సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ఏకంగా 303 సీట్లతో అఖండ విజయం సాధించినప్పటికీ కేరళ రాష్ట్రంలో ఆ పార్టీకి ఎందుకు ప్రవేశం దొరకలేదు ? కనీసం మూడు సీట్లు గెలుచుకుంటామంటూ ధీమా వ్యక్తం చేసిన ఆ పార్టీకి ఒక్క సీటు కూడా ఎందుకు దక్కలేదు ? శబరిమల ఆలయంలోకి అన్ని వయస్కుల మహిళలను అనుమతించాల్సిందేనంటూ గతేడాది సెప్టెంబర్ 28వ తేదీన ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఆరెస్సెస్ వర్గాలు ఆందోళన చేపట్టిన విషయం తెల్సిందే. సుప్రీం కోర్టు ఉత్తర్వులకు అనుకూలంగా యువతులు శబరిమలలోని అయ్యప్ప గుడిలోకి ప్రవేశించిన వారిపైనా వారు దాడులు చేశారు.
యుక్త వయసు మహిళలెవరూ గుళ్లోకి ప్రవేశించకుండా ఆలయ పరిసరాల్లో ఆరెస్సెస్ తన సేనలను మోహరించింది. ముందుగా సుప్రీం కోర్టు తీర్పను గౌరవిస్తామని చెప్పిన బీజేపీ, దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందచ్చని భావించి మాట మార్చింది. తీర్పుకు వ్యతిరేకంగా ఆరెస్సెస్‌తో కలసి ప్రత్యక్ష ఆందోళనకు దిగింది. ఎన్నికల ప్రక్రియ కొనసాగిన ఏప్రిల్–మే కాలం వరకు ఆందోళనను సాగదీశాయి. శబరిమల అంశం బీజేపీకి ఓ సువర్ణావకాశాన్ని ఇచ్చిందని కేరళ బీజేపీ అధ్యక్షుడు పీఎస్ శ్రీధరన్ పిళ్లై వ్యాఖ్యానించారు. కానీ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించిన బీజేపీకి కాకుండా బీజేపీ లాగానే సుప్రీం కోర్టు తీర్పును ముందుగా సమర్థించి, తర్వాత వ్యతిరేకించిన కాంగ్రెస్‌కు పడ్డాయి.
మొత్తం 20 సీట్లలో 15 సీట్లు కాంగ్రెస్‌కు రాగా, మిగతా నాలుగు సీట్లు దాని మిత్రపక్షాలకు వచ్చాయి. పాలకపక్ష సీపీఏం పార్టీ ఒకే ఒక్క సీటు దక్కింది. అలప్పూజ నుంచి పోటీ చేసిన సీపీఎం నాయకుడు ఏఎం. ఆరిఫ్ ఒక్కరే విజయం సాధించారు. కాంగ్రెస్ నాయకత్వంలోని ఫ్రంట్ నుంచి ఏకంగా 9 మంది అభ్యర్థులు లక్షకుపైగా మెజారిటీతోని విజయం సాధించారు. యూడీఏ ఫ్రంట్‌కు 47. 2 శాతం ఓట్లు రాగా, ఎల్‌డీయే ఫ్రంVŠ కు 35. 1 శాతం ఓట్లు వచ్చాయి. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేకు కేవలం 15.5 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన 14.9 శాతం ఓట్లతో పోలిస్తే కొద్దిగా ఓట్ల శాతం పెరిగింది. అదే 2014 లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన 10.8 శాతం ఓట్లతో పోలిస్తే ఎక్కువ పెరిగింది. బీజేపీ తరఫున గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనుకున్న కుమ్మనం రాజశేఖరన్ మినహా మిగతా మూడవ స్థానంలో నిలిచారు.
తిరువనంతపురం నుంచి పోటీ చేసిన రాజశేఖరన్‌పై కాంగ్రెస్ అభ్యర్థి శశి థరూర్ ఏకంగా 99, 989 ఓట్ల తేడాతో విజయం సాధించారు. రాజశేఖరన్‌కు 31.1 శాతం ఓట్లు వచ్చాయి. శబరిమల ఆలయం ఉన్న పట్టణం తిట్టలో బీజేపీ అభ్యర్థి కే. సురేంద్రన్ 29 శాతం ఓట్లతో రెండో స్థానంలో వచ్చారు. ఎందుకిలా జరిగిందని వామపక్షాలను, కాంగ్రెస్, బీజేపీ వర్గాలను మీడియా విచారించగా, వామపక్ష సానుభూతిపరులు బీజేపీకి ఓటు వేయడం ఇష్టంలేక కాంగ్రెస్‌కు ఓటు వేశారని, తద్వారా ఆ పార్టీ లబ్ధి పొందిందని వామపక్ష నాయకులు వ్యాఖ్యానించారు. కేరళ ప్రజలు మొదటి నుంచి లౌకిక వాదులని మతతత్వ బీజేపీకి ఓటు వేయడం ఇష్టం లేక తమకే ఓటు వేశారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. శబరిమల ఆలయ వివాదం వల్ల కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా లబ్ధి పొందిందని, అయితే తాము గెలవక పోయినా తమ పార్టీ కూడా బలపడిందని బీజేపీ నాయకులు చెప్పారు. భవిష్యత్తులో తాము మరింత బలపడేందుకు ఇప్పుడు సమకూర్చుకున్న బలం ఉపయోగపడుతుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment