
ఈ ఎన్నికల్లో కఠినంగా శ్రమించింది ఎవరూ? విశ్రాంతి పొందింది ఎవరూ? సరిగా పని చేయనివారెవరూ?
సాక్షి, చెన్నై : తనలోని ఒక కోణాన్నే చూశారని, మరో కోణాన్ని మీరు చూడలేదంటూ నటుడు, మక్కళ్‌నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ తన పార్టీ నిర్వాహకులను ఉద్దేశించి హెచ్చరికలు జారీచేశారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన మక్కళ్ నీది మయ్యం పార్టీ విజం సాధించకపోయినా, కొన్ని స్థానాల్లో మూడో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా మక్కళ్‌నీది మయ్యం పార్టీ 14,74,916 ఓట్లను దక్కించుకుంది. అదే విధంగా కోవై, ఉత్తర చెన్నై, దక్షిణ చెన్నై, మధురై స్థానాల్లో లక్షకు పైగా ఓట్లను రాబట్టుకుంది. కాగా 11 స్థానాల్లో మూడో స్థానంలో నిలిచింది. ఈ ఓట్ల శాతం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్‌ను ఉత్సాహపరిచింది. ఈ నేపథ్యంలో ఆయన ఆదివారం చెన్నైలోని తన పార్టీ కార్యాలయంలో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, జిల్లాల కార్యదర్శులు, నిర్వాహకులకు విందునిచ్చారు. ఈ విందులో సుమారు 400 మంది పాల్గొన్నారు. అనంతరం సమావేశంలో పలు విషయాల గురించి చర్చించారు.
ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో మనం ఓడిపోయామని బాధపడాల్సిన అవసరం లేదు. విజయం సాధించామనే భావించాలి. పార్టీని ప్రారంభించిన 14 నెలల్లోనే ఎన్నికలకు వెళ్లిన తాము మంచి ఫలితాలనే పొందామని అన్నారు. అయితే డెల్టా జిల్లాలు, ఉత్తరాది జిల్లాల్లో తక్కువ ఓట్లనే రాబట్టగలిగామని, కాగా ఎన్నికలు ముగిశాయి కదా, తదుపరి ఎన్నికల సమయానికే ప్రజల వద్దకు వెళ్లవచ్చు అని ఎవరూ భావించరాదన్నారు. ప్రతి ఒక్కరు ఆయా ప్రాంతాల్లో ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను తెలుసుకోవాలని అన్నారు. కష్టపడి పనిచేసిన వారికి రానున్న శాసనసభ ఎన్నికల్లో అవకాశం ఉంటుందని చెప్పారు.
కఠిన చర్యలుంటాయి
ఈ ఎన్నికల్లో కఠినంగా శ్రమించింది ఎవరూ? విశ్రాంతి పొందింది ఎవరూ? సరిగా పని చేయనివారెవరూ? వివరాలన్నీ తన వద్ద ఉన్నాయన్నారు. అలాంటి వారు ఇకపై కూడా ఇలానే పని చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తనలోని ఒక కోణాన్నే చూశారని, మరో కోణాన్ని మీరు చూడలేదని అన్నారు. ఆ కోణం తన, పర భేదాలను చూడదని అన్నారు. మనకిప్పుడు బాధ్యత పెరిగిందన్నారు. 14 నెలలోనే ప్రజలు మనకు ఇన్ని ఓట్లు వేసి ఆదరించారని, అందుకు తగ్గట్టుగానే మనం కూడా నడుచుకోవాలన్నారు. లేకుంటే పార్టీ నుంచి తొలగించడానికి కూడా వెనుకాడనని అన్నారు.
అందరికీ ఉంటుంది విందు
ప్రధాన నిర్వాహకులకే విందా? అని ఎవరూ భావించరాదని, తాను త్వరలోనే అన్ని జిల్లాలకు పర్యటించనున్నాని, అప్పుడు సమావేశాలతో పాటు విందు ఉంటుందని కమలహాసన్ పేర్కొన్నారు. ప్రజలకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉండాలన్నారు. అర్ధరాత్రి ఫోన్ చేసినా తాను వస్తానని కమల్ హాసన్ చెప్పారు.