
మాజీ ప్రధాని దివంగత వాజ్‌పేయి హయాంలో 1999లో తమిళనాడులో బీజేపీకి 7.1 శాతం ఓట్లు పడ్డాయి. ఆ తరువాత అనేక ఎన్నికలు వచ్చినా అంతకు మించి ఓట్లను సాధించలేకపోయింది.
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఎందుకీ పరాభవం. ఎందుచేత ఈ ఘోరపరాజయం..ఐదింటిలో ఒక్కటి కూడా గెలవకపోవడం, ఓట్లశాతం పడిపోవడానికి దారితీసిన పరిస్థితులు ఏమిటని భారతీయ జనతా పార్టీ పరేషాన్‌లో పడిపోయింది. అంతేకాదు, ఓటమి వైఫల్యాలపై నివేదిక సమర్పించాల్సిందిగా నోటీసు జారీచేసింది. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా తమిళనాడులోని అధికార అన్నాడీఎంకేతో బీజేపీ కూటమిగా ఏర్పడి డీఎంకే-కాంగ్రెస్ కూటమితో తలపడిన సంగతి తెలిసిందే. కన్యాకుమారి, తూత్తుకూడి, రామనాథపురం, శివగంగై, కోయంబత్తూరు.. ఈ ఐదు స్థానాల్లో పోటీచేసింది. కేంద్ర మాజీ మంత్రి పొన్ రాధాకృష్ణన్, పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, పార్టీ సీనియర్ నేతలు నయినార్ నాగేంద్రన్, హెచ్ రాజా, సీపీ రాధాకృష్ణన్ ఈ ఐదు స్థానాల్లో పోటీచేశారు. అయితే బీజేపీ ఒక్క స్థానంలో కూడా గెలుపొందలేదు. అంతేగాక ఐదు మంది లక్షల పైచిలుకు ఓట్ల వ్యత్యాసంతో ఓడిపోయారు. ఈ ఘోర ఓటమి పార్టీ అధిష్టానంతోపాటూ రాష్ట్ర శాఖను విస్మయానికి గురిచేసింది.
తమిళనాడులో మోదీ ప్రభుత్వానికి వ్యతిరేక గాలి వీచినందునే ఓటమి పాలయ్యామని ప్రాథమికంగా నిర్దారణకు వచ్చినా, ఓట్లశాతం గతంలో కంటే దారుణంగా పడిపోవడాన్ని అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. ఈ ఓటమికి సరైన కారణాలు కనుగొని పార్టీని చక్కదిద్దాలని నిర్ణయానికి వచ్చారు. ఇక మాజీ ప్రధాని దివంగత వాజ్‌పేయి హయాంలో 1999లో తమిళనాడులో బీజేపీకి 7.1 శాతం ఓట్లు పడ్డాయి. ఆ తరువాత అనేక ఎన్నికలు వచ్చినా అంతకు మించి ఓట్లను సాధించలేకపోయింది. 2009లో 2.3 శాతం, 2014లో 5.60 శాతం పొందింది. తాజా ఎన్నికల్లో 3.7 శాతానికి పడిపోయింది. అంటే 2014 నాటి ఎన్నికలతో పోలిస్తే 2 శాతం ఓట్లను కోల్పోయింది. దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడులోనే బీజేపీకి గట్టి దెబ్బతగలడంతో బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షా తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు.
ఈ నేపథ్యంలో ఢిల్లీలోని అమిత్‌షా కార్యాలయం నుంచి రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై ఫోన్ వచ్చినట్లు సమాచారం. తమిళనాడులో పార్టీ పరాజయానికి కారణాలు ఏమిటో సంజాయిషీ ఇవ్వాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. కేవలం తమిళిసై నుంచే గాక రాష్ట్రంలోని పలువురు నేతల నుంచి ఓటమి కారణాలపై నివేదిక కోరారు. తమిళనాడులో రెండు లేదా మూడు స్థానాల్లో గెలుపొందాలని మోదీ, అమిత్‌షా రాష్ట్రపార్టీకి లక్ష్యాన్ని నిర్దేశించారు. దీనిని దృష్టిలో ఉంచుకునే కాంచీపురం, తిరుప్పూరు, మధురై, కన్యాకుమారి, తేని, ఈరోడ్ నగరాల్లో భారీ ప్రచార సభలు నిర్వహించి మోదీ ప్రసంగించారు. ఇంత చేసినా ఓటమి కారణాలు ఏమిటని అధిష్టానం తీవ్ర ఆలోచనలో పడింది. నేతలు సరిగా పనిచేయక పోవడమే ఓటమి కారణమనే తీరులో నివేదిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.