది. గత జూలైలోనూ నామాకు, ఆయన కుటుంబానికి సంబంధించి రూ.73.74 కోట్ల విలువ గల 105 స్థిరాస్తులను ఈడీ జప్తు చేసింది.

బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల్లో నుంచి మధుకాన్‌ గ్రూపు రూ.361.92 కోట్లు దారిమళ్లించినట్లు ఈడీ నిగ్గుతేల్చింది. మధుకాన్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ సంస్థ ప్రమోటర్‌గా, డైరెక్టర్‌గా ఉన్న నామా నాగేశ్వరరావు బ్యాంకుల కన్సార్షియం నుంచి తీసుకునే రుణానికి పూచీకత్తుగా కూడా ఉన్నారని ఈడీ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. నామా నాగేశ్వరరావు, నామా సీతయ్య ఆధ్వర్యంలోని ఉషా ప్రాజెక్ట్స్, శ్రీ బీఆర్‌ విజన్స్, శ్రీధర్మ శాస్త కన్‌స్ట్రక్షన్స్, శ్రీ నాగేంద్ర కన్‌స్ట్రక్షన్స్, రాగిణి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్, వరలక్ష్మి కన్‌స్ట్రక్షన్స్‌ అనే ఆరు డొల్ల కంపెనీలకు రూ.75.50 కోట్లు మళ్లించారని ఈడీ గుర్తించింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని మధుకాన్‌ ప్రధాన కార్యాలయం, నగరంలోని మరికొన్ని ఆస్తులతో పాటు ఖమ్మం, ప్రకాశం జిల్లాల్లోని ఆ సంస్థ ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది. 



ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణం కాంట్రాక్ట్‌ రద్దు
రాంచీ నుంచి జంషెడ్‌పూర్‌ను కలిపే 163 కిలోమీటర్ల నిడివి గల ఎక్స్‌ప్రెస్‌ వే అయిన నాలుగు లేన్ల ఎన్‌హెచ్‌ 33కి సంబంధించి కాంట్రాక్టును మధుకాన్‌ కంపెనీ పొందింది. ఇందుకోసం 15 బ్యాంకుల కన్సార్షియం రూ.1,151 కోట్ల రుణం మంజూరు చేయగా, అందులోంచి రూ.1,029 కోట్లు మధుకాన్‌ సంస్థ తీసుకుంది. బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నా ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణం పురోగతి లేక, పెద్దఎత్తున నిధులు దుర్వినియోగమైనట్లు, ఆ నిధులను ఇతర అవసరాలకు మళ్లించినట్లు సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ సంస్థ గుర్తించింది. దీంతో కన్సార్షి యం బ్యాంకులు సీబీఐకి ఫిర్యాదు చేశాయి. జార్ఖండ్‌ హైకోర్టు సైతం సీబీఐని దర్యాప్తు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో కేసు నమోదు చేసిన సంగతి విదితమే. మనీ లాండరింగ్‌ కింద ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో మధుకాన్‌ కాంట్రాక్టును జాతీయ రహ దారుల సంస్థ రద్దు చేయడంతోపాటు రూ.73.95 కోట్లను స్వాధీనం చేసుకుంది.  

చదవండి: యువతుల కోసం అపార్ట్‌మెంట్‌కు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి.. ఇంతలోనే షాకింగ్‌ ట్విస్ట్‌


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement